Thursday, July 31, 2014

శ్రావణ మాసం – పూర్ణం బూరెలు! ప్రత్యెక వ్యాసం: శ్రావణ మాసపు శుభాకాంక్షలతో!






శ్రావణ మాసం – పూర్ణం బూరెలు!

శ్రీమతి పద్మా రఘునాద్

శ్రావణ మాసం వచ్చేసింది అని వినగానే అందరికి గుర్తుకు వచ్చేవి పెళ్లి పిలుపులు, పేరంటాల సంబరాలుపట్టుచీరల రెపరెపలు, పట్టు చీరల డిస్కౌంట్ ఆఫర్లు, బంగారం షాప్ వాళ్ళ మజూరి రేట్లు తగ్గింపురోడ్డు మీద రద్దీలు, కొత్త కోడళ్ళ ముచ్చట్లు, నోములు, పండుగలు, వ్రతాలూ, కొత్త వియ్యాలవారి విందులు ఇంకా ఇలా ఎన్నో ఎన్నెన్నో!

శ్రావణ మాసం అంటేనే అందరికి ఒక విధమైన ఉత్సాహం. బూజులు దులుపుకోవటం, ఇల్లు శుభ్రం చేసుకోవటం, కొత్త బట్టలు కొనుక్కోవటం, టైలర్ చుట్టూ తిరగటం, తీరా సమయానికి ఇవ్వక పోతే టెన్షన్ పడటంబ్యాంకు లాకర్లోంచి నగలు తెచ్చుకోవటం,  పిండి వంటలకు, పేరంటాలకు వస్తువులు కొనుక్కోవటం ఇలా రక రకాల  పనులతో అసలు రోజులు ఎలా గడచి పోతాయో కూడా తెలియదు కదండీ? ఇలా అందరూ ఉత్సాహంగా సంతోషంగా ఉండటమే వారి వారి ఇళ్ళలో అసలైన లక్ష్మీ కళ అని ఒక  గొప్ప మహాను భావులు చెప్పగా ఈ మధ్యనే  తెలిసింది కూడాను. 

వీటి అన్నిటితో పాటు సమానంగా అందరికి గుర్తుకు వచ్చి నోరు ఊరే పూర్ణం బూరెలు మాట ఏమిటంటారు మరిశ్రావణ మాసం అంటేనే మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం, పోలాల అమావాశ్య కదండీ! వీటన్నిటికి  తప్పని సరిగా చేసే పిండి వంట నైవేద్యం  మరియు అమ్మవారికి అతి ప్రీతి కరమైన ప్రసాదం ఈ పూర్ణం బూరెలే సుమండీ!

సంపూర్ణ మైన ఆనందానికి చిహ్నం, అత్యంత శుభ కరమైన వంటకం, తెలుగు వారికి అతి ఇష్ట మైన ప్రసాదం, పదహారు అణాల అసలు సిసలైన మన తెలుగు వంటకం, పిండి వంటలన్నిటికి  మహారాణీ మన పూర్ణం బూరె అని అనటంలో ఎక్కడా అతిశయోక్తి లేదండోయ్!

మరి ఇలాంటి మహారాణిని మనం ఆ శ్రీ మహారాజ్ఞి కి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తే ఆ అమ్మవారికి  ఎంత సంతోషంగా వుంటుందో ఊహించగలమా చెప్పండీ? అయితే మరి శ్రద్ధగా ఆ బూరెలు చేసే విధానాన్ని తెలుసుకుందామా

కావలసిన వస్తువులు:
మంచి బెల్లం : 200 గ్రాములు
శనగ పప్పు :  150 గ్రాములు
మినప పప్పు : 1 కప్పు
బియ్యం        : 1.5 కప్పులు
ఏలకుల పొడి  : 1/2 స్పూన్ 
నునె           : వేయించటానికి సరిపడా . 

చేసే విధానం: 
మినప పప్పు, బియ్యం కడిగి ఒక పాత్రలో తగినంత నీరు పోసి 4 లేదా 5 గంటలు నాన పెట్టండి. పండగ రోజు హడావుడి ఉంటుంది కనుక ఆ ముందు రోజు రాత్రి నాన పెట్టుకొవచ్చును. మర్నాడు ఈ మిశ్రమాన్ని మిక్సి లో బాగా మెత్తగా రుబ్బండి . అచ్చం దోశె పిండి మాదిరిగ, పిండి మరీ పలుచన కాకుండగా చూసుకోండి. అది పక్కన అలా వుంచండి . శనగ పప్పుని కూడా ఒక అరగంట లేదా గంట తగినంత నీరు పోసి నాన పెట్టండి. బెల్లం ని కోరుగా చేసుకోండి. శనగ పప్పు నానే క  కుక్కర్ లో సరిపడ  నీరు పోసి ఉడికించండి. 

