Friday, December 26, 2014

‘దంత సిరి’


శ్రీమతి నయన కస్తూరి

'ఎలాగైనా వాడికి  దంతసిరి ఎక్కువే!' అని ఎవరైనా ఒకరి గురించి అసూయగా  అన్నారంటే వారి దంతాలు బంగారంతోనో ప్లాటినంతోనో చేయుంచుకున్నారని కాదు వారి భావం. అసలు దంత సిరి అంటే ఏమిటి అనే విషయానికి వద్దాం.

దంతాలు చేసే పని ఆహారాన్ని చక్కగా నమలడం. మనందరం రోజూ ఆహారాన్ని తీసుకుంటూనే ఉంటాము. అయితే మనలో కొంతమంది మాత్రమే  భోజన ప్రియులు ఉంటారు. వారు సాధారణ స్తాయి కన్నా ఎక్కువ మోతాదులో ఏంతో  ఇష్టంగా తింటూ ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా మంచి ఆహారం సమయానికి దొరుకుతుంది. కడుపునిండా తినగలుగుతారు.  తిన్నది అరిగించుకుంటారు. ఇలా తినడం కూడా ఈ రోజుల్లో అదృష్టమే అని చెప్పుకోవచ్చును.

ఈ ఆధునిక యుగంలో మనిషి అనేక రకాల ఒత్తిడులకు లోనవుతూ ఉంటాడు. పని ఒత్తిడి, చదువుల ఒత్తిడి, పోటీల ఒత్తిడి....... ఇలా ఇంకా ఎన్నో!  వీటన్నిటి వలన సమయాభావం ఏర్పడి, తినే తిండి మీద ఆసక్తి పోయి, ఏదో ఒకటి నిలబడే  నోట్లో పడేసుకుని మింగేయడం వలనైతే నేమి, అకాల భోజనం వలనైతేనేమి, రెడీమేడ్ పదార్ధాలు తినడం వలనైతే నేమి అనేక సమస్యలు ఎదురై, అరుగుదల క్రమేపి తగ్గిపోతూ ఉంటుంది.

'అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని' అన్నట్లు ఇంట్లో అన్నీ వండి పెట్టి ఉన్నా మూడు పూటలా అయిదు వేళ్ళు నోట్లోకి పోనిచ్చుకుని కడుపు నిండా తినే అదృష్టం అందరికి కలగడం లేదు. అందులోను మన తెలుగు భోజనం పదార్ధాలు అన్నం తో చక్కగా చేతి తో  బాగా కలిసేలా కలుపుకుని వేళ్ళతో ముద్దలు చేసుకుని తింటే ఉండే రుచి, ఆ మధురానుభూతి వర్ణించు కుంటూ పొతే కావ్యాలే తయారవుతాయి. కలిసీ కలవకుండా మన అమృత హస్తం స్పర్శ  లేకుండా స్పూన్ లేక ఫోర్క్ తోనో నోట్లో పడేసుకుంటే రుచి ఏమి తెలుస్తుందండీ? అసలు మీకు తెలుసా దేముడు మన చేతి వేళ్ళల్లో అమృతం దాచేడని? అందుకనే అమ్మ చేతి ముద్దతోటే ‘అరడుగు’ పాపాయి ‘ఆరడుగుల బుల్లెట్’ అవడానికి పునాది వేస్తుంది. ఆహారం తీసుకునే విధానం గురించి సరి అయిన అవగాహన లేక జంక్ ఫుడ్ మీదే బ్రతకడం వలన తొందరగా అనేక అనారోగ్యాలు ఎదురై మనలో చాలామందికి మంచి మంచి పదార్ధాల రుచి పూర్తి గా ఆస్వాదించకముందే అవి నిషిద్దాలై మనకు దంత సిరి కరువై పోతోంది.

