Thursday, July 31, 2014

శ్రావణ మాసం – పూర్ణం బూరెలు! ప్రత్యెక వ్యాసం: శ్రావణ మాసపు శుభాకాంక్షలతో!






శ్రావణ మాసం – పూర్ణం బూరెలు!

శ్రీమతి పద్మా రఘునాద్

శ్రావణ మాసం వచ్చేసింది అని వినగానే అందరికి గుర్తుకు వచ్చేవి పెళ్లి పిలుపులు, పేరంటాల సంబరాలుపట్టుచీరల రెపరెపలు, పట్టు చీరల డిస్కౌంట్ ఆఫర్లు, బంగారం షాప్ వాళ్ళ మజూరి రేట్లు తగ్గింపురోడ్డు మీద రద్దీలు, కొత్త కోడళ్ళ ముచ్చట్లు, నోములు, పండుగలు, వ్రతాలూ, కొత్త వియ్యాలవారి విందులు ఇంకా ఇలా ఎన్నో ఎన్నెన్నో!

శ్రావణ మాసం అంటేనే అందరికి ఒక విధమైన ఉత్సాహం. బూజులు దులుపుకోవటం, ఇల్లు శుభ్రం చేసుకోవటం, కొత్త బట్టలు కొనుక్కోవటం, టైలర్ చుట్టూ తిరగటం, తీరా సమయానికి ఇవ్వక పోతే టెన్షన్ పడటంబ్యాంకు లాకర్లోంచి నగలు తెచ్చుకోవటం,  పిండి వంటలకు, పేరంటాలకు వస్తువులు కొనుక్కోవటం ఇలా రక రకాల  పనులతో అసలు రోజులు ఎలా గడచి పోతాయో కూడా తెలియదు కదండీ? ఇలా అందరూ ఉత్సాహంగా సంతోషంగా ఉండటమే వారి వారి ఇళ్ళలో అసలైన లక్ష్మీ కళ అని ఒక  గొప్ప మహాను భావులు చెప్పగా ఈ మధ్యనే  తెలిసింది కూడాను. 

వీటి అన్నిటితో పాటు సమానంగా అందరికి గుర్తుకు వచ్చి నోరు ఊరే పూర్ణం బూరెలు మాట ఏమిటంటారు మరిశ్రావణ మాసం అంటేనే మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం, పోలాల అమావాశ్య కదండీ! వీటన్నిటికి  తప్పని సరిగా చేసే పిండి వంట నైవేద్యం  మరియు అమ్మవారికి అతి ప్రీతి కరమైన ప్రసాదం ఈ పూర్ణం బూరెలే సుమండీ!

సంపూర్ణ మైన ఆనందానికి చిహ్నం, అత్యంత శుభ కరమైన వంటకం, తెలుగు వారికి అతి ఇష్ట మైన ప్రసాదం, పదహారు అణాల అసలు సిసలైన మన తెలుగు వంటకం, పిండి వంటలన్నిటికి  మహారాణీ మన పూర్ణం బూరె అని అనటంలో ఎక్కడా అతిశయోక్తి లేదండోయ్!

మరి ఇలాంటి మహారాణిని మనం ఆ శ్రీ మహారాజ్ఞి కి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తే ఆ అమ్మవారికి  ఎంత సంతోషంగా వుంటుందో ఊహించగలమా చెప్పండీ? అయితే మరి శ్రద్ధగా ఆ బూరెలు చేసే విధానాన్ని తెలుసుకుందామా

కావలసిన వస్తువులు:
మంచి బెల్లం : 200 గ్రాములు
శనగ పప్పు :  150 గ్రాములు
మినప పప్పు : 1 కప్పు
బియ్యం        : 1.5 కప్పులు
ఏలకుల పొడి  : 1/2 స్పూన్ 
నునె           : వేయించటానికి సరిపడా . 

చేసే విధానం: 
మినప పప్పు, బియ్యం కడిగి ఒక పాత్రలో తగినంత నీరు పోసి 4 లేదా 5 గంటలు నాన పెట్టండి. పండగ రోజు హడావుడి ఉంటుంది కనుక ఆ ముందు రోజు రాత్రి నాన పెట్టుకొవచ్చును. మర్నాడు ఈ మిశ్రమాన్ని మిక్సి లో బాగా మెత్తగా రుబ్బండి . అచ్చం దోశె పిండి మాదిరిగ, పిండి మరీ పలుచన కాకుండగా చూసుకోండి. అది పక్కన అలా వుంచండి . శనగ పప్పుని కూడా ఒక అరగంట లేదా గంట తగినంత నీరు పోసి నాన పెట్టండి. బెల్లం ని కోరుగా చేసుకోండి. శనగ పప్పు నానే క  కుక్కర్ లో సరిపడ  నీరు పోసి ఉడికించండి. 

చల్లారాక కుక్కర్ లోంచి తీసి, ఎక్కువగా వున్న నీరుని తీసివేసి బాగా మెత్తగా గరిటెతో ఎనపండి. తరువాత ఏలకుల పొడి, బెల్లం పొడిని వేసి బాగా కలపండి. ముద్దలాగా అవ్వాలన్న మాట. పలుచగా అనిపిస్తే స్టవ్ మీద సన్న సెగ లో పెట్టి అది గట్టి పడేదాకా అడుగంట కుండగా కలుపుతూ ఉండండి. గట్టి పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. చల్లారాక చిన్న చిన్న గుండ్రటి ఉండల లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇవే పూర్ణం ఉండలు. 

