ప్రియమైన పాఠకులకు
మొన్నీమధ్య మన కామాక్షి తన పుట్టిన
రోజు సందర్భంగా వాళ్ళింటికి భోజనానికి పిలిచింది. కామాక్షి ఇంటికి భోజనం అంటే ఇక
చెప్పేదేముంది, తగిన ఏర్పాట్లతో వెళ్ళాలి. అందుకే ముందు రోజు రాత్రి అల్పాహారం తో
సరిపెట్టుకుని, ఆ రోజు ప్రొద్దుట కూడా ఒకే అరటిపండు మాత్రం తీసుకుని, ఆవిడ తన పాక
శాస్త్ర ప్రావీణ్యంతో, తయారుచేసి వడ్డించబోయే షడ్రసోపేతమైన భోజనం గురించి కమ్మటి
పగటి కలలు కంటూ వారింటికి చేరాను.
గుమ్మంలోనే విశ్వనాధం గారు ఆదరంతో
పలకిరించి లోనికి తీసుకు వెళ్లారు. పట్టూ అదే మన పట్టాభి ‘హాయ్ అంకుల్’ అంటూ తనదైన రీతిలో పలకరించాడు. ఇంతలో పూజ గది నుండి లక్ష్మీకాంతం గారు,
వంటగదినుండి సూరీడమ్మ గారు, మరి మన కామాక్షి వచ్చి కుశల ప్రశ్నలు వేసారు. విశ్వనాధం
“నాన్నా వీరు ‘తెలుగు భోజనం’ బ్లాగ్ సంపాదకులు” అని పరిచయం చేసారు. వెంటనే “అయ్యోరామా!
భోజనం చేసి వచ్చారా?” అని విస్తుపోయారు లక్ష్మీ కాంతం గారు. “కాదు
నాన్నా ‘తెలుగు ..తెలుగు భోజనం సంపాదకులు” అని కొంచెం గట్టి గా అన్నారు. “ఏమిటీ తెలుగు రాదా ? మరి చెప్పవేం? సారి! హౌ
ఆర్ యు సర్?” అని ఇంగ్లీషు లో పలకరించి లోపలి వెళ్లారు.
ఇంతలో కామాక్షి భోజనానికి పిలుపు
ఇచ్చింది. అందరూ లోపలి వెళ్ళాం! అక్కడ భోజనాల బల్ల కనిపించక కొంచెం కంగారు
పడ్డాను.
ఇంతలో వారి పెరటిలో వున్న అరటి చెట్టు
నుండి అపుడే కోసిన ఆకు పచ్చటి అరిటాకుని
శుబ్రముగా నీళ్ళతో చిలకరించి పీట వేసి భోయనానికి పిలిచి కూర్చోబెట్టారు.
ముందుగా వర్రగా పోపు పెట్టిన పసుపచ్చటి
మామిడికాయ పప్పుని వడ్డించారు. ఆహా! నా ఫేవరెట్ అనుకున్నాను.
తర్వాత మామిడిపప్పుకి ఏమాత్రం తీసిపోకుండా బహుశా వీక్లీ మార్కెట్ లో దగ్గరుండి పొందికగా
కొట్టించిన పనసపొట్టుని, ఘాటైన ఆవ పెట్టి, పొడి పొడి లాడేట్టు వండిన పనసపొట్టు
కూర వడ్డించారు. అబ్బో! ఎమీ నా భాగ్యం అనుకున్నాను.
ఆ తర్వాత మామిడి పప్పుకి, పనసపొట్టు కన్న నేనేమి తక్కువ
అంటూ లేత వంకాయ అల్లం , పర్చిమిర్చ, కొత్తిమీరతో
తనని ఆ పళం గానే దట్టించమని వయ్యారంగా వచ్చి ఆకులో వాలింది. అబ్బ! ఈ రోజు
నక్క తోక తోక్కివచ్చేను అనుకున్నాను.
