Sunday, July 5, 2015

నూల్ కోల్ పెసరపప్పు- కొబ్బరి కూర


శ్రీమతి రత్నా శ్రీనివాస్

నూల్ కోల్, ఆ కాయగూర గుణ గణాలు అదేనండి పోషక విలువలు ఇతరత్రా విషయాలు గురించి ముందు సంచికల్లో ప్రస్తావించడం జరిగింది. ఈ కాయగూర తో మన సంప్రదాయమైన పులుసు- బెల్లం కూర చేసుకోవటం కూడా చెప్పెము. ఇప్పుడు మరో సంప్రదాయమైన, ఎక్కువగా వాడుకలో నున్న పెసరపప్పు- కొబ్బరి తో పొడి కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం!

కావలసిన పదార్దములు :                      
నూల్ కోల్                                              :  దుంపలు
పెసరపప్పు                                            : 3  టేబుల్ స్పూన్లు 
కొబ్బరి తురుము                                      : 11/2 టేబుల్ స్పూను 
పచ్చి మిర్చి                                             : 4

పోపుకు కావలసినవి :
నూనె                                                         :  2 టేబుల్ స్పూన్స్ 
ఎండు  మిర్చి                                               :  2
ఆవాలు, జీల కర్ర                                           : చెరొక అర టీస్పూన్ 
ఇంగువ                                                       :  సువాసనకు 
కరివేపాకు                                                    :  3, 4 రెబ్బలు 
పసుపు                                                        : చిటికెడు 
ఉప్పు                                                          : తగినంత 


తయారు చేయు విధానం 
నూల్ కోల్ ని శుబ్రంగా కడిగి చెక్కు తీసి చిత్రంలో చూపించిన విధముగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఒక గిన్నెలో ముక్కలు వేసి తగినంత నీరు పోసి చిటికెడు పసుపు వేసి ప్రెజర్ పాన్ లో పెట్టుకోవాలి. పెసరపప్పు ని కూడా ప్రెజర్ పాన్ లో పెట్టుకోవచ్చు ముక్కలతో కలిపి. కాకపొతె బాగా వుడికిపోతే పప్పు ముద్ద అయిపోతుంది. పొడి పొడిగా కావాలనుకునే వారు వేరొక బాండీ లో కాని, గిన్నెలో కాని,  మైక్రో వేవ్ లో కాని పెసరపప్పు లో తగినంత నీరు పోసి పొడి పొడి లాడే లా వుడకపెట్టుకోవచ్చు.  ఒక విజిల్ వచ్చేక మంట తగ్గించి 5 నిమిషాలు  వుంచి, పెద్దది చేసి రెండో విజిల్ కి స్టవ్ ఆపెసుకోండి. 

పెసరపప్పు మూడు వంతులు వుడికేక  ఒక బాండీలో నూనె తీసుకుని  వేడేక్కేక పైన చెప్పిన పోపు దినుసులు వేసి వేయించుకోండి. ఆ పోపులో పెసరపప్పు ను వేసి కలియ బెట్టి వేయించుకోండి. ఈ లోగా ప్రెజర్ విడుదలై వుండి  వుంటుంది. నూల్ కోల్ ముక్కలను తీసి బాండీ లో వేసి కలిపి ఉప్పు వేసి మూత  పెట్టి మగ్గ నివ్వండి. నూల్ కోల్ ఉడక పెట్టినప్పుడు వచ్చిన అదనపు నీరుని చారులో కాని, పులుసు లో కాని వాడు కోవచ్చు. 

వుడికిన నూల్ కోల్ ముక్కలు కొంచెం, కాబేజీ, ముల్లంగి వుడికేటప్పుడు వచ్చే వాసనను పోలి వుంటుంది. అది కొందరికి గిట్టకపోవచ్చు. ఐతే నేమి దాని పోషక విలువలను చూస్తె, దాని వాసనను భరించటం కష్టమేమి  కాదు. అయినా ఆ వాసన ఎంత సేపు ఒక్క సారి వుడికిన ముక్కలను గుబాళించే ఇంగువ  పోపు లో పడే సామంటే చక్కదానల కమ్మటి వాసన రాదూ !

ఇప్పుడు ముక్కలు చక్కగా మగ్గి వుంటాయ.  పెసర పప్పు కూడా ఆ మిగిలిన వంతు కూడా వుడికేసి పొడి పొడి లాడుతూ వుంటుంది.  కొబ్బరి కోరు వేసి ముక్కలను సమానంగా కలపండి. ఒక్క సారి మంట పెద్దది చేసి మరొక్క సారి  కలిపి స్టవ్ ఆపెసుకోండి.

