ముందుమాట:
దోసావకాయ
.........అబ్బ! వింటుంటేనే నూరు వూరిపోతోంది కదా! దోసావకాయ ఆవకాయకి ఏమాత్రం
తీసిపోదు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు వారింట ఏ శుభకార్యం జరిగిన దోసావకాయ,
కందిపొడి ఉండాల్సిందే. ఎర్రగా, ఊటలూరుతూ, ఆవఘాటు
గుబాళిస్తూ వుండే దోసావకాయను పెద్ద పెద్ద గిన్నెల్లో
తెచ్చి పెడుతుంటారు శుభకార్యాలలో. ఎన్ని పదార్ధాలు వున్నా ఆవఘాటు ముక్కుకి సోకగానే తక్కిన పదార్ధాలు
తరువాత వేసుకోవచ్చులే! మొదట ముద్దలో నెయ్యి వేసుకుని కొంచెం దోసావకాయ రుచి చూద్దాం
అని విస్తరిలో మొదట అదే వడ్డించుకుంటాం. పెళ్లి భోజనాలను పోల్చి చెప్పేడప్పుడు,
వడ్డించిన దోసావకాయ ఘాటు ని గీటు రాయి గా పెట్టుకుని మార్కులు వెయ్యటం పరిపాటి.
మనసులను దోచే ఈ దోసావకాయ ను కాయ నుండి వూటలూరే పచ్చడి గా ఎలా మలుచుకోవాలో వివరిస్తున్నారు
శ్రీమతి రత్న
రమణ బంధకవి
సంపాదకుడు
‘దోసావకాయ’
శ్రీమతి రత్నా
శ్రీనివాస్
నా చిన్నప్పుడు నాగుల చవితికి మా ఇంటిల్లి పాది పగలంతా ఉపవాసం
వుండే వాళ్ళం. రాత్రి పలహారానికి మా అమ్మగారు
పెద్ద ఇత్తడి గిన్నెతో ఉప్పిడి
పిండి చేసి దానితో పాటు
దోసావకాయ,వెన్న ముద్ద వడ్డించేవారు .ఉప్పిడి పిండిని దోసావకాయలో అద్దుకుని కొంచెం
వెన్న నాలికకి రాసుకుని తింటున్నప్పుడు దోసకాయ ముక్కలు పంటి కిందకు వచ్చి
కోరుకున్నప్పుడు వచ్చే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేము.నిజానికి అప్పుడు నాకు
పట్టుమని పదేళ్ళు కూడ లేవు. ఆ నాటి మా అమ్మగారి చేతి దోసావకాయే ఈ నాడు నా చేత
రెసిపీ రాయిన్చేలా చేసిందని నమ్ముతాను.
మరి మీరు కూడా ఆ అనుభూతికి లోనవుదామనుకుంటున్నారా?మరి
ఆలస్యం దేనికి?రంగంలోకి ఉపక్రమిద్దాము.
తయారుచేయటానికి పట్టేసమయం 20
నిమిషాలు
కావలసిన
పదార్దములు
దోసకాయ
1
ఉప్పు,కారం,ఆవపిండి అన్నీ
తలా ఒక కప్పు
నూనె
200 ml
తయారు చేయు విధానం :
చిన్నగా,గుండ్రంగా,గట్టిగా
వున్న దోసకాయను చూసి ఎంచుకోండి. కాయను
శుబ్రంగా కడిగి గుడ్డతో తుడిచి పెట్టుకోవాలి. చెక్కు తీయనక్కర్లేదు.గింజలు పూర్తిగా తీసేసి
ముక్కలు సన్నగా తరుక్కోవాలి.ముందుగా ముక్కలు పైన నూనె పోసి,అన్ని తడిసేలాగా
కలుపుకోవాలి. నువ్వుల నూనె ఐతే కమ్మగా ఉంటుంది.
ఒక గిన్నెలో కానీ,వెడల్పాటి పళ్ళెంలో కానీ ఆవ పిండి ,ఉప్పు,కారం సమానంగా
కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలను పిండి లో వేసి పిండి కలిసే లాగ సమానంగా
కలుపుకోవాలి. అరగంట పాటు మూత పెట్టి ఊరనివ్వాలి. ముక్కల్లో ఉప్పు వేయటం వలన
దోసకాయలోంచి కూడా ఊట వూరి, పిండి నూనె తో
కలిసి పైకి ఊట లాగ తేరుతుంది. ఇంక మీరు అన్నంలో నెయ్యి/ అవకాశం వుంటే వెన్న వేసి
కలుపుకోవటమే ఆలస్యం.
ఇది అన్నం లోకే
కాకుండా ఇడ్లి, దోశ, ఉప్పిడి పిండిలో కూడా రుచిగా ఉంటుంది.
కారం ఎక్కువ
తినని వారు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు.
No comments:
Post a Comment