చల్లారాక కుక్కర్ లోంచి తీసి, ఎక్కువగా వున్న నీరుని తీసివేసి బాగా మెత్తగా గరిటెతో ఎనపండి. తరువాత ఏలకుల పొడి, బెల్లం పొడిని వేసి బాగా కలపండి. ముద్దలాగా అవ్వాలన్న మాట. పలుచగా అనిపిస్తే స్టవ్ మీద సన్న సెగ లో పెట్టి అది గట్టి పడేదాకా అడుగంట కుండగా కలుపుతూ ఉండండి. గట్టి పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. చల్లారాక చిన్న చిన్న గుండ్రటి ఉండల లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇవే పూర్ణం ఉండలు. 

స్టవ్ మీద మీడియం హీట్ లో ఒక వెడల్పు బాండి లో తగినంత నూనె పోసి వేడి చేయండి. తర్వాత పక్కన తయారు చేసుకున్న దోశె పిండి లో ఈ ఉండలు వేసి పైన చక్కగా పూర్ణం ఉండ పైన పూర్తిగా పిండి అంటుకునే లాగా ముంచి దానిని మెల్లిగా కాగుతున్న వేడి నూనె లో వేసి, బంగారు రంగు లోకి వచ్చేదాకా వేయించి పైకి తీసి పక్కన పెట్టుకోండి . స్టవ్ దగ్గర పాటించాల్సిన జాగ్రత్తలన్నీ మాత్రం మరచి పోకండే!

అన్ని బూరెలు చక్కగా వేగాక ఒక పాత్రలో పెట్టుకుని అమ్మవారికి భక్తీ శ్రద్ధలతో పూజ చేసుకుని నైవేద్యంగా సమర్పించి బంధు మిత్రులతో చక్కగా ప్రసాదాన్ని ఆనందంగా భుజించండి . ఈ బూరెలను మంగళ గౌరీ నోముకి వాయనం గాను, వర లక్షి వ్రతం లో ముత్తైదువలకు వాయనంగా కూడా సమర్పించు కోవటం సాంప్రదాయంగా వస్తున్నది. అదే కాకుండగా పోలాల అమావాస్య రోజు పిల్లల ఆయురారోగ్యాలకోసం బూరెలు కూడా ఒక నైవేద్యం గా అమ్మవారికి సమర్పించు కోవటం ఆచారంగా చెప్పబడుతోంది.

ఈ బూరెలు వేడి గాను , చల్లారాకా  కూడా రుచికరం గా ఉంటాయి. వేడి వేడి  బూరే ని చిదిపి అందులో కమ్మటి కరిగిన నేయి వేసుకుని తింటే దాని మజా నే వేరు సుమండీ! మరి పూర్ణం బూరెలని చేసే విధానం తెలుసుకున్నాం  కదా, మరి ఇక శ్రద్ధ గా  ఈ నైవేద్యాన్ని తయారు చేసి భక్తి తో అమ్మవారికి సమర్పించు కుందామా

ఈ శుభ ప్రదమైన,  శ్రావణ మాసం మన అందరి మనస్సుల్లో మరింత ఉత్సాహాన్ని నింపి, మన ఇళ్ళకు  మరింత లక్ష్మీ కళ ను ప్రసాదించాలని ఆ మహాలక్ష్మి అమ్మవారిని  కోరుతూ మీ అందరికి శ్రావణ మాస శుభాకాంక్షలు.