పొడి పొడి లాడే నూల్ కోల్ -పెసరపప్పు కొబ్బరి పొడి కూర తయారయి పోయింది . ఇది మీరు అన్నంలో చల్ల మిరపకాయలతో కాని, వడియాలతో కాని నంచుకుని తినవచ్చు . అలాగే చపాతీలలో కూడా చాల బావుంటుంది. ఒక సారి ప్రయత్నించండి మీరు కూడా!







కామాక్షి పుట్టినరోజు భోజనం!


ప్రియమైన పాఠకులకు

మొన్నీమధ్య మన కామాక్షి తన పుట్టిన రోజు సందర్భంగా వాళ్ళింటికి భోజనానికి పిలిచింది. కామాక్షి ఇంటికి భోజనం అంటే ఇక చెప్పేదేముంది, తగిన ఏర్పాట్లతో వెళ్ళాలి. అందుకే ముందు రోజు రాత్రి అల్పాహారం తో సరిపెట్టుకుని, ఆ రోజు ప్రొద్దుట కూడా ఒకే అరటిపండు మాత్రం తీసుకుని, ఆవిడ తన పాక శాస్త్ర ప్రావీణ్యంతో, తయారుచేసి వడ్డించబోయే షడ్రసోపేతమైన భోజనం గురించి కమ్మటి పగటి కలలు కంటూ వారింటికి చేరాను.

గుమ్మంలోనే విశ్వనాధం గారు ఆదరంతో పలకిరించి లోనికి తీసుకు వెళ్లారు. పట్టూ అదే మన పట్టాభి ‘హాయ్ అంకుల్’  అంటూ తనదైన రీతిలో పలకరించాడు.  ఇంతలో పూజ గది నుండి లక్ష్మీకాంతం గారు, వంటగదినుండి సూరీడమ్మ గారు, మరి మన కామాక్షి వచ్చి కుశల ప్రశ్నలు వేసారు. విశ్వనాధం “నాన్నా వీరు ‘తెలుగు భోజనం’ బ్లాగ్ సంపాదకులు” అని పరిచయం చేసారు. వెంటనే “అయ్యోరామా! భోజనం చేసి వచ్చారా?” అని విస్తుపోయారు లక్ష్మీ కాంతం గారు.   “కాదు నాన్నా ‘తెలుగు ..తెలుగు భోజనం సంపాదకులు” అని కొంచెం గట్టి గా అన్నారు.  “ఏమిటీ తెలుగు రాదా ? మరి చెప్పవేం? సారి! హౌ ఆర్ యు సర్?” అని ఇంగ్లీషు లో పలకరించి లోపలి వెళ్లారు.
ఇంతలో కామాక్షి భోజనానికి పిలుపు ఇచ్చింది. అందరూ లోపలి వెళ్ళాం! అక్కడ భోజనాల బల్ల కనిపించక కొంచెం కంగారు పడ్డాను.

ఇంతలో వారి పెరటిలో వున్న అరటి చెట్టు నుండి అపుడే  కోసిన ఆకు పచ్చటి అరిటాకుని  శుబ్రముగా నీళ్ళతో చిలకరించి పీట వేసి భోయనానికి పిలిచి కూర్చోబెట్టారు. ముందుగా వర్రగా పోపు పెట్టిన పసుపచ్చటి మామిడికాయ పప్పుని వడ్డించారు. ఆహా! నా ఫేవరెట్ అనుకున్నాను. తర్వాత మామిడిపప్పుకి ఏమాత్రం తీసిపోకుండా బహుశా వీక్లీ మార్కెట్ లో దగ్గరుండి పొందికగా కొట్టించిన పనసపొట్టుని, ఘాటైన ఆవ పెట్టి, పొడి పొడి లాడేట్టు వండిన పనసపొట్టు కూర వడ్డించారు. అబ్బో! ఎమీ నా భాగ్యం అనుకున్నాను. ఆ తర్వాత మామిడి పప్పుకి, పనసపొట్టు కన్న నేనేమి తక్కువ అంటూ  లేత వంకాయ  అల్లం , పర్చిమిర్చ, కొత్తిమీరతో తనని ఆ పళం గానే దట్టించమని  వయ్యారంగా వచ్చి ఆకులో వాలింది. అబ్బ! ఈ రోజు నక్క తోక తోక్కివచ్చేను అనుకున్నాను.

ఇంతలోకే  పుల్లటి మామిడి కాయలను దగ్గరుండి కొట్టిన్చుకొచ్చి, ఏమాత్రం రాజీ పడకుండా, త్రీ మాంగోస్  వారి ఆవపిండి, ఎర్రదనం కోసం బళ్ళారి కారం, ఎ ఎస్  బ్రాండ్ పప్పు నూనె, అందులో వెల్లుల్లి కూడా దట్టించి, సుబ్రమైన జాడీలో పెట్టి దానికి తెల్లటి గుడ్డ వాసెన కట్టి నా ముందు వుంచి గర్వంగా నిల్చున్నారు.  నేను ఈ ఏటి కొత్త ఆవకాయనంటు నాకు ఒక ప్రత్యేక స్తానాన్ని ఆకులో కల్పించమని కొత్త ఆవకాయ జాడిలోంచి గొంతెత్తి ఘోషిస్తుంటే నేనూరుకుంటానా? వెంటనే వాసెన తీసి నిగ నిగలాడుతున్న ఒక పెద్ద పెచ్చు తీసుకుని  ఆప్యాయంగా ఆకులో వేసుకున్నా.  అంతే కాదండోయ్! మన విశ్వనాధం గారు పని కట్టుకుని గుమ్మడి పండు కోసం మార్కెట్ కి  వెళ్ళి మంచి ఎర్రటి గుమ్మడి పండుని పట్టుకొచ్చి ఘుమ ఘుమ లాడే తియ్యటి దప్పళం, గుమ్మడి ముక్కలకి ఏ మాత్రం దెబ్బ తగిలి ఎనిసిపోకుండా  ముక్కలతో రాచిప్ప(పూర్వం పులుసులు వండేవారు) ప్రత్యక్షమయ్యింది. అవటమే కాదు మిగతా పదార్దాలకేసి ఒక ఓర చూపు  కూడా చూసింది పొండి పెద్ద బడాయి అంటూ. ఆహా! ఇవాళ లేచిన వేళా విశేషం బాగుంది అని రాచిప్ప కేసి ముసి ముసిగా నవ్వుకున్నాను.

ఇంతలోకే   పోండే చుప్పనాతుల్లార!  పండుగలైనా, పబ్బాలైన నాదే ప్రముఖ పాత్ర అంటూ  పూర్ణం బూరె కమ్మటి  నేతి గిన్నెని  చంకలో  పెట్టుకుని వచ్చి  పొందికగా  ఆకులో పీటం వేసుకుని  మరీ కూర్చుంది. అమ్మ బాబోయి! బూరేలే! ఆనందంతో నోట మాట రాలేదు. ఇవన్నే సరే! మరి నేను లేకుంటే ఎంత పూర్ణం బూరెలు వున్నా భోజనం అసంపూర్ణమే సుమా! అంటూ స్టీలు గిన్నెలో అపుడే  కమ్మగా తోడుకున్న గడ్డ పెరుగు పరిగెత్తుకుంటూ వచ్చింది.

వెంటనే విశ్వనాధం "ఇంతటి విందు భోజనములో చెవుల్లోంచి పొగలు వచ్చే పర్చిమిరపకాయ బజ్జీలు లేకపోతె ఎలా?” అంటూ చింతపండు, వాము, నూపొడి కూరి, కూరిమితో చేసిన పొడుగాటి బజ్జీలు తెచ్చి వేసేరు.

ఇంక నా మొహం చూడాలి. అబ్బ! ఎ నాటి పుణ్యమో కదా! ఈ నాడు పంచ భక్ష్య పరమాన్నాలతో విందు భోజనమే చేస్తున్నాను అని అనుకుంటుంటే, విశ్వనాధం చక్కటి వూరు మిరపకాయలు, గుమ్మడి వడియాలు ఆకులో వేసారు.

“వేసవి కాలం కదా! పెరుగు అన్నంలో  బంగిన పల్లి మామిడి పండు ముక్కలు తింటే భలేగా వుంటుంది అంటూ సూరీడమ్మ గారు మామిడి ముక్కలు తరిగి వేసారు. “డిసెర్ట్ వుండాలి గా అన్నం తిన్నాక”  అంటూ పట్టాభి కిస్స్మిస్స్, జీడిపప్పులతో పాయస పాత్రని వాళ్ళ అమ్మ చేతిలోంచి అందుకుని పక్కన పెట్టాడు.

