Saturday, August 2, 2014

వాణి వంటింటి విచిత్రాలు : ఆపద్ధర్మం టిఫిన్లు – ‘ఉల్లి-పుదినా పరోటా’ - వారాంతపు ప్రత్యక వ్యాసం!



             
ఆపద్ధర్మం టిఫిన్లు 

అబ్బ రోజూ ఈ టిఫిన్లే నా! అనే చిరాకు తో కూడిన విసుర్లు ఇల్లాళ్ళకి వినబడడం కద్దే!  పాపం ఏం చేస్తారు? ఇడ్లి, దోసె, ఉప్మా, పూరీ... అప్పుడప్పుడు తినడానికే కాదు చెయ్యడానికి కూడా విసుగు రావొచ్చు. ఏదైనా కొత్తగా, చేయాలనిపించ వచ్చు. అందుకే మీకోసం తీసుకువస్తున్నాం ఒక కొత్త శీర్షిక – ‘వాణీ వంటింటి విచిత్రాలు’. ఈ శీర్షిక లో సులభమైన, వినూత్నమైన వంటల విశేషాలు పొందు పరచడం జరుగుతుంది. శ్రీమతి నయనా కస్తూరి ఇలాంటి ప్రయోగాలలో అందే వేసిన చెయ్యే కాక, వాటిని చక్కని తన రచనా శైలి లో వివరిస్తూ మీ ముందుకు తెస్తారు.  ఈ రోజు ఈ శీర్షిక కింద ఒక ఆపద్ధర్మం టిఫిన్ ;  ‘ఉల్లి- పుదినా పరోటా’ ని వివరిస్తున్నారు. మరి రేపు ఆదివారం కదా, చక్కగా, వేడిగా, ‘ఉ.పు.ప’ ని చేసుకుని తిని ఆనందించండి

రమణ

సంపాదకుడు

‘ఉల్లి-పుదినా పరోటా’
నయనా కస్తూరి, హైదరాబాద్

ఏవండీ! రాత్రికి ఏం టిఫిన్ చేయమంటారు? అడిగింది వాణి భర్త భాస్కరాన్ని. “ దయ చేసి ఉప్మా మాత్రం చేయకు. రెండు రోజుల నుండి ఎడాపెడా వాయిస్తున్నవు నీ ఉప్మాతో”  అన్నాడు భాస్కరం. “అవునమ్మా రోటి చెయి”, వంత  పాడాడు కొడుకు. “రోటి అయితే కూర కూడా చేయాలి. నాకిప్పుడు అంత  ఓపిక లేదు బాబు! అయినా ఇంట్లో ఒక్క కూరగాయ లేదు. రేప్పొద్దున్నే రైతు బజార్ కి వెళ్లి తెచ్చుకోవాలి” అంది వాణి, బద్ధకం గా టీవి లో తనకిష్టమైన సిరియల్ చూస్తూ. 

“ఏమిటమ్మా ! నువ్వెప్పుడూ ఇంతే!  పోనీ పరోటా చేయి సాస్ తో తింటాము” ఛాయస్ ఇచ్చ్హాడు  కొడుకు. “అవునురా ఉల్లి పాయలు, పుదినా తప్పితే ఏమి లేవు కూరలు. వాటి తో పరోటా చేస్తే మీ తాత గారికి ఇష్టం వుండదు. ఉల్లిపాయ ముక్కలు, పుదినా ఆకులు ఏరు కుంటూ కూర్చుంటారు” సమాధానం చెప్పింది వాణి.  “అయితే  అమ్మా ఒక ఐడియా!”  అంటూ అమ్మ చెవిలో ఎదో చెప్పాడు.  “సరే ఐతే పద నువ్వు నాకు హెల్ప్ చేయాలి”. లేచి చేయడానికి సిద్దం అయ్యారు తల్లి కొడుకులు. 

పుదీనా ఆకులు వలిచి, ఉల్లి పాయలు తొక్క తీసి కడిగి కొడుక్కి అందించింది. వాటికి నాలుగు  పచ్చి మిర్చి, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు జోడించి మిక్సి లో వేసి మెత్తగా రుబ్బేసి అమ్మకి అందించాడు . దాన్ని ఒక శుభ్రమైన గిన్నెలో వేసి  ఒక టేబల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, ‌ఆఫ్ స్పూన్ ఆమ్ చూర్ పౌడర్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి దాంట్లో గోధుమ పిండి వేసి, చపాతి పిండిని తయారు చేసింది వాణి.  పిండి కలర్ ఫుల్ గా ఉండటం వలన   ఉత్సాహంగా పరోటా ల్లాగా వత్తి, పెనం మీద రెండు వైపులా బాగా కాల్చి, సరిపడగా నూనె వేసి ఇంకొంచెం సేపు  కాల్చి ప్లేట్ లో పెట్టింది.

ముందుగా మామగారికి పెట్టింది. మంచి పుదినా, ఉల్లిపాయ రుచులతో నోట్లోకి ముక్కలు ఏవి అడ్డం పడకుండా, పచ్చిమిర్చి కారం, ఆమ్చూర్ పులుపు కలిసి పుల్ల పుల్లగా కారం కారంగా వుంది. నోట్లో  వేసుకుంటే  కరిగి పోతుండటం వలన  ఒక పరోటా  ఎక్కువే  తిన్నారు పెరుగుతో పాటు. ఒక్క పుదీనా యే  కాకుండా  ఉల్లిపాయ కూడా  కలవడం  వలన “పరోటా  వెరైటీ  గా  ఉందోయ్” అన్నాడు భాస్కరం వేడి వేడిగా పరోటాలు లాగిస్తూ. “ఒరేయ్! మరి దీనికి ఏం  పేరు  పెడదామురా?'వాణి అడిగింది కొడుకిని.   ఒక్క క్షణం ఆలోచించి ‘ఉ.పు.ప’  అమ్మా”  అన్నాడు.

“అదేం పేరు రా? తాతయ్య అడిగాడు మనుమడిని. “అంటే  తాతయ్యా!  ఉల్లి -పుదినా -పరోటా !'  అన్నాడు  పరోటాల  రుచిని  ఆనందంగా  ఆస్వాదిస్తూ.

మరి మీరు కూడా ‘ఉ.పు.ప’ ని చేసుకుని దాని రుచిని ఆస్వాదిస్తారు  కదూ? ఒక్క మాట! ఆమ్ చూర్ బదులుగా ఒక అరచెక్క నిమ్మ కాయ రసం కలుపుకోవచ్చు.  వాణి డిన్నర్ కి చేసింది కాని మనం బ్రెక్ ఫాస్ట్ కి చేసుకున్నా బాగుంటుంది. 

ఇంకా ఇలాంటి వెరైటి వంటకాలు తెలుసుకోవాలంటే క్లిక్ చేస్తూ వుండండి ‘తెలుగు భోజనం' బ్లాగు ని.

*****

3 comments:

  1. chala manchi idea ichcharu nayanagaru. inka ilanti vantakalani gurinchi teliyacheyandi. Thadumukokundaga chesukovali memu intlo aa kshanamlo unna vatitho.

    ReplyDelete
  2. Innovative and tasty paratha. I liked the sentence: "bhaskaram vedi vediga paratalu lagistu" The paratha was liked both by the grandson and grandfather alike. We lookforward to more such new innovations in cooking from the writer Nayana garu

    ReplyDelete
  3. వాణి వంటింటి విచిత్రాలు శీర్షిక చాలా బాగుంది. ఉ.పు.ప ఐడియా బాగుంది. కధానిక ద్వారా recipe ఇవ్వటం చాలా innovative గా ఉంది.

    ReplyDelete