Wednesday, October 29, 2014

కార్తీక మాస ప్రత్యేక వ్యాస పరంపర – 6 : ఉపవాస పానీయాలు – ఉపాహారాలు!


ముందుమాట:

మనం నిన్న చెప్పుకున్నట్లుగా పూర్తి అభోజనం గా ఉపవాస దీక్ష చేయటం అందరి వలన సాధ్యం 

కాదు. అందుకే పెద్దలు, ఆద్యాత్మిక వేత్తలు, ఉపవాసం చేసినప్పుడు కొన్ని పానీయాలు లేక 

ఉపాహారం గా కొన్ని పదార్ధాలను స్వీకరించ వచ్చు అని సెలవిచ్చారు. మన పాఠకుల లో కూడా 

కొందరు, రాత్రి ఉపవాస ఆహరంగా ఏమి తినవచ్చు అని అడిగారు. అందరికి ప్రయోజనకరం గా 

ఉండటం కోసం, మనం ఈ వ్యాసంలో మరి ఆ ఉపవాస పానీయాలు, ఉపాహారాలు ఏమిటో 

తెలుసుకుందాం. దీనివలన నీరసానికి లోను కాకుండా ఉపవాస దీక్ష కొనసాగిస్తూ పూర్తి ఉపవాస 

ఫలాన్ని పొందవచ్చు.


రమణ బంధకవి


సంపాదకుడు




ఉపవాస పానీయాలు – ఉపాహారాలు!



శ్రీమతి నయన కస్తూరి


కార్తీక మాసం అనగానే మనలో చాలామందికి   'ఈ సారి ఏమైనా సరే నేను కూడా ఉపవాసం ఉంటాను....., ఈ సారి ఎలాగైనా సరే ఉపవాసం ఉండి తీరాలి' అని అనిపిస్తుంటుంది. అవునా? పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి భోజనం చేస్తారు. కాని చాలామందికి ఉపవాసం అనగానే "నీరసం వస్తుందేమో!" "ఉండలేమోమో!'' అని ఉదయం నుండే కంగారుపడి నీరసపడిపోతారు. అలా మీరేమీ కంగారుపడక్కర్లేదు! పాపం ఈ కాలంలో అన్నిటా ఎక్కడ చూసినా కాలుష్యం... కాలుష్యం. దీనికి తోడూ చదువుల, పనుల వత్తిడులు, సుదీర్ఘ పని వేళలు, రాత్రి వేళల్లో కూడా ఆఫీసులు, అకాల భోజనాలు..... అన్నీ ఆరోగ్యం  మీద ప్రభావం చూపి, మధుమేహం, రక్తపోటు థైరాయిడ్ లాంటి సమస్యలు ఎదురై వాటికి మందుల వాడకం తప్పనిసరి అయి, ఉపవాసం సమయంలో కొంచెం ఇబ్బంది కలగవచ్చు. వయసులో పెద్ద వారికి కూడా ఆహారం ఏమీ తీసుకోకుండా ఉండటం కష్టం అనిపించవచ్చు. మీకు అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురవ్వకుండా మీ 'తెలుగు భోజనం' కొన్ని బలవర్ధకమైన పానీయాలను మీకు తెలియజేస్తుంది. చక్కగా వాటిని తయారు చేసుకుని, సేవించి, నిస్త్ర్రాణాలూ, నీరసాలూ లేకుండా మనసంతా శివకేశవుల మీద లగ్నం చేసుకుని, ఉపవాస పూర్ణ ఫలితాలను పొందండి.   అంతే  కాకుండా కొంతమంది సాయంకాలం పూట భోజనం కాకుండా, కొంచెం తేలికగా వుండే ఉపాహారాలను తీసుకుంటే బాగుంటుందని భావిస్తారు. వారికోసం కూడా 'తెలుగు భోజనం' రెండు మూడు ఉపాహారాలను మీకు అందిస్తోంది.

పానీయాలు: ‘పళ్ళు బాదం పిస్తా పాలు’
ముందుగా ఉపవాస సమయంలో నీరసం అనిపించకుండా భగవంతుని మీద దృష్టి నిలిచేలా పగలు ఒక సారి మీకు ఎక్కువ ఆకలి వేసే సమయం లో ఒక గ్లాస్ పాలల్లో ఒక అరటి పండు ముక్కలుగా చేసి వేసి, రెండు మూడు ఆపిల్ ముక్కలు కాని మీకిష్టమైన మరి ఏ పండైనా కానీ వేసి, దానికి మూడు బాదం పప్పులు, నాలుగైదు పిస్తా పప్పులు, కచ్చాపచ్చాగా కొట్టుకుని, ఒక చెంచాడు తెనేకలుపుకుని త్రాగితే మీకు ఏంతో  శక్తివంతంగా ఉండి, మీ పనులు మీరు చక్కగా చెసుకొగలరు(ఇది మధుమేహులకు కాదండోయి!).

కార్తీక మాసం లో సీతా ఫలాలు ఎక్కువగా దొరుకుతాయి కనుక పాలల్లో సీతాఫలం గుజ్జు వేసుకుని తాగినా చాలా శక్తివంతంగా ఉంటుంది. రుచి కూడా 'అద్భుతః!’