పాయసం తో పాటు గులాబ్ జాము కూడా తింటే దాని రుచే వేరు అంటూ కామాక్షి  గుండ్రటి గులాబ్ జాములు తెచ్చి పెట్టింది.

ఇంక నా సామి రంగా అంటూ  ఒకసారి దేవుడి కి చేతులు జోడించి, దేవుడా! నువ్వే, నేను ఈ పదార్ధాలకి న్యాయం చేకూర్చేలా చేయి. అంటూ దణ్ణం పెట్టుకున్నాను.
 అమ్మయ్య! అనుకుని భోజనం తృప్తిగా, ఆస్వాదిస్తూ తిని "అన్న దాతలారా! సుఖీ భవ!” అంటూ త్రేంచేను. కామాక్షికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి వారందరికి ధన్యవాదాలు తెలుపుకుని బయలు దేరాను.

వెంటనే అన్ని తిని చివరలో ఇది లేకుంటే ఆ విందు భోజనం అరగద్దూ అంటూ లక్ష్మీ కాంతం గారు చక్కటి కర్పూర కిళ్ళీ  ఇచ్చారు. ఆఃహా! అంటూ తాంబూలం కూడా సేవించి అబ్బ నోరు చక్కగా పండింది అని అద్దం లో చూసుకున్నాను.

ఇక ఈ విషయం మాపాఠక మహాశయులకి చేరవేయాలని చెప్పి వారి వద్ద సెలవు పుచ్చుకున్నాను.

  


  

Monday, June 15, 2015

పచ్చి టమాటో పప్పు


ముందుమాట:
పండినతరువాతే అన్నీ తినటానికి బావుంటాయనుకోవటం ఎల్లా వేళలా సరికాదు. కొన్ని పచ్చిగా ఉన్నా వాటిని రుచికరంగా చేసుకునే పద్దతులుంటాయి. అలాటి వాటిలోవే పచ్చి టొమాటోలు. టొమాటోలు బాగా పండి ఎర్రగా ఉన్నాకా ఎన్నో రుచికర పదార్దాలు చేసుకోవచ్చు. అయితే కొన్ని సమయాలలో అంగళ్ళలో టొమాటోలు పచ్చివి కూడా వుంటాయి. వాటితో చక్కని రుచికరమైన పప్పు చేసుకోవచ్చు అంటున్నారు శ్రీమతి రత్న. నేను మట్టుకు ఎన్నోసార్లు ఈ పదార్ధాన్ని సేవించి ఆనందించటం జరిగింది.

రమణ బంధకవి
సంపాదకుడు

పచ్చి టమాటో పప్పు 

శ్రీమతి రత్నా శ్రీనివాస్

కావలసిన పదార్దములు:
పచ్చి టమాటాలు                 :   పావు కేజీ 
కంది పప్పు                         :  ఒక కప్పు 
పచ్చి మిర్చి                         :  రెండు
ఉప్పు                                 : తగినంత 
పసుపు                               : చిటికెడు 
కారం                                   : ఒక టీ స్పూన్ 

పోపుకు కావలసిన పదార్దములు :
నూనె                                    : 2 టేబుల్ స్పూన్స్ 
మినపపప్పు                           :  1 టీ స్పూన్ 
ఆవాలు, జీలకర్ర                        :  చెరొక అర టీస్పూన్
మెంతులు లేదా మెంతి పిండి         :  పావు స్పూన్  
ఇంగువ                                  :  సరిపడ
కొత్తి మీర  తురుము                  :    కొంచెం 

తయారు చేయు విధానం:
ముందుగా పచ్చని రంగులో నిగ నిగ లాడే టమేటాలు తీసుకుని శుబ్రముగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. ఒక బాండీ  తీసుకుని కొద్దిగా నూనె వేసి వేడెక్కేక  పచ్చి మిర్చి వేసి వేగేక టమేటా ముక్కలు వేసి వేయించి ఉప్పు, పసుపు వేసి కలియ బెట్టి మూత  బెట్టుకుని చిన్న మంట మీద వుంచుకోవాలి. ఈ లోగా ప్రెజర్ పాన్ లో కంది పప్పు వేసి కడిగి, తగినంత నీరు పోసి, చిటికెడు పసుపు వేసి మూత  పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చి పప్పు వుడికిందనుకున్నాక స్టవ్ ఆపెసుకోవాలి.

