Wednesday, October 1, 2014

నవరాత్రి వ్యాస పరంపర 13: దుర్గాష్టమం-దురితనివారిణం! (02-10-2014)



ముందుమాట:

రేపటి అలంకారం గురించి మనం మాట్లాడుకునే  ముందు పాఠక మహాశయులకు ఒక సంగతి విన్నవించుకొవాలి. అదేమిటంటే, దేవీ నవరాత్రులలో రేపటి రోజున అనగా అక్టోబర్ 2న రెండు మహాతిధుల విశిష్ట సమ్మేళనం వలన పరమేశ్వరి యొక్క రెండు స్వరూపాలకు ఒకే రోజు విశేష పూజలు జరిపించాలని పండితులు నిర్ణయించారు. రేపు సూర్యోదయం సమయానికి అష్టమి గడియలు వుండటం వలన మరియు నవమి ప్రవేశించి, మరునాడు ప్రాతః కాలమునందే నవమి వెళ్ళిపోవడం వలన దేవీ నవరాత్రులలో విశిష్ట స్థానం పొందిన శ్రీ దుర్గాష్టమి మరియు జగన్మాత మహిషాసురుని వధించిన పర్వదినం-మహానవమి పండుగలు రెండూ రేపే జరుపుకోవాలి. రెండు తల్లుల అలంకరణలు, ఆరాధనలు ఉదయమే చేసుకోవచ్చును. కాకపొతే  గృహం లో కూడా విశేష అలంకరణ చేసుకునే వారు తమ వీలుని బట్టి సాయం సమయమున మహానవమి పూజలు చేసుకోవచ్చును. ఆ తిధులు గురించి, ఆ అలంకారాలు గురించి, ఏ పూజలు సలిపి అమ్మవారిని సంతృప్తి పరచాలో, ఏ యే వంటకాలు నివేదనకు ఉపయోగించాలో శ్రీమతి నయన కస్తూరి గారి విపుల వ్యాస పరంపరలో ఇప్పుడు  తెలుసుకుందాము. 
ఈ రోజు రెండు వ్యాసాలు ప్రచురితమౌతాయి కనుక పాఠకులు గమనించగలరు.

రమణ బంధకవి

సంపాదకుడు



దుర్గాష్టమం-దురితనివారిణం!

శ్రీమతి నయన కస్తూరి

ముందుగా 'దుర్గాష్టమి' నాడు అమ్మవారిని ఏ విధంగా అలకరించాలో చూద్దాం. 'దుర్గామాత' అని అనుకోగానే మన మదిలో త్రిశూలధారియై, వ్యాఘ్రవాహన అయి, శరణు కోరినవారిని రక్షించే  చల్లని చూపుతో ప్రత్యక్షమవుతుంది. ఆ సకల శక్తి స్వరూపిణి కే రేపు  'ఓం కాత్యానాయ విధ్మహే కన్యకుమారి ధీమహీ! తన్నో దుర్గీ  ప్రచోదయాత్!'  అంటూ ప్రార్ధనలు సలిపి, ఆరాధిస్తే, భక్తుల దుర్గతులు దూదిపింజల్లా ఎగిరిపోతాయి.

దుర్గముడనే అసురుని సంహారం చేయడానికి, దుర్గాదేవిగా ఆవిర్భవించింది మహేశ్వరి! ఆ రక్కసుని ఎలా అంతమొందించిందో భక్తుల దుర్గమాలను కూడా అలాగే  రూపుమాపుతుంది దుర్గమ్మ! రాహుగ్రహ దోషాలను నివారించి, భక్తుల కష్టాలను శీఘ్రం గా దూరం చేస్తుంది. 'ఓం దుం దుర్గాయనమః' అని వీలైనన్ని సార్లు జపిస్తే శత్రు బాధలు తొలగి, సుఖశాంతులు కలుగుతాయి. శ్రీ లలితాసహస్రనామ స్తోత్రం తో పాటు శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం  చేసుకుంటే, భక్తుల కోరిన కోరికలు ఈడేరుతాయి. దుర్గాష్టమి నాడే 6 నుండి 12 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పూజ చేసి, తాంబూలాలు, కానుకలు ఒసగుతారు. బొమ్మలకొలువు పేరంటం కొనసాగిస్తారు. సరస్వతీ దేవి పూజ నాడు మొదలు పెట్టిన త్రిరాతవ్రతం ఈ రోజు కొనసాగిస్తారు. ఈ విశిష్ట పర్వ దినాన్న శ్రీ దుర్గా దేవికి మిక్కిలి ప్రీతికరమైన పులగాన్నం మరియు పులిహార నివేదన చేస్తే చాలా ఫలప్రదం! 

