ముందు మాట:
నిన్నటి వ్యాసం లో దీపావళి పుట్టుపూర్వోత్తరాల
గురించి తెలుసుకున్నాం. ఇక పటాసులు గురించి కొంచెం ముచ్చటించుకుందాము. మా ఇంటిలో
బుట్ట తో పటాసులు వచ్చేవి. ఇక అసలు యుద్దాలు అపుడే మొదలు. మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు
మధ్య బాణసంచా పంపకాల విషయం లో కీచులాటలు. తాటాకు టపాకాయలు, జువ్వలు మా అన్నగారి
పరం అయితే, నేల టపాసులు, సిసింద్రీలు, సీమ టపాసులు, చుచ్చు బుడ్లు నేను మా తమ్ముడు దక్కించుకునే
వాళ్ళం. ఇక మా అక్క చెల్లళ్ళు మతాబులు, కాకర పువ్వోత్తులు, భూ చక్రాలు, విష్ణు
చక్రాలు మొదలైనవి దక్కించుకునే వారు. ఇక అవి బాగా కాలటం కోసం వాటిని నిర్ణీత
స్థానాల లో ఎండ బెట్టుకునే వాళ్ళం. గుమ్మాల పైన చిన్న చిన్న డాబాల పైన మా వాటాలు
ఎండబెట్టుకునే వాళ్ళం.
దీపావళి నాడు ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూసే
వాళ్ళం. సాయంత్రం కాగానే మా అమ్మగారు గోగు కర్రలతో దివిటీలు కొట్టించి, మైసూరు
పాక్ తినిపించే వారు. ఇక అప్పుడు ఆనందానికి అవధులు ఉండేవి కావు. కానీ వేటిని ముందు
కాల్చుకోవాలన్న సమస్యతో ఉక్కిరి బిక్కిరి అయ్యే వాళ్ళం. ఏది ముందు కాల్చినా మిగతా
వాటికి అన్యాయం జరుగుతోందన్న భావన ఉండేది.
ఏవీ...అవన్నీ ఇప్పుడు ఎవరి దగ్గరా
కనబడటం లేదే..!
రమణ బంధకవి
సంపాదకుడు
దీపాల మరియు పటాసుల పండుగ – దీపావళి- పార్ట్ 2
శ్రీమతి నయన కస్తూరి
కొన్ని ప్రాంతాల ప్రజలు దీపావళిని అయిదు రోజుల పండుగ గా చేసుకుంటారు. వీరికి
ఆశ్యీయుజ బహుళ త్రయోదశి నుండి దీపావళి వేడుకలు ప్రారంభమై, కార్తీక శుద్ద విదియ నాడు జరుపుకునే ‘భగినీహస్త భోజనం’ తో ముగుస్తాయి.
ధన త్రయోదశి:
ఆశ్వీయుజ బహుళ త్రయోదశి నాడు ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు. ఇల్లంతా శుభ్రం
చేసుకుని, వాడని పాత
వస్తువులను తీసువేసుకుంటారు. ఈ రోజు వెండి బంగారు వస్తువులను
కొనుక్కుని, పూజలో పెట్టుకుంటే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని హిందువులు
నమ్ముతారు. ధనలక్ష్మీ కుబేరులను వారి వారి విభవం కొలది భక్తిశ్రద్ధలతో
అర్చించుకుని, ధన ధాన్యాలతో తుల
తూగుతారు. వెండి బంగారాలే కాకుండా ఈ రోజు ఏ వస్తువు కొనుక్కున్నా అది చాలా మేలు
చేస్తుందని, అది చాలాకాలం వరకు వాళ్లకు ఉపయోగకరం గా ఉంటుందని
నమ్ముతారు. అమృతం కొరకై జరిగిన
క్షీరసాగర మధనం లో వెలువడిన ధనలక్ష్మీ
దేవి, ఈ రోజు తనను అర్చించిన వారిని అనుగ్రహిస్తుందని,
ఏ నూతన వస్తువుని ఇంటికి తెచ్చ్హుకున్నా అది అమృతభాండం అవుతుందని
భక్తుల విశ్వాసం.
ధన్వంతరి జయంతి:
మరో విశేషమేమంటే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి యొక్క జయంతి కూడా
ఈ రోజే! ఆరోగ్యమే మహాభాగ్యం కదా? మరి ఆ మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త
ధన్వంతరి కూడా క్షీరసాగర మధనం లో వెలువడిన లక్ష్మీ దేవి, కామధేనువు, అమృతం...... లాంటి దివ్య శక్తులతో పాటు ఆవిర్భవించాడు. పురాణాల ప్రకారం
ఒక చేతిలో అమృత భాండము, మరియొక చేతిలో ఆయుర్వేద గ్రంధం తో ప్రకటితమైయ్యాడు. అనారోగ్యాలు
రాకుండా ఉండటానికి, వచ్చిన అనారోగ్యాల నుండి శీఘ్ర
ఉపశమనం కలగడానికి ఈ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు . కొన్ని పురాణాల్ల కథనం
ప్రకారం ధన్వంతరి కూడా నారాయణుని అంశే అని, ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీ దేవి సంతసించి, అనుగ్రహిస్తుందని
తెలుస్తుంది. ఇప్పటికీ ఆయుర్వేద వైద్యులు రోగులను నయం చేయడానికి ప్రారంభించేటప్పుడు
ధన్వంతరిని స్మరించుకుంటారని చెప్తారు. ఈ విధంగా ధన త్రయోదశి ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కూడా కలిగిస్తుందని, భక్తి శ్రద్ధలతో,
ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. మరి మనం కూడా జరుపుకుందాం.