*****

Tuesday, July 29, 2014

మామిడి కాయ మహారాణి......కీరా రాకుమారి సంవాదం; కామాక్షి కబుర్లు


కూరలు పళ్ళు తమలో తాము వాదించుకుంటాయా? మీరెప్పుడైన, ఎక్కడైనా విన్నారా? ఇదెక్కడి చోద్యం అనుకోకండి! ఇది చదివేక మీరు ఒప్పు కోక తప్పదు. ‘మామిడికాయ మహారాణి, కీర రాకుమారి’  అద్భుత సంవాదం లో మరి ఎవరు గెలిచారు, ఎవరు వోడేరు తెలుసుకోవాలంటే, ఈ రోజు ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకు వచ్చిన ఈ కామాక్షి చెప్పే కధ చదివి తీరాలి. అద్భుతమైన సృజనాత్మకతో, కడుపుబ్బ నవ్వించే హాస్య సంభాషణలతో ఆద్యంతం సాగే ఈ కామాక్షి చెప్పిన కథ చదివిన తరువాత మీ తీర్పు ఎవరి పక్షాన ఉందొ తెలుపగలరు.


సంపాదకుడు





మామిడి కాయ మహారాణి......కీరా రాకుమారి సంవాదం

శ్రీమతి రత్నాశ్రీనివాస్, బెంగళూరు


 ప్రతి బుధవారం ఉదయం, కామాక్షి ఇంటి దగ్గర వున్న కూరల దుకాణంలో ఫ్రెష్ గా తోపుడు బండిలో కూరలు వస్తుంటాయి. భర్త విశ్వనాథం, బాబిగాడు; ఆఫీసు,స్కూల్ కి వెళ్ళగానే కామాక్షి గబా గబా తెమిలి కూరలు తెచ్చుకోవటానికి   వెళుతుంది. ముందు వెళితే తాజావి ఏరుకోవచ్చు మరి. లేదంటే  ఇల్లాళ్ళంతా వచ్చి లేతగా వున్న కాయ గూరలన్నీ ఏరేసుకుని ముచికలు విరిచేసిన ముదురు బెండ కాయలు, పుచ్చు వంకాయలే మిగుల్చుతారు. అందుకే కామాక్షి ఆదరా బాదారగా బయలుదేరింది. ఎలాగో ఇవాళ తనే ముందు వెళ్ళింది. చక చక నవనవ లాడుతూ లేతగా వున్న కూరలన్నీ ఏరుకుని తూకం వేయించుకుంది. ఇంకా ఏమి తీసుకుందామా అని ఆలోచనలో పడింది. అక్కడ ఒక పక్కగా వెదురు గంపలో  కోలగా  ఉండి  పచ్చగా మెరిసిపోతున్న మామిడికాయలు, పక్క గంపలో లావుగా, పొడుగ్గా ఉండి, లేతాకు పచ్చ రంగులో వున్న కీరలు (దోసకాయ) వున్నాయి.

మామిడి కాయ, పక్క గంపలో వున్న కీరతో  "చూడు ఆ ఆంటీ నన్నే తీసుకుని సంచిలో వేసుకుంటుంది" అంది గర్వంగా.  

వెంటనే కీర "ఏం! ఎందుకని అలా చెప్పగలుగుతున్నావు?నన్ను కూడా కొనవచ్చుగా" అంది.

“ఆ...... నీరుగారి పోయే మొహాన్ని ఎవరు కొంటారు" అంది మామిడి.

“చాల్లే పెద్ద చెప్పొచ్చావు! ఇది వేసవి కాలం. ఎండ తాపం తీర్చేది నేనే. ఈ వేసవి కాలం   కూడలి లో చూసినా బళ్ల నిండా నేనే కనిపిస్తాను. మధ్యాహ్నాలు ఎంత మంది బళ్ల దగ్గర మూగి, అందంగా తరిగిన ముక్కలను తిని సేద తీరటం లేదు? నీరు కారుతాను కాబట్టే ఎండకు నీరెండి పోయిన శరీరాలకి ఊరట కలిగిస్తునాను”  అంది కీర.

“వేసవి కాలం నేను మాత్రం విరివిగా దొరకనా? అసలు వేసవి కాలమే నా సీజన్. ఆ మాట కొస్తే వేసవి నంతా నేనే పరిపాలిస్తాను. ఊరగాయలు ఎపుడు పెడదామా అని ఇల్లాళ్ళు అంత తహతహ లాడుతూ నా కోసం ఎదురు చూస్తుంటారు. పెట్టాలె కాని ఒక్కటేమిటి?  ఆవకాయ, మాగాయ, మెంతికాయ, పులిహారావకాయ, బెల్లపు ఆవకాయ....ఇల్లాళ్ల కి నాతో ఒక క్షణం తీరికే వుండదు. మడి కట్టుకుని మరీ అందమైన జాడీల్లో నన్నుపెట్టి వాసెన కట్టి ఇల్లాళ్ళు మురిసిపోతుంటే, ఇంకో పక్క ఇంటిల్లి పాది ఆప్యాయంగా వేసుకుని తింటూ వుంటే నిజంగా నా జన్మ సార్ధకమైంది అని అనిపిస్తుంటుంది.” అంది పొంగిపోతూ  మామిడి.

