విహారం లో భోజన వీరంగం:
విహార యాత్రలు వినోదానికి, ఆహ్లాదానికి మాత్రమే
కాదండోయి, అవి ఆహార యాత్రలు కూడా సుమా! కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అక్కడి
వింతలూ, వినోదాలే కాకుండా, అక్కడి వంటలు, టిఫిన్లు కూడా మనలను రంజింప చేస్తాయనడం
లో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. కొన్ని సార్లు మనం ఆ ప్రాంతంలోని విశేషాల కంటే అచ్చటి తిన్న తిళ్ళు మాత్రం గుర్తు
పెట్టుకోవడం కద్దు. కనుక ‘విహారం లో భోజన వీరంగం’ అనే ఈ శీర్షిక ద్వారా విహార
యాత్రల లో మనసుని రంజింప చేసిన భోజన విశేషాల గురించి సవివరం గా మీ ముందు ఉంచుతాము.
పాఠకులు ఎవరైనా ఇటువంటి చక్కటి విశేషాలు అందరితో పంచుకోదలిస్తే తెలుగులో చక్కగా
వ్రాసి మాకు ఈమెయిలు ద్వారా పంపగలరు.
రమణ
సంపాదకుడు
శ్రీ కృష్ణ భవన్
(అనే కాఫీ, టీ, అల్పాహార శాల, మడికేరి)
రమణ
పార్ట్ 1
పొద్దున్నే మనతో పాటే నిద్ర లేచే ఆత్మారాముడు మనం
ఇతర కాలకృత్యాలు తీర్చుకోవటం లో నిమగ్నమైనప్పుడు, అదను చూసి ఘోష పెట్టటం మొదలు పెడతాడు . అది మొదలు మనము
రెండు జతల ఇడ్లీలు(పచ్చడి, సాంబారు లేకపోతే
నస పెరుగుతుంది )లేక పొంగల్ వడ లేక మసాల దోస లేక పుంజీడు పూరీలు
విత్ ఆలు గడ్డలు ఉల్లిపాయల కూర లేక అధమ పక్షం ఉండలు లేకుండా,
జీడి బద్దలు తగులుతూ ఉండే సొగసైన ఉప్మా పెట్టేదాకా బుర్ర తినేస్తు
వుంటాడు.
యిక ఎప్పుడైనా మనోరంజనం కోసం విహార యాత్రలకు వెళ్ళితే, ఒక పక్క ప్రకృతి దృశ్యాలు కంట బడినా, ఆత్మారాముని నస
తో బుర్ర పాదరసం లా పని చేస్తూ 'శాంతి పూజలు' చేసుకోవటానికి వీలుగా, చక్కని అల్పాహార శాల (అదేనండి బాబు ఆంగ్లమున దానిని రెస్టారెంట్ అందురు) ఏదైనా
కనిపిస్తుందేమో అని వేట మొదలు పెడతాం. అలాంటి పరిస్థితే మొన్న
మేము కుటుంబ సమేతము గా కూర్గ్ వెళ్ళినప్పుడు జరిగింది.
బస చేసినది 'క్లబ్ మహీంద్రా' వారి చక్కటి వసతి గృహము లో ఐనా,
అది క్షుద్బాధ తీరటానికి అంతా గిట్టుబాటు గా అనిపించలేదు. అందుకే వాన్ వేసుకుని వేట కోసం వీధిన పడ్డాం. ఎడారి లో
తిరిగి తిరిగి దాహంతో నాలుక పిడచ కట్టుకునే సమయానికి ఒయసిస్ కనిపిస్తే ఎలా అనిపిస్తుందో,
తిండి వేటలో మడికేరి పట్టణం తిరగ మోత పెడుతున్న మాకు 'శ్రీ కృష్ణ భవన్' కనిపించగానే అలాగే అనిపించింది.
