Friday, December 2, 2016

మార్గశిర మాసం - లక్ష్మీ నారాయణుల ఆవాసం!


ముందుమాట:

గత మాసం అంతా కార్తీక మాస వైభవం గురించి తెలుసుకుని, హరిహరులను మనసారా కొలుచుకుని, కార్తీక స్నానాలు, దీపాలు, దానాలు, అభిషేకాలు మొన్నగు కార్యక్రమాలతో తరించి, ఉపవాసాల తో పునీతులమై, కొసమెరుపుగా షడ్రుచోపేతమైన వనసమారాధన తో అత్మేశ్వరుని కి నివేదన చేసి ఇప్పుడు, హేమంత ఋతువు లోని మొదటి మాసమైన పుణ్య మార్గశీర్షం లోకి అడుగు పెట్టాము. ఈ మాసం యొక్క విశిష్టత గురించి, పర్వ దినాల గురించి శ్రీమతి నయన విపులంగా మన ముందుకు తెస్తున్నారు.


సంపాదకుడు

రమణ బంధకవి



మార్గశిర మాసం - లక్ష్మీ నారాయణుల ఆవాసం!

శ్రీమతి నయన కస్తూరి


తెలుగు మాసాలలో తొమ్మిదవ మాసమైన మార్గశిర మాసం శ్రేష్టమైన మాసం .మార్గశిరపౌర్ణమి నాడు మృగశిరా నక్షత్రం పడటం వలన ఈ మాసానికి మార్గశిర మాసం అనే పేరు వచ్చింది. కార్తీకం పరమేశ్వరునికి ప్రీతికరమైతే, మార్గశిర మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనది .ఆయన భక్తులకు ఎంతో పవిత్రమైనది.ఆ శ్రీమన్నారాయణుడే స్వయంగా మార్గశిరం అంటే తానే అని ప్రభోధించినట్టు ప్రతీతి..

'గాయత్రి చందా సమాహం
మాసానాం మార్గసోహం"అని చెప్పాడట '

అందుకే మార్గశిరానికి ఇంకొక పేరు కూడా ఉందిట. అది ఏమిటంటే 'అగ్రహాయన'అగ్ర అనగా అగ్రజుడు ఆయన అనగా ప్రయాణం . సూర్యుని సంక్రమణం జరిగె సమయం కానక ఆ పేరు వచ్చింది. దాని గురించి కూడా తదుపరి ప్రస్తావించుకుందాం.

.శ్రీ కృష్ణ భగవానుడు గీత లో సెలవిచ్చిన ప్రకారం పృథ్వి మీది మానవులకు ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక రోజుతో సమానం. మరి ఇక అందులో మార్గశిర మాసం ఆ రోజులోని బ్రహ్మి ముహూర్తం గా దేవతల చేత భావించబడే సమయం . రోజులో బ్రాహ్మి ముహూర్త సమయం యొక్క వైశిష్టత మనం చదువుకునే వున్నాం . ఆ సమయం పవిత్రమైన దైవకార్యాలు మాత్రమే ఆచరించవలసిన సమయం . ఆ సమయం లో చేసే ఏ చిన్న పవిత్ర కార్యమైనా ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది .

ప్రతి తెలుగు సంవత్సరంలో వచ్చే మార్గశిరం యొక్క పవిత్రత ప్రాధాన్యత లను తెలుసుకుందాం. ఈ సంవత్సర నవంబర్ 30 నుండి డిసెంబర్ 29 వరకు వరకు మార్గశిరమాసం కలదు. నిన్న మొన్నటి వరకు కార్తీకమాసం లో శివ సాన్నిధ్యం కోసం ఎలా సాధన చేసామో మహావిష్ణు అనుగ్రహాన్ని పొందుటకై ఈ మార్గశిరమాసం మనకు ఎంతో చక్కటి అవకాశాన్ని చూపుతున్నాయి.

సూర్యోదయానికి ముందే స్నాన మాచరించి, దీపారాధన చేసుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులవుతాము. విష్ణువాలయ దర్శనం భోగభాగ్యాలను సంప్రాప్తిస్తుంది. నారాయణ స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారిని కూడా కొలుచుకుంటారు . నిత్యం విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణము చేసుకుంటే మహా విష్ణువు యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. మార్గశిర మాసం లో లక్ష్మీ దేవియొక్క ఆరాధన కూడా ఎంతో విశిష్టమైనది. తప్పక ఆచరించతగ్గది . అష్టైశ్వర్యప్రాప్తికి కారకమైనది. మార్గశిర మాసం లోని లక్ష్మీ వారాలనాడు మార్గశిరలక్ష్మి నోమును చేసుకుంటారు . దీని గురించి మనకు స్త్రీల వ్రతకథ పుస్తకాలలో వివరంగా ఇవ్వబడి ఉంటుంది .వైజాగ్ లోని కనకమహాలక్ష్మి ఆలయం లాంటి లక్ష్మీ దేవి ఆలయాలలో విశేష అలంకారాలు పూజలు జరుపబడతాయి అని మన లో చాలామందికి తెలిసిన విషయమే.

