ముందుమాట:
దీపావళి తరువాత వెంటనే వచ్చే చక్కటి
పండుగ ‘నాగుల చవితి’. నాగుల చవితి నాడు పిల్లలకీ, పెద్దలకీ అత్యంత ప్రీతికరమైనది
చిమిలి ఉండలు. చెప్పొద్దూ! నేనైతే ఈ చిమిలి కోసమే ఈ పండుగను గుర్తున్చుకునేవాడిని.
చిన్నతనం లో ప్రొద్దున్నే లేచి, మా గ్రామం లో పిల్లలూ పెద్దలు అందరూ వూరి చివర
గరువులో ఉన్న పెద్ద పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అందరు పుట్టకి పూజ చేసి, పాలు, అరటి పళ్ళు, పుట్ట కలుగు లో వేసేవారు. కొందరు
కోడి గ్రుడ్లు కూడా వేసే వారు. ముఖ్యంగా చిమిలి, పచ్చి చలిమిడి నైవేద్యం
పెట్టేవారు. తరువాత దీపావళికి కొని మిగుల్చుకున్న టపాకాయలు కాల్చే వాళ్ళం. పుట్ట
మన్ను భక్తిగా చెవులకు పెట్టుకునే వాళ్ళం. ఇంటి దగ్గర మా అమ్మగారు, పూజ గది గోడకు
చలిమిడి, చిమిలి తో నాగేంద్రులను
తయారుచేసి అతికించి పాలు పోసి పూజ చేసేవారు. మొత్తానికి ఆ రోజు అంతా చిమిలి తింటూ
గడిపేవాళ్ళం. మరి ఆ రోజులన్నీ గుర్తుకు తెచ్చుకుని, రేపు చక్కగా నాగ రూప
‘సుబ్రహ్మన్యుడిని’ కొలుచుకుందామా?
రమణ బంధకవి
సంపాదకుడు
కార్తీక
చతుర్ధి-నాగుల చవితి
శ్రీమతి నయన కస్తూరి
ఈ నెల 27 న కార్తీక శుద్ద చవితి ఉన్నందున
ఆ రోజు నాగులచవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పూర్వం గ్రామాలలో ప్రజలంతా
కలిసి ఆ వూళ్ళో వున్న పాము పుట్ట దగ్గరకు వెళ్లి నాగ దేవతకు పూజలు సలిపే వారు.
కానీ ఈ రోజుల్లో గ్రామాలు వదిలి పట్టణ, నగర జీవనానికి అలవాటు
పడి, ఎక్కడా ఖాళీ ప్రదేశం వదలకుండా పెద్ద పెద్ద భవనాలు
నిర్మించుకోవడం వలన వనాలు వన్య ప్రాణులు అంతర్ధానం అవుతున్నాయి. ఇక పాము పుట్టలు
మనకు ఎక్కడ కనిపిస్తాయి? అందుకే నాగులచవితి లాంటి పండుగలు
కేవలం కొన్ని పల్లెలకే పరిమితం అయి, పట్టణాల్లో మరుగున
పడిపోతున్నాయి. కనుక మనం ఈ సారి మర్చిపోకుండా ఈ నెల 27 న నాగదేవతను
పూజించుకుని, పిల్లాపాపలతో చల్లగా ఉందాం.
కార్తీక మాసం శివకేశవులకే కాక
సుబ్రహ్మణ్యస్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చును. ఈ మాసం పేరే కార్తికేయుని
ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసం లోని శుద్ద చవితి నాడు సర్పరూప
సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును ‘నాగుల చవితి’, ‘మహా చతుర్ధి’అంటారు. ఈ రోజు పచ్చి చలిమిడి, చిమిలి చేసుకుని, ఆవు పాలు, పూలు,
పళ్ళు కూడా తీసుకుని, పాము పుట్ట
దగ్గరకు వెళ్లి, నాగదేవతకు దీపారాధన చేసి, పూజ చేసి, పుట్ట కన్నులలో ఆవు పాలు పోసి, చలిమిడి, చిమిలి కూడా వేసి, రెండు
మతాబులు, కారపువ్వులు లాంటివి వెలిగించుకుంటారు. పుట్ట
దగ్గరకు వెళ్ళటం అలవాటు [ ఆచారం ]లేని వారు ఇంట్లోనే పూజా ప్రదేశం లో గోడకి చిమిలి
నాగేంద్రుడు, చలిమిడి నాగేంద్రుడు ని పెట్టుకుని,
పూజ చేసుకుని, పాలు పోసి, చలిమిడి, చిమిలి, పాలు,
పళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు. ఇలా గోడ మీద నాగేంద్రుడిని ‘గద్దె
నాగన్న’ అని భక్తి తో పిలుచుకుంటారు.