రోడ్ సైడ్ న ఉన్న చిన్న పెంకుటిల్లు, పాత రేకు
బోర్డు, లోపలి మూడు చెక్క బల్లలు. వాటి ముందు ఇరుకుగా కూర్చుని టిఫిన్స్ ఫై సామూహిక
దండ యాత్రలు చేస్తున్న పది మంది అన్నార్తులు, ఎడం పక్క సన్నని
నాప రాయి గట్టు పై మూడు నాలుగు స్టీలు పాత్రలలో నోరూరించే లాగా కన బడుతున్న మైసూరు
బజ్జీలు , ఉప్మా మరియు రవ్వ కేసరి ఇత్యాదులు. 'వాస్కో డ గామా' కాలికట్
తీరం చేరినప్పుడు పొందిన ఆనందం మొదట సెర్చ్ పార్టీ గా బయలు దేరిన మా
వెంకట్ రాముడికి నాకు కలిగింది. కాని
అక్కడ ఏర్పాట్లు చూసి కొంచెం నిరాశ చెందిన మాట వాస్తవం.
(సశేషం)
వంటా - వార్పూ - ఈ నాటి
వంటకం
ముల్లంగి సాంబారు
శ్రీమతి పద్మా రఘునాద్
ముల్లంగి చాల రుచి కరమైన మరియు చాల పోషక విలువలున్న కూరగాయ. దీనితో
రకరకాల పదార్ధాలు చేసుకున్నా, మరి సాంబారు లో
వేసుకుంటే సాంబారు రుచి ద్విగుణీ
కృతం
అవుతుంది. సాంబారులో ముల్లంగి వుడుకుతున్నపుడు వచ్చే ఘుమఘుమలు
కు ఏదీ సాటి రావు. మరి ఇక తెలుసుకుందామా ఈ రుచి కరమైన వంటని ఎలా
చేయాలో?
కావలసినవస్తువులు:
·
ముల్లంగి మీడియం సైజు లో తరిగిన ముక్కలు: 2 కప్పులు
·
టమాటో మీడియం సైజులో
తరిగిన ముక్కలు: 1
కప్పు
·
కంది పప్పు : 1 కప్పు; చింతపండు : పెద్ద సైజు నిమ్మకాయ పరిమాణం
·
పచ్చి మిరపకాయలు : 2 లేక 3 లేదా తగినన్ని
·
ఉప్పు : 2 టీ
స్పూనులు లేదా తగినంత ; నూనె : 1 టేబుల్ స్పూన్
లేదా పోపు కు సరి పడా.
పోపు వస్తువులు :
·
సాంబారు పొడి : 2 టీ స్పూనులు;
వేయించిన మెంతి పిండి :1 స్పూను
·
పంచదార: 1
స్పూను; మినప పప్పు : 1 టీ స్పూన్
·
ఆవాలు :1
టీ స్పూన్; జీల కర్ర : 1 టీ స్పూన్, పసుపు: 1 టీ
స్పూను
·
కరివేపాకు : రెండు రెబ్బలు; ఇంగువ : సువాసన కొరకు;
·
ఎండు మిరపకాయలు : 5
తయారుచేయువిధానం:
·
ముల్లంగిని చెక్కు తీసి శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కలు గా
తరిగి
పెట్టుకోండి. ఇంకో పళ్ళెంలో
టమాటోలను, పచ్చి మిర్చిని బాగా కడిగి తగిన సైజు ముక్కలుగ చేసుకుని వేరేగా
పెట్టుకోండి.
·
చింతపండును బాగా కడిగి ఒక కప్పు నీటిలో 15 నిమిషాలు నాన పెట్టి
వుంచండి. తొందరగా కావాలంటే మైక్రో వేవ్ లో కూడా పెట్టుకుని పులుసు తీసుకోవచ్చును.
చింత పండు పులుసు తీసి రెడీగా ఉంచుకోండి. కందిపప్పును బాగా కడిగి తగినంత నీరు పోసి
కుక్కర్ లో మెత్తగా ఉడకపెట్టండి.
·
ఒక మీడియం సైజు గిన్నెలో 3 కప్పుల నీరు పోసి అందులో ముల్లంగి ముక్కలు వేసి
సుమారు 10 నిముషాలు, మెత్తపడే దాకా ఉడికించండి.
·
అందులో టమాటో ముక్కలను కూడా వేసి మూత పెట్టి మీడియం సెగ లో
పెట్టి ఉడికించండి. ముక్కలు అన్ని బాగా ఉడికాక, ఉప్పును కూడా వేసి బాగా కలిపి సన్నసెగన ఉంచండి
.
