Wednesday, October 8, 2014

మరుగున పడుతున్న పర్వదినాలు: 'అట్ల తద్ది'


ముందు మాట:

“అట్ల తద్ది ..ఆరట్లు...ముద్ద పప్పు ... మూడట్లు” అన్న పాట మన చిన్నతనంలో విని వున్నాం. కాని ఆ పదాలు చెవిని పడి, ఏళ్ళు పూళ్ళు అయి ఉంటుందనటం అతిశయోక్తి కాదు. చిన్నతనంలో తెల్లవార ఝామునే తోటి పిల్లలతో కలసి ఈ పాట పాడుకుంటూ వీధులన్నీ తిరగటం నాకు బాగా గుర్తు. అంతే కాదు, వూరి మధ్యలో గట్రావి చెట్టుకి పెద్ద పెద్ద మోకులతో ఉయ్యాలలు వెయ్యటం, వాటి మీద వూగటానికి ఆడ పిల్లలు రావటం, ఉయ్యాల తోయ్యటానికి లంచం కింద అట్లు వసూలు చెయ్యటం జరిగేది. మరి ఈ పండగలు, పబ్బాలు, ఆటలు, పాటలు ఇలా కాలగర్భంలో కలసిపోయి, మరుగున పడి పోవలసినదేనా? అక్కర్లేదు; వీటిని మళ్ళీ మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుని, మన పరిధి లో వీటిని మన తరువాత తరానికి అందించగలిగితే, మన సంస్కృతిని, భావి తరానికి అందిచే మన భాద్యత కొంతవరకు తీర్చినట్లే అని చెపుతూ, మర్చి పోయిన ఈ ‘అట్ల తద్దె’ పండుగ విశేషాలు వివరంగా మనకు అందిస్తున్నారు శ్రీమతి నయన కస్తూరి. ఇక ఈ వ్యాసం చదివి ఈ నెల 10 వ తారీఖున వచ్చే అట్ల తద్దె పండుగను జరుపుకుంటారని ఆశిస్తున్నాను.


రమణ బంధకవి


సంపాదకుడు



అట్ల తద్దె


శ్రీమతి నయన కస్తూరి



మనం ఈ ఆధునిక యుగం లోని యాంత్రిక జీవన వేగం లో మర్చిపోతున్న 'ఉండ్రాళ్ళతద్దె' లాగానే ఇంకొక అందమైన 'తెలుగు పండగ' 'అట్ల తద్దె'. పాశ్చ్యాత్త నాగరికత ప్రభావం వలనైతే  నేమినర్సరీ తరగతుల నుండే పోటీ పరీక్షల వత్తిళ్ళ వలనైతే నేమి, టీవీలు, వీడియో గేమ్స్ పట్ల శ్రుతి మించిన మోజు వలనైతే నేమి, ఈ కాలం తల్లులకే తెలియక పోవడం వలనైతే నేమి, మన పిల్లలు మన తరం వారు జరుపుకున్న ఎన్నో మంచి పండుగలను చూడలేక పోతున్నారు.  అలాంటి వాటిలో కి చెందినదే  ఈ అట్ల తద్దె పండగ.

అట్ల తద్దె ఆడపిల్లల పండగ. ఇది ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ నాడు వస్తుంది. అంటే ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత మూడవ రోజు వస్తుంది. ఈ పండగను పెళ్ళికాని ఆడపిల్లల నుండి, పెళ్లి  అయిన స్త్రీల దాకా అందరూ కలిసి చేసుకునే పండగ. ఈ పండగను 'చంద్రోదయోమా వ్రతం' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజున చంద్ర కళలో గౌరీ దేవిని ఆరాధిస్తారు.  చంద్రోదయం అయ్యాక పూజను ముగిస్తారు. 

మరి ఈ 'అట్ల తద్దె' పండగను ఎవరు, ఎందుకు, ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. ఈ పండగను ఆరేళ్ళ వయసు నుండి వివాహం అయిన ముత్తైదువుల వరకు భక్తి శ్రద్ధలతో కొన్ని నియమాలు పాటించి చేసుకుంటారు. పెద్దలు పుణ్యం కొద్ది పురుషుడు అంటారు. అందుకే కన్నె పిల్లలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారు. కన్నె పిల్లలు అనురాగం తో చూసుకునే అందమైన భర్త కోసం ఈ వ్రతం ఆచరిస్తే, ముత్తైదువులు తమ దీర్ఘ సౌమాంగళ్యం కోసం చేస్తారు.

'అట్ల తద్దె' పండగను ఎలా జరుపుకుంటారో చూద్దాం. 'ఉండ్రాళ్ళ తద్ది కి మనం చెప్పుకున్నట్లే, అట్ల తద్దె ముందు రోజు సాయంకాలం ఈ వ్రతం ఆచరించే ఆడవారంతా చేతులకి, కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు.  ఒకటి, మూడు, అయిదు, తొమ్మిది, పదకొండు  అలా బేసి  సంఖ్యలో  ముత్తైదువులను పేరంటానికి పిలుస్తారు. పిలిచేటప్పుడు సున్ని పిండి, కుంకుడుకాయలు, గోరింటాకు ముద్దా, పసుపు కుంకుమ ఇస్తారు.

