ముందుమాట:
“ఈ మధ్యనే
వాడికి పెళ్ళయ్యింది. అప్పట్నించి వాడికి తల్లి అల్లం, ఆలి బెల్లం అయిపోయింది
సుమా!” అన్న పెదవి విరుపు మాటలు మన నిత్య
జీవితంలో ఏ పెద్దవారో అనటం వింటూనే వుంటాం. మరి అల్లం, బెల్లం రెండూ మన తెలుగు
భోజనం లో విశిష్టమైన పదార్దాలే కదా? అల్లపు ఘాటు లేని కూరలు, పచ్చళ్ళు మరియు
అల్పాహారాలు బహు తక్కువ. అలాగే బెల్లపు తీపితనం లేని పులుసులు, దప్పళాలు, చారులు
మరియు పులుసు బెల్లం కూరలు ఊహించగలమా? మరి వీటి మధ్య పోటీలు, పోలికలు ఎందుకోచ్చాయో?
నాకైతే తెలియదు గాని, ఈ విషయాన్ని కొద్దిగా లోతుగా పరిశీలించి మన ముందుకు
తెస్తున్నారు శ్రీమతి పద్మా రఘునాద్. మొన్నటి అల్లం పచ్చడి రుచి ఇంకా జిహ్వని
వదిలి ఉండదు. మరి ఇది కూడా చదివి ఆనందించండి.
రమణ బంధకవి
సంపాదకుడు
‘అల్లం…బెల్లం’
శ్రీమతి పద్మా రఘునాద్
ఈ రెండు పదాలని
ప్రక్క ప్రక్కన చూడ గానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది; “తల్లి అల్లం.. పెళ్ళాం బెల్లం
అయిపొయింది వాడికి” అనే విసుర్లు, ఛలోక్తులు, విమర్శలు, నిట్టూర్పులే మరి.
అసలు ఈ విధమైన
పోలిక ఎందుకు వాడుకలోకి వచ్చిందా?
అని ఒక్క నిమిషం ఆలోచిస్తే, బహుశ ఈ రెండు పదార్దాలకున్న వాటి వాటి
సహజమైన రుచి, వాసనలు కారణం కావచ్చు అని అనిపిస్తుంది.
అంటే, అల్లానికి వున్న సహజమైన ఘాటు, కారం అనే గుణాల వలన, మనకు అప్రియమైన వారిని అల్లం తో పోల్చటం, అదే విధంగా బెల్లాని కున్న సహజమైన తీపి
రుచి వలన, మనకు ప్రియమైన వారిని బెల్లం తో పోల్చటం జరుగుతోంది అని అనుకోవచ్చును.
ఇంకొంచెం
పరిశీలించి చూసినట్లయితే, అల్లం పని బెల్లం చేయలేదు. బెల్లం పని అల్లం చేయలేదు. అంటే వేటికవే, వాటి వాటి సహజ మైన, రుచులతో మనకు ఉపయోగకరం గా వున్నాయన్నమాట. మొదట అల్లం గురించి కొంచెం
విపులంగా తెలుసుకుందాము.
అల్లంకున్న
ఘాటైన రుచి వలన అజీర్ణం, దగ్గు, జలుబు, గొంతు నెప్పి మొదలైనవి నెమ్మదిస్తాయని, వికారం తగ్గించే గుణం కూడా వుందని అదే కాకుండగా, కాన్సర్ నివారణకు పనికి వచ్చే మందులు
తాయారు చేయటానికి కూడా అల్లం మీద పరిశోధనలు జరుగుతున్నట్లు గా ఆరోగ్యానికి సంబంధించిన
పేపర్ల ద్వారా, పత్రికల
ద్వారా, ఇంటర్నెట్ ద్వారా సమాచారం తెలుస్తోంది.
ఇక బెల్లం మాటకి
వస్తే, బెల్లం కి వున్న అమోఘమైన తీపి రుచి తో పాటు, మనకు జీర్ణ కారి గా ఉపయోగిస్తుందని, అందులో శరీరానికి అవసరమయ్యే రకరకాల మినరల్స్, విటమిన్స్, ముఖ్యంగా ఐరన్ కూడా ఉంటుందని సమాచారం అందుతోంది. కాబట్టి వాటి వాటి విలువలు, ఉపయోగాలు గుర్తించి, తగిన మోతాదులలో వాడుకుంటే, మనకు అవి ఎంతో మేలు చేస్తాయి.
మన నిత్య జీవితం
లో మనకు తారసపడే వ్యక్తులు కానీ,
మనకు సంబంధం వున్న వ్యక్తులు కాని, ఎవరికీ వారే, వారి వారి సహజ గుణాలతో ప్రత్యేకంగా
వుంటారు. ఎదుటి వారి సహజ
గుణాలను గుర్తించి అర్ధం చేసుకుని,
వాటిని వారి దోషాలు గా ఎత్తి చూపకుండగా, సమన్వయం తో వ్యవహరిస్తే వారిలో మనకు
నచ్చే గుణాలు కూడా త్వరగా, సులభంగా విదితమయ్యే అవకాశం ఉంటుంది.
ఇక అల్లం, బెల్లం గురించి అంటారా, మంచి ఘాటైన అల్లం పచ్చడి నూరుతున్నపుడు ఒక బెల్లం ముక్క కూడా వేసి చూడండి.
అల్లం పచ్చడి అమోఘమైన రుచితో తయారవుతుంది. ఇకముందు ఎపుడైన, “తల్లి అల్లం.. పెళ్ళాం బెల్లం” అని
వినిపిస్తే,
రెండు విభిన్న గుణాలున్న ఈ రెండు పదార్ధాలు కలిపినపుడు తయారయ్యే రుచి
కరమైన పచ్చడిని వెంటనే దృష్టికి తెచ్చుకుంటే, ఇంటికి, వంటకి మరి వంటికి కూడా చాలా మేలు
జరుగ్తుందని ఆశిస్తూ ఇక సెలవు.
No comments:
Post a Comment