Saturday, December 20, 2014

‘ఇంగువ కట్టిన గుడ్డ’


ముందు మాట:

పాఠకులకు నమస్కారం!  కొన్నిఅనివార్య  కారణాల వలన తెలుగు భోజనం పోస్ట్స్ ఆలస్యం 

అయ్యాయి. అందుకు  చింతిస్తున్నాము. ఘాటైన  ఇంగువ పోపు తగిలించిన  పుల్లటి తెలిగింటి 

పులిహోర లాంటి ‘తెలుగు భోజనం’  మరల మీ ముందుకు వచ్చింది. ఇంగువ కట్టిన గుడ్డ 

ఎంతకాలమైన ఆ సువాసనలను వెదజల్లుతుంది. మరి అ కధా కమామిషు ఏమిటో శ్రీమతి పద్మ 

గారు చెపుతున్నారు విందామా?


రమణ బంధకవి


సంపాదకుడు




ఇంగువ కట్టిన గుడ్డ


శ్రీమతి పద్మా రఘునాద్


పూర్వపు రోజుల్లో అంటే ఇంగువ డబ్బాలలో దొరకని రోజుల్లో అన్నమాట, ముద్ద ఇంగువని ఒక గుడ్డలో గట్టిగా కట్టుకుని దానిని వంట ఇంట్లో పోపుల డబ్బా లో భద్రపరచుకుని  వంట చేసేటపుడు వాడతారని  మా బామ్మ గారు చెప్పగా విన్నాను. 

ఇలా గుడ్డలో కట్టి ఉంచటం  వలన దాని వాసన పోకుండగా ఎంత కాలమయినా అది గుభాలింపు సువాసనలు అందిస్తూనే ఉంటుందట. అంతే కాకుండగా ఆ  ఘుభాళింపులు ఆ కట్టిన గుడ్డకి కూడా అలా అంటి పెట్టుకునే ఉంటాయి ఎంత కాలమయినా కూడా!

ఇంగువ వాసన గిట్టని వారు, ఇంగువని వంటల్లో వాడని తెలుగు వారు అసలు ఉండనే ఉండరని గట్టిగా చెప్పఛు. ఎందుకంటే తెలుగు వంటకాలలో- మన కూరలు, పచ్చళ్ళు,  పప్పులుపులుసులు, చారులలో తప్పని సరిగా వాడేది,  పాత్ర మూత తీయగానే ఘుప్పుమని సువాసనలు వెదజల్లేది  మన ఇంగువే  సుమా! ఇంగువకి అంత ఘాటైన సువాసన ఉంటుందని అది మన తెలుగు వారి వంటలకి కలికి తురాయి అని వేరే చెప్పక్కర్లేదు.

ఇక చింతపండు పులిహార అయినా, నిమ్మ కాయ పులిహార అయినా,  కొబ్బరన్నం కాని ఇంగువ పోపు దట్టంగా పడక పోతే దాని రుచి తగ్గిపోయినట్లే సుమండీ!

మన పత్యపు  పచ్చళ్ళ కోవలోకి  వచ్చే పాత చింతకాయ పచ్చడి కాని, ఉసిరి పచ్చ్హడి  లో కాని ఈ ఇంగువ పోపు పెట్టుకుంటే అవన్నీ మళ్లి  కొత్తగా తింటున్నట్లు అనిపించి జిహ్వ లేచి వస్తుంది మరి. 

జలుబు జ్వరాన పడి లేచిన తర్వాత, కాస్త ఇంగువ చారు పోసుకుంటే ప్రాణం లేచివస్తుందని వేరే చెప్పక్కర్లేదు కూడాను. 

ఇంతే కాకుండగా ముందుగా చేసుకున్న వంటపదార్ధాల మీద కూడా తినేముందు  కొంచెం ఇంగువ పోపు పెట్టుకుంటే, అప్పటి కప్పుడు తయారు చేసుకుని తింటున్న అనుభూతి నివ్వగలిగేది  కూడా మన ఇంగువే అనటం లో ఏ  మాత్రం సందేహం లేదు. 

ఇలా ప్రతీ వంటకానికి తుది మెరుగులు దిద్దేదీ , "పాత తనానికి" కొత్త రుచి నిచ్చేది మన ఇంగువ పొపే  అన్నది నూటికి నూరు పాళ్ళ ( నోటికి నోరు పాళ్ళ )  నిజం!

ఈ ఇంగువ కి ఒక్క రుచి కరమైన ఘాటైన సువాసనే కాకుండగా కడుపు ఉబ్బరం తగ్గించే గుణం కూడా ఉన్నదని అందుకనే మన వంటల్లో విరివిగా వాడే అలవాటు పూర్వపు రోజులనుండే ఉన్నదని చాల మంది  పెద్దవారు కూడాచెప్తుంటారు. 

ఇక ఈ ఇంగువ కట్టిన గుడ్డని పరిశీలిస్తే , ఇందాక చెప్పుకున్నట్లు, ఇంగువ మొత్తం అయిపోయినా, ఆ ఇంగువ వాసన ఆ గుడ్డని అలానే ఎంత కాలమయినా అంటిపెట్టుకుని ఉంటుందని తెలుస్తోంది. మనకి సాధారణంగా అనేక స్వభావాలు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కాని , స్నేహాలు కాని ఏర్పడుతూ ఉంటాయి. కొంతమంది స్వభావం మనల్ని చాల ప్రభావితం చేస్తుంది వారు మన సమీపంలో ఉన్నా  లేకపోయినా కూడా! అయితే ఏ యే స్వభావాలు మనలని ఎంత వరకు ప్రభావితం చేస్తాయి అన్న విషయం మన వివేకం మీద, మన సంస్కారాల మీద తద్వారా సంక్రమించే  మన స్నేహాల మీద ఆధారపడి ఉంటాయి. 


మరొక్క మాట!  మన  భారత దేశం లోని ఎందఱో గొప్ప మహానుభావులు వారి విశిష్టమైన వ్యక్తిత్వం తో ఎక్కడి కెళ్ళినా వారి స్వభావపు పరిమళాలు వెదజల్లారు.  వారి మాటలతో, చేష్టలతో ప్రజలకు  గొప్ప గొప్ప  సంస్కారాలనుస్పూర్తిని  అందజేశారు. వారి ఉన్నతమైన ఆదర్శాలనే ఘాటైన ఇంగువతో గట్టిగ్గా కట్టిన  గుడ్డ మన భారతదేశం అని నిస్సందేహంగా అనుకోవచ్చు. ఆ మహాత్ములు నిష్క్రమించినా వారి సంస్కారాలు, ఆదర్శాలు  మన దేశం లో ఇంకా సువాసనలు గుప్పిస్తునే ఉన్నాయి.  మరి ఆ సువాసన ఘాటు  పోకుండగా మన ఇంగువ కట్టిన గుడ్డని మరింత పదిలంగా చూసుకుందామా





No comments:

Post a Comment