Friday, October 17, 2014

"ఆ! ఎదో పాత చింతకాయ పచ్చడి లెద్దురూ!"



ముందుమాట:  

“అబ్బ వాడి ధోరణి వట్టి పాత చింతకాయ పచ్చడి రా! మనకు బొత్తిగా సరిపడదు” అపుడపుడు అనటం పరిపాటి. ఎవరైనా పెద్దవారు,  శ్రేయోభిలాషులు కాని ఏదైనా సలహా చెప్పినప్పుడు, అది మనకు అంతగా రుచించనప్పుడు, సాధారణం గా మనం అనే మాట ఇది. మరి నాలుగు రోజులు జ్వర పడి లేచినప్పుడు, పత్యపు భోజనం చేస్తున్నపుడు, “ నోరు చవి చచ్చింది. కాస్త పాత చింతకాయ పచ్చడి వుంటే వేద్దూ!” అని బ్రతిమాలే ధోరణి లో అడగటం కద్దు. తమాషా ఏమిటంటే ఈ పాత చింతకాయ పచ్చడి అందరి ఇళ్ళలో వుండే వస్తువు కాదు. కనుక ఇలాంటి అపత్సమయాలలో ఇరుగు పొరుగులను అడిగి తెచ్చుకోవటం మాములే! ఇక ఈ విషయం మీద శ్రీమతి పద్మా రఘునాద్ గారు విపులంగా వ్రాసిన వ్యాసం చదువుదామా?


రమణ బంధకవి


సంపాదకుడు


 



పాత చింతకాయ పచ్చడి 


శ్రీమతి పద్మా రఘునాద్



సాధారణం గా మనకు ఏ మాత్రం ఆసక్తి లేని విషయాలు కాని , ముఖ్యంగా మనకు నచ్చని విషయాలు ఎవరైనా చెప్తుంటే “ ఆ! ఏముంది లెద్దురూ! ఎదో పాతచింతకాయ పచ్చడి ! అవన్నీ మనకు ఇపుడు ఏం ఉపయోగం లేద్దురూ! అంటు కొట్టి పడేస్తూ ఉంటాము. ఈ నానుడి ఎప్పటినుండో అంటే మన ముత్తాతల కాలం నుండి మన కాలం దాక వస్తూ, వింటూ, అంటూ ఉన్నదే! మన పిల్లల కాలం లో అని మాత్రం చెప్ప లేమండోయ్! ఎందుకంటే మన పిల్లలకు అంటే ఈ కాలం పిల్లలకు, ఆ చింత కాయ పచ్చడేమిటో తెలిస్తే కదా అసలు? వాళ్లకు, ఆ చింత కాయ పచ్చడీ తెలియదు, దాని రుచి కూడా తెలియదు. 

వాళ్ళ దాకా  ఎందుకు? మనమే అసలు ఆ పాత చింతకాయ పచ్చడిని, దానిలో ఇంగువ దట్టించి, మెంతి పిండి రంగరించి పెట్టె పోపునే మర్చిపోతున్నాము కదా ? పూర్వం ఎవరైనా జ్వరం పడి లేస్తే, వాళ్ళకు నోరు హితవ పుట్టటానికి వెంటనే కొంచెం పాత చింత కాయ పచ్చడుంటే , దాన్ని వెతికి  వెతికి , జాడీల అట్టడుగునుండి గీకి తీసి, పోపు గరిటె లో ఓ నాలుగు ఎండు మిర్చి, కాస్తంత మినపపప్పు, రవ్వంత ఆవాలు, కూసింత  మెంతులు వేసి దోరగా వేయించి, ఓ నాలుగు కరివేపాకు రోబ్బలేసి, మరింత ఇంగువ దట్టించి మూల నున్న రోలు తెచ్చి కడిగి, దానిలో మెత్తగా నూరి, ఒక చిన్న బెల్లం ముక్క పడేసి రోటి పచ్చడి చేసి, వేడి వేడి అన్నం లో కొంచెం నేయి వేసి, పచ్చడిని మెత్తగా పిసికి కలిపి వారికీ పెడితే, జిహ్వ పైకి లేచి వచ్చేదిట కదండీ?  ఈ చింతకాయ పచ్చడి ముద్ద తో వాళ్ళకు ప్రాణం లేచి వచ్చి, అన్న హితవు పుట్టి వెంటనే లేచి కూర్చునే వాళ్ళని మా బామ్మ గారు కూడా చెప్తుండే వారు మరి.
 
ఏది ఏమైనా ఈ పాతచింతకాయ పచ్చడి రుచే రుచి మరి. పాత అయిన కొద్డీ దానిలో రుచి కూడా పెరుగుతుందేమో మరి?  జ్వరం పడిన వారికే కాకుండగా, ఎవరికైనా, ఎపుడైనా నోటికి కొంచెం హితవైన భోజనం, పుల్ల పుల్లగా, కొంచెం తియ్యగా తినాలనిపిస్తే వెంటనే అట్టే పెట్టుకున్న పాత చింతకాయ పచ్చడిని కొంచెం నూరు కుంటే మన ఆత్మా రాముళ్ళు కూడా సంతోషిస్తారు అనటం నూటికి నూరు పాళ్ళు నిజం సుమండీ!

పాత చింతకాయ పచ్చడి మన చవి చచ్చిన జిహ్వాని తిరిగి లేచేలా చేసినట్లే, మన పూర్వీకులు, మన పెద్ద వారు, మన శ్రేయస్సు కోరే వారు చెప్పే మాటలు కూడా మనకు ఏంతో మేలు చేస్తాయి ఓపికగా శ్రద్ధగా వింటే. 

కాబట్టి, ‘పాత చింతకాయ పచ్చడని’ ఎవరి సలహాలైన కొట్టి పడేసే ముందు, ఒక్కసారి ఘుమఘుమ లాడే ఆ పాత చింతకాయ పచ్చడి రుచిని, అది మన నోట్లో పడినపుడు మన నాలుక పొందే ఆనందాన్నీ గుర్తుకు తెచ్చుకుని, ఒక్క నిమిషం అలోచించి మన మేలు కోరి చెప్పే మన పెద్దల మాటలను విందామా మరి

ఇదంతా చదివి మీరందరూ, ఆ! ఏముంది లెద్దురూ! ఎదో పాతచింతకాయ పచ్చడి! అని అనరని ఆశిస్తాను.


 

No comments:

Post a Comment