“నేను కూడా ఎమీ తక్కువ కాదే? నువ్వు ఒక్క వేసవి లోనే లభ్యమవుతావు. నేనైతే మూడొందల అరవై ఐదు రోజులు అందుబాటులో వుంటాను. పైగా ఇపుడు అందరు భోజనానికి ముందు సలాడ్ అంటూ నా తోనే ఆరంభిస్తున్నారు. అదీకాక ధర విషయంలో చూసుకుంటే సామాన్య మానవుడికి కూడా అందుబాటులో వుంటాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే, సాదా బండి నుండి స్టార్ హోటల్ వరకు ఎక్కడ చూసిన నేనే దర్శనమిస్తుంటాను”  గర్వంగా అంది కీర.

“నా మొహం! ఆడవాళ్ళు కూడా మొగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేయటం వలన తీరిక లేక, ఆరోగ్యం శీర్శికలు అవి చదివి, ఎక్కవ శ్రమ ఉండదు కదా అని సలాడ్స్ తిని కడుపు నింపుకుంటున్నారు” అక్కసుగా అంది మామిడి.

“నువ్వు ఎన్నైనా చెప్పు! పూర్వం ముచ్చట పడి ఆవకాయలు, మాగాయలు వేసుకునే వారేమో కాని , ఇపుడు ప్రజల్లో ఆరోగ్యాన్ని గురించిన అవగాహన పెరిగి ఊరగాయలు తినటం తగ్గించేసేరు.  బీపీ ఉన్న  వాళ్ళు నిన్ను చూసి బెంబేలెత్తి పోతున్నారు. కొందరు నీ పుల్ల మాగాయికి  అసిడిటీ వచ్చిందంటూ ఏవగించుకుంటున్నారు. ఇంకొందరు వేడిచేసిందంటూ నీ కేసి ఉరిమి ఉరిమి చూస్తున్నారు. మరి కొంతమంది నిన్ను చూస్తేనే చాలు అల్సర్   వస్తుంది బాబోయి అని అరుస్తున్నారు. ఇక మొలలతో బాధపడే వారు సరే సరి నిన్ను చూసి పుంజాలు తెంపుకుని పారిపోతున్నారు. ఇన్ని మాటలెందుకు? నిన్ను తిని అనారోగ్యం పాలైన వారికి నేనే  ఇపుడు పెద్దదిక్కునై ఆదు కుంటున్నాను” అంది కీర తనో పెద్ద ఆపద్భాందవుడిలా.

“ఇంక  తగ్గు తగ్గు! ‘పేను కి పెత్తనం ఇస్తే తల అంతా గోరికిందిట’  అలా వున్నాయి నీ ప్రగల్భాలు. ఎవరో నలుగురైదుగురు మానేసినంత మాత్రాన మిగతా దేశం గొడ్డు పోయిందా ఏమిటి? సుబ్బరంగా లీక్    ప్రూఫ్ ప్యాకింగులు చేయించుకుని మరీ అమెరికా పట్టుకు పోతున్నారు” ఆవేశంగా అంది మామిడి.

“ఆ...ఆ భాగవతాలు  కూడా అయ్యేయిగా....పట్టుకెల్లిన ప్యాకింగ్ లు ఇమ్మిగ్రేషన్ వాళ్ళు ఝడుసుకుని అక్కడ డస్ట్ బిన్ లలో పడేసిన  సంఘటనలు లేకపోలేదు” దేప్పింది కీర.

“నువ్వెప్పుడూ ఇంతే...ఏవో ఒకటి, రెండు ఇన్సిడెంట్స్ జరిగితే దాన్ని మరీ చిలవలు పలవలు చేసి మాట్లాడుతావు. ఐన ఇక్కడ నుండి దేశ దేశాలకి ఎగుమతి చేసి పంపటంలేదా? అక్కడ తిండ్ల కి జిహ్వ చచ్చి ఆవకాయ ముక్క ఉందా అంటూ ఇండియన్ స్టోర్స్ లలో బారులు తీరి మరీ కొనుక్కుని పట్టుకుపోవటం లేదా?”  చెప్పుకుపోతోంది  మామిడి.

