Wednesday, August 20, 2014

రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే!


ముందు మాట!

“అయ్యా! తమరీ వేడి ఇడ్లీ మీద కొంచెం నెయ్యి వేసుకుని, అదిగో ఆ కారప్పోడిని చక్కగా నేయి వేసి తడిపి, ఆ మెత్తటి ఇడ్లిని వేళ్ళతో సుతారం గా విరిచి పొడిలో నంచుకుని తినండి” అని ఎవరైనా ఆప్యాయంగా మీకు అల్పాహారం గా పెడితే ఇక మీ ‘రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే!’

మరి ఇలాంటి చక్కటి అనుభూతిని ఇచ్చే మన తెలుగు సామెత ను తీసుకుని శ్రీమతి పద్మ గారు, ఆకట్టుకునే తన రచనా వైదుష్యంతో నేతిలో విరిగి పడిన రొట్టె ముక్క వైభవం తో పాటు, భోజనాల బల్ల దగ్గర మెల్ల మెల్ల గా కనుమరుగవుతున్న నేతి గిన్నె యొక్క విభవాన్ని కళ్ళకు కట్టినట్లు తమ వ్యాసం ‘రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే’ లో వర్ణించారు. తెలుగు భోజనానికి పరిపూర్ణత ఇచ్చే అధికారం ఒక్క కమ్మని నేతి కి మాత్రమే ఉందంటారు శ్రీమతి పద్మ గారు. ఈ వ్యాసం చదివిన వారు తప్పక నేతి గిన్నె వేటలో పడతారని నా ఊహ! ఇక చదివి ఆ రుచిని ఆఘ్రాణిస్తూ గ్రోలండి; నిండైన కమ్మని నేతి గిన్నెను వెతికి ఒక పట్టు పట్టండి! 

రమణ బంధకవి

సంపాదకుడు 

రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే!

శ్రీమతి పద్మా రఘునాద్

"రొట్టె విరిగి నేతి లో పడ్డట్లే" అనే సామెత తెలుగు తెలిసిన వారందరికీ సుపరిచితమే! అమ్మమ్మలు, బామ్మలు, తాతయ్యలు, బాబాయిలు మొదలగు  పెద్ద వారి నోటినుండి కూడా సాధారణంగా వినపడే మాటే ఇది మరి!

ఏదైనా చాలా మంచి విషయం జరిగినపుడో, అనుకోకుండగా విశేష మయిన లాభం కలిగినపుడో, పిల్లలకు మంచి పెళ్లి సంబంధాలు కుదిరినపుడో అలాంటి సందర్భాలలో ఈ మాటను తరచూ వాడటం జరుగుతుంటుంది.

రొట్టె విరిగి నేతిలో పడటం అంటే చాల మంచి విషయమే అన్నమాట.  కమ్మగా ఉన్న రొట్టె ను ముక్కలు చేసుకుని తింటున్నపుడు పొరపాటున ఒక ముక్క జారి ఇంకా మంచి కమ్మని ఘుమ ఘుమ లాడే నేతి లో పడితే మరి దాని రుచి రెట్టింపు అవుతుంది కదా! అంటే, నేతి స్పర్శ తగిలితే చాలు తినే పదార్ధాలకి అంత రుచి వస్తుందన్న మాట. 

ఈ మధ్య కొలస్త్రాలులు, డైటింగులు లాంటివి  వాడుక లోకి వచ్చాక అసలు కమ్మటి నేయి జోలికి పోవటమే మానేశాము కదా!  కాని అపుడపుడు, పండుగలు పబ్బాల రోజుల్లో ఇంట్లో చేసిన అవునేయిని  పరిమితంగా వేసుకుంటే పరవాలేదనే చెప్పాలి మరి. ఆవు నేయి కూడా  దేహ పుష్టి కి చాల శ్రేష్టమనే పెద్దలు చెప్తారు. 

