Monday, November 28, 2016

కార్తీక వన సమారాధన అనే దివ్య భోజన యజ్ఞం!


రమణ బంధకవి 

"కార్తీక మాసం లో ఈ సారి తప్పకుండ వన భోజనం ఏర్పాటు చెయ్యాలి రా తమ్ముడు" అని గట్టి గా నొక్కి చెప్పింది వాణి అక్క.
"బావా ఈ సారైనా బావగాడి భోజనం లాంటి భోజనం పెట్టించాల్సిందే" అన్నాడు గోపాల్ బావ.
నాకు కార్తీక వన భోజనం అనగానే, మెరుపు లాగ గుర్తుకు వచ్చేది, శంకరం మంచి గారి అమరావతి కథలలోని బావగాడి వన భోజనమే! ఎప్పుడైనా సరే అలాగే భోజనం పెట్టిన్చాలనేది నా చిరకాల కోరిక. కానీ ఇంతవరకు అది తీరలేదు. మా బావలందరికీ నా ఈ కోరిక పరిచితమే అవటం తో ఎప్పుడూ బావ గాడి భోజనం అని నన్ను ఊరిస్తూ ఉంటారు. కాని ఈ సారి అనుకోని వర్షం లా అటువంటి అవకాశం ముంచుకొచ్చింది.
మా కాలనీ లో ఎవరో మాకు 50 km దూరం లో మాంచి మామిడి తోట వుందని, మంచి నీడ, జల వసతి ఉన్నాయని, చాలామంది బృందాలు అక్కడ వన భోజనాలు చేసుకుంటారని ఇత్యాది భోగట్ట నా చెవిని వేసారు. మా శ్రీమతి కూడా ప్రోత్సహించటంతో మా వాళ్ళందరి అంటే, అస్మదీయులకు 'వాట్స్అప్' లో సమాచారం హుటాహుటిని పంపించా. ఇష్టమైన వాళ్ళు లొట్టలు తో ప్రతిస్పందించాలని వ్రాశా. ఇక చూద్దురు! రాత్రి పొద్దుపోయేదాకా ఏక లోట్టల శబ్దంతో ఫోన్ మార్మోగి[పోయింది.
అందరు అనుకున్న రోజు కు రెండు రోజులు ముందరే మా ఇంటి దగ్గర గుమి కూడేరు, వాణి, భాస్కర్ బావ, గోపాల్, శ్రీను,శివ, శేఖర బావలు, వాళ్ళ వాళ్ళ శ్రీమతులు, వాళ్ళ రెండు జెళ్ళ సీతలు, నల నీలులు మొదలగు వానర సేన తో దండు వెడలి వచ్చారు. ఈ దండుకు మా నరసింహ రావు తాత గారు జాంబవంతాది వృద్ధ వీరుల వలె పెద్దరికం వహించారు.
రాత్రి ఫలహారాలు అయ్యాక, వన భోజనానికి వంటలు ఏమి చేయించాలో అనే పెద్ద చర్చ దండు ముందు ప్రతిపాదించాను. 500, 1000, రూపాయలు రద్దు పై, పార్లమెంట్ లో రేగిన దుమారం లా ముందు లేత పాకం తో మొదలై, తీగ పాకం లాగ సాగి, ఆఖరికి జీడి పాకం లాగా బిగదీసుకుని కూర్చుంది.
ముందు పప్పు మీద చర్చ. మామిడికాయ పప్పు అని కొందరు, అబ్బ పుల్లగా వుంటుంది, దోసకాయ పప్పు అయితే బెహతరు అని ఇంకొందరు, ఆకు కూర పప్పు అయితే మినరల్స్ బాగా ఉంటాయని శేఖర్ బావ, ముద్ద పప్పు, ఆవకాయ అయితే భేషుగ్గా ఉంటుందని గోపాల్ బావ వాగ్యుద్దానికి దిగారు. ఈ యుద్ధ వాతావరణానికి భయపడి, నా మనసులోని బావగాడి వాక్కాయ పప్పు ను గొంతులోనే నొక్కేసాను.