ఈ నాడు దరించవలసిన వర్ణం:  గులాబీ

ఈ నాటి నివేదనలు: పులిహోర, పులగాన్నం
పులిహార ఐదవ అలంకారమైన శ్రీ లలితాత్రిపుర సుందరి అలంకారం లో వివరంగా తెలుసుకున్నాము.  కనుక ఇప్పుడు పులగాన్నం అంటే ఏమిటో, ఎలాచేయాలో, దాని విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. పులగాన్నం చాలా సులభంగా చేసుకోవచ్చు. కాని దైవ నివేదనలలో ఎంతో విశిష్టత కలిగినది. పులగాన్న నివేదన మహానివేదనకు సమానమైనది.

కావలిసిన వస్తువులు, తయారు చేసే విధానం:
బియ్యం మఱియు ఛాయ పెసరపప్పు. రెండు గ్లాసుల బియ్యానికి చారెడు పెసరబద్దలు చాలు. పెసరపప్పు ఒక పదినిమిషాలు నీళ్ళల్లో నానబెట్టండి. ఇప్పుడు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి, బియ్యానికి రెట్టింపు కన్నా కొంచెం తక్కువగా నీళ్ళు పోసి, పైన పెసరపప్పు వేయండి. రుచికి కొంచెం ఉప్పు వేయండి. కుక్కర్లో కానీ ఒక దళసరి ఇత్తడి గిన్నలో కాని ఉడకబెట్టండి. మరీ మెత్తగా ఉడకక్కరలేదు. పులగాన్నం కొంచెం బిరుసుగానే బాగుంటుంది. పెసరపప్పు కూడా బద్దలుగా కనిపించాలి. ఉడికిన తర్వాత పైన రెండు చెంచాల నెయ్యి వేయండి. నివేదన చేసేటప్పుడు పైన చిన్న బెల్లం ముక్క పెట్టండి. చూసారా ఎంత సులభమో చేసుకోవడం? దీనినే 'పులగం'అని కూడా అంటారు. మన నిత్యపూజ లో భగవంతునికి అన్ని పదార్ధాలతో మహానివేదన చేయాలని వున్నా సమయాభావం చేత చేయలేకపోతున్నామే అని వాపోయే వారు ఈ పులగాన్నం చేసి, ఒక చిన్న బెల్లం ముక్కతో దైవానికి నివేదిస్తే మహానివేదన చేసినట్టే! పులిహార, పులగాన్నంతో పాటు అమ్మవారికి వడపప్పు, పానకం, పచ్చిచలిమిడి నివేదించుకోవచ్చు. ఇవండీ దుర్గాష్టమి విశేషాలు!
             
ముందు చెప్పినట్లు ఇప్పుడు అక్టోబర్ 2 వ తారీఖునే దుర్గాష్టమి తో పాటు జరుపుకునే మరో 
పర్వదినం  'మహానవమి'!  నవమి అలంకార మరియు నివేదన విషయాలు ఇంకొద్ది సమయం 
లోనే మీ ముందు ఉంచుతాము. చూస్తూనే ఉండండి తెలుగు భోజనం!

స్వస్తి!


 









        


No comments:

Post a Comment