అంతేకాకుండా చాలామందికి కొన్ని కారణాల వల్ల సమయానికి తినటానికి ఆహారం దొరకదు. ఆహారం ఉన్నప్పుడు వారికి ఆకలి ఉండదు. ఒకొక్కసారి మన వారు కదా అని మనం  వారికి ఎంత తినిపించాలని చూసినా అది వారికి దక్కదు. కాని కొంతమంది చక్కగా సమయానికి రుచికరమైనవి అన్ని అందిపుచ్చుకుని తింటూ ఉంటారు. వారి  పంటి కింద ఎప్పుడు ఏదో నలుగు తూనే  ఉంటుంది.  అది వారికి చక్కగా జీర్ణ మై మళ్లీ తినడానికి సిద్దమవుతూ ఉంటారు . వారి మెటబాలిజం ఆరోగ్యవంతం గా ఉండి ఊబకాయం కూడా వారి దరి చేరదు. అదండీ దంత సిరి అంటే!

అయితే దంత సిరి కదా అని కనిపించినవన్నీ తినేసి దంతాలు శుభ్రం చేసుకోకపోతే మాత్రం మీ ‘పర్స్ సిరి’ మొత్తం  గల్లంతు అవుతుంది సుమండీ! ఏది తిన్నా త్రాగినా ముఖ్యంగా స్వీట్స్ తీసుకున్న తర్వాత పళ్ళను బాగా శుభ్ర పరుచుకోవాలి. లేకపోతె మాటమాటకి దంత వైద్యుల దగ్గరికి పరిగెత్తాలిసి వస్తుంది. పళ్ళకి వచ్చే అనారోగ్యాలు అనేక అనారోగ్యాలకు కూడా దారితీస్తాయి అని మీకు వేరే చెప్పనవసరం లేదు. అందుకని మంచి ఆరోగ్యపు అలవాట్లతో, తగిన శారీరక శ్రమ కల్పించుకుని, మీ దంత సిరిని పెంచుకుంటూ, మీ దంతాలను కూడా కాపాడుకోండి.

ఎలాగు దంతసిరి గురించి ఇంత ముచ్చటించు కున్నాం. మరి మన దంత సిరికి తియ్యటి నిదర్శనం గా ఒక చక్కటి తేపి పదార్ధం గురించి తెలుసుకుందామా?


గోధుమ హల్వా


తెల్లటి పిండి గోధుమలు తెచ్చుకుని, ఒక గ్లాసు గోధుమలు నీళ్ళు పోసి రెండు మూడు గంటలు నానబెట్టి, తీసి కడిగి, రెండు గ్లాసులు నీళ్ళు పోసి గ్రైండర్ లో మెత్తగా రుబ్బుకోవాలి.  అలా రుబ్బిన పిండిని ఒక శుబ్రమైన గుడ్డలో మూట కట్టి, గట్టిగా పిండి, గోధుమ పాలు గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో ఒక చిటికెడు మనకి కావాల్సిన మిటాయి రంగు కలుపుకో వచ్చు. ఇప్పుడు తగినంత పంచదార అంటే సుమారు అర గ్లాసుడు వేసి కలపాలి. దీన్ని సన్న సెగ పై పొయ్య మీద పెట్టి మెల్లగా కలుపుతూ వుండాలి. ఈ పాలు తొందరగా గట్టి పడతాయి. గట్టి పడుతున్న సమయంలో ఓ నాలుగు చంచాల నెయ్యి వేసి అడుగంట కుండా కలపాలి. కొద్దిగా ఏలక్కాయ పొడి కూడా వేస్తే సువాసన గా వుంటుంది.  బాగా గట్టి పడ్డాక దాన్ని ఒక వెడల్పాటి పళ్ళెంకి నెయ్య రాసి దానిలో పలుచగా పరిచి సర్దాలి. ఇప్పుడు రుచి కోసం పైన వేయించిన జీడి పప్పు, బాదం, కిస్మిస్స్ అద్ది ముక్కలు గా కోసుకోవాలి. ఇప్పుడు చక్కటి తీపి వంటకం తయారు.




No comments:

Post a Comment