Friday, June 12, 2015

కాలక్షేపం కబుర్లు: ‘మాగీ మై డియర్!’


‘మాగీ మై డియర్!’


రమణ బంధకవి


“ఎవోయి! మన లేటెస్ట్ పాపులర్ తార ఎవరో తెలుసా?” అడిగాను మా శ్రీమతిని.

“ఇంకెవరూ దీపిక పడుకొనే?”

“కాదు”

“కంగనా రనౌత్?’

“కాదు”

“పోనీ అనుష్క?”

“కాదోయి” అన్నాను నవ్వుతూ.

“పోనీ అలా సాగ దీయకుండా చెప్పొచ్చుగా?” దెప్పింది శ్రీమతి.

“సరే విను. అదెవరో కాదు. మనందరకూ నచ్చిన, మనం బాగా మెచ్చిన వన్ అండ్ ఓన్లీ ‘మాగి’ మై డియర్!”

“ఓ! అదా? సర్లెండి” అంటూ లోపలి వెళ్ళింది శ్రీమతి.

‘మాగీ’ అంటే అందరికి అదో చక్కని అనుభూతి! పిల్లా మేక, పెద్దా పీచు అందరూ ఎప్పుడూ లేక ఎప్పుడో అప్పుడు, ఆ సన్నటి, చిన్నటి, మెత్తటి, తెల్లటి ఉంగరాల తాళ్ళను స్పూను లేదా ఫోర్క్ సాయంతో నోట్లికి జుర్రెసుకునే వుంటారు. అవి ఎంత గోప్పవంటే, ఫాషన్ డిజైనేర్స్, అందాల భామల కోసం వీటి స్పూర్తితో ‘నూడుల్ స్ట్రాప్’ బ్లౌసెస్ తయారు చేయుస్తుంటారు.

స్కూల్ బస్సు లోంచి దూక్కుంటూ నల నీలుల్లగా  దాడి చేసి ఇంటిని క్షణాల్లో కిష్కింద గా మార్చే పిల్ల కోతుల్ని అమాంతం కట్టి పారేసే సున్నితమైన ఆయుధమే ఇల్లాలి చేతి లోని ‘మాగీ’.

అలసిపోయి ఇంటికి వచ్చిన భర్త “ తినడానికి ఏమైనా ఉందా?” అని అడగ్గానే “ 2 మినిట్స్” అంటూ ఇల్లాలు అయన మేజోళ్ళు విప్పుకునే లోపు వేడి వేడిగా కప్పులో అందించే చక్కటి ఉపాహరమే మన ‘మాగీ’.

మరేంటదీ...ఈ మధ్యనే నిద్రలో ఉలిక్కిపడి లేచి హటాత్తుగా దానిలో సీసం వగైరాలు మరియూ, ఓ జపాను వాడు కనిపెట్టిన మంచి రుచి నిచ్చే రసాయనం ‘అజినమోటో’ మోతాదు మించి ఉన్నాయని ఆహార నిపుణులు చెప్పటం, పత్రికలూ, టీవీలు ఏక బిగిని రాత్రింబవళ్ళు ఘోషించటం, దరిమిలాను ప్రభుత్వాలు నిషేదించటం ‘2 మినిట్స్’ లో జరిగిపోయాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలలో నిషేదాజ్ఞలు ఇంకా పొయ్య మీద ఉడుకుతున్నట్లు భోగట్టా!

ఈ గొడవల్లో పాపం ‘మాగి’ గ్రహణం పట్టిన చందమామలా, ఫ్లాప్ సినిమా హీరోయిన్లా కాంతి, స్థానం పోగొట్టుకుంది. సందట్లో సడేమియా ఈ లోగా కార్టూన్లు గీస్తున్నారు, పంచ్లు పేలుస్తున్నారు, సెటైర్లు అంటిస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక కార్టూన్లో ఓ బుజ్జిపిల్ల సెలవులయి పోయి స్కూళ్ళు తెరుస్తున్నారన్న దిగులుతో ‘నూడుల్స్ తో వురి వేసుకుని చనిపోవాలని వుందిరా నానీ’ అని పక్క బుజ్జిగాడుతో చెపుతోంది. హన్నా..?

ప్రతి దానికి ఎడ్డెం అంటే తెడ్డం అనే ఒక తిక్క శంకరయ్య పెద్ద మాగి డబ్బాలోంచి జూప జూపా నూడుల్స్ జుర్రేస్తూ “నాకు మాగి అంటే ప్రాణం, ప్రాణాలు పోయినా తిండం మానను, పోయిన తరువాత కూడా పైన నూడుల్స్ దండలే వెయ్యండి’ అని సెలవిచ్చారు.