తదియ నాడు కన్నె పిల్లలు, ముత్తైదువులు తెలవారక ముందే లేచి, తలారా స్నానం చేసి, రాత్రే వండి ఉంచుకున్న అన్నం, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగు తో [ముందు రాత్రే వండిన మూలాన దీనిని సద్ది అంటారు]తిని అందరూ ఒక ఖాళీ ప్రదేశం లో కలుసుకుని ఆట పాటలతో గడుపుతారు. చూడ ముచ్చట గొలిపే ఉప్పురు గుప్ప, చెమ్మచెక్క, తొక్కుడు బిళ్ళ లాంటి ఆటలు పాటలు పాడుకుంటూ ఆడుకుంటారు. 'అట్లతద్దోయ్ ఆరట్లు, ముద్దపప్పోయ్ మూడట్లు......' అని పాడుకుంటూ ఉయ్యాలలు ఊగుతారు. ఎవరు ఎంత ఎత్తు ఊగుతారో  అని పోటీలు కూడా పెట్టుకుంటారు. తెల్లవారక ముందే ఈ ఆటపాటలు మొదలుపెట్టి, సూర్యోదయం సమయానికి ముగించి ఇళ్ళకి వెళ్ళిపోతారు.

ఆ పూటంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజ కి అన్నీ సిద్దం చేసుకుంటారు. పసుపు గణపతిని, పసుపు గౌరీ దేవిని పెట్టుకుని షోడశోపచార పూజలు చేస్తారు. మినపట్లు వేసుకుంటారు. పదకొండు అట్లు, బియ్యంపిండితో దీపం చేసి, జ్యోతిని వెలిగిస్తారు. పదకొండు ముళ్ళతో తోరాలు అమ్మవారికి, తమకి, పేరంటాళ్లకి  తయారు చేస్తారు. గణపతికి, గౌరీదేవికి  రకరకాల వంటకాలు చేసి, నివేదన చేస్తారు. ఈ రోజు అమ్మ వారికి నివేదనలో పదకొండు రకాల కూరగాయలతో పులుసు, పాలతాలికలు తప్పనిసరిగా చేస్తారు.

పులుసు చేయడం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. మరి పాలతాలికలు ఎలా చెయ్యాలో అనే సందిగ్దం లో పడ్డారా? మీ కోసం చివరలో పాలతాలికలు తయారు చేసే విధానం చెప్తాను. అమ్మవారికి,  పిలుచుకున్న ముత్తైదువులకి ఒకొక్కరికి పదకొండు అట్లు, పసుపు, కుంకుమ, నల్లపూసలు, లక్కజోళ్ళు, అరటిపళ్ళు, తోరం, దక్షిణ, పిండి దీపంలో వెలుగుతున్న జ్యోతితో వాయనం ఇస్తారు.

వాయనం ఇచ్చేటప్పుడు చీర కొంగుతో వాయనం మూసి 'ఇస్తినమ్మ వాయనం!' అంటూ ఇస్తారు. వాయనం పుచ్చుకునే ముత్తైదువు చీర కొంగు పట్టి 'పుచ్చుకుంటి వాయనం!' అంటూ తీసుకుంటారు. ఇలా మూడు సార్లు అన్నాక 'నా వాయనం పుచ్చుకుంటున్నది ఎవరు?' అంటే ముత్తైదువు 'నేనే గౌరీదేవిని!' అంటుంది. వ్రతం ఆచరించే వారు ముత్తైదువులను గౌరీ దేవి గా భావించి, 'కోరితిని వరం!' అంటూ పాద నమస్కారం చేస్తారు. ముత్తైదువులు కూడా పవిత్ర భావంతో వాయనం స్వీకరించి, 'ఇస్తిని ఫలం!' అంటూ, అక్షింతలేసి, అశ్వీరదిస్తారు. వాయనాలు ఇవ్వడం పూర్తి అయిన తర్వాత చంద్రుని దర్శించుకుని, వివాహం అయిన స్త్రీలు భర్త పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకుని, అన్ని పదార్ధాలతో భోజనం చేసి ఉపవాస దీక్ష విరమిస్తారు. కన్నె పిల్లలు ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటారు. ముత్తైదువులు అయిదు సంవత్సరాలు,  కొన్ని ప్రాంతాల్లో పది సంవత్సరాలు చేసుకుని ఉద్యాపన చేసుకుంటారు. ఉద్యాపన పూజ ఇలాగే ఉంటుంది. శక్తి కొలది ముత్తైదువులకు రవికెల గుడ్డ  కాని, చీర కాని పంచుకుంటారు.    
     
