Monday, June 15, 2015

పచ్చి టమాటో పప్పు


ముందుమాట:
పండినతరువాతే అన్నీ తినటానికి బావుంటాయనుకోవటం ఎల్లా వేళలా సరికాదు. కొన్ని పచ్చిగా ఉన్నా వాటిని రుచికరంగా చేసుకునే పద్దతులుంటాయి. అలాటి వాటిలోవే పచ్చి టొమాటోలు. టొమాటోలు బాగా పండి ఎర్రగా ఉన్నాకా ఎన్నో రుచికర పదార్దాలు చేసుకోవచ్చు. అయితే కొన్ని సమయాలలో అంగళ్ళలో టొమాటోలు పచ్చివి కూడా వుంటాయి. వాటితో చక్కని రుచికరమైన పప్పు చేసుకోవచ్చు అంటున్నారు శ్రీమతి రత్న. నేను మట్టుకు ఎన్నోసార్లు ఈ పదార్ధాన్ని సేవించి ఆనందించటం జరిగింది.

రమణ బంధకవి
సంపాదకుడు

పచ్చి టమాటో పప్పు 

శ్రీమతి రత్నా శ్రీనివాస్

కావలసిన పదార్దములు:
పచ్చి టమాటాలు                 :   పావు కేజీ 
కంది పప్పు                         :  ఒక కప్పు 
పచ్చి మిర్చి                         :  రెండు
ఉప్పు                                 : తగినంత 
పసుపు                               : చిటికెడు 
కారం                                   : ఒక టీ స్పూన్ 

పోపుకు కావలసిన పదార్దములు :
నూనె                                    : 2 టేబుల్ స్పూన్స్ 
మినపపప్పు                           :  1 టీ స్పూన్ 
ఆవాలు, జీలకర్ర                        :  చెరొక అర టీస్పూన్
మెంతులు లేదా మెంతి పిండి         :  పావు స్పూన్  
ఇంగువ                                  :  సరిపడ
కొత్తి మీర  తురుము                  :    కొంచెం 

తయారు చేయు విధానం:
ముందుగా పచ్చని రంగులో నిగ నిగ లాడే టమేటాలు తీసుకుని శుబ్రముగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. ఒక బాండీ  తీసుకుని కొద్దిగా నూనె వేసి వేడెక్కేక  పచ్చి మిర్చి వేసి వేగేక టమేటా ముక్కలు వేసి వేయించి ఉప్పు, పసుపు వేసి కలియ బెట్టి మూత  బెట్టుకుని చిన్న మంట మీద వుంచుకోవాలి. ఈ లోగా ప్రెజర్ పాన్ లో కంది పప్పు వేసి కడిగి, తగినంత నీరు పోసి, చిటికెడు పసుపు వేసి మూత  పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చి పప్పు వుడికిందనుకున్నాక స్టవ్ ఆపెసుకోవాలి.

ఈ లోపు టమేటాలు ఉడికి వుంటాయి. ఒక చిన్న పోపు గరిటలో పైన చెప్పిన పోపు దినుసులతో పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపును వుడికిన టమేటాలు లో వేసుకుని కలుపుకుని  తిరిగి స్టవ్ మీద పెట్టుకోవాలి. ప్రెజర్ పాన్ మూత  తీసి పప్పు ను బాగా ఎనుపుకుని టమేటా ముక్కల్లో వేసి బాగా కలుపు కోవాలి. ఉప్పు వేసి చివర్లో కొత్తి మీర  వేసి స్టవ్ ఆపెసుకోవాలి. 

పచ్చి టమేటాలు  బాగ పుల్లగా వుండటం వలన చింతపండు వేసుకోనక్కర్లేదు. వేడి అన్నంలో పప్పు కలుపుకుని చల్లమిరపకాయలు కొరుక్కుని తింటే చాల బావుంటుంది. 
  






Friday, June 12, 2015

కాలక్షేపం కబుర్లు: ‘మాగీ మై డియర్!’


‘మాగీ మై డియర్!’