ఇంతలో ‘టిఫిన్ రెడీ’ అన్న శ్రీమతి అనౌన్సుమెంట్ ఎంతో కర్ణపేయంగా అనిపించి టేబుల్ వైపు నడిచాను. పింగాణి ప్లేటులో, తాండవ కేళిలో జగమంతా వ్యాపించిన శివుని జటాజూటం లాగ వ్యాపించి, పొగలు కక్కుతూ, కమ్మటి మసాలా వాసనతో ఆహ్వానిస్తూ ఉన్న ‘మాగి’ నూడుల్స్ కనిపించాయి.

“ఏమోయి! నీకేమైనా వెర్రా? దిన పత్రికలూ చదవటంలా? టీవిలో న్యూస్ చూడటంలా? ఇది చేసేవేమిటి?” అని విస్తుబోయాను.

“ఆ! అన్నీ చూడ్డం, వినటం అయ్యింది! పనిమనిషి రాలేదు. ఇదే కదా తొందరగా అయ్యేది. అందుకనే చేసాను” అంది నిర్లిప్తంగా.

“మరి ఆ లోహాల మాటేమిటి? నా ప్రేవులు లోహపూరితమైపోతేనో?” అన్నాను కించిత్తు భయంగా.

“పోన్లెండి, సర్దారు పటేలు తరువాత లోహ పురుషుడు మీరే అవుతారు. ఐనా మనం తాగే నీళ్ళలో ఫ్లోరైడు, పీల్చేగాలిలో కార్బన్లు, బియ్యంలో యూరియా, కూరల్లో క్రిమి సంహారకాలు, పళ్ళలో కృత్రిమ రంగులు, పాలు పెరుగులో పెయింట్లు, పిగ్మెంట్లు ఉన్నాయని చెవిని ఇల్లు కట్టుకుని పోరుతున్నారు. వీటన్నిటికీ నోరు మూసుకుని నలుగురుతో పాటు నారాయణ అనుకున్నామా లేదా? ఎదో వీసమంత సీసం ఉంటే, మీసాలు మెలేసుకుని, బోరలు  విరుచుకుని కధాకలి చెయ్యటం ఎందుకుట? చూడండి నాలుగు రోజుల్లో ‘తిట్టిన నోరే పొగుడు’ అన్న చందాన్న మన ‘మాగీ తల్లికి’ మంచి రోజులు రాక పోవు, మళ్ళీ అది ‘వంద రోజుల బొమ్మ’ కాక పోదు. అన్నట్లు కామక్షికి ఫోన్ చెయ్యాలి. దాని కొడుకు పట్టూ కి మాగి అంటే ప్రాణం. బెంగ పెట్టుకుని తిండి మానేస్తాడేమో వెర్రి వెదవ!” అని గుక్క తిప్పుకోకుండా చెప్పి గుక్కెడు నీళ్ళు తాగింది శ్రీమతి.

పొట్టలో ప్రేవులు, ప్లేట్ లో నూడుల్స్ మెలిపెడుతుండం వల్ల తర్కాన్ని జేబులో పెట్టి, “అ ఫోర్క్ ఇటు పారెయ్” అని ప్లేటుని ముందుకు లాక్కున్నాను.



Tuesday, June 9, 2015

కాలక్షేపం కబుర్లు: వీధి

కాలక్షేపం కబుర్లు:
పాఠకులకు నమస్కారం! కాలక్షేపం కబుర్లు అనే శీర్షిక మీ ముందుకు తెస్తున్నామని చెప్పటానికి సంతోషిస్తున్నాను. ఈ శీర్షిక క్రింద దైనందిన జీవితంలోని పలు విషయాల మీద కబుర్లు సరసమైన శైలి లో మీ ముందు ఉంచుతాము. వీటిని చక్కగా సాయంత్రం పూట ఏ జంతికలో, పకోడీలో లేక పునుకులో, మిర్చి బజ్జీలో తింటూ కాఫీ పానీయం సేవిస్తూ చదువుకుని ఆనందించండి. లేక రాత్రి పోద్దుపోయేక ఏ మైసూరు పాక్ ముక్కో, మినప సున్నో ఆస్వాదిస్తూ చదువుకోండి.

