Sunday, September 21, 2014

నవరాత్రి ప్రత్యేక వ్యాస పరంపర: శరన్నవ రాత్రులు---సర్వ సౌభాగ్య సోపానాలు!



ముందుమాట:


పాఠకులందరికి శరన్నవరాత్ర శుభాభినందనలు!


ఆశ్వయుజ మాసం లో వచ్చే శరన్నవరాత్రులు అమ్మవారి ఆరాధనకు అతి  ప్రీతి పాత్రమైన కాలం గా  మనకు పెద్దల ద్వారా, పురాణాల ద్వారా తెలుస్తోంది. ప్రతి రోజూ భగవంతుని ఆరాధనకు బ్రాహ్మి సమయం, సంధ్యా సమయం ఎంత అత్యుత్తమ మైనవొ, అలాగే ఏడాది లో ఆశ్వయుజ మాసం లో శుక్ల పక్షం లో పాడ్యమి మొదలు నవమి తిధి వరకు ఉన్న తొమ్మిది రోజులు అమ్మ వారి ఆరాధనకు, సాధనకు  అంత అత్యుత్తమ మైన సమయం గా ఋషుల చేత నిర్ణయింప బడినదని  మనకు తెలుస్తోంది. శరద్ ఋతువులో భారత దేశం అంతా సమతుల్యమైన  ఉష్ణోగ్రత ఉండటం వలన సాధనకు చాల అనువైన కాలం గా కూడా చెప్పబడుతుంది. 

ఈ పవిత్ర పర్వ దినాలలో మన పాఠకులకు ప్రత్యేకంగా శరన్నవరాత్రి విశిష్టతను మరొక్క సారి గుర్తుకు తెస్తూ శ్రీమతి నయన కస్తూరి గారు ముందుగ శరన్నవరాత్రుల వైభవాన్ని వివరించటమే కాక, ఈ నవ రాత్రులలో ప్రతి రోజు అ మరుసటి రోజు యొక్క దేవీ అలంకార ప్రభావాన్ని విశదీకరిస్తూ, అ దేవికి సమర్పించే ప్రత్యేక నివేదన గురించి ప్రస్తావించటం జరుగుతుంది. పాఠకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ దేవి అలంకారాలూ నివేదనలు, ప్రాంతానుసారం  ఉత్తర తూర్పు దక్షిణ భారతాలలో కొంత మార్పుతో ఉంటాయి. అంతేకాక అచ్చటి దేవీ క్షేత్రాల సంప్రదాయం అనుసరించి కూడా స్వల్పమైన మార్పుతో ఉండవచ్చు. మనం ఇక్కడ పొందు పరిచేవి, సామాన్యం గా మన ప్రాంతాలలో జరుపుకునే పద్ధతి ని అనుసరించి వుంటాయి.

కనుక ఈ నెల 25 వ తేదీ నుండి, అక్టోబర్ 3 వ తేదీ వరుకు కొనసాగే దేవి నవరాత్రులలో పాఠకులంతా అమ్మవారి వివిధ రూపాలని అర్చించి తరించగలరని ఆశిస్తూ, మన అందరిపై ఆ తల్లి కృపా కటాక్ష వీక్షణాలు నిరంతరం నిలవాలని కోరుకుంటున్నాము.


రమణ బంధకవి

సంపాదకుడు



శరన్నవ రాత్రులు---సకల సౌభాగ్య సోపానాలు


శ్రీమతి నయన కస్తూరి, హైదరాబాద్


హిందువులు జరుపుకునే పర్వదినాలలో శరన్నవరాత్రులు విశేషమైన పండుగ రోజులు. ఈ పవిత్ర రాత్రులు శరదృతువులో ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు మొదలై , విజయదశమి తో  ముగుస్తాయి. అసలు ఈ నవరాత్రులు మనం ఎందుకు చేసుకుంటామో తెలుసా? మన పురాణాల్లో అనేక కథలు వున్నా, అన్ని చెప్తున్నవి ఏమిటంటే ఎప్పుడైనా చెడుపై మంచికే విజయం లభిస్తుందని! దుష్ట శక్తి ని అణచడానికి దైవ శక్తి ఆవిర్భిస్తుంది.

పూర్వం శివుని దగ్గర అమరత్వాన్ని వరం గా పొందిన మహిషాసురుడనే రాక్షసుడు గర్వాంధుడై , దేవతలతో సహా సమస్త ప్రాణికోటిని అంతమొందించు చుండగా, అందరూ కలిసి తమను రక్షించవలసినదిగా ఆ జగన్మాతను వేడుకున్నారు. మనకు ఏ కష్టం వచ్చినా అమ్మే కదా ఆదుకునేది!  తక్షణమే జగన్మాత దుర్గా దేవిగా అవతరించి, మహిషాసురుడిని యుద్ధానికి ప్రేరేపించి,  తొమ్మిది రోజులు పోరాడి,  తొమ్మిదో  రోజున ఆ రక్కసుని అంతమొందించి, దుష్ట శిక్షణ - శిష్ట రక్షణ గావించింది. కావునే ఈ తొమ్మిది రోజులు  అందరూ భక్తిశ్రద్ధలతో అమ్మ వారిని పూజించి, పదవ రోజున అమ్మ వారి విజయానికి సంకేతంగా  ఆనందోత్సాహాలతో, భక్తి శ్రద్ధలతో విజయదశమి సంబరాలు జరుపుకుంటారు. అందుకే ఈ నవరాత్రులను దేవీ నవరాత్రులు అని కూడా అంటారు.  

ఇంకొక కథనం  ప్రకారం  శ్రీ రాముడు రావణుడి ని సంహరించి, సీతాదేవితో అయోధ్యకు తిరిగి వచ్చిన సంతోష సందర్భము లో ప్రజలంతా ఆనందంగా విజయ దశమిని జరుపుకున్నారని, అప్పటి నుండి అదే అలవాటుగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారని నమ్ముతారు. ఏమైనా ఈ విజయ దశమి పండుగ, చెడు పై మంచి సాధించిన విజయానికి చిహ్నమని అందరూ ఒప్పుకుంటారు. 

ఈ పండగ ఎలా జరుపుకుంటారో మీందరకు సుపరిచితమే అయినా ఇక్కడ క్లుప్తంగా వివరిస్తాను. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు కలశస్థాపన చేసి, అమ్మవారిని ఆవాహన చేసి, ఒక్కో రోజు ఒకొక్క విధం గా అమ్మ వారిని అలంకరించి, విశేషమైన పూజ చేసి ఆ అవతారంలో అమ్మ వారికి అత్యంత ప్రీతికరమైన వంటకం చేసి భక్తిగా నివేదిస్తారు. ఆ వివరాలు కూడా రోజువారీగా మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు మాత్రం, ఈ నవరాత్రులలో సాధారణంగా ఏమేమి పాటిస్తారో ఒక్క సారి మననం చేసుకుందాం. (సశేషం. మిగతా భాగం తో రేపు కలుద్దాం).




No comments:

Post a Comment