·
పప్పు ఉడికాక కుక్కర్ లోంచి తీసి మెత్తగా ఎనపండి. ఆ మెత్తటి
పప్పును తీసి ఉడుకుతున్న ముక్కలలో వేసి బాగా కలపండి. ఇపుడు చింత పండు పులుసును కూడా వేసి సన్న సెగ మీద
మరిగించండి. పచ్చి మిర్చి ముక్కలను, మెంతి
పిండి, పంచదారలను కూడా వేయండి. ముల్లంగి సాంబారు ఘుమఘుమ లాడుతూ
ఉడుకుతుంటుంది.
·
పోపు గరిటె లో కొంచెం నూనె వేసి , ఎండు మిర్చి ముక్కలు గా చేసి
మినప పప్పు, ఆవాలు, జీల కర్ర
వేసి దోరగా వేయించండి. కొద్దిగా ఇంగువ కూడా వేసి స్టవ్ మీంచి తీసి వేయండి. వేడి
పోపు నూనె లో కరివేపాకు ఆకులు, సాంబారు పొడిని కూడా వేసి కలపండి.
·
ఈ ఘుమఘుమ లాడే పోపు మిశ్రమాన్ని స్టవ్ మీద నున్న సాంబారు లో
వేసి బాగా కలపండి. రుచి చూసి ఉప్పు సరిపడా ఉందొ లేదో చూసుకోండి. స్టవ్ మీంచి తీసి
ఒక సర్వింగ్ డిష్ లో పెట్టుకోండి .
·
ఘుమఘుమ లాడే ముల్లంగి సాంబారు రెడి.
వడ్డించుటకు సలహాలు:
·
వేడి వేడి అన్నం లోకి, వేడి వేడి ముల్లంగి సాంబారు చాల బాగుంటుంది. ఇడ్లీ,
దోశ, గారెలతో నంచుకోటానికి కూడా చాల రుచికరంగా
ఉంటుంది.
పైన చెప్పిన విధము గా సాంబారును రకరకాల కూర గాయాలతో కూడా చేసుకోవచ్చును.
ముల్లంగి కి బదులుగా బెండకాయ
ముక్కలతో బెండకాయ సాంబారు; ములక్కాడ
ముక్కలు,
సెల్లరి కాడలతో ములక్కాడ సాంబారు; చిన్నచిన్న ఉల్లి గడ్డలతో
ఉల్లిపాయ సాంబారు;
సొరకాయ, బెండకాయ, ములక్కాడ,
ఉల్లిపాయ, టమాటో అన్నిటితో కలిపి కలగలుపు
సాంబారు మొదలైనవి చేసుకుంటే చాల వెరైటీగా ఉంటుంది. మనకు, పిల్లలకు
కూడా బోర్
కొట్టకుండగా ఉంటుంది. ట్రై చేస్తారా మరి?
కామాక్షి కబుర్లు:
వెట్ గ్రైండర్ – గుమ్మడి వడియాలు
శ్రీమతి రత్నా శ్రీనివాస్, బెంగళూరు
పార్ట్ 1:
వేసవిలో విశ్వనాథం వాళ్ళ ఇంటికి వచ్చినపుడు అందరికీ ఏవైన బహుమతులు ఇవ్వటం
సూరీడమ్మ గారికి పరిపాటి. సాధారణంగా విశ్వనాధానికి బట్టలు, పట్టాభికి వాడు ఏదడిగితే అది
కొనిస్తారు. కామాక్షి మాత్రం వున్న చీరలే కట్టుకోవటం లేదని వద్దంటుంది. అందుకని
ఏదైనా ఇంటికి ఉపయోగపడే వస్తువు కొనిస్తుంటారు . ఈ
సారి కూడ ఏదైనా ఇంటికి ఉపయోగపడే వస్తువు కొనాలని అనుకున్నారు. చివరికి బాగా
ఆలోచించి వెట్ గ్రైండర్ కొందామని నిశ్చయించుకున్నారు. అదే విషయం కామాక్షితో
అన్నారు.
“ఎందుకత్తయ్యా వచ్చినపుడల్లా అన్ని
రకాల పచ్చళ్ళు, అడపా దడపా స్టీల్ సామాన్లు ఇస్తూనే వున్నారు;
ఇపుడు ప్రత్యేకించి వెట్ గ్రైండర్ కొనడం ఎందుకు? మిక్సీతో
పని గడిచిపోతోంది కదా!” అంది కామాక్షి.