అట్ల తద్ది పండగ ఆడవారికి ఎన్నో సంగతులు నేర్పుతుంది. కలిసి మెలిసి ఒక పద్దతి ప్రకారం చేయడం వలన క్రమశిక్షణ, ఆటల వలన శారీరక వ్యాయామం, ఐకమత్యం, పరస్పర అవగాహన, సర్దుకుని పోయి పరస్పర సహకారం అందించుకోవడం అలవడుతాయి. అలంకరణ చేసుకోవడం నేర్చుకుంటారు. వయసు రీత్యా వాళ్ళల్లో కలిగే మార్పులు ఒకరి దగ్గరనుండి ఒకరు తెలుసుకుంటారు. రంగు రంగుల సాంప్రదాయ దుస్తులతో అచ్చమైన తెలుగువారిలా బాపూ బొమ్మల్లాగా కన్నుల పండుగ గావిస్తారు. చూడ ముచ్చటైన వారి ఆటపాటలు మనల్ని మురిపిస్తాయి! వారు  ఆటపాటలతో పాటు పూజా పద్ధతులు కూడా తెలుసుకుంటారు. కుటుంబం లో సమాజం లో స్త్రీ కి ఉన్న ప్రాశస్త్యాన్ని గ్రహించి, భవిష్యత్ లో ఒక గృహిణి గా తమ భాధ్యతలను విస్మరించకుండా నడుచుకోవటం తెలుసుకుంటారు. అట్ల తద్దె పండగ వలన వినోదమూ, విజ్ఞానము రెండూ కలుగుతాయి.
   
అట్ల తద్దె మరునాడే చవితి నాడు ఉత్తర భారతీయులు జరుపుకునే 'కర్వాచౌత్' పండగ, అలాగే రొమ్ దేశంలో ప్రతీ సంవత్సరం జనవరి 21 న జరుపుకునే ‘సెయింట్ ఆగ్నెస్ ఈవ్’ మన అట్ల తద్దె పండగల్లాంటివే!

చక్కటి వైవాహిక జీవితాన్ని ప్రసాదించే శక్తి   అట్ల తద్దె వ్రతానికి ఉందని పెద్ద లు చెపుతారు. ఒక్క సారి ఆలోచించండి ఈ తరం ఆడపిల్లలు ఎన్ని ముచ్చట్లకు దూరమవుతున్నారో! చదువులు, ఉద్యోగాలు ముఖ్యమే కాని, వాటితో పాటు చక్కని జీవితానికి పనికి వచ్చే ఇటువంటి ముచ్చట్లు కూడా అవసరమే! అయితే మరి ఈ నెల 10 వ తారీఖున  వచ్చే ఆశ్వయుజ బహుళ తదియ నాడు ఆడవారంతా ఆనందంగా అట్లతద్దె జరుపుకుంటారు కదూ? మరి ఇప్పుడు పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూద్దాం.

పాల తాలికలు - కావలిసిన వస్తువులు:
ఒక గ్లాస్ బియ్యం పిండి, ఒక గ్లాసు బెల్లం తురుము, మూడు గ్లాసుల పాలు, యాలకులు 5 లేక 6. 

తయారు చేసే విధానం:
ముందుగా బియ్యం పిండిని తీసుకుని, ఒక గిన్నె లో వేడి నీళ్ళతో గట్టిగా చపాతి పిండి  లాగ కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని, ఒకొక్క ఉండని అరచేతిలో పెట్టుకుని, రెండు చేతుల సహాయం తో పొడుగు తాడులాగా తాలికలు చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో  వేసుకుని కుక్కర్లో ఇడ్లీల్లాగా ఆవిరి మీద ఉడకనివ్వాలి. ఈ లోగా పాలు ఒక దళసరి గిన్నెలో పోసి, స్టవ్ మీదపెట్టి, సగానికి సగం అయ్యేదాకా మరగనివ్వాలి. బాగా చిక్కగా అయ్యాక  బెల్లం తురుము కూడా వేసి, అడుగంటకుండా కలుపుతూ, ఇంకొంచెం సేపు మరగించాలి. అప్పుడు ఆవిరిమీద ఉడికించిన తాలికలు మరుగుతున్న పాలల్లో వెయ్యాలి. తాలికలు పాలను  పీల్చుకోవడానికి రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచి, దింపేయండి. యాలకులను పొడి చేసి, పైన జల్లండి. ఇందులో మనం నెయ్యి కానీ నూనె కానీ వాడకపోవడం వలన ఆరోగ్యానికి  చాలా మంచిది. చిన్న పిల్లలు తిన్నా జబ్బు చేయదు.    





2 comments:

  1. అట్లతద్ది గురించి చాలా చక్కగా వివరించారు
    పదకొండు యొక్క ప్రాముఖ్యత కనిపిస్తోంది కాని దానిని
    మరింత వివరిస్తే బాగుంటుంది

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete