Sunday, August 24, 2014

"ఇల్లు అలుక గానే పండుగ కాదు!” ప్రత్యెక వ్యాసం.



ముందు మాట: 

'ఇల్లు అలుకగానే పండుగ కాదు'  అనే నానుడిని మనం నిత్య జీవితం లో తరుచు వాడుతూ 

ఉంటాం. వాడినప్పుడు దానిలోని పూర్తి భావం మనకు స్పురణకు రాకున్నా సందర్భోచితం గా 

వాడతాము. శ్రీమతి పద్మ గారు ఆ నానుడి లోని నిఘూడమైన సందేశాన్ని ఒక కొత్త కోణం లో 

మనకి చూపిస్తున్నారు. పండగ రోజుల్లో వచ్చి పడిపోయే కొబ్బరి చిప్పలను పాడవకుండా ఎలా 

దాయవచ్చో శ్రీమతి నయన గారు మనకు చూపిస్తున్నారు. 




"ఇల్లు అలుక గానే పండుగ కాదు!”


శ్రీమతి పద్మా రఘునాద్


మన తెలుగు సామెతల గొప్పతనం చెప్పాలంటే అంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదు. మన పెద్ద వారు జీవితానికి పనికి వచ్చే అనేక సూత్రాలని కొన్నిసామెతలలో, మన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ, కట్టుబాట్లని మరి కొన్ని సామెతలలో, మన సనాతన ధర్మాలు, సంస్కారాలు ఇంకొన్ని సామెతలలో జాగ్రత్తగా పొందుపరచి అందరికి అర్ధమయ్యే వాడుక భాషలో మనకి అందజేసినందుకు మనం ఎంతో కృతఙ్ఞతలు తెలుపుకొవాలి. ఇలాంటి కోవలోకే వస్తుంది ఈ పై సామెత కూడా. ఈ సామెతలో ఎన్నోగూఢ మయిన  అర్ధాలు దాగి ఉన్నప్పటికీ,  మనకు తేలికగా అర్ధం అయ్యే కొన్ని సూచనలను గ్రహించటానికి ప్రయత్నిద్దాము.  

ఈ సామెతని ఒక కోణం లోంచి పరిశీలిస్తే, పండుగ రోజుల్లో ఇల్లు అలికి శుభ్రం జేసుకునే వారని, ఇల్లు అలికిన ప్రతీ సారి పండుగ కానవసరం లేదని, ఇలా మన తెలుగు సంప్రదాయాలని తెలియజేస్తూ ఒక అర్ధం చెప్పుకొవచ్చును. ఇది బాహ్యంగా కనిపించే అర్ధం. 

ఇంకొంచెం ముందుకెళ్ళి  పరిశీలిస్తే, ఏదయినా ఒక పెద్ద పనిని సాధించేటపుడు, ముందు వచ్చే చిన్న చిన్న అల్ప విజయాల్ని దృష్టి లో పెట్టుకుని, వాటి తన్మయత్వం లో మునిగి పోయిదానితో  అహం చోటుచేసుకుని, ఈ చిన్న విజయాలే అంతిమ విజయం అనుకుని పొరపడ వద్దని కూడా ఒక నిఘూఢ మైన సత్యం ఉన్నదని తెలుసుకొవచ్చు.

మన లక్ష్యం ఇంకా ముందు ఉన్నపుడు మొదట్లో వచ్చే చిన్న విజయాలకు ఆ పరిమితి లోనే  సంతోషించి వాటిని స్ఫూర్తిగా తీసుకుని ముందున్న పెద్ద లక్ష్యం మీద దృష్టిని పెట్టి సాధించమని మన పెద్దలు సూచనగా చెప్పినట్లు మనం ఇంకో అర్ధం చెప్పుకోవచ్చును. 

ఇక మన తెలుగు భోజనంకు సంబంధించి అర్ధం చెప్పుకోవాలంటే, ఇల్లు ఒక్కటి అలుకగానే పండుగ కాదోయ్, దానితో పాటు ఆ పండుగ హడావుడి, ఉత్సాహంకొన్ని పిండి వంటలు, ప్రసాదాలు, భగవంతునికి నివేదన, మనకి  ఆప్తులయిన వారితో కలసి ఆ పండుగ వేడుకలను చేసుకోవటం, ఇవన్ని కూడా తోడుగా ఉంటేనే అది అసలైన పండుగ అని మనం చెప్పుకోవచ్చు మరి. 


అంటే, మన పండుగలు  దగ్గర పడుతున్నపుడు, మనం ఏ  దేశం లో ఉన్నా, మనస్సులో ఉత్సాహాన్ని నింపుకునిమన సాంప్రదాయాలు వీలు అయినంత వరకు పాటిస్తూ, బంధు మిత్రులతో ఆ సంబరాలను పంచుకోవటమే అసలయిన పండుగ అనికూడా చెప్పుకోవాలి మరి.



వీటన్నిటి తో పాటు మనకు సాధ్యమయినంత వరకు, భగవంతునికి ప్రసాద నివేదన, ఆయా పండుగల ఆచారాల్ని అనుసరిస్తూ చేసుకుంటే అది మరింత సంతోష దాయకంగా ఉంటుందండోయ్! పండుగ రోజుల్లో సాధారణం గా చేసుకునే పిండివంటల్లో ముఖ్య మైనవి పులిహార, పరమాన్నం, గారెలు, ఆవడలుబొబ్బట్లు మొదలయినవి. 