స్టవ్ మీద మీడియం హీట్ లో ఒక వెడల్పు బాండి లో తగినంత నూనె పోసి వేడి చేయండి. తర్వాత పక్కన తయారు చేసుకున్న దోశె పిండి లో ఈ ఉండలు వేసి పైన చక్కగా పూర్ణం ఉండ పైన పూర్తిగా పిండి అంటుకునే లాగా ముంచి దానిని మెల్లిగా కాగుతున్న వేడి నూనె లో వేసి, బంగారు రంగు లోకి వచ్చేదాకా వేయించి పైకి తీసి పక్కన పెట్టుకోండి . స్టవ్ దగ్గర పాటించాల్సిన జాగ్రత్తలన్నీ మాత్రం మరచి పోకండే!

అన్ని బూరెలు చక్కగా వేగాక ఒక పాత్రలో పెట్టుకుని అమ్మవారికి భక్తీ శ్రద్ధలతో పూజ చేసుకుని నైవేద్యంగా సమర్పించి బంధు మిత్రులతో చక్కగా ప్రసాదాన్ని ఆనందంగా భుజించండి . ఈ బూరెలను మంగళ గౌరీ నోముకి వాయనం గాను, వర లక్షి వ్రతం లో ముత్తైదువలకు వాయనంగా కూడా సమర్పించు కోవటం సాంప్రదాయంగా వస్తున్నది. అదే కాకుండగా పోలాల అమావాస్య రోజు పిల్లల ఆయురారోగ్యాలకోసం బూరెలు కూడా ఒక నైవేద్యం గా అమ్మవారికి సమర్పించు కోవటం ఆచారంగా చెప్పబడుతోంది.

ఈ బూరెలు వేడి గాను , చల్లారాకా  కూడా రుచికరం గా ఉంటాయి. వేడి వేడి  బూరే ని చిదిపి అందులో కమ్మటి కరిగిన నేయి వేసుకుని తింటే దాని మజా నే వేరు సుమండీ! మరి పూర్ణం బూరెలని చేసే విధానం తెలుసుకున్నాం  కదా, మరి ఇక శ్రద్ధ గా  ఈ నైవేద్యాన్ని తయారు చేసి భక్తి తో అమ్మవారికి సమర్పించు కుందామా

ఈ శుభ ప్రదమైన,  శ్రావణ మాసం మన అందరి మనస్సుల్లో మరింత ఉత్సాహాన్ని నింపి, మన ఇళ్ళకు  మరింత లక్ష్మీ కళ ను ప్రసాదించాలని ఆ మహాలక్ష్మి అమ్మవారిని  కోరుతూ మీ అందరికి శ్రావణ మాస శుభాకాంక్షలు.

*****

7 comments:

  1. బూరెలు ఫై మనవారికి మక్కువ ఎక్కువ. కవులు కూడా వారి వర్ణనలో బూరేలును బుగ్గలతో పోల్చారు.
    శ్రవణ మాసము లో,బూరెలు ప్రధానమైన తీపి వంటకము గురించి చక్కగా తెలిపారు .
    ధన్యవాదాలు.

    ReplyDelete
  2. పద్మ గారు,
    నేను ప్రతి సంవత్సరం శ్రావణ మాసానికి బూరెలు చేయాలనుకోవటం,తీరా నూనె లో వేసేక బూరెలు విచ్చుకోవటం,పూర్ణం కాస్తా నూనెలో పడిపోవటం జరుగుతోంది.మీరు శ్రావణ మాసం విశిష్టత,బూరెల తయారి విధానం చాల చక్కగా వివరించారు. బూరెలు విచ్చుకోకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో దయ చేసి చెప్పగలరు.
    థాంక్స్
    లక్ష్మీ

    ReplyDelete
  3. మీ కామెంట్ కి ధన్యవాదాలు లక్ష్మి గారు!

    పూర్ణం పిండి , తోపు పిండికూడా గట్టిగా ఉండేటట్లు చూసుకుని పూర్ణం ఉండ తోపులో పూర్తిగా కవర్ అయ్యేలాగా చూసుకుంటే బూరెలు విచ్చు కోకుండగా ఉంటాయి .
    పూర్ణం కానీ, తోపు పిండి కాని పలుచన అయితే బూరెలు విచ్చుకునే అవకాశం వుంటుంది

    ReplyDelete
  4. thanks for writing on tasty Boorelu. However it requires little bit of expertise unlike other pindivantalu to prepare. it is interesting to know the significance of the sravana masam along with the significance of offering Boorelu to God as well as Self. :-)

    ReplyDelete
  5. Mudda pappu vyasam chala noru urinche vidhamga padma garu raseru. Repe vandukuni tinali. Antekadu danilo tappaka avakaya nunchukuni , kammati neyyi tagilinchi tintamu.

    ReplyDelete
  6. Festivities abound in several Telugu households in Shravan masam. There is a general atmosphere of happiness and celebration during the auspicious month. These came alive in the blog written by Smt Padma Raghunath, alongwith the sweetness of poornam burelu, a quintessentially Telugu prasadam offering. These are rarely available in sweetmarts and are essentially made in homes. The younger generation should learn how to make this wonderful sweet from the blog

    ReplyDelete
  7. Boorelu chala baguntayi ruchiga.samapaalalo bellam pappu padatam okka etaithe vichukokundaga veyinchatam inkoka ethu.ee madhya pellilalo,functions annitlo vaddisthunnaru kani enthaina intlo chesinavati ruchi raavu.andharu boorelu cheyataniki ,thinataniki thayaru kavali mari

    ReplyDelete