Wednesday, October 1, 2014

నవరాత్రి వ్యాస పరంపర 14:మహానవమ్యాం – మహిమాన్వితం! (02-10-2014)




మహానవమ్యాం మహిమాన్వితం


శ్రీమతి నయన కస్తూరి


శరన్నవరాత్రులలో  నవమి రోజు 'మహానవమి'గా ప్రాశస్త్యం పొందింది. అమ్మ వారి అలంకారం మహిమాన్వితమైన 'మహిషాసురమర్ధినీ అవతారం!  అమ్మవారు ఉగ్రరూపంతో, చేతిలో  త్రిశూలంతో సింహ వాహినియై దుష్టశిక్షణ గావిస్తూ వుంటుంది. మనం మొదట్లో చెప్పుకున్న విధంగా మహిషాసురుడనే రక్కసుడు శివుని దగ్గర అమరత్వాన్ని వరంగా పొంది, ఇంద్రుడి నే ఓడించి, దేవతలకు కూడా హాని తలపెట్టడంతో అందరూ పరుగు పరుగున  శివకేశవుల దగ్గరకు వెళ్లి, రక్షించమని వేడుకోవడంతో సమస్తదేవతల నుండి శక్తి వెలువడి, ప్రత్యేకమైన ఉగ్రమూర్తిగా రూపొంది, మహిషాసురుని యుద్దానికి ప్రేరేపించి దుష్ట శక్తిని అణచదలచింది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా పోరు సలిపి, ఆశ్వయుజ శుక్ల నవమి దినమున ఆ రక్కసుని అంతమొందించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించింది. అందుచేతనే ఈ నవమిని మహానవమి గా భక్తులు జరుపుకుంటారు. త్రిరాత్ర వ్రతం కొనసాగిస్తారు. బొమ్మలకొలువు  పేరంటం జరుపుతారు. కొన్ని ప్రాంతాల వారు వాహన పూజ మహానవమి నాడు చేసుకుంటారు.  

పరమేశ్వరిని మహిషాసుర మర్దిని అవతారంలో అనేక విధాలుగా పూజించి,  'జయ జయహే మహిషాసురమర్ధిని రమ్యక పర్దని శైలసుతే...!’ అంటూ ఉగ్రమూర్తిగా ఉన్న అమ్మవారికి వడపప్పు, పానకం, చలిమిడి, పులిహార, పులగాన్నం, గారెలు, నిమ్మరసం నివేదన చేసి, శాంతింపచేస్తారు. మనం కూడా శైలపుత్రిని  ఈ రోజు మహిషాసురమర్ధినిగా, మన మనస్సులలో నిలుపుకుని, మహిషాసుర మర్ధిని స్తోత్రం, లలితాసహస్రనామ స్తోత్రంతో షోడశోపచార పూజలు చేసి అమ్మ వారి కరుణాకటాక్షాలు పొందుదాం!


ఈనాటి నివేదనలు: మినప గారెలు:
వడపప్పు, పానకం, చలిమిడి, పులగాన్నం  చేయడం ముందు అవతారాల్లో నేర్చుకున్నందున ఇప్పుడు గారెలు చేసే విధానం ఒక్కసారి చూసుకుందామా?
ఉదయమే లేచి, స్నానం చేసిన వెంటనే రెండు గ్లాసుల మినప్పప్పుకి  ఒక గుప్పెడు పొట్టు మినపప్పు కలిపి నానబెట్టండి. పప్పు బాగా నానిన తర్వాత తగినంత ఉప్పు వేసి, మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి. స్టవ్  మీద దళసరి మూకుడు పెట్టి గారెలు వేగడానికి సరి పడా  నూనె పోసి, వేడెక్కాక, రుబ్బుకున్న పిండిని గారెల ఆకారంలో ఒక ఆకు మీద కానీ, ప్లాస్టిక్ కవర్ మీద కానీ చేసుకుని నూనెలో వేసి  రెండు పక్కల బంగారం రంగులో వేయించుకుని, చిల్లుల గరిటతో నూనె లేకుండా తీసుకుని పళ్ళెం లో వేసుకోవాలి. అమ్మవారికి నివేదనకి గారెలు తయారు! నవమి పండగ నాడు మినపగారెలు తప్పనిసరిగా నివేదన చేయాలని పెద్దలు చెప్తారు. రక్కసుని హతమార్చి ఉగ్రంతో ఉన్న అమ్మ వారిని శాంతింపచేయడానికి మినప గారెల నివేదన చేస్తే అమ్మ శాంతించి, భక్తులను కరుణిస్తుంది అని పెద్దలు చెపుతారు.

స్వస్తి!


     






No comments:

Post a Comment