Thursday, October 23, 2014

కార్తీక మాస ప్రత్యేక వ్యాస పరంపర -1: కార్తీకం—ముక్తిదాయకం! Part 1


ముందుమాట:

ఆశ్వీయుజ మాసమంతా అమ్మవారి ఆరాధన గావించి, అమావాస్యనాడు దీపాలతో, పటాసులతో దీపావళి వేడుకలు జరుపుకుని, ఈ నెల 24 న కార్తీక మాసం లో అడుగిడ బోతున్న సందర్భం లో, దక్షిణాయనం లో శ్రేష్ట మాసమైన కార్తీకంయొక్క విశిష్టతను తెలుగు భోజనంమీ ముందుంచుతోంది.

రమణ బంధకవి

సంపాదకుడు


కార్తీకంముక్తిదాయకం!


శ్రీమతి నయన కస్తూరి

ముందుగా ఈ మాసానికి ఈ పేరు ఎందుకొచ్చిందో చూద్దాం. ఈ మాసం లో సాధారణంగా పౌర్ణమి రోజున  కృత్తిక  నక్షత్రం  ఉంటుంది.  కృత్తికానక్షత్ర యుక్తమైన పౌర్ణమి వలన ఈ మాసానికి కార్తీకంఅనే పేరు వచ్చింది.

శరత్కాలం లో కార్తీకం రెండవ మాసం! ఆషాడ శుద్ద ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు శయనంతో ఆరంభమైన  చాతుర్మాస వ్రతం కార్తీక శుద్ద ఏకాదశి  నాడు శ్రీమన్నారాయణుని మేలుకొలుపుతో ముగుస్తుంది. అందుచేత ఈ మాసం అత్యంత పవిత్ర మైనదిగా భావించబడుతుంది. దైవసాధనకు ఈ మాసం సర్వశ్రేష్టం! ఏ చిన్న దైవకార్యం ఆచరించినా ఫలితాలు అనంతం!

కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటంటే శివకేశవులిరువురికీ ఈ మాసం అత్యంత ప్రీతికరం! సాధారణంగా కార్తీక మాసం లో శివార్చనకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని కొందరి అభిప్ర్రాయం. కానీ మనం తెలుసుకోవలిసిన విషయం ఏమిటంటే శివకేశవుల మధ్య బేధం లేదని, ఇరువురు  ఒకరేనని, కార్తీక మాసం పొడుగునా హరిహర ఆరాధాన ఎంతో పుణ్యప్రదము మరియు ముక్తిదాయకమని.  ఈ  మాసమంతా హరిహర నామ సంకీర్తనతో భక్తులు ఎలాంటి బేధభావాలు లేకుండా సామరస్య భావన తో  కలిసి మెలిసి జీవించడానికి  ఎంతో దోహదపడుతుంది. భక్తులందరూ శివస్య హృదయం విష్ణుహు: విష్ణుస్య హృదయం శివ! అని స్మరిస్తూ శివకేశవులిరువురునీ ఆరాధిస్తూ, శివాలయాలను, వైష్ణవాలయాలను ఏకరీతిగా సందర్శిస్తుంటారు! రెండు ఆలయాల్లోనూ దీపారాధన చేస్తారు. కృత్తిక నక్షత్రానికి అధిపతి అగ్ని. కనుక  కృత్తికా నక్షత్రయుక్త పౌర్ణమి గల కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత వుంది.


దీపావళి నాడు ప్రారంభించిన దీపారాధన ఈ మాసం అంతా సాగుతుంది. శివాలయంలో, విష్ణువాలయంలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత దీపం ప్రజ్వలింపజేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల్లో దీపాలను పేర్చి జ్వాలాతోరణం ప్రక్రియ జరుపుతారు. ఈ మాసం అంతా హరిహర ఆరాధన జరుగుతుంది. దైవ కార్యాలు ఆచరించే టప్పుడు  శుచి, శుభ్రత కలిగి వుండాలి. దీనికి తలారా స్నానం చేయటం అత్యంత ఆవశ్యకం. అందుకే ఈ మాసమంతా  స్నానానికి శుభప్రదం. సముద్ర, నదీ స్నానాలకి ఈ మాసం సర్వశ్రేష్టం. (సశేషం)





No comments:

Post a Comment