ముందు
మాట!
సాధారణం గా మనం ఏ దేవతలనైనా ప్రసన్నం
చేసుకోవాలంటే, భక్తి శ్రద్ధలతో పూజించటమే కాక, ఆ దేవత కు ప్రీతి పాత్రమైన చక్కటి
నైవేద్యం కూడా సమర్పించుకుంటాము. ప్రసాదం లేకుండా పూజలు జరగవంటే నమ్మండి. మరి
ప్రసాదానికి ఉన్నప్రాముఖ్యత అది. అవి చేయటానికి శక్తి లోపం లేకుండా చక్కటి దినుసులను వాడి
రుచికరం గా సువాసనా భరితం గా చేసుకుంటాం. మరి శ్రీ గణనాధునికి ప్రియమైనవి ఏమిటో
మన అందరకు తెలిసినదే! అవే ఉండ్రాళ్ళు లేదా కుడుములు మరియు మోదకాలు. మరి వీటి తయారీ గురించి శ్రీమతి పద్మ గారు ఏం
చెప్తున్నారో చూద్దామా?
రమణ
బంధకవి
సంపాదకుడు
మోదక
హస్తా గణనాధా ! కుడుముల తండ్రీ గణనాధా!
శ్రీమతి
పద్మా రఘునాద్
భాద్ర
పద మాసం లో వచ్చే అతి ముఖ్య మైన పండుగ, పిల్లలు, పెద్దలు, ఆడవారు, మగ
వారు సంతోషంగా అందరూ కలసి జరుపుకునే అతి
ప్రియమైన పండుగ, మన వినాయక చవితి పండుగ. ఈ పర్వ దినాన
మనం అందరం ప్రీతి పాత్రంగా కొలుచుకునే దైవం మన గణ నాధుడు.
కేవలం తెలుగు వారికే కాకుండగా, హిందువులు అందరకు కూడా గణపతి ప్రధమ దైవం. మనం ఏ పని ప్రారంభించాలన్నా, ఏ శుభాకార్యానికైనా, ఏ పండుగ పూజలో నైనా, ఏ వ్రతాలు తలపెట్టినా, ముందుగా పూజించి ఆయన అనుగ్రహం సంపాదించిన తరువాతనే ఏ పని అయినా ప్రారంభిస్తాము. ఆయన ఆశీర్వాదముతోనే మనకి తలపెట్టిన పనులు సవ్యంగా అవుతాయి, విజయాలు లభిస్తాయి. విద్యార్ధులు కూడా తప్పక పుజించాల్సిన దైవం మన గణపతి.
పాలవెల్లిని రక రకాల కూరగాయలు, పండ్లు, మొక్క జొన్న పొత్తులతో
అలంకరించి, మట్టి వినాయక ప్రతిమను పెట్టుకుని, రక రకాల పత్రి తో పుజించుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం.
దేశ మంతట గణపతిని తొమ్మిది రోజులు శ్రద్ధ భక్తిలతో పూజించి పదవ రోజున శాస్త్రీయమైన
పధ్ధతిలో నిమజ్జనం జరపటం కూడా మన సాంప్రదాయం గా చెప్పబడుతోంది.
ఉండ్రాళ్ళు, మోదకాలు, అటుకులు, వడపప్పు, పానకం, చెరకు ముక్కలు, బెల్లం, చనివిడి మొదలైనవి నైవేద్యం గా
గణపతికి సమర్పిస్తారు. మరి ఈ
వినాయక చవితి పండుగ రోజు చేసే నైవేద్యాలలో అతి ముఖ్య మైన ప్రసాదం ఉండ్రాళ్ళు, మోదకాలు. మరి వీటిని తయారు చేసే విధానం
తెలుసుకుందామా?
ఉండ్రాళ్ళు:
వీటినే కుడుములు అని కూడా కొందరు పిలుస్తారు.
కావలసిన వస్తువులు:
బియ్యపు నూక: 1కప్పు
శనగపప్పు : పావు కప్పు
జీలకర్ర: ½ స్పూను, ఉప్పు: ½ స్పూన్ లేదా తగినంత.
తయారు చేయు విధానం:
బియ్యాన్ని మొదట మిక్సీ లో వేసి నూక లాగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఆ నూక లో ఒకటిన్నర కప్పులు
నీరు పోసి, కడిగిన శనగపప్పును, జీలకర్ర, ఉప్పు కూడా కలిపి కుక్కర్ లో
పెట్టాలి. మూడు లేదా నాలుగు విజిల్సు వచ్చాక ఆపుచేసి స్టీమ్ పోయాక బైటకు తీసి
వుడికిందో లేదో చూసి చల్లారాక ఉండ్రాయి పిండి మీద నేయి కూడా వేసి, బాగా కలిపి, చేతికి మధ్య మధ్య తడి చేసుకుంటూ
పిండిని చిన్న చిన్న ఉండలుగా గుండ్రంగా చేయాలి. ఒక వెడల్పు పళ్ళెం లో
ఒకదాని పక్కన ఒకటి పెడితే అంటుకోకుండగా ఉంటాయి. ఇప్పుడు ఉండ్రాళ్ళు తయార్!
