Thursday, December 25, 2014

తల్లి – ఉల్లి ; ఉల్లి తల్లి మహత్యం!

ముందుమాట:

ఈ పోలిక చూసారూ ! ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు ట! విడ్డూరం కాకపోతే!
అవును ఏమోయి! దొండకాయ వేపుడు లో రెండు ఉల్లిపాయలు తరిగి వేసావా? మొన్న తోటకూర పులుసులో ఉల్లిపాయ వెయ్యని లోటు కొట్టచ్చినట్లు కనబడింది. ఆదివారం శేఖర్ వాళ్ళింట్లో పకోడీలు పెట్టారు. కానీ ఉల్లిముక్కలు వెయ్యటం మరిచారు. చెప్పొద్దూ! ఏమిటో చాలా వెలితి గా అనిపించింది. నీకు గుర్తు ఉండే ఉంటుంది; గత నెల మనం ముంబై వెళ్ళినప్పుడు లక్ష్మి వదిన కంది పచ్చడి చేసి నంచుకోవటానికి ఉల్లిపాయ పులుసు చెయ్యలేదు. ముద్ద దిగలేదు. ఏమిటో ఉల్లిపాయ లేకుండా వంటిళ్ళు ఎలా నడుపుతున్నారంటావు?
అన్నట్లు ఏమిటి చెపుతున్నాను - ఉల్లి – తల్లి గురించా? మధ్యలో నేనెందుకు? శ్రీమతి పద్మ గారు పాయకు పాయ విడదీసి ఉల్లి మహత్యం గురించి ఘాటు గా వివరిస్తున్నారు.

రమణ బంధకవి
సంపాదకుడు


“ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు!”

శ్రీమతి పద్మా రఘునాద్

"ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు!" అనే సామెత వాడుకలో ఉన్నట్లు అందరికి తెలిసినదే. అయితే ఉల్లి ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకుని మాత్రమే ఈ సామెత వచ్చి ఉండచ్చు కాని లోకం లో తల్లి తో పోల్చగలిగిన వస్తువ కానీ, ప్రాణి కాని ఆ తల్లే తప్ప మరొక్కటి ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

సరే, ఇంక ఉల్లిపాయ విషయానికొస్తే అది చాలా అక్కరకు వచ్చే కూరగాయ అన్నమాట పూర్తిగా నిజం. ఎందుకంటే ఉల్లిని రకరకాలుగా వండుకోవచ్చును. ఏమి వండినా దానికి అద్భుతమైన రుచి ఉంటుంది. ఉల్లిపాయతో కూరలు, పులుసులు, పచ్చళ్ళు, బజ్జీలు, పకోడీలు, వడలు మొదలగు చిరుతిళ్ళు, ఆఖరుకి చపాతీ పిండి లో కలిపి ఉల్లి పరాటాల వరకు కూడా చేసుకోవచ్చని అందరికి తెలిసినదే కదండీ!

అదేకాకుండగా దాన్ని ఏ కూరగాయతో కలిపి వండినా ఆ రుచిని రెట్టింపు చేసే గుణం కూడా ఉంది. మనకు లభ్యమయ్యే చాలా కూరగాయలతో బహు చక్కగా కలసి పోతుంది మరి. మాటకారి అయిన తెలివైన కోడలు, ఆ అత్తవారింటిలోని రకరకాల స్వభావాలున్న వ్యక్తులతో చక్కగా కలసిపోయినట్లుగా.

ఒక్కోసారి అకస్మాత్తుగా బంధువులోచ్చి కూరగాయలు సరిపోని పరిస్థితి లోఆపద్భాంధవి లాగా అక్కరకు వచ్చే కూరగాయ మన ఉల్లిపాయే. కూర తక్కువగా ఉన్న పక్షం లో ఉల్లిపాయ ముక్కలని కలిపి చేసుకుంటే కూర ఎక్కువగా అవటమే కాకుండా దాని రుచిని ద్విగుణీ కృతం చేస్తుంది కూడాను. అచ్చం సమాయస్పూర్తి గల కోడలు అవసరం వచ్చినపుడు ఇంటి గౌరవాన్ని ఇనుమడింపు చేసినట్లుగా అన్నమాట!

