Sunday, October 12, 2014

బామ్మ గారి కార్నర్: బామ్మగారి క్విజ్: బామ్మ గారి ప్రశ్నలకు మీ జవాబు మరియు ; నోరూరించే ఫలహారం : పులిహోరపిండి

    
ముందు మాట: 
మన తెలుగు భోజనం పాఠకుల అభిమానం చూరగొంటున్న నేపధ్యంలో, కొత్త హంగులను సంతరించుకుని మీ ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా బామ్మ గారి కార్నర్ లో జిహ్వ లేచి వచ్చే వంటకాలే కాకుండా, పురాణేతిహాసాల పై మీ అవగాహనకు పరీక్ష పెట్టే చిట్టి చిట్టి ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ఆసక్తి గలవారు సమాధానం తెలిసినట్లయితే ఇవ్వవచ్చును. ఈ సంచిక లో అడిగిన ప్రశ్నకి తదుపరి సంచిక లో జవాబు ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజు మొదటి ప్రశ్న మీ ముందుకి వస్తుంది. ఇక మీ జవాబు సిద్దం చేసుకొండి.

అంతే కాక ఈ రోజు బామ్మగారు పులిహోరపిండి గురించి వివరిస్తారు. ఆ రోజుల్లో పులిహోర పిండిని ఉపవాసం వుండే రోజున చేసుకునే వారట. కుటుంబ పెద్దలే కాకుండా ఆ ఇంట్లో సభ్యులందరూ కూడా ఉపవాసం వుండేవారట. అప్పుడు రాత్రి పూట పలహారంగా పులిహోర పిండి గాని, దిబ్బరొట్టె కాని, బియ్యపిండి రొట్టె గాని, ఉప్పిడి పిండి కాని చేసుకునే వారట. ఇప్పుడు పులిహోర పిండి తయారీ బామ్మగారి మాటల్లో తెలుసుకుందాము. 


రమణ బంధకవి


సంపాదకుడు



పులిహోర పిండి

కావలసిన  పదార్దములు 
బియ్యపు రవ్వ                                                     1 గ్లాసు 
నీళ్ళు                                                                2 గ్లాసులు 
ఉప్పు                                                                రుచికి సరిపడా 
పసుపు                                                              1/2 టీస్పూన్
నిమ్మకాయలు                                                      2

పోపుకు కావలసిన పదార్దములు
నూనె                                                                2 టేబుల్ స్పూన్స్ 
సెనగపప్పు, మినప పప్పు                                        చెరొక టేబుల్ స్పూన్ 
ఆవాలు                                                              1 టీస్పూన్
ఎండు మిర్చి                                                        4  
పచ్చిమిర్చి                                                          2
ఇంగువ                                                              సువాసనకు 
కరివేపాకు                                                           5-6 రెబ్బలు 

తయారు చేయటానికి పట్టే సమయం                        అర్ధగంట 

తయారు చేయువిధానం: 
ఒక దళసరి గిన్నె తీసుకుని 2 గ్లాసుల నీరు పోసి స్టవ్ పైన పెట్టుకోవాలి. నీరు మరిగేక బియ్యపు రవ్వ కలియబెట్టుకుంటూ పోయాలి. మంటను సన్న సేగన వుంచి మూత పెట్టుకోవాలి. రవ్వ వుడికే లోపు వేరొక స్టవ్ పైన ఒక చిన్న బాండీ  పెట్టుకుని నూనె వేసి పైన చెప్పిన పులిహార పోపును పెట్టుకోవాలి. 

ఈ లోగ రవ్వ ఉడికి వుంటుంది. గిన్నెను స్టవ్ నుంచి దింపి మూత  తీసి రవ్వను  ఒక వెడల్పాటి పళ్ళెం లో  చల్లారబెట్టుకోవాలి. రవ్వ చల్లరేక పసుపు, ఉప్పు, పులిహార పోపు వేసి సమానంగా కలిసేలాగా కలుపుకోవాలి. 

ఇప్పుడు నిమ్మకాయ కోసి రసం పిండుకుని మరొకసారి సమానంగా కలుపుకోవాలి. 
రుచికరమైన పులిహార పిండి మీ పలహారానికి తయారయిపోయింది. 

మీరు కూడా ఒక సారి ప్రయత్నించండి. నిమ్మకాయ బదులు చింతపండు రసం కూడా   వేసుకొనవచ్చును. ఐతే  చింత  పండు రసాన్ని వుడికించుకొనవలసి వుంటుంది. 



 బామ్మగారి క్విజ్: బామ్మ గారి ప్రశ్నలకు మీ జవాబు: ఈ రోజు ప్రశ్న:

శ్రీ మహావిష్ణువు హస్తాలలో వున్న ఆయుధాలు ఎన్ని? వాని  పేర్లు ఏమిటి?



No comments:

Post a Comment