ముందుమాట:
సద్గుణాలలో దాన గుణం విశేషమైనది ఐయితే, కార్తిక
మాసంలో దానాలు చేపట్టటం పరమోత్కృష్ట మైనది. దానం కారుణ్యనికి ప్రతీక. మరి కార్తిక
దానాలు ఏకంగా కైవల్య సోపానాలని అని చెపుతూ వ్యాసకర్త శ్రీమతి నయన, కార్తిక దానాల
ప్రాశస్త్యం, అవి చేసే పద్దతులు, వాటిలో రకాలు సవివరంగా మనకు అందిస్తున్నారు. అంతేకాక, అవసరంలో ఉన్న ఎవరికైనా సరే, ఏది
అవసరమో అది భగవంతుడు మనకు ఇచ్చిన శక్తి అనుసారం వారికి అందించగలిగితే, అంతకంటే భగవత్ప్రీతి
పాత్రం ఇంకొకటి లేదంటారు. ఇక చదువుదామా?
రమణ
బంధకవి
సంపాదకుడు
కార్తీక
దానాలు – కైవల్య సోపానాలు
శ్రీమతి
నయన కస్తూరి
పవిత్ర కార్తీక మాసం ఎన్నో పుణ్య కార్యాలకు మార్గం చూపుతుంది .ఈ మాసం
లో స్నానాలు చేసినా పుణ్యం! దీపారాధన పాపహరణం మరియు పుణ్యప్రదం! హరిహర ఆరాధన
జన్మజన్మ లకు పుణ్యం సంపాదించి పెడుతుంది. కార్తీకం లో దానాలు చేస్తే శివానుగ్రహం
కలిగుతుందని, ఈ జన్మలోనూ రాబోవు జన్మలలోనూ దారిద్రం పాలవరని అష్టైశ్వర్యాలతో
తులతూగుతారని పురాణాలలో చెప్పబడింది. దానగుణం కలిగి ఉండటం పూర్వజన్మ సుకృతమే! దానం
ఎప్పుడూ పుణ్యకార్యమే. విశేషించి కార్తీక మాసం లో ఏ దానం చేసినా వెయ్యి రెట్లు
ఎక్కువగా ఫలప్రదమని చెప్తారు.
ఈ మాసం లో ప్రతీ రోజూ దానం చేసుకోవడానికి ఎంతో
యోగ్యమైనదే అయినా కార్తీక సోమవారాలు, కార్తీక శుద్ధ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి,
కార్తీక పౌర్ణమి రోజులలో దానాలు చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి. కార్తీక
మాసం లో ఏమేమి దానాలు చేసుకోవచ్చో చూద్దాము.
దీపదానం:
ముందుగా ఈ మాసం లో దీపారాధనకు ఎక్కువ ప్రాముఖ్యత
ఇవ్వబడటం వలన దీపదానం చేసుకున్న వ్యక్తి పాపాలన్నీ పోయి, కష్టాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయి,
స్వర్గలోక సుఖాలు పొందడానికి అర్హత పొందుతాడు. కార్తీక మాస వ్రత
ఫలితం పొందుతాడు. ఇంత మంగళకరమైన దీపదానం ఎలా చేసుకోవాలో చూద్దాం. కార్తీక
శుద్ధ ఏకాదశి రోజు కానీ క్షీరాబ్ది ద్వాదశి రోజు కానీ, పౌర్ణమి
రోజు కానీ ఈ దానం దేవాలయం లో కానీ ఇంట్లో కానీ ఇచ్చుకోవచ్చు. దానం చేసుకునే
రోజు తలస్నానం చేసి, ఇంట్లో దీపారాధన పూజ చేసుకుని, ఒక చిన్న పళ్ళెం లో కాసిని బియ్యం పోసి దాని మీద ఒక తమలపాకు పెట్టుకోవాలి.
శక్తి కొలది ఒకకొత్త మట్టి ప్రమిద కానీ, ఒక ఉసిరి
దీపం కానీ, ఒక వెండి ప్రమిద కానీ ఒక
బంగారు ప్రమిదకానీ పెట్టి, అందులో బంగారు వత్తి కి ప్రత్తి
వత్తిని చుట్టి, ఆవు నెయ్యిని పోసి, దీపం
వెలిగించుకోవాలి. పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, పుష్పాలతో పూజించాలి. సంకల్పం చెప్పుకుని, దక్షిణ
తాంబూలాలతో ఒక యోగ్యమైన బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. దీపాల సంఖ్య 1,3,5,9
........లాంటి బేసి సంఖ్యలో దీపాలు దానం చేసుకుని విశేష ఫలితాలు
పొందవచ్చు.
సాలగ్రామ దానం:
దీపదానం తో పాటు సాలగ్రామ లేక శివలింగ దానం చేసుకుంటే
శివానుగ్రహం పరిపూర్ణం గా లభ్యమవుతుంది. పునర్జన్మ లేకుండా మోక్షం పొందుతారు అని
పెద్దలు చెపుతారు. దీపం లాగానే సాలగ్రామానికి కూడా అలంకరణ, పూజ సలిపి, శివారాధన
చేసుకునే యోగ్య బ్రాహ్మణుడికి దక్షిణ
తాంబూలాలతో శ్రద్ధగా దానం చేసుకోవాలి. ఏకాదశి కానీ, కార్తీక
పౌర్ణమి రోజు కానీ దానం చేసుకుంటే అత్యుత్తమ ఫలితాలు అందుతాయి.
