Thursday, October 16, 2014

పిల్లలకు ప్రత్యేకం: సాయంకాలపు చిరుతిండ్లు: గుంట పొంగరాలు


ముందు మాట:

చిట్టి తల్లులు! చిట్టి తండ్రులు! బాగున్నారా? మీరంతా దసరా సెలవల్లో బడి, చదువు ప్రక్కన పెట్టి  అమ్మమ్మ, బామ్మల దగ్గర ఆనందంగా గడిపి వుండి వుంటారు. దసరా పండుగలలో రకరకాల పిండి వంటలను వాళ్ళు మీకు చేసి పెట్టి వుంటారు. అట్ల తద్దికి పెట్టుకున్న గోరింటాకు  పండిన చేతులు చూసి మురిసిపోయి వుంటారు. పోటీలు పడి ఉయ్యాలలు వూగి వుంటారు. 

ప్చ్! సో....బాడ్...! సెలవులు అయిపోయి  మళ్లీ స్కూల్ ,చదువులు మొదలయ్యాయని బాధపడకండి. త్వరలోనే టపాసుల పండుగ వస్తోంది. మళ్ళీ వచ్చే  సెలవలు, పిండివంటలు, తలచుకుంటూ శ్రద్ధగా చదువుకోండి. అమ్మ చేసి పెట్టే కమ్మటి వంటలు తినండి. అమ్మ వంట ........అవునూ? స్కూల్ నుండి ఇంటికి రాగానే ఏదైనా వెరైటీ గా తినాలని అనిపిస్తోందా! మీ కోసమే మా తెలుగు భోజనం ఒక వెరైటీ స్నాక్  తో మీ ముందుకు వస్తోంది. 

అంతకు ముందు ఇడ్లి పిండితో వెరైటీ గా పిజ్జా చెప్పేము కదా! ఇప్పుడు ముఖ్యంగా మన ‘పట్టాభి’ లాంటి పిల్లల నోటికి శ్రీమతి రత్నా శ్రీనివాస్ వేడి వేడి గా (పిల్లలూ కొంచెం ఊదుకుని చల్లర్చుకుని తినండే!) అందించే ఈ స్నాక్ కూడా ఇడ్లి పిండితో చేసినదే. అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, వైవిధ్యానికి వైవిధ్యము! మరి చదువుదామా?

రమణ బంధకవి

సంపాదకుడు 



గుంట  పొంగరాలు

శ్రీమతి రత్నా శ్రీనివాస్

గుంట  పొంగరాలు! గమ్మత్తుగా లేదూ పేరు! మన అమ్మలకి, అమ్మమ్మలకి, బామ్మలకి తెలిసిన వంటకమే! పూర్వం రోజుల్లో, నాకు గుర్తు లేదు కాని, ఇప్పుడు ఇది తయారు చేయటానికి గుంటల  పాన్ మార్కెట్టులో దొరుకుతోంది. గుంటలలో పిండి వేసి చేస్తారు కాబట్టి బహుశా గుంట పొంగరాలు అని పేరు వచ్చి ఉండ వచ్చును.  ఐదే ఐదు నిమిషాలలో తయారయైపోతుంది. పిల్లలకి బాక్స్ లో  కూడా ఇవ్వవచ్చు, సాయంత్రం స్నాక్స్ గా కూడా చేసుకోవచ్చును. సరే దీనిని ఎలా తయారు చేయాలో ఒక సారి చూద్దాం!

కావలసిన పదార్దములు 
ఇడ్లి పిండి                                            1 కప్పు 
సన్నగా తరిగిన ఉల్లిపాయలు                  1/2 కప్పు 
జీలకర్ర                                                1 టీస్పూన్ 
ఉప్పు                                                 రుచికి సరిపడా 
నూనె                                                  1టీస్పూన్ 
సన్నగా తరిగిన కొత్తిమీర                        కొంచెం 

తయారు చేయు విధానం :
గుంట పొంగారాల పాన్ కి ఒక బొట్టు నూనె అన్ని గుంటలలోను వేసి  రాసుకోండి. ఇడ్లి చేసేటపుడు మనం ఇడ్లి ప్లేట్ కి రాసినట్లుగా. ఒక మూకుడు తీసుకుని  నూనె వేసి వేడెక్కేక జీలకర్ర వేసి, వేగేక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించండి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించకూడదు. కొంచెం పచ్చితనం పోయేలాగా వేయిస్తే చాలు.

ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇడ్లి పిండిని తీసుకుని ఉప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకొవాలి. ఇష్టమైన వారు కొంచెం పచ్చి మిర్చిని సన్నగా తరిగి వేసుకోవచ్చు. ఇది మన చిన్నారులకు ఉద్దేశింపబడింది కాబట్టి ఇక్కడ వేయటం జరగలేదు. 

ఇప్పుడు ఒక స్పూన్ తో ఇడ్లి పిండి-ఉల్లిపాయ మిశ్రమాన్ని గుంటల పెనం లో వేయండి. స్టవ్ వెలిగించి చిన్న మంట నుంచి కొంచెం మధ్యస్థమైన మంట మీద పెనం పెట్టి మూత పెట్టండి. రెండు లేక మూడు నిమిషాలకి స్పూన్ తో ఎత్తి చూసి రెండవ వైపు తిప్పండి. ఒక బొట్టు నూనె పొంగారాల మీద వేయండి. ఒకటి-రెండు నిమిషాలలో రెండవైపు కూడా కాలుతుంది. అంతే!  పెనం మీద నుండి తీసి ఒక మంచి ప్లేట్ లోకి మార్చుకోండి. గుంట  పొంగరాలు రెడీ! 

చూసారా! ఇట్టే  తయారయిపోయాయి.  దీనిలో నంచుకోవటానికి మాగాయి పెరుగు పచ్చడి చాల అమోఘంగా వుంటుంది.  మీకు ఇష్టమైన ఏ  పచ్చడి తో నైనా తినవచ్చు. ఇంక ఆలస్యం ఎందుకు? వెంటనే మీ చిన్నారులకు చేసి పెట్టేయండి. ఆ చేత్తో మీరు కూడా ఒకటి నోట్లో వేసుకోండి. వేడిగా వుడికిన ఇడ్లి పిండి, దానితో పాటు ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర పంటి కిందకి తగులుతుంటే, మధ్య మధ్యలో పచ్చడిలో నంచుకుని తింటుంటే, మళ్లీ మళ్లీ  చేసుకుని తినాలనిపిస్తుంది. 

ఈ సారి మీరు ఇడ్లి పిండి తయారు చేసుకునప్పుడు పిండి మొత్తం ఇడ్లికే  వాడేయకుండా కొంచెం గుంట పొంగరాలకి కూడా అట్టే పెట్టండే!








No comments:

Post a Comment