Friday, August 8, 2014

శనివారం-----ఫలహారం: 'దిబ్బరొట్టె’



“ అయ్యా సాయంత్రం ఎనిమిది కావస్తోంది మీ భోజనం అయ్యిందా?” అని పలకరించామనుకోండి, “ ఎబ్బే ఈ రోజు శనివారం కదా ఉపవాసం;  ఫలహారం చేసేసాము లెండి" అని అనడం కద్దు. అలాగని వారు ఏదైనా పండో ఫలమో తిన్నారని మీరు అనుకుంటే, టిఫిన్ లో కాలు వేసేనట్టే లెక్క! సాధారణం గా శనివారం, చపాతీలు లేక పూరీలు బంగాళాదుంప కూరతో, ఇడ్లి, దోసె, ఉప్మా లేక ఉప్పిడి పిండి లేదంటే కనీసం ఉతప్పం; ఫలహారం అనే కండువ పైన వేసుకుని దర్జాగా చలామణి ఐపోతాయి. ఒకానొకప్పుడు, అంటే మా చిన్నతనం లో అనుకోండి, ‘దిబ్బరొట్టె’ అనబడే మినప రొట్టె, ఇటువంటి శనివారం ఫలహారాలలో అగ్ర తాంబూలం పుచ్చుకునేది. గిన్నేలోనో, మూకుడు లోనో మంచి గా నూనె వేసి అడుగు ఎర్రగా అట్ట కట్టే  విధంగా కాలిస్తే, అ పై పెచ్చు కోసం ఇంట్లో పిల్లల మధ్య చిన్న పాటి అంతర్యుద్ధాలు జరగడం మీలో చాల మంది చూసి లేదా విని ఉంటారు. అటువంటి అద్భుతమైన, ‘ఘాట్టి’ ఫలహారం యొక్క గొప్పదనాన్ని మీ ముందుకు తెస్తున్నారు. శ్రీమతి నయనా కస్తూరి. రేపు శనివారం. చేసుకోవడానికి చక్కటి అవకాశం. ఇక చదివి ఆనందించి చక్కగా రంగం లోకి దిగండి.

రమణ



సంపాదకుడు

శనివారం-----ఫలహారం 

'దిబ్బరొట్టె’

శ్రీమతి నయనా కస్తూరి, హైదరాబాద్

ఇది వరకుటి  రోజుల్లో 'శనివారరాలు ఫలహారాలా మీ ఇంట్లో?' అని అడిగే వారు.ఇప్పుడైతే 
పిల్లలుపెద్దలు రాత్రుళ్ళు రోజూ  ఫలహారాలే ! అయితే 'ఏమిటా ఫలహారాలు, ఏమా కథ?' 'మంచూరియా,స్ప్రింగ్ రోల్స్,నూడల్స్,పిజ్జా,బర్గర్ ......... ఇంకా ఇలాంటివే నూట ఒకటి పదార్ధాలు చెప్పినా కూడా అందులో మన తెలుగు వారి సాంప్రదాయకమైన ఫల హారాల్లో ఒకటి కూడా కనిపించకపోవడం  కడు బాధాకరం. అన్నం బదులుగా తినే పదార్ధము అందులోనూ దైవం పేరు చెప్పి ఉపవాసం పాటిస్తున్నప్పుడు సాత్వికముగా , ఆరోగ్యం పెంపొందించే విధముగా బలవర్దకము గా వుండాలి కదండీ మరి?

అందుకే మన పూర్వికులు శనివారం నాడు తప్పనిసరిగా చాలా మంది ఇళ్ళల్లో ఫలహారాలు తినే వారు. వారానికి ఒక సారి అన్నం మానేసి కొంచెం పోషక వంతమైనది తింటే వంటికి మంచిది అని. అలా  వారు మంచివి అనుకునే ఫలహారాల్లో తరుచుగా చేసుకునేవి 'దిబ్బరొట్టె', మరియు 'ఉప్పిడి పిండి'. ఉప్పిడి పిండి గురించి మరొక సారి తీరికగా మాట్లాడుకుందాము. ముందుగా ఎన్నో పోషక విలువలున్న దిబ్బరోట్టి తయారి విధానం గుర్తు తెచ్చుకుందాము . 'గుర్తు తెచ్చు కుందాము' అని ఎందుకన్నానంటే ఇది అనాదిగా మన వాళ్లకు, మనలో కొంతమందికి, తెలిసినదే. కాకపొతే ఈ కాలం పిల్లల విదేశీ పోకడల అనుకరణ లో పడి ఇలాంటి ఎన్నో మంచి,మంచి కమ్మటి ఫలహారాలను మర్చిపొతున్నాము . 