ఇక పొతే ఈ మార్గశిరం లో వచ్చే విశేషమైన పర్వదినాలను గురించి తెలుసుకుందామా మరి .మార్గశిర మాసం లోని ఆరవరోజున వచ్చే షష్టిని సుభ్రహ్మణ్య షష్టి అని స్కంద షష్టి అని పిలుచుకుంటూ ఆ రోజు సుభ్రహ్మణ్యేశ్వరుని విశేష ఆరాధన జరుగుతుంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం సంతానం కోసం ఈ ఫాలనేత్రసుతుని భక్తిశ్రద్హలతో కొలుచుకుంటారు. హిందూ స్త్రీలకు ఎంతో పవిత్రమైన సుబ్బారాయుడి షష్టి గురించి ప్రత్యేక వ్యాసం లో తెలుసుకుందాం . ఈ షష్టి పండుగ డిసెంబర్ 5 న మనమంతా భక్తి శ్రద్హలతో జరుపుకుందాం.

షష్టి మరునాడు అనగా డిసెంబర్ 6 న వచ్చే సప్తమి ని మిత్రసప్తమి అని పిలుచుకుంటూ సూర్యభగవానుని ఆరాధిస్తారు. . ఇక త్రయోదశినాడు శ్రీహనుమద్ వ్రతంజరుపుకుంటారు. హనుమంతుడికిష్టమైన తమలపాకులతో పూజ చేసి వడమాలలతో అలంకరించి అప్పాలు నివేదన చేస్తారు. ఈ మార్గశిరం లో హనుమద్ వ్రతం డిసెంబర్ 12 న పడిందది మరి .

ఇక మార్గశిర పౌర్ణమి నాడు శ్రీ దత్తజయంతి ని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. సూర్యుడు ధనుస్సు రాశి లోకి ప్రవేశించిన రోజు నుండి ఒక నెల రోజులను ధనుర్మాసం అంటారు. ఈ పవిత్రమైన సంక్రమణం ఈ మార్గశిర పౌర్ణమి నాడు సంభవించడం ఈ మాసం యొక్క విశిష్టత. ధనుర్మాసం విష్ణు మూర్తికి ఎంతో ప్రియమైన రోజులు . నెల రోజులు విష్ణుమూర్తికి విశేష పూజలు ప్రసాదాలు చేయబడుతూ ఉంటాయి. నారాయణుని మందిరాలు భక్తులతో నిండి పోయి ఉంటాయి .సూర్యోదయానికి ముందే తిరుప్పావై శ్రీవ్రతం పారాయణం జరుగుతాయి . ఈ సంవత్సరం ధనుర్మాసం డిసెంబర్ 16 నుండి జనవరి 15 దాకా ఉంటుంది . అప్పుడు ధనుర్మాసం గురించి అప్పుడు పారాయణం చేసుకునే తిరుప్పావై సప్తపదులు గోదాకల్యాణాల గురించి మరింత వివరం గా ముచ్చటించుకుందాం.

నారాయణుడు భోగస్వరూపుడు. మార్గశిరమాసం లో సూర్యోదయానికి ముందే పూజ చేసి భోగం నివేదన చేస్తారు. పులిహార , కట్టె పొంగలి, దద్దోజనం, సుండలు, చక్కర పొంగలి. బెల్లం పొంగలి వడపప్పు పానకం లాంటి నివేదనలు సమర్పించుకుంటారు. వీటిని బహు కమ్మగా తయారు చేసుకునే విధానాలు తెలుగు భోజనము నుండి మీరు లోగడే నేర్చేసుకున్నారు కదా ? ఇకనేమి వాటిని చేసుకుని భగవంతునికి ఆరగింపు చేసుకోండి మనసారా.

ఈ విధంగా ఈ పవిత్రమైన మార్గశిర మాసం విష్ణుమూర్తి తో పాటు నారాయణ స్వరూపుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి ని, సుభ్రహ్మణ్య స్వామిని,సూర్యనారాయణ మూర్తి ని , శ్రీ దత్తాత్రేయుల వారిని కొలుచుకుని పునీతులమవుదాము.

స్వస్తి!