“నీ మొహం! అవేమైనా బహుమతులుటే? పచ్చళ్ళు నా చేతిలో విద్య. అక్కడ గోంగూర,చింత కాయలు
పదికి, పరకకే దొరుకుతాయి. ఇక
స్టీల్ సామాన్ల వాడు రోజు రోజూ ఇంటి ముందు బుట్టతో తిష్ట వేసుకుని పాత జరీ చీరలు
ఇవ్వమని ప్రాణం తీస్తుంటాడు. వాడి మొహాన రెండు పాత చీరలు పడేస్తే నాలుగు తళ తళలాడే
పాత్రలు ఇస్తాడు. అలాకాదు గాని ఇది నలుగురు వచ్చి పోయే ఇల్లు. వెట్ గ్రైండర్
వుంటే ఒక సారి ఇడ్లీకి, దోస కి పప్పు పోస్తే, వారం రోజుల వరకు నీకు మరుసటి రోజుకి టిఫిన్ ఏమిటా అని దిగులుండదు.
మిక్సీకి మల్లె దగ్గరున్దక్కర్లెదు. పప్పు పోస్తే అరగంట వరకు దాని మొహం
చూడక్కర్లేదు. అదీగాక ఇపుడు మంచి ఎండాకాలం. కేజీ పప్పు నానబోసి గుమ్మడి వడియాలు
పెట్టావంటే నిక్షేపంగా నీకు పెద్ద స్టీలుడబ్బాడు
వడియాలు వస్తాయి. విశ్వానికి, ‘పట్టు’ గాడికి వడి యాలంటే ప్రాణం. ఈ సారి అక్కడ ఎండలు మొదలవ్వకుండానే ఇక్కడికి వచ్చేయడంతో వడియాలు తీసుకురాలేదాయే! మేము రాగానే అడిగాడు కూడా పిచ్చి నాయన, మామ్మా డాడీకి, నాకు వడీడాలు తేలేదా అని. ఇన్ని మాటలెందుకు ? సాయంత్రం విశ్వాన్ని ఆఫీసు నుండి తొందరగా రమ్మని చెప్పు. ఆరుగంటలకి ద్వాదశి ఘడియలు కూడా వెళ్లిపోయేక, వెళ్లి
వస్తువు తెచ్చుకుందాం” గట్టిగా గుక్క తిప్పుకోకుండా చెప్పి
ఒప్పించారు.
భోజనాలయ్యేక సూరిడమ్మ గారు ఒక
గంట నడుం వాలుస్తారు. మూడు గంటలు కాగానే లేచి తన సంచీలోంచి ప్రత్తి తీసుకుని
హాల్లోకి వచ్చి కూర్చుని ఒక గంట వత్తులు చేసి పెడతారు కామాక్షికి. యాభై వత్తులు
కాగానే కట్టగా కట్టి పెడతారు. అవే కార్తీక మాసంలో పౌర్ణమినాడు కామాక్షి
వెలిగిస్తుంటుంది. నాలుగు గంటలికి చేయటం ఆపెస్తారు. కామాక్షి కాఫీ ఇస్తున్ది. కాఫీ
తాగుతూ టీవిలో తీర్థ యాత్ర, దివ్య దర్శిని వగైరా
చూస్తుంటారు.
“విశ్వం బయలుదేరుతున్నాని ఫోనేమైన చేశాడే?” పనుల హడావిడిలో తొందరగా రావాలనే విషయం మరచిపోతాడేమోనని ఆవిడకు భయం. “పని కాగానే వస్తారు లెండి” అంది.
సాయంత్రం 5.30
అవుతుండగా విశ్వనాధం వచ్చాడు. వస్తూనే బయలుదేరుదామా అన్నాడు. “ఉండరా! ద్వాదశి ఘడియలు వెళ్ళనీ” అన్నారు.
సరిగ్గా 6.05 నిమిషాలకు లక్ష్మీ కాంతం గారు పంచాంగం చూసి ఇక పదండన్నారు.
(సశేషం)
No comments:
Post a Comment