సంతానం కోసం ప్రార్ధన చేయాలంటే
సుబ్రహ్మణ్య స్వామినే వేడుకోవాలి. ఎందుకంటే వినాయకుడు విఘ్నాధిపతి వలెనే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్య స్వామియే
అని భక్తుల నమ్మకం!
అందుచేతే భక్తులు;
“పాహి పాహి సర్పరూప నాగ
దేవ దయామయా!
సత్సంతాన సంపత్తిం! దేహిమే శంకర ప్రియా
!
అనంతాది మహానాగరూపాయ వరదాయచ!
తుభ్యం నమామి భుజగేంద్ర! సౌభాగ్యం
దేహిమే సదా!
శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం!
శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం!
ఓం శ్రీ పంచ మాతృకాయై నమః!”
అని ప్రార్ధిస్తూ, పగలంతా
ఉపవాసం ఉంటారు. కొంతమంది సాయంకాలం భోజనం చేస్తారు. కొంతమంది నాగదేవత ప్రసాదం పచ్చి
చలిమిడి, చిమిలి, పళ్ళు తిని ఉంటారు.
పచ్చి చలిమిడిని ఎలా చేసుకోవాలో ‘తెలుగు భోజనం’ లో మనం ముందే నేర్చుకున్నాం కదా? చిమిలి ని ఎలా
తయారు చేసుకోవాలో ఈ వ్యాసం చివరలో నేర్చుకుందాం.
నాగుల చవితిని భక్తిశ్రద్ధలతో
చేసుకుంటే సర్వ పాపాలు పోతాయి. అంతే కాకుండా రాహు కుజ దోషాల నుండి విముక్తి
పొందుతారు. వివాహం కానీ కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్ర వివాహం జరుగుతుందని
నమ్ముతారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని, మానసిక
రుగ్మతలున్న వారికి మనోక్లేశం తొలిగి, ఆరోగ్య వంతులవుతారనీ,
చెవి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు తొలిగి,
పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారనీ భక్తులు నమ్ముతారు. అందుకే ఈ రోజు
పుట్ట మన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తారు.
నాగుల చవతి లాంటి పర్వదినాల వలన జీవ
కారుణ్యం కూడా పెంపొందుతుంది. ప్రకృతిలోని అన్ని ప్రాణులు ఒకరికొకరు హాని
కల్పించుకోకుండా శాంతియుత సహజీవనం గడపటానికి దోహదం చేస్తాయి. మరి మనం కూడా
వీలు కల్పించుకుని, ఈ నాగులచవితిని శ్రద్ధాభక్తులతో చేసుకుని మన అభీష్టాలను
నేరవేర్చుకుందాం.
మరి ఇప్పుడు నాగేంద్రుడి కి
నివేదించవలసిన చిమిలి తయారీని చూద్దామా?
ఒక గ్లాసు తెల్ల నువ్వులు లేక నూపప్పు
తీసుకుని మిక్సీ లో పౌడర్ లాగా
చేసుకోవాలి. అంతే బెల్లం తురుము తీసుకుని నువ్వుల పౌడర్ కి కలిపి రెండూ బాగా కలిసేలా మిక్సీ లో రెండు నిమిషాల సేపు తిప్పుకోవాలి.
ముద్ద లాగా అవుతుంది. తీసుకుని, ఉండలుగా చేసుకుని, ఒక బౌల్ లో వేసుకుని, నాగేంద్రుడి కి నివేదించు
కోవాలి. ఇదేనండీ చిమిలి తయారు చేసే విధానం!
No comments:
Post a Comment