వస్త్ర దానం:
కార్తీక మాసం లో నూతన వస్త్ర దానం చేసుకుంటే మనం
అంతవరుకు చేసుకున్న పాపాలు పటాపంచలు అవుతాయని హిందువుల నమ్మకం! యోగ్యుడైన ఒక
బ్రాహ్మణుడిని పూజించి, ఆయనకు భోజనం పెట్టి, కుదరకపోతే 'స్వయంపాకం' [స్వయంపాకం గురించి
చివరలో తెలియజేస్తాము] ఇచ్చి, సంకల్పం చెప్పుకుని, వస్త్రదానం చేసుకోవాలి. వస్త్ర దానం కింద పంచ కండువా ఇవ్వచ్చు. రెండు
పంచలు కలిసి వున్న పంచాలచాపు కూడా ఇవ్వచ్చు. ఎప్పుడూ ఏక వస్త్రం ఇవ్వకూడదు. శక్తి, అవకాశం వుంటే యోగ్య బ్రాహ్మణ దంపతులకు వస్త్రదానం చేసుకో గలిగితే మరీ
మంచిది. దానం చేసేటప్పుడు వస్త్రం నలుపు, నీలం మరియు
రక్తవర్ణం లేకుండా చూసుకోండి. ముత్తైదువుకి ఇచ్చేటప్పుడు చీర తో పాటు రవికల గుడ్డ
తప్పనిసరిగా పెట్టి, పసుపు, కుంకుమలు
పెట్టి ఇవ్వడం మర్చిపోకండి. ఈ వస్త్ర దానం అవసరంలో వున్న వాళ్లకి కూడా ఇచ్చుకుంటే
అధిక ఫలాలు అవశ్యం!
ఇప్పుడు స్వయంపాకం అంటే ఏమిటో చూద్దాము. పరిస్తితుల
కారణం చేత మనం వండిన భోజనం పెట్టలేకపోయినప్పుడు, బ్రాహ్మణుడి నే స్వయం గా తయారు చేసుకోమని ప్రార్ధిస్తూ, బియ్యం, పప్పులు, కూరగాయలు, చింత పండు, బెల్లం, ఎండు మిరపకాయలు, నెయ్యి, పెరుగు .....ఇలా భోజనానికి
సరిపడా అన్ని పదార్ధాలు ఒక ఆకులో పెట్టి పైన ఇంకొక ఆకు బోర్లించి ఇవ్వాలి. కూరగాయలతో
పాటు తోటకూర తప్పనిసరిగా వుండాలి అని చెప్తారు మన పెద్దలు.
ఇవే కాకుండా దానం చేసుకోవడానికి ఏ వస్తువూ అనర్హం
కాదు. సౌఖ్యమైన జీవనం కోసం మంచి గుమ్మడి పండు దానం చేసుకోవచ్చు. శక్తి కలవారు
గోదానం చేసుకుంటే, వారికే
కాకుండా తరతరాలకూ పుణ్యలోకాల ప్రాప్తి లభిస్తుంది. భూదానం, సువర్ణ
దానం అనంత పుణ్యాలను ప్రసాదిస్తుంది.
అదీ ఇదీ కాదు మన అవకాశం కొద్ది, శక్తి కొలది ఈ మాసం లో దానం
చేసుకుంటే చాలా మంచిది. పూజాపద్ధతులు కుదరని వారు ఏమీ విచారించక్కర్లేదు.
చదుకునే పేద విద్యార్ధులకు పుస్తకదానం చేయవచ్చు. ఆకలి గొన్న పేదవారికి అన్నదానం
చేయవచ్చును. అశక్తులకు అవసరమైనది ఇవ్వవచ్చును. ఇలా మనకున్నది ఇతరులకు లేనిదీ ఏదైనా
మనసు పెట్టి శ్రద్ధగా ఇస్తే అదే దానం! ఇలా దానం చేసిన వారికి ఎప్పుడూ ఏ కొరత
లేకుండా ఆ భగవంతుడే చూసుకుంటాడు. చేసిన వారికి కూడా ఒక విధమైన తృప్తి, అలౌకిక ఆనందం కలుగుతాయి. పండితుల పట్ల భక్తి గౌరవాలు పెంపొందుతాయి.
ఇలాంటి దానాల వలన ఆధ్యాత్మిక ఆనందమే కాక ఉన్న వాళ్ళు లేని వాళ్లకి ఇవ్వడం
వలన సామాజిక న్యాయానికి కూడా తోడ్పడతాయి. మనలో ఉన్న అంతర్లీనం గా ఉన్న
కారుణ్య గుణాన్ని వెలికి తీస్తాయి ఈ కార్తీక దానాలు!
స్వస్తి!
No comments:
Post a Comment