రమణ బంధకవి

సంపాదకుడు


వీధి

రమణ బంధకవి

సరిగా నాలుగు కునుకులైనా తీయకుండా, ఎర్రబడ్డ కళ్ళతో, కంద గడ్డ మొహం తో, ఉదయం ఆరు గంటలకే కొంపమునిగిపోయినట్లు వచ్చేసాడు సూరీడు.

పక్క పైకి తిరిగి లాగుతున్న బద్దకాన్ని బుజ్జగిస్తూ ..అదేంటది... మా శ్రీమతి సతాయిస్తూ వుంటుంది... అదే మార్నింగ్ వాక్ అని ...దాని నిమిత్తం వీధి లోకి అడుగు పెట్టాను.

సిగ తరగ! మోడీ గారి ‘స్వచ్చ భారత్’ స్కీం కళ్ళు గప్పి, ఎప్పుడు లేచి పోసేసేరో తెలీదు..పక్కంటి వాళ్ళు చెత్త కుప్పను తెచ్చి మా ఇంటి ఎదురు రోడ్డు వారగ!

నాలుగు అడుగులు వేసేనో లేదో, మార్నింగ్ వాక్ మిష మీద ఉన్న ఒక ఇల్లాలు, ఓ ఇంటి గోడ మీదనుండి వొంగి, కాలక్షేపం కోసం వచ్చే పోయే వాళ్ళను తన సువాసనతో పలకరిస్తున్న కరివేపాకు రొబ్బలను, వొడుపుగా దూసేసి కొంగున కట్టేసుకుంటోంది. కొంగు కలెక్షన్లో రెండు ములక్కాడలు, నాలుగు గులాబీలు, ఒక మామిడికాయ నా కంట బడ్డాయి. సంపద నలుగురి కోసం అన్న సామ్యవాదపు సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తున్న ఆ ఇల్లాలు, బహుశా ఆ రోజు వంటలోకి మామిడికాయ పప్పు, ములక్కాడ-కరివేపాకు చారు ఖాయం చేసి వుంటుంది అనుకున్నాను. అసంకల్పిత ప్రతీకార చర్య లాగా గభాలున నోరు వూరింది. అన్నట్లు మా శ్రీమతి ఈ రోజు ఏం వండుతుందో? వచ్చేప్పుడు ఫ్రిజ్ లోంచి నాలుగు అరటికాయలు బయటకు తీయడం చూసేను. ప్రాప్తం వుంటే వేపుడు...లేకపోతే ముద్ద కూర!

కొంచెం ఎదురుగా ఎవరి ఇంట్లోంచో ఇద్దరు కూలినాలి చేసుకునే ఆడపడచులు నడుము మీద ప్లాస్టిక్ బిందెతో నీళ్ళు మోసుకొని పోతున్నారు. ఒక బిందె నీళ్ళతో సంసారం గడవాలి కామోసు. ఏమిటో ఈ పరిస్థితులు ఎప్పుడు మారతాయో! ఇంతలో కాలి కింద నుండి పాము లాగా జరా జరా పాకుతూ నీటి కాలువ వెళ్లిపోతుంటే వెనక్కి తిరిగి చూసాను. వీధి మొగలో ఎత్తైన ఇంటి ముందు పడవలాటి కారుని, డ్రైవర్ కాబోలు లావుపాటి రబ్బర్ ట్యూబ్ తో బడ బడా నీళ్ళు పోసేస్తూ కడుగుతున్నాడు. నీళ్ళు కాలవలు కట్టి దిగువకు ప్రవహిస్తున్నాయి. సొమ్ము ఒకరిది సోకొకరిది! బకెట్ నీళ్ళలో గుడ్డ ముంచి తుడవ లేడూ బద్ధకపు బడుద్దాయి? ఆ నీళ్ళతో చిన్నకారు కుటుంబం స్నానాలు కూడా చెయ్యొచ్చు. సామాజిక వనరులు పొదుపుగా వాడుకోవడం ఎప్పటికి వస్తుంది పరమేశా?