ఈ లోపు టమేటాలు ఉడికి వుంటాయి. ఒక చిన్న పోపు గరిటలో పైన చెప్పిన పోపు దినుసులతో పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపును వుడికిన టమేటాలు లో వేసుకుని కలుపుకుని  తిరిగి స్టవ్ మీద పెట్టుకోవాలి. ప్రెజర్ పాన్ మూత  తీసి పప్పు ను బాగా ఎనుపుకుని టమేటా ముక్కల్లో వేసి బాగా కలుపు కోవాలి. ఉప్పు వేసి చివర్లో కొత్తి మీర  వేసి స్టవ్ ఆపెసుకోవాలి. 

పచ్చి టమేటాలు  బాగ పుల్లగా వుండటం వలన చింతపండు వేసుకోనక్కర్లేదు. వేడి అన్నంలో పప్పు కలుపుకుని చల్లమిరపకాయలు కొరుక్కుని తింటే చాల బావుంటుంది. 
  






Friday, June 12, 2015

కాలక్షేపం కబుర్లు: ‘మాగీ మై డియర్!’


‘మాగీ మై డియర్!’


రమణ బంధకవి


“ఎవోయి! మన లేటెస్ట్ పాపులర్ తార ఎవరో తెలుసా?” అడిగాను మా శ్రీమతిని.

“ఇంకెవరూ దీపిక పడుకొనే?”

“కాదు”

“కంగనా రనౌత్?’

“కాదు”

“పోనీ అనుష్క?”

“కాదోయి” అన్నాను నవ్వుతూ.

“పోనీ అలా సాగ దీయకుండా చెప్పొచ్చుగా?” దెప్పింది శ్రీమతి.

“సరే విను. అదెవరో కాదు. మనందరకూ నచ్చిన, మనం బాగా మెచ్చిన వన్ అండ్ ఓన్లీ ‘మాగి’ మై డియర్!”

“ఓ! అదా? సర్లెండి” అంటూ లోపలి వెళ్ళింది శ్రీమతి.

‘మాగీ’ అంటే అందరికి అదో చక్కని అనుభూతి! పిల్లా మేక, పెద్దా పీచు అందరూ ఎప్పుడూ లేక ఎప్పుడో అప్పుడు, ఆ సన్నటి, చిన్నటి, మెత్తటి, తెల్లటి ఉంగరాల తాళ్ళను స్పూను లేదా ఫోర్క్ సాయంతో నోట్లికి జుర్రెసుకునే వుంటారు. అవి ఎంత గోప్పవంటే, ఫాషన్ డిజైనేర్స్, అందాల భామల కోసం వీటి స్పూర్తితో ‘నూడుల్ స్ట్రాప్’ బ్లౌసెస్ తయారు చేయుస్తుంటారు.

స్కూల్ బస్సు లోంచి దూక్కుంటూ నల నీలుల్లగా  దాడి చేసి ఇంటిని క్షణాల్లో కిష్కింద గా మార్చే పిల్ల కోతుల్ని అమాంతం కట్టి పారేసే సున్నితమైన ఆయుధమే ఇల్లాలి చేతి లోని ‘మాగీ’.

అలసిపోయి ఇంటికి వచ్చిన భర్త “ తినడానికి ఏమైనా ఉందా?” అని అడగ్గానే “ 2 మినిట్స్” అంటూ ఇల్లాలు అయన మేజోళ్ళు విప్పుకునే లోపు వేడి వేడిగా కప్పులో అందించే చక్కటి ఉపాహరమే మన ‘మాగీ’.

మరేంటదీ...ఈ మధ్యనే నిద్రలో ఉలిక్కిపడి లేచి హటాత్తుగా దానిలో సీసం వగైరాలు మరియూ, ఓ జపాను వాడు కనిపెట్టిన మంచి రుచి నిచ్చే రసాయనం ‘అజినమోటో’ మోతాదు మించి ఉన్నాయని ఆహార నిపుణులు చెప్పటం, పత్రికలూ, టీవీలు ఏక బిగిని రాత్రింబవళ్ళు ఘోషించటం, దరిమిలాను ప్రభుత్వాలు నిషేదించటం ‘2 మినిట్స్’ లో జరిగిపోయాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలలో నిషేదాజ్ఞలు ఇంకా పొయ్య మీద ఉడుకుతున్నట్లు భోగట్టా!