“దేశ విదేశాల ప్రసక్తి వచ్చింది కాబట్టి చెపుతున్నాను. నేను అన్ని అమెరికన్ స్టోర్స్ లోను కనిపిస్తూ వుంటాను. క్రోగెర్, వాల్ మార్ట్, మాయెర్... ఎక్కడికెళ్ళినా, ఒక్క స్టోర్స్ ఏమిటి? రెస్టారెంట్స్ లో కూడా కనిపిస్తాను. విదేశీయులు మరీ ఇష్టంగా కూడా తింటారు. నన్ను వెనిగర్  లో ముంచి  పికిల్ చేస్తే పిల్లల నుండి పెద్దల దాక  సవర్ పికిల్, సవర్ పికిల్ అంటూ  చప్పరిస్తూ మరీ తింటారు”. నువ్వే కాదు నేను కూడా విదేశాలు తిరిగాను అన్నట్లుగా  అంది కీర.

“సరే ! ఊరగాయ మాట పక్కన పెట్టు. నేను పండితే, అబ్బ! ఎంత బావుందో పండు అని పెరుగన్నంలో ముక్కలు కోసుకుని తినటం లేదా? చెరకు రసాలు అంటూ రసం పిండుకుని మరీ తాగుతారు. మాంగో మిల్క్ షేక్ అని లస్సీ అనీ రకరకాలుగా తయారు చేసి అమ్ముతున్నారు, కడుపులో చల్లగా పడటం కోసం. నేను ఎక్కడికెళ్ళినా, ఏ రూపంలో నైన మహారాణి గానే వుంటాను. పెళ్ళిళ్ళ లలో మగ పెళ్లి వారు మామిడి కాయ పప్పు కంపల్సరీ అంటారు. ఎంతైనా నాది మహర్జాతకం. నీకు ఎంత పోపు పెట్టిన దండుగ. అంటనే అంటదూ..” హేళనగా అంది మామిడి. 

కీరకి ఒళ్ళు మండిపోయి "పోవే టెంక మొహమా! పోపు పెట్టిన్చుకోవలసిన అవసరం నాకేమి లేదు. పై పై మెరుగులు, అదనపు ఆకర్షణలు అంత కన్నాఅవసరం  లేదు. నేను సౌందర్యానికి ప్రతీక నంటూ, బ్యూటీ పార్లర్స్ వాళ్ళు, నన్ను  చక్రాలుగా కోసి కళ్ళ మీద పెట్టుకోండి అని సౌందర్య చిట్కాలు ఇస్తున్నారు. ఐన నీతో నాకేమిటి మాటలు? నువ్వెన్ని అనుకున్న నా విలువ ఏమిటో నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, నువ్వు మహా ముసలిరాణి వైతే, నేను అందాల రాకుమారిని”  అని గిరుక్కున మొహం పక్కకి తిప్పుకుంది.


ఇంకా ఏమి కూరలు కొనాలా అని ఆలోచిస్తున్న కామాక్షి వెనుకకి తిరిగి చూసేసరికి మామిడి, కీర కనిపించాయి. వెంటనే కామాక్షి, శ్రీ రామ నవమి వస్తోంది కదా, వడపప్పు ప్రసాదం లో మామిడి ముక్కలు, కీర ముక్కలు, సన్నగా తరిగి, దానికి కొబ్బరి తురుము, కాస్తంత ఉప్పు, కారం కలిపితే ఇటు ప్రసాదం లాను, అటు సాలడ్  లాను పనికి వస్తుందని, మామిడి, కీర  చెరొకటి తీసుకుని సంచీలో వేసుకుంది. సంచీలో పడ్డ మహారాణి, రాకుమారి.. అదేనండి మామిడి, కీర, ఇద్దరు  మోహ మొహాలు చూసుకుని కిసుక్కుని నవ్వుకున్నాయి.

*****

Monday, July 28, 2014

2 వ సంచిక: తెలుగు శాకాహార రుచుల మరియు సంగతుల సమాహారం!