రమణ బంధకవి


“ఎవోయి! మన లేటెస్ట్ పాపులర్ తార ఎవరో తెలుసా?” అడిగాను మా శ్రీమతిని.

“ఇంకెవరూ దీపిక పడుకొనే?”

“కాదు”

“కంగనా రనౌత్?’

“కాదు”

“పోనీ అనుష్క?”

“కాదోయి” అన్నాను నవ్వుతూ.

“పోనీ అలా సాగ దీయకుండా చెప్పొచ్చుగా?” దెప్పింది శ్రీమతి.

“సరే విను. అదెవరో కాదు. మనందరకూ నచ్చిన, మనం బాగా మెచ్చిన వన్ అండ్ ఓన్లీ ‘మాగి’ మై డియర్!”

“ఓ! అదా? సర్లెండి” అంటూ లోపలి వెళ్ళింది శ్రీమతి.

‘మాగీ’ అంటే అందరికి అదో చక్కని అనుభూతి! పిల్లా మేక, పెద్దా పీచు అందరూ ఎప్పుడూ లేక ఎప్పుడో అప్పుడు, ఆ సన్నటి, చిన్నటి, మెత్తటి, తెల్లటి ఉంగరాల తాళ్ళను స్పూను లేదా ఫోర్క్ సాయంతో నోట్లికి జుర్రెసుకునే వుంటారు. అవి ఎంత గోప్పవంటే, ఫాషన్ డిజైనేర్స్, అందాల భామల కోసం వీటి స్పూర్తితో ‘నూడుల్ స్ట్రాప్’ బ్లౌసెస్ తయారు చేయుస్తుంటారు.

స్కూల్ బస్సు లోంచి దూక్కుంటూ నల నీలుల్లగా  దాడి చేసి ఇంటిని క్షణాల్లో కిష్కింద గా మార్చే పిల్ల కోతుల్ని అమాంతం కట్టి పారేసే సున్నితమైన ఆయుధమే ఇల్లాలి చేతి లోని ‘మాగీ’.

అలసిపోయి ఇంటికి వచ్చిన భర్త “ తినడానికి ఏమైనా ఉందా?” అని అడగ్గానే “ 2 మినిట్స్” అంటూ ఇల్లాలు అయన మేజోళ్ళు విప్పుకునే లోపు వేడి వేడిగా కప్పులో అందించే చక్కటి ఉపాహరమే మన ‘మాగీ’.

మరేంటదీ...ఈ మధ్యనే నిద్రలో ఉలిక్కిపడి లేచి హటాత్తుగా దానిలో సీసం వగైరాలు మరియూ, ఓ జపాను వాడు కనిపెట్టిన మంచి రుచి నిచ్చే రసాయనం ‘అజినమోటో’ మోతాదు మించి ఉన్నాయని ఆహార నిపుణులు చెప్పటం, పత్రికలూ, టీవీలు ఏక బిగిని రాత్రింబవళ్ళు ఘోషించటం, దరిమిలాను ప్రభుత్వాలు నిషేదించటం ‘2 మినిట్స్’ లో జరిగిపోయాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలలో నిషేదాజ్ఞలు ఇంకా పొయ్య మీద ఉడుకుతున్నట్లు భోగట్టా!

ఈ గొడవల్లో పాపం ‘మాగి’ గ్రహణం పట్టిన చందమామలా, ఫ్లాప్ సినిమా హీరోయిన్లా కాంతి, స్థానం పోగొట్టుకుంది. సందట్లో సడేమియా ఈ లోగా కార్టూన్లు గీస్తున్నారు, పంచ్లు పేలుస్తున్నారు, సెటైర్లు అంటిస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక కార్టూన్లో ఓ బుజ్జిపిల్ల సెలవులయి పోయి స్కూళ్ళు తెరుస్తున్నారన్న దిగులుతో ‘నూడుల్స్ తో వురి వేసుకుని చనిపోవాలని వుందిరా నానీ’ అని పక్క బుజ్జిగాడుతో చెపుతోంది. హన్నా..?