ఇంతలోకే పుల్లటి మామిడి కాయలను దగ్గరుండి
కొట్టిన్చుకొచ్చి, ఏమాత్రం రాజీ పడకుండా, త్రీ
మాంగోస్ వారి ఆవపిండి, ఎర్రదనం కోసం
బళ్ళారి కారం, ఎ ఎస్ బ్రాండ్ పప్పు నూనె, అందులో
వెల్లుల్లి కూడా దట్టించి, సుబ్రమైన జాడీలో పెట్టి దానికి
తెల్లటి గుడ్డ వాసెన కట్టి నా ముందు వుంచి గర్వంగా నిల్చున్నారు. నేను ఈ
ఏటి కొత్త ఆవకాయనంటు నాకు ఒక ప్రత్యేక స్తానాన్ని ఆకులో కల్పించమని కొత్త ఆవకాయ జాడిలోంచి
గొంతెత్తి ఘోషిస్తుంటే నేనూరుకుంటానా? వెంటనే వాసెన తీసి నిగ నిగలాడుతున్న
ఒక పెద్ద పెచ్చు తీసుకుని ఆప్యాయంగా ఆకులో వేసుకున్నా. అంతే కాదండోయ్! మన విశ్వనాధం గారు పని కట్టుకుని
గుమ్మడి పండు కోసం మార్కెట్ కి వెళ్ళి
మంచి ఎర్రటి గుమ్మడి పండుని పట్టుకొచ్చి ఘుమ ఘుమ లాడే తియ్యటి దప్పళం, గుమ్మడి
ముక్కలకి ఏ మాత్రం దెబ్బ తగిలి ఎనిసిపోకుండా ముక్కలతో రాచిప్ప(పూర్వం పులుసులు
వండేవారు) ప్రత్యక్షమయ్యింది. అవటమే కాదు మిగతా పదార్దాలకేసి ఒక ఓర చూపు కూడా
చూసింది పొండి పెద్ద బడాయి అంటూ. ఆహా! ఇవాళ లేచిన వేళా విశేషం బాగుంది అని రాచిప్ప
కేసి ముసి ముసిగా నవ్వుకున్నాను.
ఇంతలోకే
పోండే చుప్పనాతుల్లార! పండుగలైనా, పబ్బాలైన
నాదే ప్రముఖ పాత్ర అంటూ పూర్ణం బూరె కమ్మటి నేతి గిన్నెని చంకలో పెట్టుకుని వచ్చి పొందికగా ఆకులో పీటం వేసుకుని మరీ కూర్చుంది. అమ్మ బాబోయి! బూరేలే! ఆనందంతో నోట మాట రాలేదు. ఇవన్నే సరే!
మరి నేను లేకుంటే ఎంత పూర్ణం బూరెలు వున్నా భోజనం అసంపూర్ణమే సుమా! అంటూ స్టీలు
గిన్నెలో అపుడే కమ్మగా తోడుకున్న గడ్డ పెరుగు
పరిగెత్తుకుంటూ వచ్చింది.
వెంటనే విశ్వనాధం "ఇంతటి విందు
భోజనములో చెవుల్లోంచి పొగలు వచ్చే పర్చిమిరపకాయ బజ్జీలు లేకపోతె ఎలా?” అంటూ
చింతపండు, వాము, నూపొడి కూరి, కూరిమితో చేసిన పొడుగాటి
బజ్జీలు తెచ్చి వేసేరు.
ఇంక నా మొహం చూడాలి. అబ్బ! ఎ నాటి
పుణ్యమో కదా! ఈ నాడు పంచ భక్ష్య పరమాన్నాలతో విందు భోజనమే చేస్తున్నాను అని అనుకుంటుంటే, విశ్వనాధం
చక్కటి వూరు మిరపకాయలు, గుమ్మడి వడియాలు ఆకులో వేసారు.
“వేసవి కాలం కదా! పెరుగు అన్నంలో బంగిన
పల్లి మామిడి పండు ముక్కలు తింటే భలేగా వుంటుంది అంటూ సూరీడమ్మ గారు మామిడి
ముక్కలు తరిగి వేసారు. “డిసెర్ట్ వుండాలి గా అన్నం తిన్నాక” అంటూ పట్టాభి కిస్స్మిస్స్, జీడిపప్పులతో
పాయస పాత్రని వాళ్ళ అమ్మ చేతిలోంచి అందుకుని పక్కన పెట్టాడు.
పాయసం తో పాటు గులాబ్ జాము కూడా తింటే
దాని రుచే వేరు అంటూ కామాక్షి గుండ్రటి
గులాబ్ జాములు తెచ్చి పెట్టింది.
ఇంక నా సామి రంగా అంటూ ఒకసారి
దేవుడి కి చేతులు జోడించి, దేవుడా! నువ్వే, నేను ఈ పదార్ధాలకి న్యాయం చేకూర్చేలా
చేయి. అంటూ దణ్ణం పెట్టుకున్నాను.
అమ్మయ్య! అనుకుని భోజనం తృప్తిగా, ఆస్వాదిస్తూ
తిని "అన్న దాతలారా! సుఖీ భవ!” అంటూ త్రేంచేను. కామాక్షికి పుట్టిన రోజు
శుభాకాంక్షలు చెప్పి వారందరికి ధన్యవాదాలు తెలుపుకుని బయలు దేరాను.
వెంటనే అన్ని తిని చివరలో ఇది లేకుంటే
ఆ విందు భోజనం అరగద్దూ అంటూ లక్ష్మీ కాంతం గారు చక్కటి కర్పూర కిళ్ళీ ఇచ్చారు. ఆఃహా! అంటూ తాంబూలం కూడా సేవించి అబ్బ
నోరు చక్కగా పండింది అని అద్దం లో చూసుకున్నాను.
ఇక ఈ విషయం మాపాఠక మహాశయులకి చేరవేయాలని
చెప్పి వారి వద్ద సెలవు పుచ్చుకున్నాను.
No comments:
Post a Comment