Friday, November 21, 2014

కార్తీక మాస ప్రత్యేక వ్యాస పరంపర – 16 (ముగింపు వ్యాసం)


ముందుమాట:

రేపు అనగా 22 వ తారీఖున అమావాస్య నాటితో పవిత్ర కార్తీక మాసం ముగుస్తుంది. భక్తులందరూ 

శ్రద్దగా మాసమంతా చేపట్టిన  రేపటి అమావాస్యను సర్వ అమావాస్య అంటారని, దానికి ఒక 

విశిస్టత వుందని వివరిస్తున్నారు. అంతే కాక పితృదేవతలను సంతృప్త పరచి వారి ఆశీస్సులతో 

ఋణపాప విమోచనం పొందే అవకాశం కూడా ఈ సర్వ అమావాస్య కలిగిస్తుందని చెపుతున్నారు 

శ్రీమతి నయన.

ఈ వ్యాసం తో మన కార్తిక మాస ప్రత్యెక వ్యాస పరంపర ముగిసింది. మరి యొక విశిస్ట మాసం లో 

మరికొన్ని చక్కటి విషయాలతో ‘తెలుగు భోజనం’ మీ ముందుకు వస్తుంది. పాఠకుల 

అభిమానానికి, ఆదరణకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.


రమణ బంధకవి


సంపాదకుడు



సర్వ అమావాస్యం - సర్వ ఋణ పాప విమోచకం!




శ్రీమతి నయన కస్తూరి

కార్తీక బహుళ అమావాస్య రోజు కార్తీక మాసం పొడుగునా చేసుకునే పూజలకు మంగళ నీరాజనాలద్దుతుంది. ఈ అమావాస్య సర్వ అమావాస్య అని కూడా పిలువబడుతుంది. మాసమంతా తలస్నానాలు చేయలేక పోయినా ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేక దినాలలో చేసేవారు ఈ అమావాస్యనాడు తప్పనిసరిగా స్నానం చేస్తారు. అయితే ఒంటికి  కానీ తలకి కానీ నూనె రాసుకోకుడా నలుగు పెట్టుకోకుండా చేయాలి. ఈ రోజు చేస్త్తే మాసమంతా కార్తీక స్నాన ఫలితం కలుగుతుంది. తలస్నానం చేసిన తర్వాత మాసమంతా సూర్యోదయానికి ముందే కార్తీక దీపాలు వెలిగించుకునే వారు ఈ రోజు దీపాలను నీటిలో వదులుతారు. నది లో కానీ, చెరువులోకానీ, ఇంటి లోనే ఒక పెద్ద టబ్ లో నీళ్ళు పోసుకుని అందులో వదులుతారు.

ఈ రోజుతో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది. కార్తీక మాస ప్రత్యేక  అభిషేకాలు, అర్చనలు ఈ రోజుతో ముగుస్తాయి. నత్తాలు ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగిస్తాయి. తులసమ్మ దగ్గర సింహాద్వారానికిరువైపులా వెలిగించే సంధ్యా దీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి.

ఆకాశదీపాన్ని ఈ రోజు కూడా కొనసాగించి, శివసాన్నిధ్యం కోరుకుంటూ పోలి స్వర్గంకి వెళ్ళిన కథ చెప్పుకుంటారు. పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ అమావాస్యనాడు తలస్నానం చేసి,  శివుని సన్నిధిన  దీపం వెలిగించి, ఉపవాసం ఉన్న  పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానం లో స్వర్గానికి తీసుకుని వెళ్తారు. ఈ కథ చెప్పుకుని,పోలి లాగే తలస్నానం చేసి, దీపారాధన చేసి, ఉపవాసం ఉండి ,శివసాన్నిధ్యం కోరుకుంటారు.  

ఈ రోజున పితృదేవతలకు కూడా తర్పణాలు వదులుతారు. ప్రతి అమావాస్య పితృదేవతల సేవకు అనువైన రోజు. విశేషించి ఈ కార్తీక బహుళ అమావాస్య పితృదేవతల రోజు. ఈ రోజు పితృదేవతల పేరుతో ఏమి అర్పించినా వారు మిక్కిలి సంతుష్టులై ఆశీస్సులు అందిస్తారు. ఈ విధం గా మన పెద్దలు కార్తీకమాసరూపం లో  మన పాపాలు హరించు కోవడానికి, మరియు ఋణాలు తీర్చుకోవడానికి మంచి అవకాశాన్ని ఇచ్చారు. దానిని మనం చక్కగా అందుకోగలగాలి!

ఈ కార్తీక మాసం అంతా శుచి గా శుభ్రం గా హరిహరులను పూజించుకుని, ఉపవాసాల వలన జీర్ణవ్యవస్థ ను క్రమబద్దం చేసుకుని, శీతాకాలంలో సాధారణంగా వచ్చే ఇబ్బందులకు లోను కాకుండా, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని, ఆధ్యాత్మికానందాన్ని అనుభవిస్తూనే, మన ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుచుకోవడానికి మనమంతా చేసిన కృషికి హరిహరులు తప్పక హర్షిస్తారు! మళ్ళీ  వచ్చే కార్తీక మాసం లో మరికొంత కృషి సలుపుదాం. స్వస్తి!

సర్వే  జనా సుఖినో భవంతు!    


 












No comments:

Post a Comment