ప్రతి దానికి ఎడ్డెం అంటే తెడ్డం అనే ఒక తిక్క శంకరయ్య పెద్ద మాగి డబ్బాలోంచి జూప జూపా నూడుల్స్ జుర్రేస్తూ “నాకు మాగి అంటే ప్రాణం, ప్రాణాలు పోయినా తిండం మానను, పోయిన తరువాత కూడా పైన నూడుల్స్ దండలే వెయ్యండి’ అని సెలవిచ్చారు.

ఇంతలో ‘టిఫిన్ రెడీ’ అన్న శ్రీమతి అనౌన్సుమెంట్ ఎంతో కర్ణపేయంగా అనిపించి టేబుల్ వైపు నడిచాను. పింగాణి ప్లేటులో, తాండవ కేళిలో జగమంతా వ్యాపించిన శివుని జటాజూటం లాగ వ్యాపించి, పొగలు కక్కుతూ, కమ్మటి మసాలా వాసనతో ఆహ్వానిస్తూ ఉన్న ‘మాగి’ నూడుల్స్ కనిపించాయి.

“ఏమోయి! నీకేమైనా వెర్రా? దిన పత్రికలూ చదవటంలా? టీవిలో న్యూస్ చూడటంలా? ఇది చేసేవేమిటి?” అని విస్తుబోయాను.

“ఆ! అన్నీ చూడ్డం, వినటం అయ్యింది! పనిమనిషి రాలేదు. ఇదే కదా తొందరగా అయ్యేది. అందుకనే చేసాను” అంది నిర్లిప్తంగా.

“మరి ఆ లోహాల మాటేమిటి? నా ప్రేవులు లోహపూరితమైపోతేనో?” అన్నాను కించిత్తు భయంగా.

“పోన్లెండి, సర్దారు పటేలు తరువాత లోహ పురుషుడు మీరే అవుతారు. ఐనా మనం తాగే నీళ్ళలో ఫ్లోరైడు, పీల్చేగాలిలో కార్బన్లు, బియ్యంలో యూరియా, కూరల్లో క్రిమి సంహారకాలు, పళ్ళలో కృత్రిమ రంగులు, పాలు పెరుగులో పెయింట్లు, పిగ్మెంట్లు ఉన్నాయని చెవిని ఇల్లు కట్టుకుని పోరుతున్నారు. వీటన్నిటికీ నోరు మూసుకుని నలుగురుతో పాటు నారాయణ అనుకున్నామా లేదా? ఎదో వీసమంత సీసం ఉంటే, మీసాలు మెలేసుకుని, బోరలు  విరుచుకుని కధాకలి చెయ్యటం ఎందుకుట? చూడండి నాలుగు రోజుల్లో ‘తిట్టిన నోరే పొగుడు’ అన్న చందాన్న మన ‘మాగీ తల్లికి’ మంచి రోజులు రాక పోవు, మళ్ళీ అది ‘వంద రోజుల బొమ్మ’ కాక పోదు. అన్నట్లు కామక్షికి ఫోన్ చెయ్యాలి. దాని కొడుకు పట్టూ కి మాగి అంటే ప్రాణం. బెంగ పెట్టుకుని తిండి మానేస్తాడేమో వెర్రి వెదవ!” అని గుక్క తిప్పుకోకుండా చెప్పి గుక్కెడు నీళ్ళు తాగింది శ్రీమతి.

పొట్టలో ప్రేవులు, ప్లేట్ లో నూడుల్స్ మెలిపెడుతుండం వల్ల తర్కాన్ని జేబులో పెట్టి, “అ ఫోర్క్ ఇటు పారెయ్” అని ప్లేటుని ముందుకు లాక్కున్నాను.



