Wednesday, October 29, 2014

కార్తీక మాస ప్రత్యేక వ్యాస పరంపర – 7 : దీపారాధన - పాప నివారణ


ముందుమాట:

కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ మాసం లో దీపాలను వెలిగిస్తే 

పాపక్షయమే కాక, పుణ్య మార్గ సోపానాలను పరుస్తుంది. మట్టి ప్రమిదలలో ఆవు నేతి మరియు 

నువ్వుల నూనె లలో తడిపిన ప్రత్తి వత్తులను వెలిగించటం; దేవాలయాలలో, ఇండ్లలో ఆకాశ 

దీపాలను వెలిగించి దర్శించటం; జ్వాలా తోరణాలను ప్రజ్వరిల్ల చేయటం; దీప దానాలు చేయటం; 

ఇలా ఎన్నో ప్రక్రియల ద్వారా, భగవత్క్రుపకు పాత్రులవటానికి ఈ పవిత్ర మాసం అవకాశాలు 

కల్పిస్తుంది. వీటన్నిటి గురించి సవివరం గా మనకు తెలియ జేస్తున్నారు శ్రీమతి నయన.


రమణ బంధకవి


సంపాదకుడు




దీపారాధన - పాప నివారణ


శ్రీమతి నయన కస్తూరి



కార్తీక  స్నానాల తర్వాత ఈ మాసం లో మోక్ష సాధనకు సులభ సాధనం దీపారాధన! కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు కార్తీక బహుళ అమావాస్య వరకు నిత్యం  ప్రాతః మరియు సాయం సంధ్యా సమయాల లో దీపారాధన చేస్తే సాంబశివుడు భక్తుల పూర్వజన్మ పాపములు, ఈ జన్మలో తెలిసీ  తెలియక చేసిన పాపకర్మములు  పటాపంచలు చేసి, ఇహపర సుఖములు ప్రసాదిస్తాడు అని మనకు పురాణాల వలన తెలుస్తోంది!

ఈ దీపారాధన చేసే సమయం మరియు విధానం ఇప్పుడు చూద్దాము! సూర్యోదయానికి ముందు తలారా స్నానం చేసిన తర్వాత గృహము లోని దేవుని దగ్గర మరియు  తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుంటే ఎంతో పుణ్యప్రదం! అలాగే సాయంకాలం దైవసన్నిధి లో, తులసమ్మ దగ్గర మరియు ఇంటి సింహద్వారానికి ఇరువైపుల దీపాలు పెట్టుకోవాలి. ఇంటి ముంగిట ఈ దీపాలు పితృదేవతలకు దారి చూపుతూ ఆహ్వానం పలుకుతాయి. ఇలా కార్తీక మాసం పొడుగునా పెట్టుకుంటే, కార్తీక దీపారాధన ఫలం లభిస్తుంది.

ఈ దీపారాధనకి మట్టి ప్రమిదలు ఉపయోగించవచ్చును. ప్రత్తి తో మూడు లేక అయిదు పోగులతో చేసిన వత్తులు ఉపయోగించాలి (ప్రత్తి తో వత్తులు చేసే విధానం, రకాలు, విధి విధానాలు గురించి రేపటి వ్యాసం లో తెలుసుకుందాము). కార్తీక మాసం లో దీపారాధనకు నువ్వుల నూనె వాడితే అష్టకష్టాలు పోయి, సకల సుఖాలు లభిస్తాయాని చెప్తారు. అయితే పూజలో దేవుని దగ్గర దీపారాధనకు ఆవు నెయ్యి వాడితే అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు పొందుతారని కూడా మనకు పురాణాలు చెపుతాయి.
"ఘ్రుతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం,
దీపం దాస్యామితే దేవీ గృహాణ ముదితాభవ!"  
దీప జ్యోతులు అజ్ఞానంధకారాల్ని తొలిగించి,జ్ఞాన జ్యోతులను వెలిగిస్తాయి.