చేసే విధానం:
ఒక గ్లాస్ మినపప్పు నాన బెట్టి రెండు గ్లాస్ లకు కొంచెం తక్కువగా సన్నటి బియ్యపు రవ్వను [ఇడ్లి రవ్వ కాదు సుమండీ !]విడిగా నాన బెట్టి ఉంచుకోవాలి . మినప పప్పు బాగా నానిన తర్వాత  మెత్తగా రుబ్బుకుని దాన్లో నాన బట్టిన రవ్వను శుభ్రం గా కడిగి కలిపి తగినంత ఉప్పు వెయాలి. అంతే! ఇంక ఏమి కలపక్కర్లేదు. ఈ పిండిని ఇడ్లి పిండి లాగా ఊర బెట్టక్కర్లేదు. అప్పటికి అప్పుడు రొట్టె చేసుకోవచ్చు. ఒక ఇనప మూకుడు [నాన్ స్టిక్ అక్కర్లేదు ] కాని ఇత్తడి గిన్నె కాని తీసుకుని, స్టవ్ మిద పెట్టి బాగా కాలాక నూనె [పప్పు నూనె అయితే శ్రేష్టం] వేసి, మూకుడు సైజ్ బట్టి రెండు మూడు గరిటల పిండి వేసి, ఇత్తడి గిన్నె అయితే మధ్యలో ఒక చిన్న కప్పుని కానీ గ్లాసుని కానీ గుచ్చి మూత పెట్టాలి (అలా చేస్తే మధ్య భాగం బాగా ఉడుకుతుందన్న మాట!). మన పెద్దలు అదృష్ట వంతులు కాబట్టి పైన ఒక నిప్పుల పళ్ళెం పెట్టేవారు. మనకది ఇప్పుడు చాలా కష్టతరం అనుకోండి. చిన్న సెగ మిద రొట్టి బంగారం రంగు వచ్చే దాకా కాల్చి, జాగ్రత్తగా నేర్పుగా రొట్టి చితక కుండా తిరగ వేయాలి. పైన నిప్పుల పళ్ళెం ఉందనుకోండి రెండు వైపులా ఒకే సారి చక్కగా కాలుతుంది.

దీనికి ప్రత్యేకత ఏమిటో తెలుసా మీకు? మన ఇతర ఫలహారాలు దోస, ఉప్మా, ఇడ్లి చల్లారితే నోట్లో పెట్టుకోగలమా? తోడుగా రెండు మూడు రకాల పచ్చళ్ళు, పొడులు , సాంబార్, నేతి  గిన్నె  అన్నీ ఉంటేనే వాటి రుచి! మరి మన దిబ్బ రొట్టె చల్లారితే ఇంకా బాగుంటుంది. పైగా దీనికి మంచి జతగాడు ఎవరో తెలుసా ? ఎప్పుడూ తెలుగు వారి ఇళ్ళల్లో జాడీల నిండుగా వుండే ఎర్రటి కమ్మటి ఆవకాయ. రెండూ కలిపి శనివారం నాడు ఫలహారం గా తింటే ఇక స్వర్గం చవి చూసినట్టే అంటే నమ్మండి. ఇంకో మంచి విషయం చెప్పమంటారా? ఈ దిబ్బ రొట్టిని అన్ని వయసుల వారు తిని చక్కగా అరిగించుకోవచ్చు. ఇటీవల పద్మ గారు చెప్పిన ముద్ద పప్పు ఆవకాయ సరసన మన శనివారం ఫలహారాలకే రాణి అయిన దిబ్బ రొట్టె - ఆవకాయను నిస్సంకోచము గా చేర్చవచ్చును. మరి ఇక దిబ్బరొట్టె ను వీలైనన్ని సార్లు చేసుకుని, తిని, చక్కగా ఆనందిద్దమా?  






               



   

 


No comments:

Post a Comment