వీధి మలుపులో కుడి వైపు ఇంటి ముందు, క్రిందటి రాత్రి జరిగిన విందు తాలూకా మిగిలిపోయిన రొట్టెలు, కూరలు, బిర్యానీ ఇత్యాదులు అసహ్యంగా కుప్పగా పోసి ఉన్నాయి. కనీసం మిగిలిన ఆహారం చక్కగా ఏ అన్నార్తులకో పంపించవచ్చుగా! హుహుం ..మనకు అహం అడ్డుగా! అది సరే! ఈ సంగతి పసిగట్టి వీధి కుక్కలు బంధు మిత్రులకు అరుపుల ద్వారా అర్జెంటు వర్తమానాలు పంపి, దొరికిన సంపద ‘సమ న్యాయంతో’ ఎలా పంచుకోవాలో పంచాయతీ పెట్టుకున్నాయి. ఒక్కోప్పుడు ఆటువంటి పంచాయతీ నిర్ణయాలు దారేబోయే దానయ్యల పిక్కలు పీక్కురమ్మని కూడా ఉండటం కద్దు కాబట్టీ, ఎందుకైనా మంచిదని పంచాయతీకి కొంచెం దూరం గా నడుస్తూ, పార్కు దగ్గరికి వచ్చెను.

పార్క్ అంటే పూల మొక్కలు, మెత్తటి తివాచీ లాను వగైరా వుంటాయి...కదా? అలా అని గబుక్కున ఊహించేసుకోకండి. ఎదో ఎగుడు దిగుడు నేలకి కంచే కట్టి పార్క్ అని పిలుచుకుంటూ కాలనీ వాసులు వీపులు గట్రా చరిచేసు కుంటున్నారు. లోపల అక్కడక్కడా, ప్రగతి పై సమాధానం చెప్పలేని ప్రశ్నల్లా, చిన్నా, పెద్దా బండరాళ్ళు బయటకు పొడుచుకొచ్చి ఉంటాయి. వాటికి కాలి బొటన వేళ్ళు బలి ఇచ్చుకుని రక్తం ఓడుతూ, కుంటుకుంటూ ఇంటి ముఖం పట్టే వాకర్స్ ని చూడటం కద్దు. డొంకలు, తుప్పలమయంతో గందరగోళంగా ఉంటుంది. అన్నట్లు, త్రాచు పాములు, రక్త పింజర్లు లాంటివి నాలుగైదు కుటుంబాలు పిల్లా, జెల్లాతో కాపురం ఉంటున్నట్లు కాలనీ వాసుల భోగట్టా! పార్కు డెవలప్మెంట్ క్రింద ఒక ఖర్చు ఐటెం ప్రతి ఏడాది కాలనీ బడ్జెట్ లో కనబడుతూ వుంటుంది. అయినా.. కనబడే వన్నీ నిజాలా ఏమిటీ .. పోదురూ బడాయి!

అన్నట్లు కాఫీ టైం అయినట్లు వుంది. ఈ రోజుకు ఈ వాకింగ్ చాలు. మాంచి సామాజిక అవగాహన వచ్చింది కూడానూ! అర్థం అయినట్లు, కానట్లు ఉన్న ఆ వీధిలోంచి ఇంటివైపు అడుగులు వేసాను...



Saturday, April 18, 2015

అప్పు చేసి పప్పు కూడు తినకురా!

పాఠకులకు నమస్కారం! కొన్ని సాంకేతిక కారణాలవలన ఇటీవల మనం తెలుగు భోజనం లో కలుసుకోవడంలో కొంత జాప్యం జరిగింది. అందుకు క్షంతవ్యులం. మన వెబ్ సైట్ తయారీ కూడా వేగం పుంజుకుంది. త్వరలోనే తెలుగుభోజనం వెబ్ సైట్ కూడా ఆవిష్కరించబడుతుంది.

వేసవి వేడిమి మొదలైంది. పిల్లలందరూ పరీక్షలు అవీ చక్కగా వ్రాసి వేసంగి విహారయాత్రలుకు సిద్దం అవుతూ ఉండి ఉంటారు. ఉద్యోగస్తులంతా ఆర్ధిక సంవత్సర ముగింపు జాతరలు పూర్తి చేసుకుని హమ్మయ్యా అనుకుంటూ వుంటారు. అమ్మలందరూ క్రొత్త ఊరగాయల పర్వానికి సన్నద్ధం అవుతూ ఉండి వుంటారు. మీ అందరికి తెలుగుభోజనం తరఫున శుభాభినందనలు.

