Wednesday, October 22, 2014

దీపావళి ప్రత్యేక వ్యాసాలు -3: దీపాల మరియు పటాసుల పండుగ – దీపావళి (ఆఖరి భాగం)


ముందు మాట:
నిన్నటి వ్యాసం లో మనం ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి, దీపావళి అమావాస్య వేడుకల గురించి తెలుసుకున్నాం. మరి ఇక ఈనాటి వ్యాసం లో శ్రీమతి నయన గారు మన ముందుకు తెచ్చే విశేషాలు తెలుసుకునే ముందు, మరి యొక్క సారి, మన చిన్నతనం గుర్తుకు తెచ్చుకుని, ఆ నాటి దీపావళి సరదాలను విహంగ వీక్షణం చేద్దామా?

మా గ్రామం లో పెంకుటిళ్ళు విశేషం గా ఉండేవి. ప్రతి ఇంటికి ముందు పెద్ద అరుగులు ఉండేవి. ఇంటిలో  అమ్మమ్మలు, బామ్మలు, ప్రత్తి తో వత్తులు చేసేవారు. వాటిని మట్టి ప్రమిదలలో వేసి, నువ్వుల నూనె దీపాలు వెలిగించేవారు. అరుగుల పైన దీపాలు ముచ్చటగా ఉండేవి. వీది మొగలో తాటి దూలాలు పాతి, వాటి మధ్య వెడల్పైన వెదురు పట్టీలు కట్టి దీపాలు పెట్టేవారు. రోడ్డున పోయే వారు, వాటి సాయంతో బాణసంచా కాల్చుకునే వారు.

అన్నిట్లోకి ఉత్కంట భరితమైన విషయం చెరువు దగ్గర జరిగేది. రాత్రి పొద్దు పోయిన తరువాత, ఊరంతా రెండు పక్షాల గా విడిపోయి చెరువుకు రెండు వైపులా విడిది చేసి తారా జువ్వల యుద్ధం మొదలు పెట్టేవారు. పెద్ద గోలతో జువ్వలు అటువైపు వారు ఇటు, ఇటు వారు అటు వైపుకి జువ్వలు విడిచి పెట్టేవారు. చూసే వారికీ ఎదో భారత యుద్ధం లాగ అనిపించేది. దూరం నుండే చూసి మేము ఆనందించే వాళ్ళం. గ్రామం లో తాటాకు కప్పుల ఇళ్ళు కూడా మెండు గా ఉండేవి. కొన్ని జువ్వలు దారి తప్పి అటువంటి ఇళ్ళ కప్పుల లో దూరటం వలన చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు జరగటం కద్దు. గ్రామస్తులు నీళ్ళు జల్లి మంటలు ఆర్పేసే వాళ్ళు.

ఎన్ని ఏళ్ళు గడిచినా, జ్ఞాపకపు పొరల అడుగు నుండి ఈ సంగతులు కళ్ళకు  కట్టినట్లు బయటకు వస్తూనే వుంటాయి. ఇప్పుడు అన్నీ వున్నా అంత సరదా ఉన్నట్లు నాకు అనిపించటం లేదు. తప్పదు కాల మహిమ!

పాఠకులందరికీ ఈ సరదాల పండుగ శుభాకాంక్షలు.

రమణ బంధకవి

సంపాదకుడు  


దీపాల మరియు పటాసుల పండుగ దీపావళి – ఆఖరి భాగం


శ్రీమతి నయన కస్తూరి


మూడవ రోజైన అమావాస్యనాడు నాడు చేసుకునే దీపావళి పండుగ గురించి కూడా చెప్పుకున్నాం!

బలి పాడ్యమి:
నాలుగవ రోజు కార్తీక శుక్ల పాడ్యమి రోజున బలిపాడ్యమి గా జరుపుకుంటారు. ఈ రోజును బలి పాడ్యమి అని ఎందుకంటారో క్లుప్తం గా తెలుసుకుందాం. ప్రహ్లాదుని మనుమడైన బలి చక్రవర్తి రాక్షసరాజు. దేవతలతో సహా అందరిని ఓడించి, ఇంద్రుడు కావాలనే దురాశతో ఇంద్రునిపై దండెత్తాడు. రక్షించమని ఇంద్రుడు  విష్ణుమూర్తిని వేడుకోవడంతో జగన్నాటక సూత్రధారి వామనుడి అవతారంలో  దాన గుణం కలిగిన బలి చక్రవర్తిని మూడడుగులు దానం అడిగి ఇంతింతై వటుడింతంతై............’ ఒక అడుగుతో భూమిని, ఒక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి, మూడవ అడుగుతో బలి శిరస్సు మీద పెట్టి, పాతాళ లోకానికి నెట్టేస్తాడు. కానీ బలి చక్రవర్తి యొక్క దాన గుణానికి  మెచ్చి, సంవత్సరానికి ఒక్కసారి కార్తీక శుక్ల పాడ్యమి నాడు పాతాళం నుండి భూలోకానికి రావచ్చని వరమిస్తాడు. అందుకే ఈ పాడ్యమి నాడు బలిపాడ్యమి పేరుతో ప్రజలు వేడుక చేసుకుంటారు. భార్యా భర్తలు ఒకరికొకరు కానుకలిచ్చుకుంటారు. ఈ పండుగ భార్యాభర్తల మధ్య సన్నిహిత్వాన్ని పెంచుతుంది. ఈ రోజున గోపూజ కూడా చేస్తారు. కొత్తగా పెళ్ళైన కూతుళ్ళను ఇంటికి పిలిచి కానుకలను ఇస్తారు.