సంపాదకీయం

సాహిత్యం లో తెలుగు భోజన ప్రస్తావన - మొదటి భాగం

తెలుగు వారి ప్రాచీన సాహిత్యం లో కూడా చక్కటి భోజన ప్రస్తావన కద్దు. కావ్యాలలోను, ప్రబందాలలోను  ఆనాటి కాలం లోని శాక పాకాల గురించి అక్కడక్కడ ప్రస్తావనలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం శ్రీ కృష్ణ దేవరాయల కాలం నాటి సామాన్య  గృహస్థుల ఇంట, ఆయా కాలాలలో విధమైన వంటలు వండుకునేవారో చూద్దాం.  

వర్షాకాలపు భోజనం
 గ్యాస్ మరియు కరంటు పోయ్యలు లేని కాలం లో  వంట వండటం, అందునా వర్షా కాలం లో వండటం  ఇల్లాలు కైనా ఏంతో  కష్ట సాధ్యమైన పని. మరి అందుకేనేమో గృహస్తు కూడా భార్య కష్టాలను తగ్గించటానికి అంతో కొంతో సహాయ పడేవాడు

తడిసిన కట్టెలతో వండితే వచ్చే పొగ వలన భార్య కన్నులు మండుతాయనే విషయం గమనించి, చూరు కింద దాచి ఉంచిన ఎండిన కొబ్బరి బొండం డిప్పలను తెచ్చి వంట చెరుకు గా వాడమని చెప్పటం గమనిస్తాము. అప్పుడు ఇల్లాలు చక్కగా ఎండు  డిప్పలతో పొయ్య రాజేసి, పోత్తి లాంటి వరి అన్నము, ఒలిచిన కంది పప్పు, నాలుగు లేక ఐయిదు పొరటిన  కూరలు, వడియములు, ఎండ బెట్టిన కూరల వరుగులు, మరి వీటి నన్నిటిని చక్కగా తడిపి కమ్మగా తినటానికి ఎర్రగా కాచిన నెయ్యి  మరియు చిక్కటి గడ్డ పెరుగు సిద్దం చేసేది. మరి అలాంటి  మృష్టాన్నభోజనం తినటానికి పెట్టి పుట్టాలి కదా!

అన్నట్లు మరి ఇది వర్షాకాలం అనుకుంటాను. ఎక్కువుగా కాక పోయినా, అడపా తడపా జల్లులు కురుస్తున్నాయి కదా; మరి పైన చెప్పిన కమ్మటి భోజనం వండుకోవటానికి ఇది గొప్ప అవకాశం. ఆలస్యం దేనికి?  ఇక పొయ్య ముట్టించండి.  (సశేషం)


రమణ బంధకవి 
సంపాదకుడు



*****
ఆనపకాయ కూటు

శ్రీమతి రత్న శ్రీనివాసు


మన చిన్నతనం నాటి  వంటలు తలుచు కుంటే  ఆ కాలం లో మన అమ్మ, అమ్మమ్మ లేక బామ్మా చేసిన ఘాటైన ఆనపకాయ కూటు గుర్తుకు వచ్చి తీరుతుంది. ముఖ్యంగా వాన కాలం లో ఈ వంటకాన్ని వండేవారు. అందులో వాడే మిరియాలు, ధనియాల ఘాటు కి వానకాలపు రొంప – పడిశాలు ఉష్ కాకి అయి పోయేవి. మరి ఈ వర్షపు రోజులలో ఈ వంటకం వండి ఆస్వాదించుదాము పదండి. మన వద్ద ఇప్పుడు బామ్మలు అమ్మమలు లేరు ఎలాగా అని ఆలోచించ కండి. మీ కోసం ఇదిగో ఆ వంటకం తయారీ! చదివి చేసుకుని తినడమే తరువాయి.  

తయారు చేయు విధానం:

v  కందిపప్పుని కడిగి, పప్పు, ఆనపకాయ ముక్కలు, పచ్చి మిర్చి ప్రెషర్ పాను లోకి తీసుకుని తగినంత నీళ్ళు పోసి చిటికెడు పసుపు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి.
v  పప్పు వుడికేలోపు వేరొక బర్నర్ పైన బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగేక సన్నని సెగ మీద ధనియాలు వేయించుకొవాలి.
v  ధనియాలు బ్రౌన్ కలర్ లోకి వచ్చేక తీసేసి మరి కొంచెం నూనె వేసి, మినపప్పు, సెనగపప్పు, బియ్యం, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు  వేయించుకోవాలి .
v  ఈ మిశ్రమాన్నిచల్లరేక  మిక్సీ లో పొడి చేసుకోవాలి. 
v  బాండి తిరిగి స్టవ్ మీద పెట్టుకుని పప్పులోకి 3 ఎండుమిరప కాయలు, మినపపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువతో కొద్దిగా నూనె వేసి పోపు వేయించుకోవాలి.
v  పోపు వేగేక కరివేపాకు రెబ్బలు వేయాలి. 
v  ఇప్పుడు వుడికిన పప్పు తీసుకుని బాండి లో వెయాలి. తగినంత ఉప్పు వేసి కలిపి, మిక్సీ లో పట్టిన పొడిని వేసి కలపాలి.
v  పప్పు ఉడికి గట్టి పడిన తర్వాత మనం వేయించుకున్న పోపు పైన వేసి కలియ పెట్టుకోవాలి.