ఇంతలో మరి కూరల మాటేమిటి? అని భాస్కర్ బావ పాయింట్ అఫ్ ఆర్డర్ లేవనేట్టేడు. వంకాయ కూర మీద ఏకాభిప్రాయం ఏర్పడినా , ఏ రకం వంకాయ, అనగా తెల్లగా పొడుగ్గా వుండేవా, తెల్లగా రౌండ్ గ ఉండేవా, నల్లగా పొడువుగా ఉండేవా, నల్లగా రౌండ్ గా ఉండేవా? అన్న మౌలికమైన ప్రశ్నే కాక, దానిని పొడుం కూరి గుత్తిగా వండాలా, అల్లం మిర్చి కొత్తిమెర దట్టించి ఇగురు గా వండాలా, లేక మెంతికారం వెయ్యాలా, అనే మీమాంశ నుండి బయటపడటానికి చాలా సేపు జరిగింది. ఇక పచ్చడి మాట కొస్తే, దోసకాయా, కొబ్బారా, బీరకాయా, మామిడి-కొబ్బరి పచ్చడా అనే వాటిపై వేడి వాదాలు, ఇక గుమ్మడి కాయ ముక్కాలా పులుసా, దప్పళమా, సాంబారా, మజ్జిగ పులుసా అనే విషయం పై మల్లా గుల్లాలు, ఆలాగే ఇతర పదార్థాల విషయం చర్చించి ఒక కొలిక్కి వచ్చేప్పటికి అర్థరాత్రి దాటింది. మర్నాడు, రాత్రి జరిగిన నిర్ణయాలపై ఒక జాబితా తయారుచేసి, వంటవాళ్లకు అందించా. ఇక ఆ రోజు ఉదయం అల్పాహారం విషయం మాత్రం అసెంబ్లీ లో ప్రవేశ పెట్టలేదు. అది సస్పెన్స్ అని చెప్పాను. వంటవాళ్లకు టిఫిన్ ఎక్కడ ఎన్నింటికి అందచేయ్యాలో చెప్పాను.
అనుకున్న రోజు రానే వచ్చింది. కోడి కూతలకు ముందే ప్రొద్దుటే, నాలుగు కార్ల లో బయలుదేరాం. ఇంకా పూర్తిగా వెలుగు రేకలు విచ్చుకోలేదు. చలి మంచు తెరలు అలవోకగా తోలుగుతున్నాయి. సూరీడు బద్ధకంగా లేచి కళ్ళు నులుము కుంటున్నాడు. అందరూ మంచి ఉల్లాసం గా ఉన్నారు. దారి, కొండలు, పొలాలు, తోటల మధ్య నుండి మెలికలు తిరిగి వెళ్తోంది. ఒక గంట ప్రయాణం సాగింది. ఇక వెనక కార్ల నుండి, టిఫిన్ ఎప్పుడు? ఏమిటి, ఎక్కడ ? అన్న ప్రశ్నలు శరపరంపరలాగా వాట్స్అప్ లో వస్తున్నాయి. ఓపిక పట్టండి అని చెప్పి, ముందుకు సాగెను.
కొంత దూరం వెళ్ళాక, కారు రోడ్డు ప్రక్కగా ఆపెను. అందరి కార్లు ఆగి, జనాలు బిల బిల మని వచ్చారు. "టిఫిన్ బ్రేక్" అని గట్టిగ అరిచాను. ఎక్కడ ఎక్కడ ? అని ఆదుర్దా గా అడిగేరు. కొంచెం దూరం లో ఉన్న టేకు తోపు చూపించాను. అందరూ, వంద మీటర్ల పరుగు పందెం లాంటిది పెట్టి టేకు తోపు లోకి చేరారు. అక్కడ మా వంట వాళ్ళు అప్పడికే, క్రింద జంపఖానాలు పరిచి, ప్లేట్స్ లో వేడి ఇడ్లి, వడ మరియు టమాటో ఉప్మా విత్ సెనగ చట్నీ, సాంబారు తో వడ్డించారు. జనాలు ఆకలి గొన్న పులుల్లా తిన్నారు. గొంతుకు దిగడానికి వేడి కాఫీ మధ్య మద్య లో తీర్థం లా పుచ్చుకుంటూ, ఒక్కోడు పుంజీడు ఇడ్లీలు, వడలు, రెండేసి రౌండ్ల ఉప్మా ముద్దలు భొంచేసారు.
