అసలే శ్రావణ మాసం, నోములు,
ముత్తైదువుల పేరంటాలు, వాయనాలు; అబ్బో రోజు సరి పోవటం లేదు ఇల్లాళ్ళకు. తన్నితే
బూరెల గంపలో పడ్డట్టు రోజూ విందు పిలుపులు. ఒకరు పిలిస్తే ఇంకొకరు ఊరుకుంటారా!
పిలుపుల మీద పిలుపులు, వడ్డనల మీద వడ్డనలు! వంటిలో సుస్తీలు కాస్త మూలన పెట్టి ఈ
విందుల కు వెళ్ళాల్సిందే మరి లక్ష్మీ కటాక్షం పొందాల్సిందే! ఇలాంటి ఒక పండగ విందు
పిలుపికి మన ఢిల్లీ పాఠకురాలైన శ్రీమతి అంజన దేవి గారు వెళ్లి వచ్చారుట. నసుగుతున్న
చిన్న చిన్న జాడ్యాలను చట్...నోర్ముయ్ అని గదమాయించి, లొట్టలు వేస్తున్న
ఆత్మారామునికి ఒక్కొక్క పదార్థాన్ని నివేదనం చేసిన వైఖరి మనకు కంటికి కట్టినట్లు
వివరిచారు శ్రీమతి అంజన. ఆ విందు వైభోగం అబ్బో అంతా ఇంత కాదుటండీ! మరి ఆ
విషయాలన్నీ మీతో పంచుకోవాలని సరదా పడుతున్నారు, ఇంకెందుకు ఆలస్యం? అదిగో భోజనం కోసం అరటి ఆకుల కవిలె లోపలికి
తుర్రుమంది. ఇక మన అంజన గారి నోరు ఊరించే భోజన వ్యాఖ్యానం చదువుదామా?
రమణ
సంపాదకుడు
విందు భోజనమా... నిన్నెలా
పొగిడేది?
శ్రీమతి అంజన మాధవరావు, ఢిల్లీ
మా వారి
ఆఫీస్ లోనే పనిచేసే ప్రసాదు గారు ఆర్. కే. పురం లో ఉంటారు. అయన శ్రీమతి రాజ్యం
గారు మొన్న శుక్రవారం పూజకి విందుకి పిలిచారు. పొద్దున్నే పనులు చక్క బెట్టుకుని,
అమ్మవారి స్తోత్రాలు చదువుకుని, పూజ చేసుకుని, పళ్ళు నివేదనం పెట్టి బయలు దేరి వారింటికి
వెళ్ళాను. అప్పటికి ఆవిడ పూజ ముగిసి, వచ్చిన వారికి భోజనం ఏర్పాట్లు అవి
చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన నన్ను, శుభ్రంగా కడిగి వరుసగా పరిచిన పచ్చటి అరటి ఆకు
ముందు కూర్చో మన్నారు. తక్కిన ముత్తైదువులు కూడా ఆనూ పాను చూసుకుని ఆకుల ముందు
చతికిల పడ్డారు. ఇక వడ్డనలు మొదలయ్యాయి.
కొత్త మామిడి కాయ వాసనలతో, ఘాటైన ఇంగువ
పోపుతో ఘుమ ఘుమలాడే మామిడికాయపప్పు, అందమైన ఆకుపచ్చని అరిటాకు మీద పెద్ద
ముత్తైదువులా కూర్చుంటే, “నేనెక్కడ ఉంటె అక్కడ 'శుభం, సంతోషం' అంటూ పచ్చని
పనసపొట్టుకూర ఆకులో పక్కన చేరింది (“పోవమ్మా! నిన్నుపొట్టు చేసికూర వండాలంటే భుజాలు
ఊడతాయి, స్పాన్డిలైటిస్ పెరుగుతుందంటే మొండిఘటం ఒప్పుకోదు!”)
ఇంతలో “నేనేం తక్కువా? చూసుకో నా అల్లపుఘాటు” అని నిగనిగలాడే
వంకాయకూర పోటీ పడింది.
(ఎసిడిటీకి నువ్వే మూలం అంటే, “చ్ఛట్ !
సత్తా లేకపోతే కూర తిని గ్లాసుడు ‘యీనో’ తాగు. టీవి లో చూపిస్తున్నారు కదా!” అని
ఈసడింపు!)
“మీకంతా ఏ రోజు వండితే ఆ రోజు పబ్బం. నేనయితే ఈ వేసవినుంచి ఆ వేసవిదాకా తోడుంటానోచ్!
నేనే గొప్పోచ్!” అంటూ ఎర్రటికారంతో, నూపప్పు నూనె
కమ్మటి వాసనతో మిలమిలామెరిసే ఎర్రటి కొత్తావకాయ దబాయిస్తూ దభాలున పడి, అరిటాకుకు
మరింత అందాన్నిచ్చింది (ఆవకాయ బి.పి వగైరాలకు చక్కని రహదారి అంటారు. పొనీ లేద్దురూ
లోకులు పలు గాకులు పట్టించుకోకండి!)
వీరందరి ఉర్రూతలు చూసి నేచెబుతా వీళ్ళ పని అనుకొని “రాగి గ్లాసులో
నీళ్ళు, రాచిప్పలో పులుసు, ఆరోగ్యం
వెనకుండే రహస్యం. మీకీవిషయం తెలుసా అసలు?” అని ఘుమ ఘుమలాడే
పాకంవచ్చిన గుమ్మడికాయ దప్పళం, “ముందు అన్నంలో గుంట చేయి” అని చటుక్కున గుమ్మడి ముక్కలతో సహా వచ్చికూర్చుంది (సొంత డబ్బావాయించు కోటమంటే ఇదేనండోయి!)
