Monday, October 13, 2014

మొదటి ముద్దగా హితవు కలిగించే కొత్తిమీర కారం


శ్రీమతి రత్నా శ్రీనివాస్

కొత్తిమీరని  ఇంచుమించుగా ప్రతి వంటకములోను అంటే పప్పులు, కూరలు, పచ్చళ్ళు, సాలడ్స్, చాట్స్ మొదలైన వంటకాలలో డ్రెస్సింగ్ కి వాడతారు. అంటే ఏ వంటకానికైన వన్నె తెచ్చేది కొత్తిమీర అన్న మాట. కొత్తిమీర వేయటం వలన ఆ వంటకం సువాసన భరితంగా వుంటుంది. ముఖ్యంగా చారులో వేస్తే దాని రుచే ప్రత్యేకతను సంతరించుకుంటుంది.  కొత్తిమీరను కేవలం డ్రెస్సింగ్ కి మాత్రమె కాకుండా పచ్చడిగా కూడా చేసుకొనవచ్చును. ఎలా అంటారా? చూడండి మరి!

కావలసిన వస్తువులు:
కొత్తిమీర                                                       1 కట్ట
చింతపండు                                                    50 గ్రాములు
ఉప్పు                                                          రుచికి సరిపడా
బెల్లం                                                           చిన్న ముక్క
కారం                                                          1 టీస్పూన్

పోపుకు కావలసిన వస్తువులు :

నూనె                                                       4 టేబుల్ స్పూన్స్
మినపపప్పు                                               2  టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి                                                10-12
ఆవాలు                                                    2 టీస్పూన్స్
ఇంగువ                                                    1 టీస్పూన్
మెంతులు                                                 1 టీస్పూన్
పసుపు                                                    చిటికెడు

తయారు చేయటానికి పట్టే సమయం :                 15 నిమిషాలు

ముందుగా కొత్తిమీర  ఆకులు వలచుకోవాలి. తరువాత  శుబ్రంగా మట్టి పోయేలాగా కడిగి ఒక గుడ్డలో ఆరబెట్టినట్లుగా పరచుకోవాలి.  చింతపండును కడిగి ఒక కప్పులోతగినంత నీరు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలి తీసుకుని నూనె వేసుకుని వేడిక్కిన తరువాత మెంతులు వేసి రంగు మారేక మినపపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. తరువాత ఆవాలు వేసి చిటపటలాడేక ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఆఖరుగా ఇంగువ వేసి స్టవ్ ఆపుచేసుకోవాలి.

ఇపుడు పోపును వేరొక పాత్రలోకి తీసుకుని, అదే బాణలిలో నానపెట్టిన చింతపండును పిసికి ఆ గుజ్జును వేసి ఇగరబెట్టాలి.  స్టవ్ ఆపి  బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు పోపు చల్లారి వుండి వుంటుంది. మిక్సీ లో పోపుని తిప్పుకోవాలి. పోపు నలిగిన తరువాత కొత్తిమీర, ఉప్పు, చింతపండు-బెల్లం మిశ్రమం  వేసి మిక్సీ లో తిప్పాలి. ఇప్పుడు పచ్చడిని తీసుకుని ఒక మంచి పాత్రలోకి మార్చుకోవాలి.  వేరొక చిన్న  బాణలిలో ఒక  టీస్పూన్ నూన్ వేసి కొంచెం ఆవాలు, ఇంగువ వేసి చిటపట లాడేక స్టవ్ అపి ఒక టీస్పూన్ కారం వేసి దానిని తయారైన పచ్చడి లోకి వేయాలి.

సలహాలు:
1.కొత్తిమీర  పచ్చడిని వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని మొదటి ముద్దగా  తింటే చాల రుచిగా వుంటుంది.
2. దీనిని చపాతీ, పరాటా, ఇడ్లీ, దోశలల్లోకి కూడా నంచుకుని తినవచ్చును.
3. పచ్చడి ఫ్రిజ్ లో వుంచితే వారం, పది రోజుల పాటు నిలువ చేసికొనవచ్చును.


No comments:

Post a Comment