అరగంట తరువాత పునః ప్రయాణం. కొండ దార్లు చుట్టుకుంటూ మరియొక గంట కి మేం నిర్నయిన్చుకున్న మామిడి తోపు కు జేరాము. ఇరవై ఎకరాల స్థలంలో శ్రద్దగా పెంచిన దాదాపు వెయ్యి మామిడి మరియు ఇతర ఫల వృక్షాలు ఉన్నాయి. మధ్యలో చక్కటి నీడ ప్రాంతంలో క్యాంపు వేసాము. జంపఖానాల మీద జనాలు జేరి, అంతాక్షరి ఆడేవాళ్ళు, పాటలు పాడుకునే వాళ్ళు, ఆటలు ఆడేవాళ్ళు కొందరు. ఇక గృహిణులు, అక్కడ ఉన్న ఉసిరి చెట్టు కింద, తులసి మొక్కను ఉంచి, పూజలు చేసి, ఉసిరి దీపాలు వెలిగించి, విష్ణు సహస్ర నామం, లలితా సహస్త్ర నామం పారాయణం చేసారు. ఇక పిల్లలు కొమ్మల మీద కెక్కి కోతి కొమ్మచ్చు లాడుకున్నారు.
అంతలో వంటవాళ్లు తమ సామగ్రి సంభారాలతో దిగేరు. దాంతో మగ బ్యాచ్ ఒక చెట్టుకింద జేరి వంటల గురించి మాటలు మొదలు పెట్టారు. మామిడికాయ కంది పప్పులో బావుంటుందా లేక పెసర పప్పా? చుక్కకూర పచ్చడా, పులుసా ఏది మహత్తరంగా వుంటుంది? వంకాయ బండ పచ్చడా లేక పులుసు పచ్చడా, ఏది కంది పచ్చడి లోకి నంచు కోవటానికి బావుంటుంది? దానిని పాటోలి లోకి కూడా నంజుకో వచ్చా? అన్నట్లు పొట్లకాయ పెరుగు పచ్చడి గురించి అభిప్రాయమేమిటి; ముక్కల పులుసులో చిలకడ దుంపల విశిష్టత ఏమిటి? ఇలా తర్జన భర్జన పడి, నోరు వూరి, కడుపులో ఆకలి ని ఎగదోసుకుని, అందరూ ఇక వడ్డనలు ఎప్పుడు, అని నా మీదకు దండెత్తారు. అయ్యా భోజన ప్రియులారా, కొంచెం ఓపిక పడితే షడ్రసోపేత భోజనం, మీ ముందు విస్తట్లోకి వేడిగా వస్తుంది. అంతవరకు శాంతించండి అని చెప్పి పంపెను.
ఒక అరగంట తరవాత, పులిహోర పళ్ళెం మీద పులుసు గరిటెతో టాంగ్ టాంగ్ మని కొట్టి వంటలు తయార్ అని వంటవాళ్లు ఏకగ్రీవంగా శబ్ద సంకేతాలు పంపేరు. జనాలు ఉలిక్కిపడి, చేస్తున్న వ్యాపకాలు పక్కన బెట్టి, సుప్రభాత దర్శనం కోసం, తలుపు తీయగానే గర్భ గుడి మీదకు ఎగబడే భక్త సందోహంలాగ వడ్డన ప్రాంతానికి పొలో మని వెళ్లారు. అక్కడ సన్నగా పరిచిన జంపఖాన ముందర, కడిగి, తుడిచిన పచ్చటి అరటి ఆకులు వేసారు. పక్కన మంచి నీటి గ్లాసులు పెట్టారు. జనాలు వారికీ నచ్చిన చోట లేదా, నచ్చిన ఆకు ముందర చతికిల పడ్డారు.