“పలుకు పంచదార చిలకవుతుందిట” అంటూ పూర్ణం
బూరెలు పరిగేట్టు కొచ్చాయి. వీరి ఘుమ ఘుమ వాసనకు తబ్బిబ్బయి గేటు దగ్గర సెక్యూరిటీ
గార్డు ఎవరింటికి అని కూడా అడగ లేదుట! (ఈ మధ్యనే ఓ పెద్దాయన ‘మన ఆరోగ్యం
మన చేతుల్లోనే ఉందండీ’ అనే పాటకు
ట్యూన్కట్టి విడుదల చేసేరుట. ఉష్..........కొంచెం సేపు ఆగొడవెత్త కండి!)
“స్వీట్ ఉంటే హాట్ ఉండద్దా? ఇంత
పరాకయితే ఎలా?” అంటూ లావుపాటి పొడుగు పచ్చిమిరపకాయ బజ్జీలు పరిమిషన్లేకుండా వచ్చిఅరిటాకులో చోటు నాక్రమించుకొన్నాయి(ఇంట్రూడర్
అనకండి! కోపం వస్తుంది).
అలంకరణ అందానికి మెరుగులు దిద్దినట్లు, రుచికరమైన పదార్దాలకు
వన్నెతెచ్చేవి మేమే అని ఒడియాలు, ఊరుమిరపకాయలు
వచ్చి, "మమ్మల్నికలిపి దంచేరంటే
స్వర్గానికి ఒక మెట్టేదూరం" అనిచెప్పేయి
(నిజం చెప్పేరు. బి. పి., షుగరు, ఎసిడిటి, స్పాండిలైటిస్
కలిస్తే స్వర్గం ఒక మెట్టు దూరంలోనే ఉంటుంది మరి!)
ఇన్నిరకాలు ఒకటి తర్వాత ఒకటి లోపలికి పంపించేస్తోంటే, “కడుపులోచల్లదనం ఉండాలా? అక్కరలేదా?” అంటూ గడ్డ పెరుగు ఒత్తైన మీగడతోవచ్చింది (మీగడ మీ కొలెస్ట్రాల్నిపెంచితే ఆవిడకేం పట్టిందీ!)
“భుక్తాయాసం ఇంకా రాలేదు. మాక్కూడా కాస్త చోటుంది” అనుకొంటూ
మామిడిపళ్ళ ముక్కలు, మన తెలుగువారి పాయసం వచ్చేయి(అన్నంతో పాటు పళ్ళ ముక్కలు
తింటే అరగవని మంతెన గారు చెప్పేరని చెబితే ఏవన్నా వింటారా పెడతారా? మన పళ్ళు రాల
గొడతారు. అందుకే కాసేపు నోరు మూసుకొనికూర్చోండి).
బ్రేవుమని త్రేనుస్తూ, పొట్ట మీద
చేత్తో రాసుకొంటూ "ఎంత మంచిభోజనమో !...........ఎన్నినోళ్ళ
పొగడుదునో......." అని పాట పాడటానికి ఏమాత్రం చాన్స్ లేదు. భుక్తాయాసంతో గొంతు పెగలటం
కష్టం. "నన్ను తింటే నువ్వు తిన్న భోజనం
అరుగుతుందని" సున్నం వేసి చక్కగా కట్టిన కిళ్ళీ సానుబూతి చూపించింది. అంతే కాదు; “చక్కగా భోజనం చేసి, భోజనం
అరిగేలా పని చెయ్యి. వేళకి వ్యాయామం చెయ్యి. అనులోమ, విలోమలు, కపాలబాతి
ఉన్నాయికదా! ఎందుకంత భయం?” అని ఉచిత సలహా కూడా
పారేసింది.
అన్నదాతా! సుఖీభవా! అంటున్నారు వచ్చిన జనమంతా! కొందరైతే మరీ
కొంటెగా మళ్ళీ ఎప్పుడు? అంటున్నారు. బాగా నోరు వూరి నట్టుంది కామోసు! పోన్లెండి వచ్చే వారం మా
ఇంటి విందు భోజనానికి మీకు కూడా విస్తరి వేయిస్తాలెండీ!
*****
చదువరులకు విజ్ఞప్తి:
ప్రతి సంచిక పైన
చదువరులు తమ తమ అమూల్యమైన అభిప్రాయాలను బ్లాగ్ నందలి కామెంట్స్ భాగం లో పోస్ట్
చెయ్యగలరు . లేదా వాటిని ఈ క్రింద పొందుపరచిన ఈమెయిలు ఇడి కి పంపించ
గలరు.
తెలుగు శాకాహార రుచుల
పట్ల అభిలాష ఉండి,
తమ తమ ప్రాంతానికి చెందిన సాంప్రదాయక తెలుగు శాకాహారవంటలను మరియు
సంబందిత విశేషాలను ఉత్సాహపరులైన చదువరులు తమదైన శైలి లో వివరిస్తూ, దానికి సంబందించిన ఫొటోస్ కూడా జోడిస్తూ సంపాదకునికి ఈ దిగువ ఇవ్వబడిన
ఈమెయిలు ఇడి కి పంపించ గలరు. తమ వ్యాసాలను తెలుగు లిపి
లో టైపు చేసి పంపించ గలరు.
సంపాదకుడు
చదువరులకు వురూతలోగిస్తూ వ్యాసకర్త తనరచనను సాగించిన
ReplyDeleteవిధానము కడుబాగుంది. మనము అప్రయత్నముగా నోరూతుంది.
అయితే ఎన్నిపిండివంటలున్నాను వాటిని మరింత రుచికరముగా
చేయు నేతి ఘుమ ఘుమలు తగలలేదు. దానిని జోడిస్తే మరింత
మధురముగా వుంటుంది.