ఈ గొడవల్లో పాపం ‘మాగి’ గ్రహణం పట్టిన చందమామలా, ఫ్లాప్ సినిమా హీరోయిన్లా కాంతి, స్థానం పోగొట్టుకుంది. సందట్లో సడేమియా ఈ లోగా కార్టూన్లు గీస్తున్నారు, పంచ్లు పేలుస్తున్నారు, సెటైర్లు అంటిస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక కార్టూన్లో ఓ బుజ్జిపిల్ల సెలవులయి పోయి స్కూళ్ళు తెరుస్తున్నారన్న దిగులుతో ‘నూడుల్స్ తో వురి వేసుకుని చనిపోవాలని వుందిరా నానీ’ అని పక్క బుజ్జిగాడుతో చెపుతోంది. హన్నా..?

ప్రతి దానికి ఎడ్డెం అంటే తెడ్డం అనే ఒక తిక్క శంకరయ్య పెద్ద మాగి డబ్బాలోంచి జూప జూపా నూడుల్స్ జుర్రేస్తూ “నాకు మాగి అంటే ప్రాణం, ప్రాణాలు పోయినా తిండం మానను, పోయిన తరువాత కూడా పైన నూడుల్స్ దండలే వెయ్యండి’ అని సెలవిచ్చారు.

ఇంతలో ‘టిఫిన్ రెడీ’ అన్న శ్రీమతి అనౌన్సుమెంట్ ఎంతో కర్ణపేయంగా అనిపించి టేబుల్ వైపు నడిచాను. పింగాణి ప్లేటులో, తాండవ కేళిలో జగమంతా వ్యాపించిన శివుని జటాజూటం లాగ వ్యాపించి, పొగలు కక్కుతూ, కమ్మటి మసాలా వాసనతో ఆహ్వానిస్తూ ఉన్న ‘మాగి’ నూడుల్స్ కనిపించాయి.

“ఏమోయి! నీకేమైనా వెర్రా? దిన పత్రికలూ చదవటంలా? టీవిలో న్యూస్ చూడటంలా? ఇది చేసేవేమిటి?” అని విస్తుబోయాను.

“ఆ! అన్నీ చూడ్డం, వినటం అయ్యింది! పనిమనిషి రాలేదు. ఇదే కదా తొందరగా అయ్యేది. అందుకనే చేసాను” అంది నిర్లిప్తంగా.

“మరి ఆ లోహాల మాటేమిటి? నా ప్రేవులు లోహపూరితమైపోతేనో?” అన్నాను కించిత్తు భయంగా.

“పోన్లెండి, సర్దారు పటేలు తరువాత లోహ పురుషుడు మీరే అవుతారు. ఐనా మనం తాగే నీళ్ళలో ఫ్లోరైడు, పీల్చేగాలిలో కార్బన్లు, బియ్యంలో యూరియా, కూరల్లో క్రిమి సంహారకాలు, పళ్ళలో కృత్రిమ రంగులు, పాలు పెరుగులో పెయింట్లు, పిగ్మెంట్లు ఉన్నాయని చెవిని ఇల్లు కట్టుకుని పోరుతున్నారు. వీటన్నిటికీ నోరు మూసుకుని నలుగురుతో పాటు నారాయణ అనుకున్నామా లేదా? ఎదో వీసమంత సీసం ఉంటే, మీసాలు మెలేసుకుని, బోరలు  విరుచుకుని కధాకలి చెయ్యటం ఎందుకుట? చూడండి నాలుగు రోజుల్లో ‘తిట్టిన నోరే పొగుడు’ అన్న చందాన్న మన ‘మాగీ తల్లికి’ మంచి రోజులు రాక పోవు, మళ్ళీ అది ‘వంద రోజుల బొమ్మ’ కాక పోదు. అన్నట్లు కామక్షికి ఫోన్ చెయ్యాలి. దాని కొడుకు పట్టూ కి మాగి అంటే ప్రాణం. బెంగ పెట్టుకుని తిండి మానేస్తాడేమో వెర్రి వెదవ!” అని గుక్క తిప్పుకోకుండా చెప్పి గుక్కెడు నీళ్ళు తాగింది శ్రీమతి.

పొట్టలో ప్రేవులు, ప్లేట్ లో నూడుల్స్ మెలిపెడుతుండం వల్ల తర్కాన్ని జేబులో పెట్టి, “అ ఫోర్క్ ఇటు పారెయ్” అని ప్లేటుని ముందుకు లాక్కున్నాను.