ముందు మాట:
కాకర కాయ పేరు చెపితే, దాని చేదును తలుచుకుని పెడ మొహం పెట్టే వారు కొంచెం
ఎక్కువే ఉంటారు. ఎప్పుడైనా కాకర కాయ కూర చెయ్యాల్సి వస్తే, ఇల్లాళ్ళకు పెద్ద
సమస్యే అవుతుంది. దాని చేదు ను తగ్గించే విదంగా పరి పరి విధాల ప్రయత్నాలు చేస్తూవుంటారు.
ఇప్పుడు మరి మన బామ్మ గారు ఈ సమస్యకి చక్కటి పరిష్కారం చూపిస్తున్నారు. మరి ఆవిడ
మన ముందుకు తెచ్చే రెండు రకాల పద్ధతులు పాటిస్తే కాకర కాయ చేదును మరిపించి,
తినేవారిని మైమరిపించే విధంగా కాకర కాయ ఉల్లి మసాలా కూరిన కూర మరియు బజ్జీ కూర
చేసుకుని తిని ఆనందించ వచ్చు.
బామ్మ గారి క్విజ్ లో లోగడ అడిగిన ప్రశ్నకు సమాధానం మరియు ఇంకొక కొత్త ప్రశ్నకూడా
ఈ శీర్షిక లో చూడొచ్చు!
రమణ బంధకవి
సంపాదకుడు
కాకర కాయ ఉల్లి మసాలా కూరిన కూర – మరియు బజ్జీ కూర
కాకర కాయ నాలిక కి చేదుగా ఉన్నా మనకి
ఎంతో మేలు చేస్తుంది. మధుమేహాన్ని నియంత్రణ చేస్తుంది. అధిక బరువుని తగ్గిస్తుంది.
అందుకని కాకర కాయను తరుచుగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చేదుగా ఉండటం వలన
చాలా మంది ముఖ్యం గా పిల్లలు దీనిని తినడానికి విముఖత చూపిస్తారు. మీ పిల్లలూ
అంతేనా? అయితే మీ పిల్లలు, పెద్దలు కూడా కాకర
కాయని కూడా ఇష్టం గా తినడానికి ఒక ఉపాయం చెప్తాను, సరేనా?
కాకర కాయలు చిన్న చిన్నవి అయితే కాయ పళంగా
చేసుకోవచ్చు. లేక పొతే రెండు మూడు అంగుళాల ముక్కలు గా చేసుకోండి. నిమ్మ కాయంత చింతపండును నీళ్ళల్లో నాన బెట్టి తుక్కుని తీసివేసి ఆ చింతపండు నీళ్ళల్లో
కాకరకాయలను ఉడకబెట్టండి. మరీ మెత్తగా ఉడకక్కర్లేదు, గుర్తుంచుకోండి! ఉడికేక,
చింతపండు నీటి నుండి కాయలు తీసి, నీటిని పిండేసి, కాయలు చితక కుండా లోపలి గింజల్ని
తీసివేసి పక్కకు పెట్టుకోవాలి.
రెండు ఉల్లిపాయలు తగిన కారం కోసం నాలుగైదు ఎండు మిరపకాయలు, అర చెంచాడు
జీలకర్ర వేసి, మిక్సీ లో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ఉల్లి
మసాలాకు తగినంత ఉప్పు, కొంచెం చింత పండు గుజ్జు ని కలిపి
మగ్గిన కాకర కాయల లో సరి పడగా కూరి, ఒక పళ్ళెంలో
పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక మూకుడిని పెట్టి, సరి పడా
నూనె వేసి, నూనె కాగాకా ఈ కాకరకాయలని వేసి,
చితికి పోకుండా జాగ్రత్తగా వేగనివ్వాలి. నాన్ స్టిక్
మూకుడు అయితే నూనె కూడా ఎక్కువ పట్టదు. కాయలు వేగాకా పైన కొంచెం శనగ పిండిని
జల్లితే ఏదైనా తడి ఉంటే పీల్చేస్తుంది. వేగాయి అని అనిపించేకా తీసి ఒక బౌల్ లో
వేసుకోవాలి. దీని రుచి గుత్తి వంకాయ కూర లాగానే అన్నం తో తింటే అమోఘంగా ఉంటుంది.
ఇంకా వెరైటీ గా కావాలనుకుంటే మీకు ఇంకో మాంచి ఐడియా చెప్తాను. ఉల్లి మసాలా
కూరిన కాకరకాయలని పళ్ళెం లో పెట్టుకున్నాక, ఒక గ్లాస్ శనగ పిండికి ఒక అరగ్లాస్
బియ్యం పిండి కలిపి ఒక గిన్నెలో వేసుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు, కారం, ఒక అరచెంచాడు జీలకర్ర కలిపి, సరిపడగా నీరు కలిపి బజ్జీల పిండిలాగా జాలువారుగా కలుపుకోవాలి.
ఒక మూకుడులో కొంచెం నూనె పోసుకుని, బాగా
కాగాక ఒకొక్క కాయను పిండిలో ముంచి, బజ్జీ
ల్లాగా వేసి, బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. నూనె
చాలా తక్కువగా వేసుకుంటే మంచిది. మిగిలిన నూనె మరి
దేనికి వాడలేము. చేదు వస్తుంది. ఒకొక్క బజ్జి వేసుకున్నా పరవాలేదు. వీటిని
అన్నం లో నంచుకుని తింటే అసలు చేదే తెలియదు. అందుకని మీరు కూడా ఈ విధం గా ట్రై
చేసుకుని ఇంటిల్లి పాది మెప్పు పొందండి!
No comments:
Post a Comment