Thursday, October 2, 2014

నవరాత్రి వ్యాస పరంపర 15: విజయదశమం – విజయకేతనం! (03-10-2014)




విజయదశమం – విజయకేతనం! (03-10-2014)

శ్రీమతి నయన కస్తూరి


దేవీ నవరాత్రులలో విజయదశమి గా పిలువబడే ఆశ్వయుజ శుక్ల  దశమి నాడు అనగా రేపటి రోజున రకరకాల పూజలు, వేడుకలు చేసుకుని దుష్టశిక్షణ జరిపిన అమ్మను శాంతింప చేసి, ప్రసన్నమూర్తి అయిన శ్రీ రాజరాజేశ్వరీ దేవి రూపంలో పరి పరి విధాల స్తుతించి, ఇహ పర సౌఖ్యాలు పొందుతారు.

అమ్మవారు చిద్రూపిణి. పరదేవతగా అలరారుతుంది. పరమేశ్వరుని అంకమును ఆసనముగా చేసుకుని, చేతిలో చెరకుగడతో, చిరుమందహాసంతో శోభాయమానమై ప్రకాశించే జగన్మాతను మనోనేత్రంతో దర్శించుకుంటూ పూజోపచారాలు భక్తితో సమర్పించుకుందాం! అనంత శక్తి స్వరూపిణి అయిన ఈ తల్లి  శ్రీచక్రానికి అధిష్టాన దేవత! త్రిపుర త్రయం లో తృతీయ దేవత! ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరిని ప్రసన్నం చేసుకోవడానికి కుంకుమార్చనలు, సువాసినీ పూజలు, శ్రీచక్రార్చనలు నిర్వహిస్తారు.  వాహనాలకి, వ్యవసాయ పనిముట్లకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలమాలలు అలంకరించి పూజలు చేస్తారు.  శమీవృక్షానికి  పూజలు చేస్తారు. ఈ రోజే పాండవులు శమీ వృక్షానికి ప్రదక్షణలు చేసి, ఆయుధపూజ జరిపి, అమ్మవారి ఆశీస్సులు పొంది, కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు. అందుచేత మనం  కూడా రేపటి విజయదశమి నాడు శమీ వృక్షానికి పూజలు, ప్రదక్షణలు చేసి ఈ క్రింది శ్లోకాన్ని పటించుకుందాం, సర్వత్ర విజయం సాదిద్దాము.

             శమీ శమయతే పాపం, శమీ శత్రువినాసినీ!
             అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ!

ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదలు ఆశ్వయుజ శుక్ల నవమి వరకు జరిగిన పూజల  పరంపరకు దశమి నాడు జరిపే పూజా వేడుకలు అమ్మవారి నవరాత్రి  పూజకు పునః పూజ చేసి, ఉద్యాపన పలకడం అనుకోవచ్చును. బొమ్మలకొలువు పూజలకుకానీ, బాల పూజలకు కానీ,  బతుకమ్మ పూజలకు కానీ ఈ రోజుతో ముగింపు పలుకుతారు.

నవరాత్రులలో తుది పూజ విజయదశమీ పూజ. అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరీ దేవి అష్టోత్తరం తో   అన్ని పూజలు జరిపి సమస్త జనులు సుఖం గా వుండాలని కోరుకుంటూ, అమ్మవారికి ఎంతో ఇష్టమైన బూందీ లడ్డూ తో పాటు  షడ్రసోపేతమైన భోజన పదార్ధాలతో మహానివేదన సమర్పిద్దాము.

విజయదశమి రోజు విజయముహూర్తం అని, ఏ పని తలపెట్టినా అది విజయవంతం అవుతుందని, భక్తుల ప్రగాడ విశ్వాసం. పిల్లలు పెద్దలు కొత్తదుస్తులు ధరించి, బంధుమిత్రులతో కలిసి విందులు-వినోదాలు చేస్తారు. ప్రతీ తెలుగు లోగిలి పిల్లా పాపలతో, పెద్దల ఆదరాభిమానాలతో, కన్నె పిల్లల  పట్టు పావడాలతో ముత్తైదువుల పట్టు చీరల రెపరెపలతో, కొత్త అల్లుళ్ళు, మరదళ్ల సరసాలతో, కొత్త కోడళ్ళ మురిపాలతో, ఆడపడుచుల ముచ్చటలతో, షడ్రసోపేతమైన తెలుగు భోజనాలతో పండగ సందడి నెలకొంటుంది. ఒకరికొకరు కానుకలు, మిటాయిలు  ప్రేమగా పంచుకుంటారు. కలశం పెట్టి అమ్మవారి మూర్తిని పెట్టి సామూహికంగా చేసుకున్నవారు దశమి రోజున భక్తిశ్రద్ధలతో ఉద్ద్వాసన పలికి, నిమజ్జనం చేస్తారు.

రేపటితో ఈ విజయదశమి వేడుకలు ముగించుకుంటున్న సందర్భములో అసలు ఈ పండగలు జరుపుకునే ఉద్దేశ్యం ఏమిటో, శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి తత్వము ఏమిటో, వివిధ అలంకారాల పూజల వెనుక దాగిన మర్మమేమిటో అవి ఏ విధం గా మన సమాజానికి ప్రయోజనకరమో రేపటి దసరా వ్యాస పరంపర లోని ముగింపు  వ్యాసం లో ముచ్చటించుకుందాము.


స్వస్తి!




No comments:

Post a Comment