ముందు మాట:
శరత్ కాలం లో వచ్చే శరన్నవరాత్రులు లేదా
దేవి నవరాత్రులలో భక్తులు అమ్మవారిని వివిధ అవతారాలలో భక్తి తో పూజించిటం మనం ఈ
వ్యాస పరంపర ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాము. ఈ శరత్ కాలం లో అనేకరుగ్మతలు పొంచి
ఉంటాయని,
అమ్మవారిని
ఆ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి నట్లయితే మనకు ఆ మహాశక్తి రక్షణ లభించి
ఆ తల్లి కరుణ కటాక్షాలకు కూడా పాత్రులవుతాము అని పెద్దలు చెప్తారు. కొన్ని ప్రాంతాలలో “శాకంబరి” అలంకారం
లో కూడా భక్తులు అమ్మవారిని కొలుచుకుంటారు.
ఈ అలంకారం యొక్క విశిష్టతను తెలియచేయటానికి ఈ ప్రత్యేక వ్యాసం ద్వారా శ్రీమతి
పద్మా రఘునాద్ ‘తెలుగు భోజనం’ ముందుకు వస్తున్నారు. ఈ అలంకార ప్రాభవ విశేషాలను
తెలుసుకుని అమ్మవారిని శాకంబరి మాతగా మనుసులో అర్చించు కుందాము.
రమణ బంధకవి
సంపాదకుడు
రమణ బంధకవి
సంపాదకుడు
శ్రీ శాకంబరి మాత
శ్రీమతి పద్మా రఘునాద్
నవరాత్రులలో ఒక రోజు అమ్మవారిని అనేక రకాల
కాయగూరలతో,
ఫలాలతో,
శాస్త్ర ప్రకారం అలంకరించి శాకంబరి అవతారం గా కొలిచి దేవాలయాల్లో అర్చనలు జరుపుతుంటారు.
ఆ
అవతారము మహిమ దాని ఆవిర్భావము వెనకాల వున్న విషయాలను గుర్తుచేసుకుందామా మరి?
పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడు తపస్సు
ద్వారా బ్రహ్మ ని మెప్పించి, వేదాలన్నీ
తనలో దాచేసుకున్నాడు. దానివలన, లోకంలో అందరు, వేదమంత్రములు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్ని మర్చిపొయారు.
పూజలు, యజ్ఞాలు మొదలైనవి లేక పోవటంతో, దేవతలకు హవిస్సులు అందక, కోపించినందువలన, లోకంలో వర్షాలు లేక భూమి ఎండిపోయి బీటలు
వారింది.
పంటపొలాలు
కూడా బీడు వారి భయంకరమైన కరువు కాటకాలు రావటంతో ప్రజలు చాల బాధలు పడుతూ అన్న పానాదులు లేక మాడిపోసాగారు. అపుడు ఋషులంతా హిమాలయాల మీద కు వెళ్లి అమ్మవారిని
దీనంగా ప్రార్ధించారు. వారి
వెతలను తీర్చటానికి అమ్మ వారు అమితమైన కరుణతో “శతాక్షి” గా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరవు కాటకాలను, లోకం లో వున్న దుస్థితిని
చూసి
అమ్మవారి ఒక కన్నులోంచి నీరు రాగా, ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకం అంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించటానికి కొంచం
వ్యవధి పడుతుంది కాబట్టి, మరి
ప్రజల
ఆకలి వెంటనే తీర్చాలి కనుక, అమ్మవారు
అమితమైన దయతో శాకంబరి రూపు దాల్చి వివిధమైన కాయగూరలు పళ్ళతో
సహా ఒక పెద్ద చెట్టు లాగా దర్సనమిచ్చింది. ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్న ఇంకా తరగని సంపదతో వచ్చింది
అమ్మవారు.
ఆవిడ
అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే
ఈ
శాకంబరి అవతారం.
పరమ పావనమైన ఈ శరన్నవరాత్రులలో అమ్మవారిని
ప్రకృతి స్వరూపిణిగా కొలిచి అర్చించటం వెనుక నున్న అంతరార్ధం తెలిసింది కదా! మనం ప్రకృతి ద్వారా లభించే
ప్రతి
వస్తువులన్నిటి ఎడల, గౌరవ
భావం కలిగి,
అమ్మవారి
ప్రసాదంగా భావించి దానిని గ్రహిస్తే ఎంత సంతోషము గా, తృప్తి గా వుంటుందో కదా మరి?
స్వస్తి!
No comments:
Post a Comment