వేసవిలో తాజా కూరగాయల కొరత కొంత ఉండక మానదు. ఇక పప్పు దినుసుల ధరలు అంబరాన్ని చుంబిస్తున్నాయి అనడం అతిశయోక్తి కాదు. అంతేకాదండీ! పప్పుకూడు చేసుకోవాలన్నా అప్పు చేయక తప్పదేమో! అందుకే మరి ఇల్లాళ్ళకు కలగూర పప్పులు వండే అవసరం మరియు అవకాశం ఈ రోజుల్లో మెండు. పప్పుకూడు- అప్పు ఈ రెండిటికీ ఉన్న సంబంధం గురించి తనదైన రీతిలో విశ్లేషిస్తూ, పాఠకులకు రుచికరమైన తోటకూర పప్పు చేయడం గురించి వివరిస్తున్నారు శ్రీమతి నయన.


రమణ బంధకవి

సంపాదకుడు



అప్పు చేసి పప్పు కూడు తినకురా!


శ్రీమతి నయన కస్తూరి

'అప్పు చేసి పప్పు కూడు తగదు' చాలా మంది మన హితులు శ్రేయోభిలాషులు మనకు సలహా ఇస్తూనే వుంటారు. అయితే ఇక్కడ 'పప్పు కూడు' అంటే కేవలం 'పప్పన్నం' మాత్రమే కాదు అని మనం గ్రహించాలి. ''ఏమ్మా! పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తావ్?” అని ఎవరైనా ఒక పెళ్ళికాని అమ్మాయిని అడిగారంటే 'పెళ్లెప్పుడమ్మా?' అని అడగకనే అడిగినట్టన్న మాట! వారి ఉద్దేశ్యం లో 'పప్పన్నం' అంటే ఏంతో ఖర్చు తో కూడిన అనేక మధుర పదార్ధాలతో కూడిన సంపూర్ణ పెళ్లి భోజనం అన్న మాట. పెళ్లిభోజనం పెట్టాలంటే పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం! కాబట్టి 'పప్పు కూడు' అంటే పెళ్లి భోజనం లేక ఏదైనా పండగ భోజనం మాత్రమే  కాకుండా దాని వెనుక వుండే  ఒక వేడుక ....ఒక పండగ.....ఒక సరదా.... జరుపుకోడానికి అయ్యే ఖర్చు అన్నమాట!

ఇలా చూసుకుంటే 'అప్పు చేసి పప్పు కూడు' మంచిది కాదు.  మన సరదాలకి, వేడుకలకి మన దగ్గర వున్నంతలో ఖర్చు పెట్టుకోవాలి కాని వాటి కోసం
మనం అప్పులు చేయకూడదు. అసలు పూజలికి కానీ  పండగలకి కానీ  అప్పు చేసి సంబరాలు జరుపుకొరాదు అని మన పెద్దలు చెప్పనే చెప్పారు.  మన యధాశక్తి చేసుకోవాలే  కానీ శక్తికి మించి జరప రాదు. చాలా మందికి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి, తమ సరదాలు తీర్చు కుంటూ వుంటారు. అయిన దానికి కాని దానికి తమ దగ్గర  తగినంత ఆదాయం లేకపోయినా అప్పులు చేసి అన్ని హంగులు అమర్చుకుంటూ ఉంటారు. తర్వాత ఆ అప్పులు తీర్చలేక నానా అగచాట్లు పడుతూ ఉంటారు. ఇలాంటి వారిని చూసే ఈ నానుడి వాడుక లోకి వచ్చి వుంటుంది.

అందుకే మనందరం  ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి.  ఏ పని చేయవలసి వచ్చ్హినా ముందుగా మనకున్న వనరులు చూసుకుని, ఆర్ధిక ప్రణాళిక తయారు చేసుకుని దానికి లోబడే మన ఖర్చులుండేలా చూసుకోవాలి. ఒక వ్యక్తీ అయినా, ఒక సంస్థ అయినా, ఒక దేశమైనా ఈ సూత్రాన్ని అనుసరించి, 'పప్పు కూడు' కోసం అప్పు చేయకుండా తమ  ఆదాయ ఖర్చులు బేరీజు వేసుకుని, అర్ధం లేని అనవసర ఆడంబరాలకి మన శక్తి కి మించి పోకుండా తమ ఖర్చులను నియంత్రణ చేసుకుంటే అప్పుల పాలయ్యే ప్రశక్తే లేదు.  ఎవరికీ లోటు బడ్జెట్ సమస్య అనేదే వుండదు. అదే నిజమైన పండగ .... నిజమైన 'పప్పు కూడు' అంటే మరి మీరిప్పుడు గ్రహించారా? 'అప్పు చేసి పప్పు కూడు తగదు' అనే నానుడి లో పెద్ద మేనేజ్ మెంట్ దాగి ఉందండోయ్! ఈ విషయాన్ని ఇంటి ఖర్చులు చూసుకునే గృహిణులు మరియు ఇంటి యజమానులు గుర్తించుకుంటే ప్రతి ఇల్లు ఒక స్వర్గ సీమ అవుతుంది. కుటుంబ కలహాలకు తావే వుండదు. 

