Saturday, December 20, 2014

కామాక్షి వంటింటి కబుర్లు: ‘చేమ దుంపోపాఖ్యనం!’





ముందుమాట:
అన్నట్లు చెప్పటం మరిచా! మొన్న రైతు బజారు లో కూరలు కొంటున్నప్పుడు “అబ్బీ ! చేమదుంపలు కిలో ఎంతకిస్తున్నావు?” అన్న సుపరిచితమైన గొంతు వినేసరికి పక్కకి తిరిగి చూసాను. ఎవరో కాదండి మన అందరికి బాగా తెలిసిన మన కామాక్షి!  కుశల ప్రశ్నలు అయ్యాక “చేమ దుంపల కొన్నారు, వేపుడు ప్రస్తావన ఏమైనా ఉందా?” అని కొంచెం కుతూహలం తో అడిగాను. దానికి మన కామాక్షి ఉత్కంట భరితమైన ప్రహసనం చెప్పింది. మరి మన పాఠకులకు కూడా అందిస్తే బావుంటుందన్న ఉద్దేశ్యంతో మీ ముందుకు తెస్తున్నాము. విశ్వనాధానికి- అదేనండి మన కామాక్షి పతి దేవులు; వారు చేమదుంపల  వేపుడు అంటే చెవి కోసుకుంటారుట. మరి చూద్దాం!

రమణ బంధకవి

సంపాదకుడు




‘చామదుంపలు  - శ్రీ వారు’

శ్రీమతి రత్నాశ్రీనివాస్

         
"కాస్త ఈ రోజైన వచ్చే సరికి కొంచెం చామ దుంపల వేపుడు వర్రగా, వేడి వేడి గా చేసి పెట్టు. మొన్న అనంగా తెచ్చి పడేసాను. ఇదిగోచేస్తాను, అదిగో చేస్తాను అనటమే గాని దానికి మోక్షమే లేదు” అన్నాడు విశ్వనాథం ఆఫీసు కి వెళ్ళటానికి సిద్దమవుతూ. 

"ఎందుకు చేయను? రాత్రి పూట చేస్తే అరగదని, శని,ఆదివారాలైతే ఇంట్లోనే వుంటారు కదా, పగలు చేయచ్చని ఊరుకున్నాను. అంతేకాని బద్దకించి కాదు”,  కొంచెం వుడుకుమోత్తనంగా అంది కామాక్షి. 

"ఆ! అప్పటి దాక ఆగితే మొక్కలు కూడా మొలుస్తాయి వాటికి. ఏదో చేసి పడేస్తే పనైపోతుందని!  సరిగ్గా వుడకనీకుండా  రాళ్ళల్లా చేస్తేఅరగవు కాని  మనసు పెట్టి చేసి మెత్తగా ఉడికిస్తే   సుబ్బరంగా అరుగుతాయి ఏ పూట చేసిన!" కొంచెం నిష్టూరంగా అంటూ కారుతాళాలు  తీసుకుని భయ్యి మంటూ వెళ్ళిపోయాడు విశ్వనాధం. 

ఎటు వాళ్ళు అటు వెళ్ళాక కామాక్షి ఇల్లు సర్దుకుని, బట్టలు పని చూసుకుని, స్నానం చేసి, పూజ చేసుకుని అపుడు టిఫిన్ తింటుంది.తనకి వంట చెసుకొదు. రాత్రి చేసినవే సాధారణంగా మిగులుతాయి.అవే భోజనం వేళలో వేడి చేసుకుని తింటుంది. పిల్లాడు పట్టాభికిమాత్రం బాక్స్ లోకి వాడు ఏది అడిగితెఅది చేసి పెడుతుంది. విశ్వనాథం టిఫిన్ మాత్రం తిని వెళతాడు. మధ్యాహ్నానికి అక్కడే కాంటీన్లో తింటాడు. ఇక ఇంట్లో భోజనం రాత్రికే. అందుకే ఆ  ఒక్క పూట తనకి కావలసిన విధంగా వంట చేయమంటాడు విశ్వనాధం. 


అసలు విషయానికి వస్తే, కామాక్షికి వేపుడు చేయటం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆ ముందురోజే   ఇంత  నూనె పోసి  బంగాళ   దుంపవేపుడు, అంతకు ముందు రోజు అరటికాయ వేపుడు చెసిన్ది. ఈ పూట చేమ దుంపల వేపుడు చేయాలిట! ఇంట్లో వేపుళ్ళు! కాంటీన్లో పకోడీలు,  పచ్చి మిరపకాయ  బజ్జీలు! అక్కడ ఆపేదెవరు? ఇలా రోజు వేపుళ్ళు చేసుకుపోతే ఆరోగ్యం  ఏమి గాను? కొంచెం ఒంటి మీద శ్రద్ద ఉండక్కర్లేదు? ఇవాళ ఏమైనా గాని నేను మాత్రం ససేమిరా వేపుడు చేయను. కొంచెం గట్టిగానే నిశ్చయించుకుంది కామాక్షి...  (సశేషం) 









No comments:

Post a Comment