Monday, December 22, 2014

రోజు వారీ కూరలతో వైవిధ్యం: కారట్ ఉల్లి మసాల కూర


శ్రీమతి రత్నాశ్రీనివాస్ 

క్యారెట్ ఒంటికి, కంటికి ఎంత మంచిదో మీకు తెలియంది కాదు. క్యారెట్ తో మనం సాధారణంగా తురుము కూర, కొబ్బరి వేసిన కమ్మటి కూర లేదా ఇతర కాయగూరలతో కలిపి చేసుకుంటాం. క్యారెట్ తో మనం ఉల్లి మసాల కూర కూడా చేసుకొనవచ్చును. రోజు వారీ కూరలతో వైవిధ్యముగా చేయటమే మా తెలుగుభోజనం ప్రత్యేకత. మరి దీని తయారీ తెలుసుకుందామా!
కావలసిన వస్తువులు:

క్యారెట్ : పావు కిలో
ఉల్లిపాయలు: 2 పెద్దవి
జీలకర్ర: ½ టీ స్పూన్
ఉప్పు: తగినంత
నూనె: 2 టేబుల్ స్పూన్స్
ఎండు మిర్చి : 1 (రెండు గా తుంపి వేసుకోవాలి)
మినప పప్పు: ½ టీ స్పూన్
కరివేపాకు : 4 -5 రెబ్బలు


తయారు చేయు విధానం:

క్యారెట్ని శుబ్రంగా కడిగి చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. క్యారెట్ ముక్కలను ఒక ప్రెషర్ పాన్ లోకి తీసుకుని తగినంత నీరు పోసి స్టవ్ పైన పెట్టుకోవాలి. మొదట విజిల్ రాగానే మంట తగ్గించి ఐదు నిమిషాలు ఉంచాలి. రెండవ విజిల్ రాగానే స్టవ్ ఆపుకోవాలి.

మైక్రోవేవ్ విధానం: 
ముక్కలను మైక్రోవేవ్ విధానం లో ఉడికించ దలచుకున్నట్లయితే ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని అందులో ముక్కలను, కొద్దిగా నీరు పోసి మూత పెట్టి, పది నిమిషాలు హై పవర్ లో మైక్రోవేవ్ చేయాలి. మీరు ఐదు నిమిషాలకి ఒక సారి ఆపి ముక్కలు వుడికేయో లేదో చూసుకుని మరల ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకోవచ్చు. నీరు పోయటం వలన మైక్రోవేవ్ చేసినపుడు ముక్కలు ఎండిపోయినట్లుగా కనిపించవు. 

ఉల్లి మసాల తయారు చేయు విధానం:

ఈ లోగా ఉల్లిపాయలను చెక్కు తీసి కడుక్కుని నాలుగు, ఐదు ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. దానికి కొంత ఉప్పు, జీలకర్ర జేర్చి ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఒక బాణలి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, నూనె కాగేక ఉల్లిముద్ద ను వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిలో వుండే నీరంతా ఇంకిపోవాలి. ఇపుడు కారం వేసుకుని మరల వేయించుకోవాలి. ఉల్లి పచ్చి వాసన అంతా పోయి, ఉల్లి ముద్ద కొంచెం గట్టి పడేంత వరకు వేయించుకోవాలి.

ఈ పాటికి ప్రెషర్ రిలీజ్ ఐయి వుంటుంది. పాన్ మూత తీసి ముక్కలు వుడికేయో లేదో చూసుకుందాము. ముక్కలు ఉడకటానికి మనం నీరు పోసేము కదా! ఆ నీరును పారబోయకండి. దానిని చారు, పులుసు తయారీలో కాని లేదా సూప్స్ తయారీలో కాని వాడుకోవచ్చు.

ఒక బాండీ(లేదా నాన్ స్టిక్ పాన్) తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, కాగేక మినప పప్పు వేసుకుని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి, చిటపట లాడేక ఎండు మిర్చివేసి వేగేక, కరివేపాకు వేసుకోవాలి.


పోపు వేగి పోయింది కాబట్టి, ఉడికన క్యారెట్ ముక్కలను వేసుకుని పోపు అంటుకునే లాగా కలుపుకుని, ఉల్లిమసాల ముద్దను, తగినంత ఉప్పును, పసుపు వేసి చక్కగా కలియబెట్టాలి. ఇపుడు మూత పెట్టి, మంటను తగ్గించి ఒక ఐదు నిమిషాల పాటు వుంచుకోవాలి. ఇలా చేయటం వలన క్యారెట్ ముక్కలు వుల్లి మసాలాను బాగా పీల్చుకుంటాయి.

ఇపుడు కూర పరిస్థితి ఏమిటో మూత తీసుకుని చూసుకుంటే, ముక్కలు ఉల్లిమసాలాను పీల్చుకుని, ఘాటైన వాసన వస్తూ వుంటుంది.


వడ్డించుటకు సలహాలు మరియు ఇతరత్రా: 

క్యారెట్ ఉల్లిమసాల కూర వేడి అన్నం లోను, చపాతీ, పరాటాలతో కూడా తినవచ్చును.
క్యారెట్ కాయగూర సహజంగానే తీయదనం కలిగి వుంటుంది. ఉల్లి మసాలా వేయటం వలన కూర కొంచెం కారంగాను, కొంచెం తియ్యగాను వుండి, ఎపుడు వండే పోపు కూర కన్నా వైవిధ్యం గా వుంటుంది.
పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.









No comments:

Post a Comment