ఇక అసలు పప్పు విషయానికి వస్తే  ఈ రోజులలో అన్ని ధరలతో పాటు పప్పుల ధరలు ముఖ్యంగా పెసరపప్పు ధర నక్షత్రాలను అంటుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. పప్పులు సమృద్ధిగా కొనుక్కుని గిన్నె నిండా పప్పు చేసుకుని తినాలంటే సామాన్య మానవుడికి అప్పు చేయకుండా వుండటం కష్టమే! అందుకే మీకందరికీ నాదొక సలహా ....... పప్పుని కొంచెం గా తీసుకుని తక్కువ ధరలో లభ్యమయ్యే ఆకు కూరలు, ఆ కాలం లో విరివిగా దొరికే కాయగూరలు ఎక్కువగా తీసుకుని, కలగలుపు పప్పులు చేసుకుంటే రుచికి రుచి, బలానికి బలం, ఆదాకి ఆదా! అవునా కాదా? ఉదాహరణకి తోటకూర-కందిపప్పు, పాలకూర-శనగపప్పు, బచ్చలి కూర-పెసరపప్పు, దోసకాయ పప్పు, మామిడికాయ పప్పు, సొరకాయ పప్పు, బీరకాయ పప్పు .......... ఇలా అన్నిరకాల కూరలు కలిపి పప్పులు చేసుకోవచ్చు

తోటకూర-కందిపప్పు:

ఇప్పుడు తోటకూర-కంది పప్పు ఎలా చేసుకుంటే రుచిగా ఉంటుందో తెలుసుకుందాం. మూడు తోటకూర కట్టలు తీసుకుని కడిగి శుభ్రం చేసుకుని, సన్న గా తరుగుకోవాలి. ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలుగా తరుగు కోవాలి.  ఒక చిన్న కుక్కర్ ని తీసుకుని, అందులో ఒక అరగ్లాస్ కందిపప్పు తీసుకుని,  దాంట్లో మనం ముందే తరిగి ఉంచుకున్న తోటకూర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి, చిటికెడు పసుపు, ఒక పావు చెంచాడు కారం, తగినంత ఉప్పు కొంచెం గా పులుపు రావడానికి కొంచెం చింత పండు గుజ్జ్జు కలిపి, సరి పడ నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. పక్క స్టవ్ మిద ఒక చిన్న మూకుడు పెట్టి, ఒక చెంచాడు నూనె పోసి, వేడెక్కాక రెండు ఎండు మిరపకాయలు  ముక్కలుగా చేసుకుని, ఒక చెంచాడు మినప్పప్పు, ఒక అరచెంచాడు ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. పోపు వేగాక వుడికిన పప్పులో బాగా కలిసేలా కలుపుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇదే ఎంతో  రుచిగా వుండే తోటకూర కలగలుపు  పప్పు! ఇది అన్నం లోకి బాగుంటుంది. చపాతీల్లోకి, పూరీల్లోకి కూడా బాగుంటుంది. చేసుకుని తినండి. 





Monday, March 30, 2015

శ్రీ సీతా రామాభ్యానమః

ముందుమాట:

పాఠకులందరకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు! మర్యాదా పురుషోత్తముడైన ఆ ఇనకుల రామయ్య యుగ యుగాలు గా మానవాళి హృదయ మందిరాలలో నెలకొని ఎందరి జీవితాలనో ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. శ్రీరామ నవమి పర్వ దిన సందర్భాన, ఆ కౌసల్యా తనయుని ప్రార్థిస్తూ నా మనసులోంచి వచ్చిన నాలుగు చరణాలను మీ ముందు ఉంచుతున్నాను. చదివి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

రమణ బంధకవి

సంపాదకుడు



శ్రీ సీతా రామాభ్యానమః 


పారిజాత తరువు పరవశించి పూసింది తనువెల్లా సుమాలు,
వనపాళి మురిసి సడిచేసే శతకోటి సన్నాయి స్వరాలు,
తులసమ్మ మై మరచి చిగురించే రెమ్మ రెమ్మ కు వేయి దళాలు, 
ఇనకుల రామయ్య ఉదయించే నేడు, కలుగు అనేక శుభాలు!