వడ్డన వాళ్ళు వరుసగా, పచ్చటి పులిహోర, ఎర్రటి బూరెలు, పచ్చి మిరపకాయ బజ్జి, పక్కన ఒక దొన్నె లో వేడి ఘుమ ఘుమ లాడే జీడిపప్పు పాయసం, మామిడి కాయ పప్పు, వంకాయ అల్లం మిర్చి కూర, అరటికాయ ఆవ పెట్టిన కూర, దోసకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, అప్పడాలు, వడియాలు వడ్డించారు. వేడి పొగలు గక్కే తెల్లటి అన్నం ఆకు మధ్యలో వడ్డించారు. కరిగిన ఆవు నెయ్యి ధారాళం గా వడ్డించారు. అందరు ఆపోసనలు పట్టి, ఆకలి మంటల్ని, అన్న యజ్ఞంతో చల్లార్చ ఉపక్రమించారు.
ఇక పులిహోర లోని పోపు గురించి, పప్పులోని మామిడికాయ పులుపు గురించి, బూరేలోని పూర్ణం గురించి, అందులో వేసుకున్న నేతి పరిమళం గురించి, మిర్చి బజ్జి ఘాటు గురించి, వంకాయ లేతదనం గురించి, వాటి తొడిమెల రుచి గురించి, దట్టించిన మిర్చి కారం పొగరు గురించి, పాయసం యొక్క దివ్యత్వం గురించి, అరటికూరలో పెట్టిన ఆవాల ఘాటు గురించి; ఒకటేమిటి, ఎన్నో విషయాలు కూలంకషంగా చర్చించుకుని, కథలు కథలు గ చెప్పుకుంటున్నారు. ఇంతలో ముక్కల పులుసు, దాని తదుపరి, కొబ్బరి పెరుగు పచ్చడి, అ పైన , కమ్మటి గడ్డ పెరుగు వడ్డనలకు వచ్చాయి. జనాలు మైమరచి తిన్నారు. మరీ మరీ మారు వడ్డించుకుని తిన్నారు. ఇంత అపూర్వమైన రుచికరమైన భోజనం, ఈ మధ్యకాలం జరిగిన పెళ్ళిళ్ళ లో కూడా తినలేదని శపథాలు పట్టేరు. అందరు అయిష్టంగానే ఉత్తరాపోసనం పట్టేరు.
ఇంత చక్కటి భోజనం పెట్టిన్చినందుకు నాకు ఎన్నో అభినందనలు తెలిపేరు. అప్పుడు నేను అందరిని, నేను చెప్పే ఆశీర్వచన వచనం మనస్పూర్తి గా చెప్పి లేవమన్నాను.." పాక కర్తా, తథా భోక్తా, అన్న దాతా శుఖీభవ!" . అందరు ఏక కంఠం తో గట్టిగా చెప్పారు.
ఇక భుక్తాయాసం తో ఆకు ముందు నుండి లేవలేక ప్రయాస తో లేచి చేయి కడుకుని చెట్ల కింద అసీనులయ్యారు. ఇంతలో చక్కటి తాంబూలం అందరికి అందింది. తాంబూల చర్వణం తరువాత అందరు చెట్ల నీడన గుర్రు పెట్టి పడుకున్నారు. సుమారు ఇదు గంటల ప్రాంతం లో అందరిని నిద్ర లేపి, కాఫీ టీ లు అందించి, వంట వారికీ ధన్యవాదాలు తెలిపి అందరూ గృహోన్ముఖం అయ్యాము. వెళ్ళే ముందరు అందరు, ప్రతి సంవత్సరం ఇలాగే వన(మనః) భోజనం పెట్టిస్తానని నా చేత మాట తీసుకున్నారు. అంతా "ఈశ్వర కృప" అని నమస్కరించి అందరికి ధన్యవాదాలు తెలిపెను.
ఈశ్వరార్పణం!