Thursday, August 21, 2014

బామ్మ గారి కార్నర్: పెళ్లి విందులు – పదనిస రాగాలు



ముందు మాట :

మొన్నీ మధ్యన మా దగ్గరి చుట్టాలు దూర ప్రాంతపు పట్టణంలో పెళ్ళికి వెళ్లి వచ్చారు. పెళ్లి కబుర్లు 

తెలుసుకోవటానికి వారు వచ్చిన తరువాత ఫోన్ చేసాను. ఆమె నాకు చెల్లెలి వరుస అవుతుంది. 

ఫోన్ తీయగానే “ఏం చెప్పమంటావు అన్నయ్య! దారి పొడుగునా బాబి గాడిగి వాంతులు, 

విరోచనాలు; రాగానే హాస్పిటల్ లో జేర్చాము. ఇదిగో రెండు రోజులు సెలైన్ బాటిల్స్ పెట్టాక, 

ఇప్పుడే ఇంటికి తీసుకోచ్చాము” అంది నీరసంగా. “అయ్యో అలాగా! పోనీలే నీకు బావ కి బానే 

ఉంది కదా!” అని అడిగాను. “ఆ నా మొహం! నాకు అక్కడే పట్టుకున్నాయి. మాత్రలు మింగుతూ 

మేనేజ్ చేశాను. మీ బావకి మిర్చి బజ్జీలంటే ప్రాణమాయే! కాస్త ఎక్కువే తిన్నారు. అసిడిటీ తో 

కడుపు నొప్పి, పుల్ల త్రేపులు వస్తుంటే ఒక సీసాడు జేలూసిల్ తాగి ఎలాగో తగ్గించుకుని బయట 

పడ్డారు.  ఇక పాపం పెళ్ళికొడుకు తల్లి కడుపు నొప్పితో బాధ పడుతూ పీటల మీద కూర్చోవడానికే 

కష్టపడింది” అని చెప్పి వాపోయింది.


ఈ మాసం లో పెళ్లిల్లు పెద్ద పెట్టున జరుగుతాయి. విందుల మీద విందులు. వెళ్ళక పొతే 

బావుండదు. ఏర్పాట్లు అన్ని చోట్లా ఒక లాగ ఉండవు. విందు వైభోగాలతో పాటు మందుల 

భాగవతాలు కూడా కద్దు.  అందుకనే మన జాగ్రత్తలు మనం తీసుకుంటే మంచిది.


అన్నట్లు బామ్మగారు ఈ లాంటి నేపద్యం లోనే ఆ రోజుల పెళ్లిళ్ళు, విందు వినోదాలు 

గుర్తుతెచ్చుకుంటూ వాటిలో కాలం తెచ్చిన మార్పు గమనిస్తూ, ఈ విందు భోజనాల పదనిస 

రాగాల గురించి కొన్ని జాగ్రత్తలు చెపుతున్నారు.  మన కోసం ఒక వ్యాసం వ్రాసేరు. ఇక 

చదువుదామా?


రమణ బంధకవి


సంపాదకుడు






బామ్మ గారి కార్నర్:


పెళ్లి విందులు – పదనిస రాగాలు


ఆ రోజుల్లో పెళ్లిల్లు మూడు రోజులు జరిగేవి. బంధువులంతా మూడు రోజులు సుష్టు గా విందులు 

చేసి, వధూ వరులను చక్కగా దీవించి, వధువును వడుగంటి బియ్యం తో అత్తవారింటికి పంపేక, 

వారి వారి ఇళ్ళకు వెళ్ళేవారు. పెళ్ళింటి గృహస్తు, వచ్చిన బంధువులకు బట్టలు పెట్టి, పెళ్ళికి 

చేసిన అరిసెలు మిటాయిలు, మినప సున్ని, మిక్సెరు వగైరా ఇచ్చి పంపే వారు. బంధువులు 

ఇంటికి వెళ్ళిన పది రోజుల దాకా పెళ్లి కబుర్లు చెప్పుకునే వారు.


కాని ఈ రోజుల్లో చాల మార్పు వచ్చింది. పెళ్లి అర్థరాత్రి లగ్నం అయితే, ముందు రోజే వధూ 

వరులను కూర్చో బెట్టి రిసెప్షన్ ఇస్తున్నారు. ముహూర్తానికి పట్టుమని పదిమంది కూడా 

వుండటం లేదు. రిసెప్షన్ లోనే వధూవరులను దీవించి బహుమతులను ఇచ్చి, భోజనాలు చేసి 

వెళ్లి పోతున్నారు.


రాత్రి విందు భోజనం మాత్రం బ్రహ్మాండం గా గులాబ్ జాములు, రస మలై వగైరా స్వీట్స్, పెరుగు 

వడలు, మిర్చి బజ్జీలు, బిర్యానీ రాయతాలు వగైరా లెక్క పెట్టలేని వంటకాలు అందిస్తున్నారు. 

విందుకు వచ్చిన వారు అన్నీ కాస్త కాస్త తిన్నా, ఇంటికి వెళ్ళాక అప్పుడప్పుడు అవస్థలు పడి, 

డయేరియాల తో మందులు మింగటం చూస్తూనే ఉన్నాము.


ఇక చిన్న పిల్లలకు సెలైన్లు ఎక్కించ వలసి రావటం కూడా కద్దు. అందు చేత విందు భోజనాలు 

పెట్టేటప్పుడు, కాటరింగు వాడు, శుద్దమైన నీటిని ఇస్తున్నాడా లేదా, పదార్థాల తయారికి 

నాణ్యమైన వస్తువులు వాడుతున్నాడా లేదా, వండిన వాటి పై ఈగలు ముసరకుండా మూతలు 

పెడుతున్నడా లేదా అని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీళ్ళు చల్ల గా 

ఉండాలని ఐస్ గడ్డలు వేసేస్తారు. వాటిని ఎటువంటి నీళ్ళతో తయారు చేస్తున్నారో పేపర్ లో 

వార్తలు చదువుతున్నాము. కనుక ఈ రోజుల్లో వచ్చే చక్కటి మినరల్ వాటర్ సీసాలు పెట్టేస్తే సరి.


పూర్వం మూడు రోజుల పెళ్లి అయినా ఎదో వందలలోనో, వేలలోనో అయిపోయేది. ఇప్పుడు ఒక 

పూట పెళ్లి కే లక్షలు  ఖర్చు పెడుతున్నారు; మరి ఒక పూట విందు తిన్నందుకే  బంధువులు 

ఇళ్ళకి వెళ్లి నానా అవస్థలు పడటం వింటున్నాం. మరి మూడు రోజులు విందులు తిన్నా ఆ 

రోజుల్లో పెద్ద ఈతి బాధలు ఏమీ వచ్చేవి కావు. ఇళ్ళ కు వెళ్లి చాల రోజులు చక్కగా పెళ్లి విషయాలు 

ముచ్చటిన్చుకునే బదులు, పది రోజులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ చీకాకులు పడటం 

ఎవరికీ శ్రేయస్కరం కాదు మరి. అందుకనే పైన చెప్పిన కొన్ని జాగ్రత్తలు పెళ్లి విందు లప్పుడు 

పాటిస్తే అందరికి శ్రేయస్సు. అదే నూతన వధూ వరులకు గొప్ప ఆశీస్సు! 







1 comment:

  1. Bamma gari corner bagundi. entho nijamunndadi . ipudu pellillalku vellina vari paristhitulu alage vuntunnaayi kudanu.

    ReplyDelete