Friday, August 22, 2014

మరుగున పడుతున్న మన పండుగలు: ‘పోలాల అమావాస్య – పోలాంబా వ్రతం’



ముందు మాట:


“భారత దేశం గ్రామాలలో నివసిస్తుంది” అన్నారు మహానుభావులు. ఇప్పుడు ఎక్కడ ఏ పట్టణం లో నివసిస్తున్నా, మన మూలాలు గ్రామ సీమల లోనే! మన చిన్నతనం ఎంతో  కొంత గ్రామ సంస్కృతి లోనే గడిచి ఉండవచ్చు. ఆనాటి వేడుకలు, పండగలు, ముచ్చట్లు మరి కాల పరిణామంతో క్రమేపి మరుగున పడి పోతున్నాయి. అలాంటి ముఖ్యమైన వేడుకలలో గ్రామ దేవతల పండుగలు ఒకటి. శ్రీమతి నయన గారు మరుగున పడుతున్న  ‘పోలాల అమావాస్య – పోలాంబా వ్రతం’ అనే శ్రావణ మాసపు పండుగను అందరికి గుర్తుకు తెస్తున్నారు. మరి ఆ వ్యాసం చదివి, తమకు కుదిరిన విధంగా ఈ పండుగను జరుపుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకుంటారని ఆశిస్తున్నాను.


రమణ బంధకవి


సంపాదకుడు



‘పోలాల అమావాస్య – పోలాంబా వ్రతం’



శ్రీమతి నయన కస్తూరి, హైదరాబాద్



మొదట్లో మనకు ఎన్నో పర్వదినాలు, పండుగలు ఉండేవి. అవన్నీ మన సంస్కృతికి, సంప్రదాయాలకి అద్దం  పట్టేవిగా ఉండేవి. అప్పట్లో ఊరు ఊరంతా కలిసి చేసుకునేవారు. ఇప్పుడు మ్యుఖ్యమైన పండగలకి కూడా కుటుంబం లోని సభ్యులు కలవడమే గగనం అయిపోతోంది. మన అమ్మమ్మలు చేసుకున్న పండగలలో కొన్నిటిని హడావిడి జీవనంలో పడి మనం ఇప్పటికే వదిలేసాము మన. దాని వలన పాపం మన పిల్లలికి మన పండగలలో చాలా పండగల విశిష్టత మాట పక్కకు పెడితే, పేర్లు కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదు.

అలా మన పిల్లలతో పాటు మనలో చాలా మంది విస్మరిస్తున్న పండగలలో  ఒక పండగ ప్రతి శ్రావణ మాసంలో అమావాస్య రోజు చేసుకునే ఎంతో  ముఖ్యమైన పండుగ. ఆ పండుగ పేరు మీరో ఎవరైనా చెప్పగలరా? అదేనండీ 'పోలాల అమావాస్య' పండుగ. దీనినే 'పోలాంబ వ్రతం' లేక ‘కంద గౌరీ వ్రతము’ అని కూడా అంటారు. ఈ వ్రతం, తల్లి అయిన ప్రతి స్త్రీ తప్పక చేయవలసిన విధానం. సంతానం ఆయురారోగ్యాలతో వర్ధిల్లడానికి ఆచరించ తగ్గది ఈ వ్రతం.   

మనము, మన సంతానం ఆయురారోగ్యాలతో ఉండటానికి కారణం మన గ్రామ దేవతల కరుణా కటాక్షాలే! అందుకే మన పెద్దలు గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పండుగల రూపాలలో ఎన్నో అవకాశాలు కల్పించారు. మరి అటువంటి గ్రామదేవతలలో పోలేరమ్మ ఒక ముఖ్యమైన 
దేవత. మరి ఇంకెందుకు ఆలస్యము? ఈ  మాసం 25 వ తారిఖు, సోమవారం 'పొలాల అమావాస్య' భక్తి శ్రద్ధలతో జరుపుకుని, అమ్మవారుగా కొలవబడే పోలేరమ్మ వారిని పూజించు కుందాం.

“అది సరే కాని ఎలా జరుపుకోవాలో అసలు తెలియదే!” అని కంగారు పడుతున్నారా? అందుకే కదండీ నేనిప్పుడు మీ ముందుకు వచ్చింది! పొలాల అమావాస్య ముందు రోజు ఒక కంద మొక్క కాని కంద పిలక కాని తెచ్చుకోండి. మిగతా పూజ సామాను అంతా మీకు తెలిసినవే; పసుపు,  కుంకుమ, పూలు, కొబ్బరి కాయ ఒకటి, పసుపు కొమ్ములు రెండు, అరడజను అరటి పళ్ళు. 


పొలాల అమావాస్య  రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి కంద మొక్క ని కాని కంద పిలకను కాని పూజా మందిరంలో పెట్టుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు వినాయకుని, పసుపు గౌరమ్మని, చేసుకుని తమల పాకుల్లో కంద మొక్క దగ్గరగా పెట్టుకోవాలి. నైవేద్యానికి పళ్ళు, కొబ్బరి కాయతో పాటు అమ్మ వారికీ వడ పప్పు, పానకం, చలిమిడి, ఆడ సంతానం కలవారు గారెలు, మగ సంతానం కల వారు బూరెలు సిద్దం చేసుకోవాలి. ఇద్దరు వున్నవారు రెండూ సిద్దం చేసుకోవాలి. రెండు దారం పోగులకు పసుపు రాసి పసుపు కొమ్ములు కట్టి ఉంచుకోవాలి. ఈ వ్రత కథ ప్రతి స్త్రీల వ్రత కథల పుస్తకంలో కనిపిస్తుంది. ఆ పుస్తకం కూడా 
దగ్గర పెట్టుకోండి.

ఇక  పూజా  విధానం ఇతర పూజల లాగానే. ముందుగా ఆచమనం చేసుకుని, సంకల్పం చెప్పుకుని గణపతి పూజ చేసుకుని అమ్మ వారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. పసుపు అమ్మ వారిని, కంద మొక్క లేక కంద పిలకని, కుంకుమతో పుష్పాలతో పూజించి, దీప, ధూప, నైవేద్యాలు సమర్పించి, అక్షతలు చేత పట్టుకుని, వ్రత కథ చదువుకుని, కొన్ని అక్షతలు అమ్మ వారి మీద, కొన్ని కుటుంబ సభ్యుల అందరి మీద జల్లు కోవాలి. పసుపు కొమ్ము కట్టిన ఒక దారం అమ్మ వారి దగ్గర ఉంచి, ఇంకో దారం పూజ చేసిన స్త్రీ మెడలో కట్టు కోవాలి. తీర్థ ప్రసాదాలు భక్తి తో స్వీకరించాలి. 

ఇంతేనండీ పొలాల అమా వాస్య వ్రతం అంటే! ఈ నెల 25 న వస్తుంది ఈ పండుగ. పధ్ధతి తప్పినా భక్తి  తప్పకూడదండీ! భక్తి శ్రద్ధలతో చేసుకుని అమ్మ వారి దయకు పాత్రులై, పిల్ల పాపలతో వందేళ్ళు చల్లగా ఉండండి! 




   
 


 









1 comment:

  1. పూజలు చేయ పూలు తెచ్చానుపూజలు చేయ పూలు తెచ్చానునీ గుడి ముందే నిలిచానుతీయరా తలుపులను రామాఈయరా దర్శనము రామా
    పూజలు చేయ పూలు తెచ్చాను ani manavaru poojalu gurinchii bhaktito patala roopam lo chepparu

    ReplyDelete