పదములు తాకంగా పులకరించెను ఒక రాయి;
                 పడతి గా మారి ప్రణమిల్లెను శాప విమోచనమయి;
కఠిన శిలలు వోలె కారుణ్యము లేక ఇల జనులు, 
                   బడయుచున్నారు, రాలవంటివే వారి హృదయాలు,
కరుణించి పదమిడు మా హృదిని, వీక్షించి నీ శాంత నయనాలు,
           కరిగి జనియించునేమో ప్రేమాను రాగాలు, సమయు కార్పణ్యాలు! 


పరిణయమాడంగ చేపట్టి విరిచేవు మేటైన శివుని విల్లు
                                సీతమ్మ హృదయాన కురిసింది ప్రణయాల విరిజల్లు.
మానవాళి మదియందు నెలకొంది అహంకారపు పెను విల్లు,
                వేగంగా విరువగా రావే, ఇక వెలసేను లోకాన మమతల హరి విల్లు.

కరకు బాణాల బడవైచితివి దనుజులెల్లరినో,
                           త్రుంచి వైచితివి సంగారాన లంకేశు శిరాలెన్నో!
మనుష్య హృదయాన ప్రజ్వరిల్లే అరిషడ్వర్గాలు,
                          దురాశ, దుర్నీతి, వ్యామోహ మద మత్సరాలు!
ఇవియే కాబోలు, మారు మారు మొలకెత్తు 'దశకంఠ' శిరాలు
                   దహియించగా వీటిని, విడువుమయ్య యిక రామ బాణాలు!



Wednesday, March 18, 2015

‘చల్ల కొచ్చి ముంత దాచినట్లు!’


శ్రీమతి పద్మా రఘునాద్

మనందరికీ  రోజు అనేక మందితో వ్యవహారాలు వస్తుండటం, పోతుండటం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. వీటిని అనుసరించి వివిధ స్వభావాలున్న వ్యక్తులు మనకి తారస పడటం,వారితో మనకి మాట్లాడే అవసరం కూడా కలుగుతుంటుంది. కొంత మంది ‘చల్లకొచ్చి ముంతని దాచే’ విధంగా మాట్లాడటం పరిపాటే!  ఈ తెలుగు సామెతకి అర్ధం ఏమిటో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం! 

‘చల్ల’ కావాల్సి వచ్చి, మొహమాట పడి ‘ముంత’ ని దాచి పెట్టి మెల్లగా తరువాత దానిని బైటకి తీసి అడగటం అన్న మాట. ఇంకా వివరించాలంటే, ఏదైనా అవసరం పడి నేరుగా దాన్ని తీర్చమని అడగటానికి మొహమాటం, చిన్నతనం అనిపించి వేరే సాకు మీద వచ్చినట్లు గా వచ్చి మాటల సందర్భం లో వారి కోరికను బైట పెట్టటం అపుడపుడు మనం చూస్తూ ఉంటాం! 

ఇంకా చెప్పాలంటే ఏ పంచదారో, కాఫీ పోడో బదులు కావాల్సి వస్తే, గిన్నె లేదా కప్పుని దాచి పెట్టి, యోగ క్షేమాలు కనుక్కోటానికి వచ్చినట్లు గా వచ్చి, పిచ్చాపాటీ మాట్లాడితర్వాత బదుళ్ళు అడగటం అన్నమాట. ఇదే ‘చల్ల కొచ్చి ముంత దాయటం’ అంటే!  పనులను సులువుగా జరిగేలా చేసుకోటానికి ఉన్న మార్గాల్లో ఇదొకటి మరి. సరే ఇక మన తెలుగు సామెత లోని ‘చల్ల’ గురించి అందరికి తెలిసిందే అయినా మళ్ళి కొంచెం తెలుసుకుందాం. 

పూర్వ కాలం లో ఈ చల్ల లేదా మజ్జిగని కవ్వం తో తోడూ పెట్టిన పెరుగుని చిలికి చేసుకునే వారు. ముంతల్లోను, మట్టి కుండల్లోను గడ్డ పెరుగు ని తోడు  పెట్టుకుని, దాన్ని కవ్వం తో గంట సేపు చిలికి, మంచి వెన్నని తీసి దాచి తర్వాత దాన్ని పొయ్యి మీద కాచి మంచి ఘుమ ఘుమ లాడే నేయిని చేసుకునేవారు. ఈ వెన్న తీసేసిన మజ్జిగని కూడా ఒక ముంత లేదా పాత్రలో ఉంచుకుని ఎండని పడి  వచ్చిన  అతిధులకి అందులో చిటెకెడు ఉప్పుని వేసి ఇచ్చేవారు.