Tuesday, June 9, 2015

కాలక్షేపం కబుర్లు: వీధి

కాలక్షేపం కబుర్లు:
పాఠకులకు నమస్కారం! కాలక్షేపం కబుర్లు అనే శీర్షిక మీ ముందుకు తెస్తున్నామని చెప్పటానికి సంతోషిస్తున్నాను. ఈ శీర్షిక క్రింద దైనందిన జీవితంలోని పలు విషయాల మీద కబుర్లు సరసమైన శైలి లో మీ ముందు ఉంచుతాము. వీటిని చక్కగా సాయంత్రం పూట ఏ జంతికలో, పకోడీలో లేక పునుకులో, మిర్చి బజ్జీలో తింటూ కాఫీ పానీయం సేవిస్తూ చదువుకుని ఆనందించండి. లేక రాత్రి పోద్దుపోయేక ఏ మైసూరు పాక్ ముక్కో, మినప సున్నో ఆస్వాదిస్తూ చదువుకోండి.

రమణ బంధకవి

సంపాదకుడు


వీధి

రమణ బంధకవి

సరిగా నాలుగు కునుకులైనా తీయకుండా, ఎర్రబడ్డ కళ్ళతో, కంద గడ్డ మొహం తో, ఉదయం ఆరు గంటలకే కొంపమునిగిపోయినట్లు వచ్చేసాడు సూరీడు.

పక్క పైకి తిరిగి లాగుతున్న బద్దకాన్ని బుజ్జగిస్తూ ..అదేంటది... మా శ్రీమతి సతాయిస్తూ వుంటుంది... అదే మార్నింగ్ వాక్ అని ...దాని నిమిత్తం వీధి లోకి అడుగు పెట్టాను.

సిగ తరగ! మోడీ గారి ‘స్వచ్చ భారత్’ స్కీం కళ్ళు గప్పి, ఎప్పుడు లేచి పోసేసేరో తెలీదు..పక్కంటి వాళ్ళు చెత్త కుప్పను తెచ్చి మా ఇంటి ఎదురు రోడ్డు వారగ!

నాలుగు అడుగులు వేసేనో లేదో, మార్నింగ్ వాక్ మిష మీద ఉన్న ఒక ఇల్లాలు, ఓ ఇంటి గోడ మీదనుండి వొంగి, కాలక్షేపం కోసం వచ్చే పోయే వాళ్ళను తన సువాసనతో పలకరిస్తున్న కరివేపాకు రొబ్బలను, వొడుపుగా దూసేసి కొంగున కట్టేసుకుంటోంది. కొంగు కలెక్షన్లో రెండు ములక్కాడలు, నాలుగు గులాబీలు, ఒక మామిడికాయ నా కంట బడ్డాయి. సంపద నలుగురి కోసం అన్న సామ్యవాదపు సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తున్న ఆ ఇల్లాలు, బహుశా ఆ రోజు వంటలోకి మామిడికాయ పప్పు, ములక్కాడ-కరివేపాకు చారు ఖాయం చేసి వుంటుంది అనుకున్నాను. అసంకల్పిత ప్రతీకార చర్య లాగా గభాలున నోరు వూరింది. అన్నట్లు మా శ్రీమతి ఈ రోజు ఏం వండుతుందో? వచ్చేప్పుడు ఫ్రిజ్ లోంచి నాలుగు అరటికాయలు బయటకు తీయడం చూసేను. ప్రాప్తం వుంటే వేపుడు...లేకపోతే ముద్ద కూర!

కొంచెం ఎదురుగా ఎవరి ఇంట్లోంచో ఇద్దరు కూలినాలి చేసుకునే ఆడపడచులు నడుము మీద ప్లాస్టిక్ బిందెతో నీళ్ళు మోసుకొని పోతున్నారు. ఒక బిందె నీళ్ళతో సంసారం గడవాలి కామోసు. ఏమిటో ఈ పరిస్థితులు ఎప్పుడు మారతాయో! ఇంతలో కాలి కింద నుండి పాము లాగా జరా జరా పాకుతూ నీటి కాలువ వెళ్లిపోతుంటే వెనక్కి తిరిగి చూసాను. వీధి మొగలో ఎత్తైన ఇంటి ముందు పడవలాటి కారుని, డ్రైవర్ కాబోలు లావుపాటి రబ్బర్ ట్యూబ్ తో బడ బడా నీళ్ళు పోసేస్తూ కడుగుతున్నాడు. నీళ్ళు కాలవలు కట్టి దిగువకు ప్రవహిస్తున్నాయి. సొమ్ము ఒకరిది సోకొకరిది! బకెట్ నీళ్ళలో గుడ్డ ముంచి తుడవ లేడూ బద్ధకపు బడుద్దాయి? ఆ నీళ్ళతో చిన్నకారు కుటుంబం స్నానాలు కూడా చెయ్యొచ్చు. సామాజిక వనరులు పొదుపుగా వాడుకోవడం ఎప్పటికి వస్తుంది పరమేశా?

