Sunday, July 5, 2015

నూల్ కోల్ పెసరపప్పు- కొబ్బరి కూర


శ్రీమతి రత్నా శ్రీనివాస్

నూల్ కోల్, ఆ కాయగూర గుణ గణాలు అదేనండి పోషక విలువలు ఇతరత్రా విషయాలు గురించి ముందు సంచికల్లో ప్రస్తావించడం జరిగింది. ఈ కాయగూర తో మన సంప్రదాయమైన పులుసు- బెల్లం కూర చేసుకోవటం కూడా చెప్పెము. ఇప్పుడు మరో సంప్రదాయమైన, ఎక్కువగా వాడుకలో నున్న పెసరపప్పు- కొబ్బరి తో పొడి కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం!

కావలసిన పదార్దములు :                      
నూల్ కోల్                                              :  దుంపలు
పెసరపప్పు                                            : 3  టేబుల్ స్పూన్లు 
కొబ్బరి తురుము                                      : 11/2 టేబుల్ స్పూను 
పచ్చి మిర్చి                                             : 4

పోపుకు కావలసినవి :
నూనె                                                         :  2 టేబుల్ స్పూన్స్ 
ఎండు  మిర్చి                                               :  2
ఆవాలు, జీల కర్ర                                           : చెరొక అర టీస్పూన్ 
ఇంగువ                                                       :  సువాసనకు 
కరివేపాకు                                                    :  3, 4 రెబ్బలు 
పసుపు                                                        : చిటికెడు 
ఉప్పు                                                          : తగినంత 


తయారు చేయు విధానం 
నూల్ కోల్ ని శుబ్రంగా కడిగి చెక్కు తీసి చిత్రంలో చూపించిన విధముగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఒక గిన్నెలో ముక్కలు వేసి తగినంత నీరు పోసి చిటికెడు పసుపు వేసి ప్రెజర్ పాన్ లో పెట్టుకోవాలి. పెసరపప్పు ని కూడా ప్రెజర్ పాన్ లో పెట్టుకోవచ్చు ముక్కలతో కలిపి. కాకపొతె బాగా వుడికిపోతే పప్పు ముద్ద అయిపోతుంది. పొడి పొడిగా కావాలనుకునే వారు వేరొక బాండీ లో కాని, గిన్నెలో కాని,  మైక్రో వేవ్ లో కాని పెసరపప్పు లో తగినంత నీరు పోసి పొడి పొడి లాడే లా వుడకపెట్టుకోవచ్చు.  ఒక విజిల్ వచ్చేక మంట తగ్గించి 5 నిమిషాలు  వుంచి, పెద్దది చేసి రెండో విజిల్ కి స్టవ్ ఆపెసుకోండి. 

పెసరపప్పు మూడు వంతులు వుడికేక  ఒక బాండీలో నూనె తీసుకుని  వేడేక్కేక పైన చెప్పిన పోపు దినుసులు వేసి వేయించుకోండి. ఆ పోపులో పెసరపప్పు ను వేసి కలియ బెట్టి వేయించుకోండి. ఈ లోగా ప్రెజర్ విడుదలై వుండి  వుంటుంది. నూల్ కోల్ ముక్కలను తీసి బాండీ లో వేసి కలిపి ఉప్పు వేసి మూత  పెట్టి మగ్గ నివ్వండి. నూల్ కోల్ ఉడక పెట్టినప్పుడు వచ్చిన అదనపు నీరుని చారులో కాని, పులుసు లో కాని వాడు కోవచ్చు. 

వుడికిన నూల్ కోల్ ముక్కలు కొంచెం, కాబేజీ, ముల్లంగి వుడికేటప్పుడు వచ్చే వాసనను పోలి వుంటుంది. అది కొందరికి గిట్టకపోవచ్చు. ఐతే నేమి దాని పోషక విలువలను చూస్తె, దాని వాసనను భరించటం కష్టమేమి  కాదు. అయినా ఆ వాసన ఎంత సేపు ఒక్క సారి వుడికిన ముక్కలను గుబాళించే ఇంగువ  పోపు లో పడే సామంటే చక్కదానల కమ్మటి వాసన రాదూ !

ఇప్పుడు ముక్కలు చక్కగా మగ్గి వుంటాయ.  పెసర పప్పు కూడా ఆ మిగిలిన వంతు కూడా వుడికేసి పొడి పొడి లాడుతూ వుంటుంది.  కొబ్బరి కోరు వేసి ముక్కలను సమానంగా కలపండి. ఒక్క సారి మంట పెద్దది చేసి మరొక్క సారి  కలిపి స్టవ్ ఆపెసుకోండి.

పొడి పొడి లాడే నూల్ కోల్ -పెసరపప్పు కొబ్బరి పొడి కూర తయారయి పోయింది . ఇది మీరు అన్నంలో చల్ల మిరపకాయలతో కాని, వడియాలతో కాని నంచుకుని తినవచ్చు . అలాగే చపాతీలలో కూడా చాల బావుంటుంది. ఒక సారి ప్రయత్నించండి మీరు కూడా!







No comments:

Post a Comment