ముందుమాట:
హిందువులకు అనాదిగా దేవతలతో పాటు కొన్ని వృక్షాలు, మొక్కలు కూడా చాలా
పూజ్యనీయాలు! వాటిని శ్రద్ధగా పెంచుతారు! భక్తితో పూజించుతారు! మనం పోలాలమావాస్య
సందర్భంగా కంద మొక్కను పూజించడం తెలుసుకున్నాము. అలాగే వేప వృక్షం, వట[రావి] వృక్షం
హిందువులకు పవిత్రమైనవే! కార్తీక మాస సందర్భంలో ఈ మాసంలో ఎక్కువ
ప్రాదాన్యతనివ్వబడే 'కార్తీక వృక్ష త్రయం' అనదగ్గ తులసి మొక్క, బిల్వ
వృక్షము, మరియు ధాత్రి [ఉసిరి ]వృక్షము యొక్క పవిత్రత, విశిష్టత, పూజనీయత
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పరమ
పవిత్రమైన తులసీ వృక్షం గురించి శ్రీమతి నయన కస్తూరి ఏమి వివరిస్తున్నారో తెలుసుకుందాం!
రమణ బంధకవి
సంపాదకుడు
కార్తీక
మాసం -- వృక్ష త్రయం!
శ్రీమతి నయన కస్తూరి
తులసీ వృక్షం:
ఇక తులసీ మాత యొక్క పవిత్రతను
తెలుసుకుందాము. మన హిందూ ధర్మంలో తులసి మాతకి ఉన్న ప్రాముఖ్యత
అందరికి సుపరిచితమే. ప్రతి దినం ప్రత్యేకించి శుక్రవారం తులసి మాతకు పూజలు
సల్పటం ఎప్పటినుండో వస్తున్న సాంప్రదాయం కూడా.
తులసి కోట, తులసి మొక్క ప్రతి
ఇంటిలోనూ వెలసిన ప్రత్యక్ష దైవమని
చెప్పుకోవచ్చును. తులసి దళములకు, తులసి మాత పూజలకు
కార్తీక మాసంలో ఒక విశిష్ట స్థానం ఉన్నదని పెద్దలు చెప్తారు.
పుష్కరాది తీర్ధములు, గంగాది మొదలగు పవిత్ర
నదులు, నారాయణాది దేవతలు
తులసి దళము లందు నివసించి ఉంటారని అనేక శాస్త్రాలలో పేర్కొన బడింది. కార్తీక అమావాస్య
నాడు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన తులసి జన్మించెనని, వారిరువురు ఆమెకు
పుజార్హతను ప్రసాదించిరని, నారాయణుడామెను
తనకిష్టురాలిగా అనుగ్రహించి ఆమె దళములతో తనను అర్చించిన వారికి ప్రసన్నుడను
అయెదనని వరమిచ్చేనని, తులసి పవిత్రతని
ప్రసాదించునదిగా, పూజార్హ మైనదిగాను, మహావిష్ణువు కి
మిక్కిలి ప్రీతికరమైనది గాను కొన్ని పురాణ గ్రంధాల ద్వారా తెలియబడుతున్నది.
తులసి మహిమ
మాటలకందనిది. అనేక పురాణాలలో కూడా తులసి మహాత్మ్యం ప్రస్తావింపబడినది. రుక్మిణి సత్యభామల
వివాదమున రుక్మిణి దేవి తులాభారములో తులసీ దళములనుంచి తన భర్త అయిన
శ్రీకృష్ణ పరమాత్మను తిరిగి పొందినది. గోదా దేవి కూడా తులసి దండలను శ్రీ రంగనాధున కర్పించి శ్రీ
రంగనాధుని సాన్నిధ్యం పొందినది. సీతా మహాతల్లి తన వనవాసమున తులసిని నాటి పుజించినది.
ఈ విధముగా తులసి మహాత్మ్యం అనేక విధములుగా మన పురాణాలలోను, ఇతిహాసములలోను
కనిపిస్తూ ఉంటుంది. వైద్య విషయంలో కూడా, ఔషధీ రూపం లో కాపాడుతుంది.
కార్తీక మాసమందు
తులసి గుత్తులచే పరమ శివుని కాని, కేశవుని కాని అర్చించిన వారికి సర్వసంపదలు కలుగునని, తులసి మొక్కలు నాటుట వలన, తులసిని పెంచుట చేతను, స్ప్రుశించుట చేతను, మనో వాక్కాయములచే గావించిన సకల పాపములు హరింప బడునని, పునర్జన్మ కలుగదని
కూడా అనేక పురాణాల లో చెప్పబడింది.
పుణ్య తీర్ధములను
దర్శించుట, గంగా స్నానమాచరించుట
తులసి వనమును సేవించుట సమాన ఫలము నిస్తుందని, ఇష్ట కామార్ధ సిద్ధిని పొంది యముని భీతి కూడా తొలగునని కూడా తెలుపబడింది.
కార్తీక మాసమందు చేసే
సకల యజ్ఞములు, తీర్ధ యాత్రలు మహా
ఫలప్రదములు. ఈ మాసములోని ద్వాదశి తిధి నారాయణునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ
తిదియందు తులసి కోట యందు శ్రీ లక్ష్మి నారాయణుని ప్రతిమనుంచి, క్షీరాబ్ది ద్వాదశి
పూజను సలిపి, తులసి కధను విని
వ్రతమాచరించు వారికి అనంత పుణ్యము, వైకుంఠ నివాసము, మాంగల్య వృద్ధి, ఇహలోకమున సర్వ సౌఖ్యం
కలుగునని మనకు కార్తీక పురాణం మొదలయిన గ్రంధాల ద్వారా
తెలియబడుతోంది.
తులసి మాత
కల్పవృక్షము వంటిది. కోరినవరములను ఒసగే కన్నతల్లి వంటిది. అట్టి తల్లిని అర్చించుట, సేవించుట మన కర్తవ్యం.
అందునా కార్తీక మాసమందు చేసే తులసి పూజలకు గొప్ప ప్రాధాన్యత, ఫలము లభిస్తుందని పెద్దలు
చెప్తారు. కార్తీక మాసమందు ప్రతి రోజు, సూర్యోదయ ప్రారంభ సమయంలో, సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర దీపాలు వెలిగించటం అతి గొప్ప పుణ్య ఫలం
నోసగుతుందని చెప్పటంలో ఏ మాత్రం సందేహ పడనవసరం
లేదు.
ఇంతటి మహత్వం కలిగిన
తులసీ మొక్కను చక్కగా పెంచుకుని, నిత్యం "యాన్మూలె సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వదేవతా, యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం! నమః తులసీ కళ్యాణీ నమో
విష్ణు ప్రియే, శుభే, నమో మోక్షప్రదే దేవీ నమః
సంపత్ప్రదాయినీ!” అని
తులసమ్మని స్తుతించు కుంటూ సకల సౌభాగ్యాలు పొందుదాం!
(సశేషం)
No comments:
Post a Comment