ముందు
మాట:
“అయ్యా !
ముద్ద పప్పు కలుపుతున్నారు బాగానే ఉంది! మరి అందులోకి పక్కనే మంచి ఊటతో వున్న
ఎర్రటి కొత్తావకాయ వేసుకోవటం మరిచారు. ఏవిటీ! ముందు ఊర మిరపకాయల పని బట్టి తరువాత ఇటు
వస్తారా? భేష్! పండు మిరపకాయల పచ్చడి,
ఇదుగో, దానితో పాటు తెల్లటి తాజా వెన్నపూస ఆకులో ఇటుపక్క వడ్డిస్తున్నాను.
ఎందుకంటే అన్నం వేడికి వెన్న కరిగే ప్రమాదం వుంది. కాస్త ఆకు కాళీ చేస్తే కంది పొడి
మరి దానిలోకి నంచటానికి చిక్కటి వంకాయ పచ్చిపులుసు వేస్తాను”
ఇలాంటి సంభాషణలు
తెలిగింటి భోజనాల హడావిడిలో తప్పక వినిపించే పంచదార పలుకులు. ఈ నంచుకోవటం అనేది
తెలుగు భోజనం లో విడదీయరాని అంతర్భాగం! ఒక్క సారి అలోచించి చూడండి. ఏదైనా రోజు, ఎ
ఒక్క పదార్థంలోనైనా, ఏమీ నంచుకోకుండా తిన్నట్లు గుర్తు ఉందా? నాకైతే లేదు సుమా! అందుకే
ఈ నంజుకోవడాల గురించి శ్రీమతి పద్మా రఘునాద్ గారు వ్రాసిన వ్యాసం కంది పచ్చడి లోకి
ఉల్లిపాయ పులుసు లాగాను, గోంగూర పచ్చడిలోకి ఘాటైన ఉల్లిపాయ లాగాను ఉంది. మరి ఇక
నంజుకుని ఆనందించండి!
రమణ
బంధకవి
సంపాదకుడు
“ఇందులోకి నంచుకోవటానికి ఏమయినా
ఉందా?”
శ్రీమతి
పద్మా రఘునాద్
"నంచుకోవటానికి ఏమైనా ఉంటే
వేయి" అన్న మాటలు తెలుగు వారి ఇళ్ళల్లో భోజనాల
సమయంలో ఎపుడో అపుడు వినిపిస్తూనే ఉంటాయి. ఒక
పదార్దం కలుపుకుని అందులో వేరే పదార్ధం నంచుకుని తినటం మన భోజనాలలో ఉన్న ఎప్పటినుండో వస్తున్న అలవాటుగా చెప్పుకోవచ్చు. ఉన్న రుచిని పెంచుకోవటానికి నంచుకునేవారు కొందరయితే, నచ్చని రుచిని భర్తీ చేసి, తినటానికి నచ్చేలా చేసుకునేవారు మరికొందరు.
ఈ
నంచుకునే పదార్ధాలు సాధారణంగా ఉరగాయలు, పచ్చళ్లు అయి ఉంటాయి. ఏదీ నంచుకోటానికి
లేనప్పుడు, ఊరగాయే ఎక్కువగా ఆదుకుంటూ ఉంటుంది. ఈ రెండే కాకుండగా కొన్ని పదార్ధాలకు, దాని యొక్క జోడి అయిన వేరే పదార్ధంతో కలుపుకుని తింటేనే మరింత పరిపూర్ణత్వం ఏర్పడి ఆ రుచిని
సంతృప్తిగా ఆస్వాదించగలగటం జరుగుతుంది. ఇలాంటి జోడి లేదా ఉప పదార్ధాలు మన తెలుగు వారి భోజనపు
అలవాట్లలో కోకొల్లలు. అందులో కొన్నిటిని గురించి మనం
ముచ్చటించుకుందాం!
కాలం
మారుతున్నకొద్దీ భోజన అలవాట్లు కూడా మారుతుండటం చేత ఎపుడో ఒకసారి తప్పితే, ఈ నంచుకునే జోడి పదార్ధాలు చేసుకోవటం ఈ
మధ్య తగ్గిపోయిందనే చెప్పాలి. క్రమేపీ వీటిని మర్చిపోయే
పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇవన్ని అందరకు తెలిసినవే
అయినా మరొక్క సారి వాటిని గుర్తు తెచ్చుకుంటే అవి
తిన్న అనుభూతిని పొందుతామని ఇక్కడ వీటిని మళ్లి ప్రస్తావించుకోవటం
జరుగుతోంది.
మొదట మన
ముద్దపప్పు లో నంచుకోవటానికి ఏమున్నాయో చూద్దాము. తెల్లటి మల్లెపూవు లాంటి అన్నంలో మెత్తగా ఉడికిన ముద్దపప్పు లో ఘుమ ఘుమ లాడే నేయి వేసుకుని కలుపుకుంటే దానిలో నంచుకోటానికి
అగ్రస్థానం కొత్త ఆవకాయదే సుమా!తరువాతి స్థానాలలో మిగతా ఉరగాయలు అనగా మెంతికాయ,
మాగాయ మొదలైనవి చెప్పుకోవచ్చు.
ఇదే
కాకుండగా కొంతమందికి ముద్దపప్పులోనే అన్ని పదార్ధాలు అంటే మిగతా రోటి పచ్చళ్ళు, పులుసులు, చారులు కలుపుకుని తినే అలవాటు ఉంటుంది. కమ్మటి పప్పులో అవి కలుపుకుని తింటే ఆ పదార్ధాలకు మరింత కమ్మదనం
వస్తుందన్న కారణం కావచ్చు.
మా
చిన్నతనం లో మా అమ్మగారు మామిడి అల్లం ముక్కలు సన్నగా బద్దలుగా తరిగి వాటిని
నిమ్మరసం లో నానవేసి అందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు కొద్దిగా కలిపి
ఉరవేసి ఉంచి మాకు ముద్ద పప్పులో నంచుకోటానికి వేసేవారు. ఆ పప్పు-మామిడి అల్లం
ముక్కల కలబోసిన రుచి మాటల్లో చెప్పలేము.
మరి
కొన్ని ప్రత్యేకమైన అపురూపమయిన పదార్ధాల కలయిక
మన కంది పచ్చడి- ఉల్లిపాయ పులుసు; కందిపొడి-వంకాయ పచ్చిపులుసు; పెసర
పచ్చడి-ఉల్లిపాయ పులుసులుగా కూడా చెప్పుకోవచ్చు. వీటిని వాటి జోడీలతో కలుపుకుని
తింటే వచ్చే మజాయే వేరు మరి.
అలాగే ఇక
పెరుగు విషయానికి వస్తే ఏ ఊరగాయ ముక్కయినా పెరుగు అన్నం లోకి సమ ఉజ్జీయే! అవి లేకపోతే వేరే రోటి పచ్చడి ముక్కలయినా కూడా పనికి వస్తాయి. ఇవే కాదు, చిక్కటి పులుసు లోని కమ్మటి చిలగడ
దుంప లేక గుమ్మడి ముక్కలను పెరుగన్నం లో
నంచుకోవటం సంగతి మాత్రం మరచి పోవద్దు సుమా! ఇంకో మాట! వేసవి కాలం లో అందరకు అతిప్రియమైనవి తీయ తీయటి మామిడి కాయ ముక్కలు కోసి పెరుగు అన్నం
లోకి వడ్డిస్తే , ఇంక స్వర్గానికి ఒక మెట్టు తక్కువ అని
చెప్పచ్చు.
ఇక ఘుమ
ఘుమ లాడే గోంగూర పచ్చడి కయినా, ఇంగువ ఘుభాళించే చింత కాయ పచ్చడి
లోకయినా జిహ్వ లూరించేవి సన్నగా తరిగిన ఘాటైన ఉల్లిపాయ ముక్కలని వేరే చెప్పనవసరం లేదు కదండీ! మరి ఎర్రటి పండు మిరపకాయల
పచ్చడి-అదేనండి మన కొరివి కారం, దానిలోకైతే తెల్లటి తాజా వెన్న ముద్ద పక్కన వుండి
తీరలిసిందే!
అలాగే
మనకు వడ-అల్లం చట్నీ, ఇడ్లీ-సాంబారు, ఉప్మా-పెసరట్టు, సాంబారు-అప్పడం లేదా వడియం, కట్టె పొంగలి -శనగ చట్నీ, పులిహారలో గడ్డ పెరుగు ఇలా రకరకాల నంచుకునే ఉప పదార్ధాలు కలసినవి ఎప్పటినుండో మన తెలుగు వారి
భోజనం లో ఇమిడి పోయి ఉన్నాయి.
ఈ
"నంచుకోవటం" వలన మనకు పదార్ధాలు బోరు కొట్టకుండగా, కొత్త రుచులు రంగరించుకుని పాతవే కొత్తగా తింటున్న అనుభూతి కలుగుతుంది
అనటం లో ఎంతయినా నిజమున్నదని చెప్పచ్చు. వంట చేసుకునేటపుడు
ఈ పదార్ధాల కలయికని గుర్తుంచుకుని, వాటిని ఎంచుకుని చేసుకుని,
ఆ ప్రకారంగా నంచుకుని తింటే మనము ఆ పదార్ధాల రుచిని సంతృప్తిగా ఆస్వాదించిన వారి మవుతామనటం లో ఏ మాత్రం సందేహం లేదుకదా ? మీరే
చెప్పండి!
No comments:
Post a Comment