పూర్వం రోజుల్లో మన పెద్ద వారు రోజూ గిద్దెడు నేయి వేసుకుని తిన్నా కూడా వారికి ఈ కొలస్త్రాలులు, ఊబ శరీరాలు వచ్చినట్లుగా అంత దాఖలాలు ఏమీ కనబడవు. వారికి  అది తేలికగా అరగాయించుకునే శరీర శ్రమ కూడా ఉండి  ఉంటుంది మరి. 

ఈ పై విషయాలన్నీ దాటేసి, ఇక కమ్మని నేయి జోలికి వస్తే, మన తెలుగు భోజనానికి అసలు సిసలు పరిపూర్ణత్వం ఈ నేయి వల్లే వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

ఎంతో  మంచి భోజనం వడ్డించినా కూడా  పక్కన ఘుమ ఘుమ లాడే నేయి లేక పోతే మాత్రం పెద్ద లోపమే అది మరి.  ఇది వరకటి రోజుల్లోఅసలు నేయి పడని  వంటకమే ఉండేది కాదట! విస్తరే లేచేది కాదట. అటు కూరల దగ్గరనుంచి మొదలుకుని, పొడులు, పచ్చళ్ళు, ఊరగాయలు, ఆఖరికి  కమ్మగా ఉండే పప్పుల్లో కుడా ఈ నేయిని అభికరించుకుని వేసుకునే వారట. ఆ రుచులని మనస్పూర్తిగా ఆఘ్రాణించే వారట కూడాను. 

ఇక నేయి ఘుభాలింపులు  లేనిదే ప్రసాదాలకు ఏమాత్రం కుదరదు సుమండీ! అటు చక్ర పొంగలి అయినా, ఇటు కట్టె  పొంగలి అయినా, శ్రీ సత్య నారాయణుని నివేదన రవ్వకేసరి అయినా నేయి చిలకరింపులు, అందులో వేయించిన జీడిపప్పులేకపోతే ఆ భగవంతుని కి తెలిసి పోతుంది కూడాను!  ఏడుకొండల స్వామి వారి  లడ్డు అయినా, వడ అయినా నేతి తోనే చేస్తారు కదండీ! 

ఇంక పండుగ పబ్బాల లో వండి వడ్డించే బొబ్బట్ల మీద కాని, బూరెల ఫై కాని నేయి వేసు కుని లాగిస్తే వచ్చే మజానే వేరు మరి. ఇంకో మాట! నేతి  అరిసెకు, నూనె అరిసెకు, నేతి మైసూరు పాక్ కు నూనె మైసూరు పాక్ ల మధ్య సహస్రం తేడా  ఉంటుందని అందరికి తెలిసిన విషయమే! 

ఇంతసేపు ఈ నేతి  గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఈ మధ్య కాలం లో భోజనాల దగ్గర కనిపించని, అంతరించి పోతున్న వస్తువ మన నేతి  గిన్నె సుమా!  ఈ తరం వారి ఇళ్ళల్లో కనీ కనిపించక, ఉండీ ఉండక, అపుడపుడు అటకలమీదో, పాత సామానుల గదిలోనో కాపురముండే వస్తువ మన నేతి గిన్నేనండీ! ఇంక, వచ్చేతరం వారి ఇళ్ళల్లో అయితే నేతి  గిన్నె కొనే ప్రసక్తే లేదు సుమా అని అనటం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.

ఈ మధ్య ఎవరింటికైనా  భోజనాలకి వెళితే "అబ్బ! వీళ్ళింట్లో ఈ రోజునేయి వడ్డించారు” అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన రోజులు వచ్చాయి మరి.  అందుకే మనం ఈ నేయి గురించి ఇంతగా చెప్పుకోవాల్సి వచ్చింది. ఇది చదివాక ఈ రోజు మనం ఎవరైనా ఈ పూట కరిగిన నేయిని వడ్డించుకుంటే మన రొట్టె విరిగి నేతి లో పడ్డట్లే మరి! అవునా కాదా మీరే చెప్పండి!

 


1 comment:

  1. Neyyi meeda Padma gari article ghuma ghuma laade kammani aavu neyyi laaga vundi.chala chakkaga chepperu

    ReplyDelete