భగిని హస్త భోజనం – అన్న చెల్లెళ్ళ పండుగ:
ఇక ఐదవ రోజైన విదియ నాడు అన్నా చెల్లెళ్ళ పండుగ చేసుకుంటారు. ఈ రోజునే భగినీ హస్త భోజనంవేడుక చేసుకుంటారు. అన్నలు చెల్లెళ్ళ ఇంటికి వెళ్లి, కానుకలు ఇచ్చి, చెల్లెలి చేతి భోజనం తిని వస్తారు. అన్న చెల్లెళ్ళ అనుబంధాలు బలపరుస్తుంది ఈ పండుగ వేడుక.ఈ పండుగ తో అయిదు రోజుల దీపావళి వేడుకలు ముగుస్తాయి.

ఈ విధం గా దీపావళి పండుగ, దీపాల పండుగ గా, పటాసుల పండుగ గా, పిల్లల పండుగ గా, భార్యాభర్తల పండుగ గా , అన్నా  చెల్లెళ్ళ పండుగ గా, మనకు ఎన్నో రకాల విజ్ఞానాన్ని, వినోదాన్ని కలిగించడమే కాకుండా పటాసులు కాల్చుకోవడం వలన  శీతాకాలం లో పెరిగే దోమలను  అరికట్టడం లో కూడా దోహదం చేస్తుంది. అలాగే శబ్ద కాలుష్యాన్ని పెంచే పెద్దపెద్ద చప్పుళ్ళతో పేలే టపాకాయలు కాల్చకుండా, వెలుగులు వెదజల్లి, క్రిమికీట కాలని తగ్గించే మతాబులు, కాకరపువ్వులు, భూచక్రాలు, విష్ణుచక్రాలు లాంటివి కాల్చుకుందాం.  కాకపొతే దీపాలను వెలిగించేటప్పుడు, టపాకాయలను  పేల్చేటప్పుడు పిల్లలు, పెద్దలు, జాగ్రత్త వహించి, వదులుగా వుండే కాటన్ దుస్తులను మాత్రమె ధరించి, ఎటువంటి అవాంచనీయమైన సంఘటనలు జరగకుండా సంతోషంగా ఈ నెల 23 న  వచ్చే దీపావళి పండుగను జరుపుకోండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు! 
(సమాప్తం)

ఈ నాటి స్వీట్ తయారీ:

మరి ఇప్పుడు మైసూర్ పాకాలు మరియు కాజాలు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఈ రోజు మైసూరు పాకాల గురించి తెలుసుకుని, రేపు కాజాల గురించి తెలుసుకుందాం.
మైసూర్ పాకం:  కావలసిన వస్తువులు:
ఒక గ్లాసు శనగ పిండి, రెండు గ్లాసుల పంచదార, రెండు గ్లాసుల నెయ్యి.

తయారు చేయు విధానం:

ముందుగా ఒక దళసరి మూకుడు లో పొడి సెనగ  పిండిని పచ్చివాసన పోయేలా వేయింఛి, పక్కన పెట్టుకోవాలి. ఒక దళసరి గిన్నె లో పంచదార వేసి అది కలవడానికి సరి పడా  నీళ్ళు పోసి, పాకం పట్టుకోవాలి. తీగ పాకం వచ్చాకా, అందులో ఉండ కట్టకుండా కలుపుకుంటూ, శనగ పిండిని వేసుకోవాలి. మధ్య మధ్య లో వేడి వేడి నెయ్యి గరిట తో పోసుకుంటూ కలుపుకుంటూ, పాకం కొంచెం ముదిరే దాకా ఉడకబెట్టుకోవాలి. సరి అయిన పాకం వచ్చి, తెల్ల నురుగు లాగా వచ్చి, గిన్నెను వదిలేస్తున్నప్పుడు, స్టవ్ ఆర్పేసి, ఒక పళ్ళానికి  కొంచెం నెయ్యి  రాసి, దాంట్లో ఈ పాకాన్ని వేసి ఆరబెట్టుకోవాలి. కొంచెం గట్టి పడ్డాక, ఒక చాకుతో బిళ్ళ ల్లాగా చతురస్రం కానీ, దీర్ఘచతురస్రాకారం లో కానీ కట్ చేసుకోవాలి. బాగా ఆరాకా, ముక్కలు గా వస్తున్నప్పుడు తీసి డబ్బాల్లో పెట్టుకోవాలి.     

(ఈ రోజు ఈ ఒక్క స్వీటే పెట్టేరేమిటి అని నిరుత్సాహ పడుతున్నారా? అయితే ఈ తొక్కుడు లడ్డూ కూడా చూసి ఆనందించండి. చేసే విధానం నెమ్మది మీద తెలుసుకుందాం!)  




No comments:

Post a Comment