Saturday, October 25, 2014

కార్తీక మాస ప్రత్యేక వ్యాస పరంపర -2: కార్తీకం—ముక్తిదాయకం! పార్ట్ 2




శ్రీమతి నయన కస్తూరి


శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్ళు అభికరిస్తే చాలు. పరమేశ్వరుడు పరమ సంతుష్టుడై భక్తుల కోరికలను మరుక్షణంలో తీరుస్తాడు. కానీ భక్తులు తమ భక్తి కొలది క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, ఫలోదకాభిషేకం .........వివిధములైన అభిషేకాలు చేసి పరవశ మొందుతారు. అభిషేకాలను గురించి మరింత వివరముగా  రాబోవు సంచికలలో తెలుగుభోజనంతెలియజేస్తుంది.

అలాగే శ్రీమహావిష్ణువు అర్చన, వ్రత  ప్రీతిపాత్రుడు. వివిధ రకాల  పుష్పాలతో అర్చన చేసి విష్ణుసహస్రనామస్తోత్ర పారాయణం, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం, దామోదర వ్రతం........తమ శక్తి కొలది చేసుకుని భక్తులు శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందుతారు.

కార్తీకమాసం మోక్షప్రదాయకం. మోక్ష ప్రాప్తికై భక్తులు ఉపవాస దీక్షలు అవలంబిస్తారు. కొందరు మాసమంతా ఉదయం మొదలు సాయంత్రం వరకు ఉపవాసం వుండి నక్షత్ర దర్శనానంతరం  భోజనం చేస్తారు. దీనినే ‘నత్తాలు’ అంటారు. కొంతమంది నాగుల చవితి, సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజులలో ఏక భుక్తం చేస్తారు.

కార్తీక పౌర్ణమి నాడు కొంతమంది భక్తులు ముప్పైమూడు పున్నముల నోము చేసుకుంటే, మరికొంతమంది కార్తీక అమావాస్యనాడు, ‘పోలి’ అనే చాకలి యువతి కార్తీక స్నానం చేసి దీపం వెలిగించిన పుణ్యానికి, స్వర్గ ప్రవేశం చేసిన కధ చెప్పుకుని పూజ చేసుకుంటారు. ఇలా పరిపరి విధముల అభిషేకాలు, అర్చనలతో శంకర, నారాయణుల సేవే కాకుండా దీప దానం, అన్న దానం, వస్త్ర దానం.........లాంటి అనేక దానాలు చేసుకుని మానవ సేవే మాధవ సేవ అని సమాజానికి ప్రేరణ కలిగిస్తారు. ఏ మాత్రం పెద్దా చిన్నా తారతమ్యాలు లేకుండా  అందరూ కలిసి వండుకుని, సామూహికం గా ఏక పంక్తిని ఉసిరి చెట్టు క్రింద కూర్చుని, భోజనం చేస్తారు, దీనినే వనభోజనం లేక కార్తీక సమారాధన అంటారు. ఈ మాసంలో కార్తీక పురాణం, శివ, విష్ణు పురాణాలు మొదలగు పుణ్య గ్రంధాల పారాయణ చేస్తారు.

కార్తీక మాస వైశిష్టతను తెలుసుకున్నాము కదా! మరి ఈ మాసంలో ఆచరించ దగ్గ  విశిష్ట పుణ్య కార్యాల  గురించి విపులంగా రాబోయే సంచికలలో ముచ్చటించుకుందాము.

కార్తీక మాసం లోని ముఖ్య విశేషాలు:
కార్తీక స్నానాలు-ప్రత్యామ్నాయాలు 
కార్తీక చతుర్ధి---నాగులచవితి ( 27th October)
దీపారాధన-పాపనివారణ
అభిషేకాలు-అర్చనలు 
ఉపవాస దీక్ష-హరిహర రక్ష 
కార్తీక దానాలు-కారుణ్య సాధనాలు 
కార్తీక మాసం-వృక్ష త్రయం 
ఏకాదశ ద్వాదశ వ్రతాలు--దీర్ఘాయువు ప్రదాయకాలు ( 3rd & 4th Nov)    
కార్తీక పున్నమి-కన్నులకలిమి (Nov 6th)
శివ తత్త్వం
అర్థ నారీశ్వర తత్త్వం
వనభోజనం- కార్తీక సమారాధనం
సర్వ అమావాస్యం- సర్వ ఋణ పాప విమోచకం (Nov 22 )
వివరాలతో మళ్ళీ  కలుద్దాం ! చూస్తూ ఉండండి ‘తెలుగు భోజనం’ ప్రతి రోజూ!

             సర్వేజనా సుఖినోభవంతు !లోకా సమస్తా సుఖినో భవంతు!!!


No comments:

Post a Comment