చతుర్దశి నాడు నరక చతుర్దశి చేసుకుంటారు. ఈ పండుగ గురించి మనం
చెప్పుకున్నాం. ఈ రోజు తలస్నానం ఎలా
చేయాలో కూడా చెప్పుకున్నాం.
దీపావళి అమావాస్య:
మరుసటి రోజు దీపావళి అమావాస్య పండగ. పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండగలు
మనకు రెండు ఉన్నాయి. మహాలయ అమావాస్య మరియు దీపావళి అమావాస్య! భాద్రపద బహుళ
అమావాస్య మహాలయ అమావాస్య అయితే దీపావళి పండగ ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు
జరుపుకుంటారు. ఈ పండగ రాత్రి పూట జరుపుకుంటారు. పాత వస్తువులను తీసివేసి, ఇల్లంతా శుభ్రపరచుకుంటారు. రకరకాల
మిఠాయి లను చేసుకుంటారు (ఈ శీర్షిక చివరలో మీకు కాజాలను చేసే విధానం మైసూర్ పాకం
అచ్చులు చేసే విధానం చెప్తాను). సాయంకాలం సంధ్యా సమయమున గోగు కర్రలకు నూనె లో ముంచిన గుడ్డ పీలికలను ఒక చివర కట్టి, అవి వెలిగించి, వీధి గుమ్మాల్లో నేల మీద కొడుతూ;
‘దిబ్బి దిబ్బి దీపావళి,
మళ్ళీ వచ్చే నాగులచవితి,
పుట్ట మీద జొన్నకర్ర,
పుటుక్కు దెబ్బ !
అని పాడతారు.
గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోటవేసి, వెనక్కి తిరిగి
చూడకుండా లోపలికి వెళ్లి, కాళ్ళు, కళ్ళు కడుక్కుని శుభానికి
మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలికి చీడలు పోయి, ఆరోగ్యంగా
ఎదుగుతారని పెద్దల వాక్కు. ఈ రోజుల్లో ఈ ఆచారం కనుమరుగవుతోంది.
తర్వాత ఇల్లంతా దీపాలతో
అలంకరించి, వెలిగిస్తారు. దీపాలకు
మట్టి ప్రమిదలను నువ్వుల నూనె వాడటం మంచిది. ఈ రోజుల్లో ఒకరి మీద ఒకరు పోటీ పడి
ఇంటి గోడల నిండా, తలుపులకీ చెట్లకీ ఎక్కడ పడితే అక్కడ
విద్యుత్ దీపాలు పెట్టేసుకుంటున్నారు. దీపావళి నాడు మనం పెట్టుకోవలిసినవి లక్ష్మీ
దేవికి ఇష్టమైన నువ్వుల నూనె దీపాలు. అంతే కానీ కొవ్వొత్తులు, విద్యుత్ దీపాలు కాదు. అవి పెట్టుకునే సమయాలు సందర్భాలు వేరే ఉన్నాయి. అసలే మనకిప్పుడు
తీవ్రమైన విధ్యుత్ కొరత! మరి అటువంటప్పుడు చక్కగా నూనె దీపాలు వెలిగించుకునే చోట ఏ
పుణ్య ఫలాలు కలిగించని విద్యుత్ దీపాలు ఎందుకు చెప్పండి!
వీధి గుమ్మంలో మరియు తులసమ్మ దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ
ఆవు నేతితో కానీ దీపాలు వెలిగించుకుని కార్తీక దీపారాధన ఫలితాలను అందుకోండి.
అయితే ఇంకో విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి సుమండీ! అది ఏమిటంటే, మట్టి ప్రమిద కింద ఇంకో ప్రమిద
పెట్టి, పై ప్రమిదలో
వత్తులు, నూనె వేసి, దీపం
పెట్టుకోవాలి. మనం వెలిగించే ప్రమిద కింద ఇంకో ఖాళీ ప్రమిద వుండాలన్న మాట! పిల్లలు, పెద్దలు మతాబులు, కాకరపువ్వొత్తులు,
చిచ్చు బుడ్లు, టపాకాయల్లాంటివి వెలిగించి,
దీపావళి జరుపుకుంటారు.
ప్రదోష సమయం లోనే లక్ష్మి దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే
ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు
సంప్రాప్తిస్తాయని అందరి నమ్మకం. వ్యాపారస్తులు తమ వ్యాపారం బాగా వృద్ధి అవుతుందని
నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు కొనుక్కుని పూజలో
పెట్టుకుంటే శుభప్రదమని మన నమ్మకం! మార్వాడి వర్తకులకు
దీపావళి తో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్త ఖాతా పుస్తకాలను
తెరుస్తారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకుని, మిఠాయిలను
పంచుకుంటారు. (సశేషం)
No comments:
Post a Comment