Monday, August 25, 2014

‘శుభకరం, సౌభాగ్యకరం మన తెలుగింటి చలిమిడి’ - ప్రత్యేక వ్యాసం!



ముందు మాట: 

మన తెలిగింటి లోగిళ్ళలో చలిమిడి తెలియనవారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో! 

ఉద్యోగ రీత్యా పట్టణ వాసాలు పెరగటం వలన ఇటీవల కాలం లో మన ఇళ్ళలో కనబడే 

మిటాయిలలో చలిమిడి బహుశా కనబడటం లేదనే చెప్పవచ్చు. కానీ వివాహాది శుభకార్యాలు 

వచ్చినప్పుడు ‘చలిమిడి’ దర్శనం తప్పక అవుతుంది. పెళ్ళిళ్ళ కాలం లో మిటాయి అంగళ్ళలో 

చలిమిడి ఆర్డర్ల రద్దీ చూడవచ్చు. ఒక్క తీపి పదార్ధం గానే కాక, ఈ చలిమిడి ఎంతో ప్రాముఖ్యతను 

సంతరించుకుందని శ్రీమతి నయన కస్తూరి గారు విపులంగా వివరించిన ప్రత్యెక వ్యాసం 

చదువుదామా?


రమణ బంధకవి


సంపాదకుడు




శుభకరం, సౌభాగ్యకరం మన తెలుగింటి చలిమిడి



శ్రీమతి నయన కస్తూరి


ఎన్నో రకాల స్వీట్స్ ఉన్నా చలిమిడి కి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవాలి. హిందువుల ఇళ్ళల్లో ప్రతి పండుగ, ప్రతి వేడుక, చలిమిడి లేకుండా జరగదు. మొన్ననే  ముగిసిన శ్రావణ మాసపు నోములలో చలిమిడి అమ్మవారికి ప్రసాదం గాను, మంగళవారం నోములలో దీపాలుగాను, చలిమిడిని ఉపయోగిస్తారు.

ప్రతి పూజలోను దేవుడికి అవసర నివేదనకి పానకం, వడపప్పుతో పాటు చలిమిడిని వినియోగిస్తారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. చలిమిడి లో పచ్చి చలిమిడి, పాకం పెట్టిన చలిమిడి అని రెండు రకాలు వుంటాయి. పచ్చి చలిమిడి కైనా పాకం పెట్టిన చలిమిడి కైనా బియ్యాన్ని  కడిగి, ఆరేసి, పిండి పట్టించిన బియ్యం పిండిని వాడతారు. బియ్యం పిండిలో సరి పడా బెల్లం పొడిని వేసి, కొంచెం పాలు వేసి తడిపి కలిపేయడమే! ఇదే పచ్చి చలిమిడి.

కార్తిక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి, కార్తిక పౌర్ణమి పండగలలో, తప్పనిసరిగా వాడవలిసిన నివేదన చలిమిడి. హిందూ వివాహాల్లో పెళ్లి కూతురిని మధుపర్కాలను ధరింపచేసి పెద్ద ముత్తైదువులు జ్యోతులు, తలంబ్రాలతో తీసుకుని వస్తున్నప్పుడు, ఆ జ్యోతులు పచ్చి చలిమిడితో చేసినవే. ఇలా దేవుడికి ఎంతో ప్రీతికరమైన చలిమిడిని దైవ కార్యాలకు వినియోగిస్తే అందరు పిల్లాపాపలతో చల్లగా వుంటారు.

ఇక పాకం పెట్టిన   చలిమిడిలో కూడా రెండు రకాలు వుంటాయి. బెల్లంతో చేసిన చలిమిడి, పంచదారతో చేసిన చలిమిడి. రెంటి రుచి అమోఘమే! బియ్యం కడిగి ఆరబెట్టి పిండి పట్టించుకోవాలి. ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ బెల్లం పొడి కానీ ఒక గ్లాస్ పంచదార కానీ తీసుకోవాలి. బెల్లం లేక పంచదార ఒక దళసరి గిన్నెలో వేసి ఒకటికి ఒకటి నీరు కలిపి పాకం పట్టుకోవాలి. పాకం అడుగంటకుండా కలుపుతూ వుండాలి. తీగ పాకం  వచ్చేదాకా ఉడికించాలి. తీగ పాకం రాగానే బియ్యం పిండిని ఉండ కట్టకుండా కలుపుతూ పాకంలో వేయాలి. మధ్య మధ్య లో తగినంతగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. పాకం దగ్గర పడి గిన్నెకు అంటకుండా వదిలేస్తున్నప్పుడు స్టవ్ ఆపేయాలి. ఎండు కొబ్బరిని సన్న ముక్కలుగా చేసుకుని నెయ్యిలో దోరగా వేయించుకుని, చలిమిడిలో కలపాలి. పాకం చల్లారేటప్పటికి చేతికి అంటకుండా ముద్దలాగా సరి అయిన పదును వస్తుంది. కొంతమంది గసగసాలు కూడా కొబ్బరి ముక్కలతో పాటు పాకం లో కలుపుతారు.

మరి ఏ ఇతర స్వీట్ కి లేని ఒక బిరుదు ఈ ఒక్క చలిమిడి కి మాత్రమే  వుంది. అది ఏమిటో తెలుసా మీకు కడుపు చలువకు చలిమిడి’.  ప్రతి స్త్రీ, పుట్టింటి నుండి అత్తగారు, భర్త దగ్గరకు వెళ్ళేటప్పుడల్లా పసుపు కుంకుమల తో పాటు చలిమిడి ని తప్పక తనతో పాటు ఎంతో అపురూపంగా తీసుకుని వెళ్తుంది. తల్లి, కూతురు అత్తవారింటికి వెళ్తున్నప్పుడు కూతురు ఒడిలో  చలిమిడి పెట్టి, ‘పది కాలాల పాటు పిల్లా పాపలతో నీ కడుపు చల్లగా ఉండమ్మా! అని దీవిస్తుంది.


ఇంత  విశిష్టత కలిగిన చలిమిడిని ఇంట్లో సులభంగా తక్కువ ఖర్చుతో ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. అదే బయట స్వీట్ షాప్ లో కొనాలంటే ముందుగా ఆర్డర్ ఇవ్వాలి. తప్పని సరిగా మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఒక కిలో  తీసుకోవాలి.   కాబట్టి, మరి చలిమిడి చేయడం నేర్చుకుంటే మనకు, అమ్మాయిలను అత్తవారింటికి పంపేటప్పుడూ, ప్రతి పండుగకు పూజకు ఉపయోగించడమే కాకుండా; చలిమిడితో ఎంతో కమ్మనైన పాకుండలు, అరిసెలు’ కూడా తయారు చేసుకోవచ్చు! అవి ఎలా చేయాలో అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అది కూడా చెప్తానుగా !  చూస్తూ వుండండి తెలుగు భోజనం”.  




1 comment:

  1. చలిమిడి గురించి చాల చక్కగా చెప్పేరు నయన గారు.చలిమిడి పెట్టె సందర్భం ఇంకొకటి కూడా వుంది.కడుపుతున్నప్పుడు మూడవ నెలలో తల్లి కూతురికి "దొంగ చలిమిడి" అని కూడా పెడుతుంది.కొత్త చీర పెట్టి,దాన్ని కట్టుకోమని ఆ చీర చెంగులో తల్లి చలిమిడి పెట్టి పిల్ల,పాపలతో వర్ధిల్లు అని ఇస్తుంది.అన్ని మంచి విషయాలు అందజేస్తున్నతెలుగు భోజనం నిజంగా అభినందనీయం
    లక్ష్మి

    ReplyDelete