ఎండని పడి వచ్చిన వారికి ఈ మజ్జిగతో ప్రాణం లేచి వచ్చి కొంచెం సత్తువ వచ్చేదిట.  ఈ మజ్జిగనే ‘చల్ల’ అని కూడా పిలవటం వాడుకలో ఉంది. క్రమక్రమంగా పెరుగుని కవ్వం తో చిలకటం, వెన్న తీయటం, అది కాచి నేయి తీయటం, ఆ మజ్జిగని అతిదులకివ్వటం కనుమరుగయ్యి చాలా కాలం అయిందనే చెప్పాలి. ఇపుడు రెడీ గా దుకాణాలలో తయారు చేసిన పెరుగుని, నేయిని, ఆఖరికి మజ్జిగని కూడా అమ్మటం తో ఇంక పైన చెప్పిన పనులన్నిటితో అవసరం పోయిందనే చెప్పాలి!

ఇపుడు ఇంటికి వచ్చిన వారికి అందించటానికి ఆకర్షణీయమైన రంగు రంగుల, తీపి పులుపులు కలిపి తయారయిన  రకరకాల పానీయాలు కూడా తయారుగా ఉన్నందువలన,  అవే ఇవ్వటం ఈ నాటి సభ్యత గా కుడా చలామణి అయిపోతోంది.  పైగా అవి ఇవ్వకుండగా, మజ్జిగ ఇస్తే చిన్నతనం గా అనిపించే కాలం లో కూడా మనం ఉన్నాం కనుక, ఈ ‘మజ్జిగ’ లేదా ‘చల్లని’ గురించి మనం మళ్లి  గుర్తుకు  తెచ్చుకుని, దానిలోని పోషక లవణాలని, దాని రుచిని, అది మనకి ఇచ్చే శక్తిని మరొక్క సారి గ్రహిస్తే, మళ్లి ఈ చల్లని మనం సేవించే పానీయాలలో చేర్చుకునే అవకాశం ఉందని అనిపిస్తుంది. చల్ల లేదా మజ్జిగని మనం రకరకాల రుచులతో తయారు చేసు కొవచ్చును. 

చిటికెడు ఉప్పు,నిమ్మ రసం కలిపిన నిమ్మ కాయ మజ్జిగ ఎండా కాలం లో ఎంతో తీసుకుంటే ఎంతో శక్తిగా ఉంటుంది. అలాగే అందులో కొంచెం ఆవాలు, కరివేపాకు, జీలకర్రని పోపు పెట్టుకుని, చిటెకెడు ఉప్పు వేసుకుని తాగితే అదో రుచి మరి. అలాగే కొంచెం వాము పొడి లేదా వాముని పోపు పెట్టుకుని వాము మజ్జిగాగా చేసు కోవచ్చును. లేదా కొంచెం జీల కర్ర పొడి, చిటికెడు ఉప్పు, పుదీనా ఆకులని వేసుకుని పుదీనా మజ్జిగని కూడా చేసుకోవచ్చును. గుజరాత్, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో కూడా ఈ మజ్జిగతో  ‘చాస్’ అని ‘లస్సి’ అని చేస్తారని అందరకు తెలిసిన విషయమే!

ఒకమాట మాత్రం నిజం సుమండీ! బాగా దాహం గా ఉన్నపుడు, బడలికగా ఉన్నపుడు ఈ ‘చల్ల’ లేదా ‘మజ్జిగ’ తాగితే సేద తీరినట్లుగా ఇంక వేరే ఏ  పానీయాలు తీసుకున్నా రాదనీ గట్టిగా చెప్పవచ్చు. 

పైన చెప్పిన రకరకాల మజ్జిగలని మనమే చాల సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు బోలెడంత డబ్బు ఖర్చు పెట్టకుండగానే! ఈ సారి మనకి  ఎవరింట్లో అయినా  ఈ చల్లని ‘చల్ల’ చేసి ఇస్తే, మనస్పూర్తిగా సేద తీరినట్లే మరి. మనం కూడా అలానే వారికీ సేద తీరుద్దామా? ఏమంటారు చెప్పండి