అంతేకాకుండా ఒక గ్లాస్ పాలల్లో రెండు చెంచాల రాగి పిండిని మెత్తగా ఉడకబెట్టుకుని, ఒక చెంచాడు తేనె కాని రెండు చెంచాల పంచదారను కాని కలుపుకుని తాగచ్చు.
ఇంకో పానీయం ఎమిటంటే, ఒక గ్లాసు పాలల్లో [ఆవుపాలు అయితే మరీ మంచిది] కొంచెం బెల్లంపొడి ని వేసుకుని కలుపుకుని, ఒక్క చిటికెడు మిరియాల పొడిని కలుపుకుని తాగితే చాలా  మంచిది. ఉపవాసం వున్నప్పుడు ఏ మాత్రం ఆరోగ్యానికి మంచివి కానీ కాఫీ టీ ల కన్నా ఇలాంటివి సేవించడం చాలా మంచిది!
(పైన చెప్పినవన్నీ మధుమేహులకు కాదు సుమా!)

ఉపాహారాలు:
అలాగే పగలంతా ఏమీ తినకుండా రాత్రి ఒక్క సారిగా భోజనం ఎక్కువగా సేవించడం వలన కూడా కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. అలాంటి వారు రాత్రి పూట ఏమైనా తేలికగా జీర్ణం అయే ఉపాహారాలు తీసుకుంటే మంచిది. అలాంటి వాటిలో మొదటిది;

సగ్గుబియ్యం కిచిడీ :
కావలిసిన వస్తువులు: సగ్గుబియ్యం-రెండు గ్లాసులు, వేయించిన వేరుశనగ పొడి-మూడు చెంచాలు, పచ్చిమిరపకాయలు నాలుగు, కరివేపాకు-ఒక రెమ్మ, మినప్పప్పు రెండు చెంచాలు, శనగపప్పు-అరచెంచాడు, ఆవాలు పావు చెంచాడు, జీలకర్ర ఒక పావు చెంచాడు, నూనె పోపువేయించుకోడానికి సరిపడా. ఉప్పు-తగినంత.  

ఒక గంట ముందుగా మీకు కావలిసిన పరిమాణంలో సగ్గు బియ్యం తీసుకుని నానబెట్టుకోండి. ఇప్పుడు మనం రెండు గ్లాసుల సగ్గు బియ్యాన్ని తీసుకుని కిచిడీ ని చేసుకుందాం. పచ్చి మిరపకాయలను సన్నటి ముక్కలుగా తరుగుకోండి.

నానిన సగ్గు బియ్యాన్ని ఒక చిల్లుల పళ్ళెం లో వేసి, నీళ్ళను పూర్తిగా తీసివేయండి. స్టవ్ మీద ఒక దళసరి మూకుడు పెట్టి,  నూనె పోసి, వేడెక్కాక పైన చెప్పిన పోపు దినుసులు వేసుకుని పోపు వేయించుకోండి. పోపు వేగినతర్వాత పచ్చి మిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి కొంచెం వేయించండి. ఇప్పుడు నానిన తడి సగ్గు బియ్యం వేసి, తగినంత ఉప్పు వేసి, బాగా కలిపి మూత పెట్టి సన్న సెగ మీద పది నిమిషాలు సేపు వుంచండి. మూత తీసి, మూడు చెంచాల వేరుశనగ పప్పు పొడిని వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత సగ్గు బియ్యం మెత్తబడ్డాయో  లేదో చూసుకుని  దించేయండి. సగ్గుబియ్యం కిచడీ ఉపాహారం రెడీ!  దీనినే ఇతర రాష్ట్రాల వారు 'సాబూదానా కిచిడీ' అంటారు. ఇది వేడి వేడిగా తింటే ఎక్కువ బాగుంటుంది. ఇది తింటే కడుపు నిండినట్టుగా ఉంటుంది. తొందరగా జీర్ణమవుతుంది.

స్వజ్జ:
కావలిసిన వస్తువులు: సన్నటి బియ్యపు రవ్వ -రెండు గ్లాసులు, నీళ్ళు-నాలుగు గ్లాసులు, ఉప్పు తగినంత. 
ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి మరగనివ్వండి. మరిగిన తర్వాత ఉప్పు వేసి కలపండి. రవ్వను తీసుకుని, ఉండకట్టకుండా కలుపుతూ, మరుగుతున్న నీళ్ళలో వేయండి. ఒక చెంచాడు నెయ్యి వేసి, కలిపి మూత  పెట్టి, సన్న సెగ మీద రవ్వ వుడికే దాకా వుంచండి. అడుగంటకుండా చూసుకోండి. ఇది అలాగైనా తినవచ్చు లేకపోతె ఏ పచ్చ్హడి తోనైనా తినవచ్చు. కొంతమంది ఉపవాస సమయంలో అన్నం కాకుండా ఏదైనా ఫలహారం తింటూ వుంటారు. అలాంటి వారు ఇది నిస్సంకోచం గా తినవచ్చు. అన్నం భిన్నం అయితే వుపవాసానికి పనికి వస్తుందంటారు. మనం దీనికి బియ్యం వాడినా రవ్వ రూపం లో వాడుతున్నాం కనుక ఉపవాసానికి పనికి వస్తుంది అని పెద్దలు చెపుతారు.

ఈ స్వజ్జ లోనే ఉప్మా  పోపు పెట్టేసుకుంటే ఉప్పిడి పిండి అయి తినడానికి చాలా రుచిగా వుంటుంది. ఇలాగే మన తెలుగు వారికి భోజనానికి ప్రత్యామ్నాయం గా చాలా వుపహారాలు వున్నాయి. వాటి గురించి కూడా సమయం దొరికినప్పుడల్లా 'తెలుగు భోజనం' మీకు అందిస్తూనే ఉంటుంది.

 







        



No comments:

Post a Comment