కార్తీక శుక్ల పాడ్యమి రోజు తెల్లవారు జామున చేసుకునే వాళ్ళు ఆకాశదీపం ప్ర్రారంభించి ఆమావాస్య వరకు రోజూ  వెలిగిస్తారు. ఆకాశదీపమంటే ఏమిటో, ఎలా వెలిగిస్తారో మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా ఒక్కసారి ఆకాశదీపాన్ని ఎక్కడ వెలిగిస్తారో ఎలా వెలిగిస్తారో గుర్తుచేసుకుందాం. దేవాలయాల్లో అయితే ధ్వజస్తంభం పైన, గృహాలలో అయితే ఎత్తుగా దేనికైనా దీపాన్ని వ్రేలాడదీసి గాలి తగలకుండా ఏర్పాటు చేసుకుని, ఆకాశం కేసి చూస్తున్నట్టుగా దీపం వెలిగించుకుంటారు. ఆకాశ దీపాన్ని వెలిగించినా, దర్శించుకున్నా జన్మజన్మలకు సరిపడ పుణ్యం సంప్రాప్తిస్తుందాని పెద్దల ఉవాచ!

ఈ మాసం హరిహర తత్వానికి ప్రతీక కనుక గృహము నందే  కాక శివాలయాల్లోను, వైష్ణవాలయా ల్లోను ధ్వజ స్తంభము వద్ద దీపారాధన చేస్తే ముక్తి దాయకం!  నాగుల చవితి నాడు  పాము పుట్ట వద్ద కానీ, సర్పరూప సుబ్రహ్మణ్యస్వామి సన్నిధిని కానీ ఆవు నేతి తో దీపం వెలిగిస్తే సంతానం కోరే స్త్రీలకు సత్సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. తల్లులు వెలిగిస్తే సంతానానికి ఆయురారోగ్యాలు, ఉత్తమ విద్యాబుద్దులు, ఉన్నత పదవులు, సుఖమయ జీవితాలు స్వంతం అవుతాయి అని నమ్ముతారు.

క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయం సమయమున తులసి వనం లో ఉసిరిక మొక్కకు పూజ చేసి, ఉసిరికాయల మీద ఆవునేతి తో దీపారాధన చేస్తే స్వర్గద్వార ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసదీక్ష చేసి, రాత్రి గృహంలో బృందావనం [తులసి వనం] లో తులసీ ధాత్రి (ఉసిరి మొక్క) సమేత లక్ష్మీనారాయణ స్వామి చెంత అయిదు లేక తొమ్మిది ఉసిరిక దీపాలు, వీలైనన్ని ప్రమిదలలో దీపాలు వెలిగించి, ఇల్లంతా కూడా దీపావళి రోజు న అలంకరించినట్లు అలంకరించుకుంటారు. శివాలయాల్లో శివలింగ స్వరూపంలో దీపాలు  పేర్చి అలంకరిస్తారు. జ్వాలాతోరణం వెలిగిస్తారు. ఈ రోజున ఒక పెద్ద ప్రమిదలో 365 వత్తులతో నువ్వుల నూనె తో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ఉసిరిక దీపం మట్టి లేక వెండి ప్రమిదలో దీపారాధన చేసి, బ్రాహ్మణునికి దీపదానం చేస్తే పుణ్యప్రదమని చెపుతారు. ఇలా పవిత్రమైన కార్తీక మాసం అంతా ప్రతి నిత్యం దీపారాధన చేసుకోగలిగిన జీవిత సౌభాగ్యం అనంతం! ప్రత్యేక రోజులలో విశేష దీపారాధన చేస్తే, లభించే పుణ్యం అసామాన్యం!

ఇలా పవిత్రమైన దీపారాధన ను మనమందరం కార్తీక మాసమంతా చేసుకుని, ఇహపర సౌఖ్యాలని పొందుదాం!     
స్వస్తి!

 








No comments:

Post a Comment