చాల తక్కువ ధరకే, అతి సులభంగా లభ్యమయ్యే ఉల్లి పాయ ప్రతీ గృహిణి తన వంటింట్లో ఎల్లప్పుడూ ఉంచుకునే కూరగాయ. మరి దీనితో ఎన్నివిధాలుగా వండుకోవచ్చో చూద్దామా?

బంగాళా దుంప, వంకాయ, కాకరకాయ, దొండకాయ, క్యాబేజి, కేరట్, కాలీఫ్లవర్ ఆఖరుకి బీరకాయ, దోసకాయల తో కూడా కలిపి వివిధ రకాల వేపుడు కూరలుగా చేసుకోవచ్చు. ఉల్లిపాయని గుజ్జు చేసి వేయించి కొంచెంజీలకర్ర, తగినంత ఉప్పు, కారం కలిపి మసాలా గ చేసుకుని వంకాయలోకాని, ఆలుగడ్డలతో కాని కలిపి చేసుకుంటే అవి ఉల్లి మసాలా ముద్ద కూరలు అయిపోతాయన్న మాట!

అలుగడ్డ తో కలిపి చేసిన ముద్దకూర మసాలా దోశకి మంచి గుర్టింపు నిచ్చేది కదండీ!ఇక పులుసుల విషయానికొస్తే తోటకూర, గోంగూర, పాలకూర ఇలా ఆకుకూరలకి మాంచి ఆటైన ఘాటు నిచ్చేది మన ఉల్లిపాయే!వంకాయ కాల్చి చేసే బండ పచ్చడి, పచ్చి పులుసు, సాంబారులకు అసలు సిసలు వన్నె తెచ్చేది కూడా ఉల్లిపాయే మరి!

చిరుతిళ్ళ మాటకి వస్తే నోరు ఊరే ఉల్లి పకోడీలు, ఉల్లి వడలు, బజ్జీలు, పునుకులు, ఒక్కటేమిటి, మిరపకాయ బజ్జిలలో నిమ్మరసంతో పాటుగానింపుకుని తింటే దాని మజా తినేవారికే తెలుస్తుంది కదండీ! కనుక ఉల్లిపాయని ఎన్నివిధాలుగా వంటల్లో వాడవచ్చో ఎవరికీ కూడా చెప్పతరం కాదు సుమండీ!

ఐవన్నీ కాకుండగా ఉల్లిపాయకి రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణం కూడా ఉందని, అంతే కాకుండగా ఉల్లిని తరిగే టపుడు, కంటిలోని మలినాలని శుభ్రం చేసి కళ్ళ నీరుగా బైటకి తెస్తుందని కొన్ని ఆరోగ్య సమాచార ప్రచురణల ద్వారా తెలుస్తూనే ఉంది.

ఇన్ని రకాలుగా మలచుకోబడి, ఏ కూరగాయకి తగినట్లుగా ఆ కూరగాయతో కలసిపోయి, వాటి రుచులను రెట్టింపు చేస్తూ, చిరుతిళ్ళన్నిటికి ప్రత్యేకతని, గుర్తింపుని తెస్తూ, పచ్చళ్ళకి చేదోడు వాదోడు గా ఉంటూ, పులుసుల్లో అంతర్లీనం అయ్యి, తన కమ్మదనపు రుచిని బైటకి తెస్తూ, తెప్పిస్తూ, ఇటు సలాడ్ లో వాడే ఉల్లి చక్రాలు గా పచ్చి రూపంలో కూడా నోటికి జిహ్వ లేచోచ్చేలాగా చేసే మన ఉల్లి పాయ అమ్మలోని కమ్మతనాన్నికూడా పుణికి పుచ్చుకున్నదని చెప్పటం లో ఎంత మాత్రం సందేహ పడక్కర్లేదు కూడాను.

మరి ఉల్లి చేసే మేలుని మళ్లీ మళ్లీ గుర్తుకు వచ్చేలాగా వీలయింతగా చెప్పుకున్నాం కదండీ! ఇక దానిని వండుకోవటమే తరువాయి!

No comments:

Post a Comment