కాలక్షేపం కబుర్లు:
పాఠకులకు నమస్కారం! కాలక్షేపం
కబుర్లు అనే శీర్షిక మీ ముందుకు తెస్తున్నామని చెప్పటానికి సంతోషిస్తున్నాను. ఈ
శీర్షిక క్రింద దైనందిన జీవితంలోని పలు విషయాల మీద కబుర్లు సరసమైన శైలి లో మీ
ముందు ఉంచుతాము. వీటిని చక్కగా సాయంత్రం పూట ఏ జంతికలో, పకోడీలో లేక పునుకులో,
మిర్చి బజ్జీలో తింటూ కాఫీ పానీయం సేవిస్తూ చదువుకుని ఆనందించండి. లేక రాత్రి
పోద్దుపోయేక ఏ మైసూరు పాక్ ముక్కో, మినప సున్నో ఆస్వాదిస్తూ చదువుకోండి.
రమణ
బంధకవి
సంపాదకుడు
వీధి
రమణ బంధకవి
సరిగా నాలుగు కునుకులైనా తీయకుండా,
ఎర్రబడ్డ కళ్ళతో, కంద గడ్డ మొహం తో, ఉదయం ఆరు గంటలకే కొంపమునిగిపోయినట్లు వచ్చేసాడు
సూరీడు.
పక్క పైకి తిరిగి లాగుతున్న
బద్దకాన్ని బుజ్జగిస్తూ ..అదేంటది... మా శ్రీమతి సతాయిస్తూ వుంటుంది... అదే
మార్నింగ్ వాక్ అని ...దాని నిమిత్తం వీధి లోకి అడుగు పెట్టాను.
సిగ తరగ! మోడీ గారి ‘స్వచ్చ భారత్’
స్కీం కళ్ళు గప్పి, ఎప్పుడు లేచి పోసేసేరో తెలీదు..పక్కంటి వాళ్ళు చెత్త కుప్పను
తెచ్చి మా ఇంటి ఎదురు రోడ్డు వారగ!
నాలుగు అడుగులు వేసేనో లేదో,
మార్నింగ్ వాక్ మిష మీద ఉన్న ఒక ఇల్లాలు, ఓ ఇంటి గోడ మీదనుండి వొంగి, కాలక్షేపం కోసం వచ్చే పోయే వాళ్ళను
తన సువాసనతో పలకరిస్తున్న కరివేపాకు రొబ్బలను, వొడుపుగా దూసేసి కొంగున
కట్టేసుకుంటోంది. కొంగు కలెక్షన్లో రెండు ములక్కాడలు, నాలుగు గులాబీలు, ఒక మామిడికాయ
నా కంట బడ్డాయి. సంపద నలుగురి కోసం అన్న సామ్యవాదపు సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా
ఆచరిస్తున్న ఆ ఇల్లాలు, బహుశా ఆ రోజు వంటలోకి మామిడికాయ పప్పు, ములక్కాడ-కరివేపాకు
చారు ఖాయం చేసి వుంటుంది అనుకున్నాను. అసంకల్పిత ప్రతీకార చర్య లాగా గభాలున నోరు
వూరింది. అన్నట్లు మా శ్రీమతి ఈ రోజు ఏం వండుతుందో? వచ్చేప్పుడు ఫ్రిజ్ లోంచి నాలుగు
అరటికాయలు బయటకు తీయడం చూసేను. ప్రాప్తం వుంటే వేపుడు...లేకపోతే ముద్ద కూర!