కూటు ఘాటు గా వుండి అన్నంలోకి బాగా సరిపొతుంది. వడియాలతో కాని, అప్పడాలతో కానీ, చల్ల మిరపకాయలతో కాని నంచుకుని తింటే ఇంకా రుచిగా వుంటుంది.  
అన్నట్లు కంచం లో వాయ కలుపు కున్నాక కాచిన కమ్మటి నెయ్యి వేసుకోవటం మరవద్దు సుమా!

      కావలసిన వస్తువులు

·         100 గ్రాముల కందిపప్పు 
·         ఒక కప్పు ఆనపకాయ ముక్కలు 
·         పచ్చిమిర్చి -
·         తగినంత ఉప్పు
·         పసుపు చిటికెడు
·         ఎండుమిరప -3  
·         ధనియాలు 11/2 టేబుల్ స్పూన్ 
·         మిరియాలు : 10 గింజలు
·         మినప పప్పు -1/2 టేబుల్ స్పూన్ 
·         ఆవాలు, జీల కర్ర  - చెరొక 1/2 టీ స్పూన్ 
·         ఇంగువ తగినంత
·         కరివేపాకు రెబ్బలు 4: నూనె -1 టేబుల్ స్పూన్ 



 


*****


కాఫీ గత ప్రాణం

శ్రీమతి పద్మారఘునాద్


కాఫీ గత ప్రాణి అని అంటూ వుండటం అడపా దడపా మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఆ మాట కొస్తే, కాఫీ ప్రాణం కానీ వారు ఎవరుంటారు చెప్పండి? ఉదయం లేవగానే నిద్రకళ్ళ తోనే, ప్రతి ఇల్లాలు చేసే మొదటి పని కాఫీ డికాక్షన్ కి నీళ్ళు పెట్టి డికాక్షన్ తీయటమే ! అయితే ఈ డికాక్షన్ దిగటం, పాలు కాగే దాక ఆగే ఆలస్యం భరించలేనివారు, రాత్రి వంటిల్లంత శుభ్రం అయ్యాక  అప్పుడే డికాక్షను తీసుకుని పెట్టుకుంటే మర్నాడు ఈ ఆలస్యాలు అవి ఉండవని, పొద్దున్నే త్రాగబోయే కాఫీ ని తలుచుకుంటూ ఉత్సాహంగా అన్ని రెడీ పెట్టేసు కుంటూ వుంటారు కూడాను
పొద్దున్నే తాగే కాఫీ మహిమని ఏమి చెప్తాం చెప్పండి? వేడిగా చిక్కని పాలతో కలిపిన, స్ట్రాంగ్ ఫిల్టర్  కాఫీ రుచి ఏ అమృతానికి తీసిపోదు సుమండీ ! అది గొంతులో పడుతుంటే గుక్క గుక్కకి స్వర్గం మెట్లు ఎక్కుతున్నట్లే ఉంటుంది. అది వేళ కి పడకపోతే మాత్రం నరకం ఎందుకు పనికిరాదండోయ్ ! పొద్దున్నే ప్రతి ఇంట్లో, ముఖ్యంగా మన తెలుగు వారింట్లో విన పడేవి వేడి నీళ్ళచుయ్ చుయ్లు, ఫిల్టర్ కాఫీ ఘుమఘుమలు, చిక్కటి పాలు కాచినపుడు వచ్చే సువాసనలు.