మన సంతోషం కొద్ది అనేక రకాల పిండి వంటలు వండుకున్నప్పటికీ, అన్నిటిలోకి తేలికగా చేసుకునేది, దాదాపు ప్రతి వారు చేసుకోటానికి ఇష్టపడేది,  పండుగ రోజునయైన చేసుకునే పిండివంట, దైవ నివేదనకు కూడా ప్రసిద్ధి చెందినది మన అన్నం పరమాన్నం సుమా! మరి క్లుప్తంగా ఈ అన్నం పరమాన్నం ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా?

అన్నపు పరమాన్నం:   
రోజు వారి ఉపయోగించే వస్తువులతోటే ఈ ప్రసాదం మనం చక్కగా చేసుకోవచ్చును.
బియ్యం - ఒక కప్పు; నీరు -మూడు కప్పులు. 
కాచిన ఆవుపాలు : మూడు కప్పులు;  నేయి : వంద గ్రాములు. 
జీడిపప్పు : పది బద్దలు;  ఏలకుల పొడి : పావు చెంచా
బెల్లం : వంద గ్రాములు, లేదా పంచదార ఒకటిన్నర కప్పులు. 
కిస్ మిస్ పళ్ళు : ఒక చెంచాడు;  కుంకుమ పువ్వు ; ఒక రెబ్బ ఉంటె వేసు కోవచ్చు

తయారుచేయువిధానం: 
బియ్యాన్ని బాగా కడిగి మూడు కప్పుల నీరు పోసి కుక్కర్ లో మెత్తగా ఉడికించండి.అన్నం మెత్తగా  ఉడికాకతీసి బాగా మరింత మెత్తగా ఎనపండిబెల్లాన్ని కోరు చేసి లేదా పంచ దార,  ప్రక్కన ఉంచుకోండి. 

 ఒక పెద్ద గిన్నెలో పాలు పోసి సన్న సెగ మీద వుంచండిపాలు వేడిగా అయ్యాక అందులో  మెత్తగా ఉడికించిన అన్నాన్ని వేసి బాగా కలుపుతూ ఉండండిఅడుగంటకుండగాకలుపుతూ ఉండండి.

అందులో బెల్లం కోరును లేదా పంచదారను ఏలకుల పొడిని కుంకుమ పువ్వును  కూడా వేసి బాగా కలుపుతూ సన్న సెగ మీద 5 లేక 6 నిమిషాలు ఉంచండి.  స్టవ్ మీద నుండి తీసి పక్కన పెట్టండి. ఇపుడు పాలుబెల్లంఅన్నం కలిసి, చిక్కటి పరమాన్నం  లాగా తయారు అవుతుంది. 

ఇపుడు వేరే పోపు గరిటె లో కొంచెం నేయి వేసి, దానిలోకిసమిస్ పళ్ళు , జీడిపప్పు బద్దలు వేసి దోరగా వేయించండిఇవి తీసి పరమాన్నం మీద అందంగా వేసి కలపండిఅన్నపు పరమాన్నం 
రెడి!





కొబ్బరి తాజా గా ఉండాలంటే ..........?


శ్రీమతి నయన కస్తూరి


ఈ పండగల సీజన్ లో కొబ్బరి చిప్పలు చాలా చేరుతూ వుంటాయి కదా?  చాలా సార్లు          

రేపు చేద్దాము ఏదైనా!' అని అనుకుంటూ ఉండగానే కొబ్బరి చిప్పలు రెండో రోజుకే బూజు పట్టి 

పాడైపోతూ వుంటాయి.  బాధ ఏమిటంటే  ఫ్రిజ్ లో పెట్టినా కూడా పాడైపోతూ  వుంటాయి. వాటిని 

వాడలేక బయట పడేయటానికి ప్రాణం ఉసూరు మంటుంది. అలా కాకుండా, మీ కొబ్బరిని  వారం 

పది రోజులు అయినా కూడా తాజాగా ఉంచే ఒక చిట్కా చెప్పనా మీకు? అయితే మరి వినండి. 

 ఏమి లేదు; మీ కొబ్బరి చిప్పలను ఫ్రిజ్ క్రింద భాగం లో కాకుండా పైన ఫ్రీజర్ భాగంలో పెట్టుకోండి. 

ఎన్ని రొజులైనా పాడవకుండా ఉండటమే కాకుండా తాజాగా వుంటాయి. అంతే  కాకుండా మీరు 

వాడాలనుకున్నప్పుడు కొబ్బరి చిప్పని తీసి ఒక ఐదు నిమిషాలు నీళ్ళల్లో వేసి ఉంచితే,  కొబ్బరి 

ఏ మాత్రం చిప్పకు అంటుకోకుండా మొత్తం చాలా సులువుగా చిప్ప నుండి బయటకు వచ్చేస్తుంది.

తెలిసింది కదా? మరి అయితే ఇక నుండి కొబ్బరి చిప్పలను మీ ఫ్రిజ్ లోని  ఫ్రీజర్ భాగం లో నిలవ 

ఉంచుకుని తాజాగా ఉంచుకోండి. 



 


1 comment:

  1. సామేతలకి చక్కటి అర్ధం చెప్పారు పద్మగారు. నయనగారి వలన కొబ్బరి చిప్పల పాడవకుండా కాపాడుకోవటం తెలిసింది. ఆ మధ్య వరలక్ష్మీ పూజకు వాయనాలకు తెచుకున్న కొబ్బరి కాయలు మిగిలి పోతే ఏమి చేయాలో అర్ధం కాలేదు.ఒక స్నేహితురాలు వాటిని refrigeratorలో కూరగాయలు పెట్టే చోట పెడితే చక్కగా నెలరోజులు వాడుకోవచని చెబితే అలాగే చేశాను. పాడవకుండా బాగున్నాయి.

    ReplyDelete