వీధి మలుపులో కుడి వైపు ఇంటి ముందు, క్రిందటి రాత్రి జరిగిన విందు తాలూకా మిగిలిపోయిన రొట్టెలు, కూరలు, బిర్యానీ ఇత్యాదులు అసహ్యంగా కుప్పగా పోసి ఉన్నాయి. కనీసం మిగిలిన ఆహారం చక్కగా ఏ అన్నార్తులకో పంపించవచ్చుగా! హుహుం ..మనకు అహం అడ్డుగా! అది సరే! ఈ సంగతి పసిగట్టి వీధి కుక్కలు బంధు మిత్రులకు అరుపుల ద్వారా అర్జెంటు వర్తమానాలు పంపి, దొరికిన సంపద ‘సమ న్యాయంతో’ ఎలా పంచుకోవాలో పంచాయతీ పెట్టుకున్నాయి. ఒక్కోప్పుడు ఆటువంటి పంచాయతీ నిర్ణయాలు దారేబోయే దానయ్యల పిక్కలు పీక్కురమ్మని కూడా ఉండటం కద్దు కాబట్టీ, ఎందుకైనా మంచిదని పంచాయతీకి కొంచెం దూరం గా నడుస్తూ, పార్కు దగ్గరికి వచ్చెను.

పార్క్ అంటే పూల మొక్కలు, మెత్తటి తివాచీ లాను వగైరా వుంటాయి...కదా? అలా అని గబుక్కున ఊహించేసుకోకండి. ఎదో ఎగుడు దిగుడు నేలకి కంచే కట్టి పార్క్ అని పిలుచుకుంటూ కాలనీ వాసులు వీపులు గట్రా చరిచేసు కుంటున్నారు. లోపల అక్కడక్కడా, ప్రగతి పై సమాధానం చెప్పలేని ప్రశ్నల్లా, చిన్నా, పెద్దా బండరాళ్ళు బయటకు పొడుచుకొచ్చి ఉంటాయి. వాటికి కాలి బొటన వేళ్ళు బలి ఇచ్చుకుని రక్తం ఓడుతూ, కుంటుకుంటూ ఇంటి ముఖం పట్టే వాకర్స్ ని చూడటం కద్దు. డొంకలు, తుప్పలమయంతో గందరగోళంగా ఉంటుంది. అన్నట్లు, త్రాచు పాములు, రక్త పింజర్లు లాంటివి నాలుగైదు కుటుంబాలు పిల్లా, జెల్లాతో కాపురం ఉంటున్నట్లు కాలనీ వాసుల భోగట్టా! పార్కు డెవలప్మెంట్ క్రింద ఒక ఖర్చు ఐటెం ప్రతి ఏడాది కాలనీ బడ్జెట్ లో కనబడుతూ వుంటుంది. అయినా.. కనబడే వన్నీ నిజాలా ఏమిటీ .. పోదురూ బడాయి!

అన్నట్లు కాఫీ టైం అయినట్లు వుంది. ఈ రోజుకు ఈ వాకింగ్ చాలు. మాంచి సామాజిక అవగాహన వచ్చింది కూడానూ! అర్థం అయినట్లు, కానట్లు ఉన్న ఆ వీధిలోంచి ఇంటివైపు అడుగులు వేసాను...