మార్నింగ్ వాక్ కి వెళితే దారి  పొడవునా కాఫీ వాసనల గుబాళింపులతో పాటుగా, గుమ్మం మందు నుంచుని కాఫీ తాగుతున్న ఎవరినైనా పలకరిస్తే, ఒక అర కప్పు కాఫీ పడకా మానదుఎన్ని మార్లు తాగినా వద్దనకుండగా తాగే అమృత పానీయం కదండీ మరి! అందుకని ఎవరైనా, ఎపుడైనా, ఎవరికైనా లేదనకుండగా ఇచ్చేది ఈ కాఫీ యే సుమండీ ! అలాగని ఈ కాఫీ కలపటం అంత తేలికైన విషయం కాదు సుమా! ఒకటే బ్రాండ్ కాఫీ పౌడర్ వాడినా, ఒకేలా కొలతలు వేసినా ఒక్కొక్కరు చేసే కాఫీ కి ఒక్కో రుచి వుంటుంది . ఇంతెందుకు, ఏ ఒక్కరు చేసే కాఫీ ఒక్కలాగే వుండదు అనుకుంటే పోలా ! అదేకాకుండగా, ఒక్కరే చేసిన కాఫీ కూడా రోజూ వేరే వేరే గా  వుండే ప్రమాదం కూడా ఉందండోయ్!
కాఫీ కలపటం కూడా ఒక పెద్ద ఆర్ట్ అండీ బాబూ ! అన్ని సమపాళ్ళలో సరిగ్గా పడాలండోయ్ ! కొంచెం డికాక్షన్ లైట్ గా దిగినా, పాలు పలచబడినా, చెక్కర పలుకులు కొంచెం ఇటు అటు పడినా కూడా రుచి పాడయి పోతుందండీ ! అంతెందుకు, ఫ్రెష్ గా తీసిన డికాక్షన్, ఫ్రెష్ గా కాచిన పాలతో చేసుకునే కాఫీ రుచికి అసలు ఎక్కడా సమ ఉజ్జీ ఉండదంటే నమ్ముతారా?
ఏ వంట  పదార్ధాన్ని అయినా రుచి కుదరకపోతే బాగుచేసుకోవటం వుంటుంది కాని , కాఫీకి మాత్రం ఆ సౌకర్యం లేదండోయ్ ! పైగా పొద్దున్నే మొట్ట మొదటి సారి గా తాగే కాఫీ ప్రత్యేకతే వేరు. అంటే మొదటి డోసు అన్నమాట .
అది కనుక సరిగా కుదరకపోతే వుంటాయి రోజంతా తిప్పలేతిప్పలు. రెండో సారి తాగే దానికి ఎలాగో అలాగ సర్దుకు పోవచ్చు కాని మొదటి డోసు కు మాత్రం ఈ మినహాయింపులు ఏవి లేవండోయ్ ! అది నెంబర్ వన్ కాఫీ యే అయ్యుండాలిఈ మధ్య చూసిన ఒక సినిమా లో కూడా బాలు గారు కాఫీ గొప్పతనాన్ని చెప్తూ పాట కూడా వినిపించారు.  అందుకే మనం మొదటి సారే తాగే కాఫీని చాల జాగ్రత్తగా కలుపు కోవాలండోయ్! ఎందుకంటే మనం అందరం కాఫీ గత ప్రాణులమే కదండీ ! వెంటనే ఒక నెంబర్ వన్ కప్పు కాఫీ  వేడి వేడి గా తాగుదాం రండి పదండి

------------------------------------------------------------------------------------------------------------

చదువరులకు విజ్ఞప్తి:  

ప్రతి సంచిక పైన చదువరులు తమ తమ అమూల్యమైన అభిప్రాయాలను బ్లాగ్ నందలి కామెంట్స్ భాగం లో పోస్ట్ చెయ్యగలరు . లేదా వాటిని  ఈ క్రింద పొందుపరచిన ఈమెయిలు ఇడి కి  పంపించ గలరు.

తెలుగు శాకాహార రుచుల పట్ల అభిలాష ఉండి, తమ తమ ప్రాంతానికి చెందిన సాంప్రదాయక తెలుగు శాకాహారవంటలను మరియు సంబందిత విశేషాలను ఉత్సాహపరులైన చదువరులు తమదైన శైలి లో వివరిస్తూ, దానికి సంబందించిన ఫొటోస్ కూడా జోడిస్తూ సంపాదకునికి ఈ దిగువ ఇవ్వబడిన ఈమెయిలు ఇడి కి  పంపించ గలరు. తమ వ్యాసాలను తెలుగు లిపి లో టైపు చేసి పంపించ గలరు. 



సంపాదకుడు