చక్కగా ఉండ్రాళ్ళను గణపతికి
నైవేద్యం పెట్టుకుని ప్రసాదంగా తినవచ్చును. కొంచెం నేయి వేసుకున్నఉండ్రాళ్ళ లోకి
నంచుకోటానికి కారప్పొడి కాని, అల్లం
పచ్చడి కాని చాల బాగుంటుంది.
మోదకాలు:
కొబ్బరి,బెల్లం, బియ్యం పిండి తో చేసే ఈ
నైవేద్యం కూడా గణపతికి చాలా ప్రీతికరమైన నివేదన గా పెద్దలు చెప్తారు.
కావలసిన వస్తువులు:
బియ్యంపిండి : 1 కప్పు
కొబ్బరి తురుము : 1 కప్పు
బెల్లం :
100 గ్రాములు
నూనె :
1 టేబుల్
స్పూన్
నీరు :
½ కప్పు
తయారు చేసే విధానం:
ముందుగా కొబ్బరి కోరుని ఒక మూకుడు లో స్టవ్ మీద సిమ్ లో పెట్టి కలుపుతూ
బెల్లాన్ని తురుము చేసి అదికూడా కొబ్బరి కోరు తో కలిపి 10 నిమిషాలు లేదా అది గట్టి పడే
వరకు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
బెల్లం లోంచి పాకం వచ్చాక గట్టి పడి కొబ్బరి లౌజు గా తయారు అవుతుంది. అది చల్లారాక
చేతికి కొంచెం
నేయి కానీ నూనె కాని, నీళ్ళతో
కాని తడి చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేయాలి.
ఇంకో గిన్నె లో ఒకటిన్నర
గ్లాసు నీరు స్టవ్ మీద పెట్టి, అవి మరిగాక ఒక గ్లాసు బియ్యం పిండిని వేసి మంట
తగ్గించి బాగా కలుపుతూ ఉండాలి. దానిలో ఒక స్పూన్ నూనె కూడా వేసి కలపాలి. చాల
కొద్దిగా ఉప్పు వేసీ వేయనట్లుగా వేయాలి. లేక పోయినా పరవాలెదు. బియ్యపుపిండి
గట్టిగా ముద్దలాగా అయిపోతుంది.
స్టవ్ మీద నుండి దింపి వేసి చల్లారాక తర్వాత
బియ్యపు పిండి ముద్దను చిన్న చిన్న ఉండలు, కొబ్బరి
వుండలకన్నా కొంచెం పెద్దవి చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత
ఒక పిండి ఉండను తీసుకుని కొంచెం పలుచగా నొక్కి దానిలో కొబ్బరి ఉండను పెట్టి
అన్ని పక్కల కవర్ చేసి చేతి కి కొంచమే నూనె రాసుకుంటూ మోదకం షేప్ లో(వెల్లుల్లి
పాయ రూపం లో) వచ్చేలాగ చేతితో దానిని మలచాలి. ఇప్పుడు
బజారు లో మోదకాలు మంచి ఆకారం లో
వచ్చేలాగ సహాయపడే మూసలు కూడా అమ్ముతున్నారు. వాటిని వాడితే చక్కటి ఆకృతి
వస్తాయి.
అలా అన్ని పిండి వుండలలోను, కొబ్బరి ఉండలు
పెట్టి మోదకాల షేప్ లో చేసుకుని పెట్టుకొవాలి. తర్వాత
వీటిని ఒక గిన్నెలో పరచి ఒకదానిపక్కన ఒకటి పేర్చి కుక్కర్ లో వెయిట్ లేకుండగా
పెట్టి ఇడ్లీని చేసినట్లు స్టీమ్ చెయాలి. ఇప్పుడు మొదకాలు తయార్!
కేవలం వినాయక చవితి రోజు మాత్రమే
కాకుండగా, ఏ చవితి తిధి రోజు నయినా మనం ఉండ్రాళ్ళు, మోదకాలు వినాయకునికి సమర్పించటం
చాలా శ్రేష్టం అని పెద్దలు చెప్తారు.
మరి వీటిని చేసే విధానం
నేర్చుకున్నాము కనుక,
చవితి పండుగ రోజున ఈ ప్రసాదాలు
శ్రద్ధగా చేసి గణపతికి భక్తితో సమర్పించుకుని ఆయన కృపకు పాత్రులము అవుదామా?
|
No comments:
Post a Comment