కొంచెం ఎదురుగా ఎవరి ఇంట్లోంచో
ఇద్దరు కూలినాలి చేసుకునే ఆడపడచులు నడుము మీద ప్లాస్టిక్ బిందెతో నీళ్ళు మోసుకొని
పోతున్నారు. ఒక బిందె నీళ్ళతో సంసారం గడవాలి కామోసు. ఏమిటో ఈ పరిస్థితులు ఎప్పుడు
మారతాయో! ఇంతలో కాలి కింద నుండి పాము లాగా జరా జరా పాకుతూ నీటి కాలువ
వెళ్లిపోతుంటే వెనక్కి తిరిగి చూసాను. వీధి మొగలో ఎత్తైన ఇంటి ముందు పడవలాటి
కారుని, డ్రైవర్ కాబోలు లావుపాటి రబ్బర్ ట్యూబ్ తో బడ బడా నీళ్ళు పోసేస్తూ
కడుగుతున్నాడు. నీళ్ళు కాలవలు కట్టి దిగువకు ప్రవహిస్తున్నాయి. సొమ్ము ఒకరిది
సోకొకరిది! బకెట్ నీళ్ళలో గుడ్డ ముంచి తుడవ లేడూ బద్ధకపు బడుద్దాయి? ఆ నీళ్ళతో చిన్నకారు
కుటుంబం స్నానాలు కూడా చెయ్యొచ్చు. సామాజిక వనరులు పొదుపుగా వాడుకోవడం ఎప్పటికి
వస్తుంది పరమేశా?
వీధి మలుపులో కుడి వైపు ఇంటి
ముందు, క్రిందటి రాత్రి జరిగిన విందు తాలూకా మిగిలిపోయిన రొట్టెలు, కూరలు,
బిర్యానీ ఇత్యాదులు అసహ్యంగా కుప్పగా పోసి ఉన్నాయి. కనీసం మిగిలిన ఆహారం చక్కగా ఏ
అన్నార్తులకో పంపించవచ్చుగా! హుహుం ..మనకు అహం అడ్డుగా! అది సరే! ఈ సంగతి పసిగట్టి
వీధి కుక్కలు బంధు మిత్రులకు అరుపుల ద్వారా అర్జెంటు వర్తమానాలు పంపి, దొరికిన
సంపద ‘సమ న్యాయంతో’ ఎలా పంచుకోవాలో పంచాయతీ పెట్టుకున్నాయి. ఒక్కోప్పుడు ఆటువంటి
పంచాయతీ నిర్ణయాలు దారేబోయే దానయ్యల పిక్కలు పీక్కురమ్మని కూడా ఉండటం కద్దు కాబట్టీ,
ఎందుకైనా మంచిదని పంచాయతీకి కొంచెం దూరం గా నడుస్తూ, పార్కు దగ్గరికి వచ్చెను.
పార్క్ అంటే పూల మొక్కలు, మెత్తటి
తివాచీ లాను వగైరా వుంటాయి...కదా? అలా అని గబుక్కున ఊహించేసుకోకండి. ఎదో ఎగుడు దిగుడు
నేలకి కంచే కట్టి పార్క్ అని పిలుచుకుంటూ కాలనీ వాసులు వీపులు గట్రా చరిచేసు
కుంటున్నారు. లోపల అక్కడక్కడా, ప్రగతి పై సమాధానం చెప్పలేని ప్రశ్నల్లా, చిన్నా, పెద్దా బండరాళ్ళు బయటకు
పొడుచుకొచ్చి ఉంటాయి. వాటికి కాలి బొటన వేళ్ళు బలి ఇచ్చుకుని రక్తం ఓడుతూ, కుంటుకుంటూ
ఇంటి ముఖం పట్టే వాకర్స్ ని చూడటం కద్దు. డొంకలు, తుప్పలమయంతో గందరగోళంగా ఉంటుంది.
అన్నట్లు, త్రాచు పాములు, రక్త పింజర్లు లాంటివి నాలుగైదు కుటుంబాలు పిల్లా, జెల్లాతో
కాపురం ఉంటున్నట్లు కాలనీ వాసుల భోగట్టా! పార్కు డెవలప్మెంట్ క్రింద ఒక ఖర్చు ఐటెం
ప్రతి ఏడాది కాలనీ బడ్జెట్ లో కనబడుతూ వుంటుంది. అయినా.. కనబడే వన్నీ నిజాలా ఏమిటీ
.. పోదురూ బడాయి!
అన్నట్లు కాఫీ టైం అయినట్లు వుంది.
ఈ రోజుకు ఈ వాకింగ్ చాలు. మాంచి సామాజిక అవగాహన వచ్చింది కూడానూ! అర్థం అయినట్లు,
కానట్లు ఉన్న ఆ వీధిలోంచి ఇంటివైపు అడుగులు వేసాను...
No comments:
Post a Comment