Thursday, July 24, 2014

ప్రథమ సంచిక

తెలుగు భోనం
(తెలుగు సాంప్రదాయ శాకాహార రుచుల మరియు సంగతుల సమాహారం!)


అరె! అదేమిటో పేరు చదవగానే నోరు వూరి పోతోందండి !

ఆవును మరి తెలుగు భోజనం విశిష్టత అదే కదా?

తెలుగు వారు భోజన ప్రియులని ప్రతీతి. వందల సంవత్సరాల పాక శాస్త్ర నైపుణ్యం వంట పట్టించుకున్నారు. అబ్బో ఎన్ని వంటలు, ఎన్నెన్నో రుచులు!

భోజనం అంటే వేళకు ఏదో వండుకుని తిని పడేయ్యటం కాదు. దానికి ఎంత ప్రణాళిక, ఎంత వ్యూహం?

మనసు పెట్టి, మమత జోడించి దానికి సృజనాత్మకత అనే పోపు పెట్టి, పాక కళాప్రావీణ్యం రంగరించి కంచం లోకి వడ్డిస్తే అది అవుతుంది తెలుగు భోజనం. ఈ కళా దీపం కొడిగొట్టి పోకుండా తెలుగు తల్లులు తర తరాలనుండి అవిశ్రాంతం గా పాటు పడుతున్నారు. వారందరికీ నమోవాక్కులు.

మనం తిని తరిస్తున్నాం. కానీ మన తరువాతి తరం? వారికీ ఈ సంపద అంతో కొంత అందించాల్సిన బాద్యత మన అందరి పైన ఉంది. చంద్రునికో నూలు పోగు అన్న సామెత ఉండనే ఉంది. దానిలో భాగం గానే ఈ చిన్ని ప్రయత్నం. ఇందులో మనం అందరు భాగస్వాములే.

ఈ పత్రిక లో తెలుగు వంటలు, పండగలు, విశేషాలు, సంబరాలు, ప్రసాదాలు, వంటిటి కబుర్లు, కథలు, సారస్వతం లో మన వంటల ప్రస్తావన, ఎన్నో మరెన్నో సంగతులు ఉంటాయి.

ప్రతి సంచిక లోను, మీరు పంపించే రుచుల రెసిపీ ల నుండి ఉత్తమ మైన, వైవిధ్యమైన వాటిని ఎంపిక చేసి ప్రచురించటం జరుగుతుంది. మరుగున పడి పోతున్న మన సంప్రదాయపు రుచులను, విశేషాలను మళ్ళీ వెలుగు లోకి తేవటం మన తరానికి ఒక పునచ్చరణ మాత్రమె కాక, మన తరువాతి తరానికి, ఈ గొప్పదాన్ని అందించటం మన గురుతర బాద్యత.

ఇక అందరు కలసి కదులుదామా?

రమణ బంధకవి

సంపాదకుడు


*****

షడ్రసోపేత భోజనం
శ్రీమతి పద్మ రఘునాద్ 

షడ్ర సోపేతమైన భోజనం పేరు వినగానే, ఒక రాజుగారి ఆస్థానం లో జరిగే ఒక గొప్ప విందు, ధనికుల ఇళ్ళలో జరిగే వివాహ భోజనం, పండగ సంతర్పణ భోజనాలు గుర్తుకు వస్తుంటాయి. ఈ షడ్ర సోపెతమన్న శబ్దం మనకు చాలా  ప్రత్యేకంగా అనిపిచటం తో ఈ భోజనం మాట వింటుంటేనే నోటిలో నీరు కుడా ఉరటం ఎవరికైనా సహజం.
అసలు ఈ భోజనం ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఈ పేరు దీనికి వచ్చింది? అని కొంచెం దీని పూర్వోత్తర కధ ఏమిటో తెలుసు కుందామా?

మన పూర్వీకులు మానవ శరీరానికి కావాల్సిన పోషక పదార్ధాలను ఆరు ముఖ్యమైన రుచులుగా విభజించారు. ఈ ఆరు రుచులను మన నాలుక చివర వున్న గ్రంధుల ద్వారా  గ్రహించ గలుగుతాము. అంటే, ఈ ఆరు రుచులతో మేళవించిన పదార్ధాలను, మనం ప్రతీ రోజు స్వీకరించినట్లయితే, మనకు కావాల్సిన పోషక విలువలన్ని మనకు చక్కగా అందుతాయన్నమాట. అంటే రోజు మన భోజనం లో, మన పిల్లలకు పెట్టె భోజనం లో ఏమేమి పోషక పదార్ధాలు ఎంతెంత వున్నాయి అని కొలత బద్దలు పెట్టుకుని కోలుచుకోకుండగా మన పూర్వీకులు ఈ షడ్ర సోపేతమైన భోజనం తినమని సాహిత్యం ద్వారా, పురాణాల ద్వారా, కధల ద్వారా మనకు సందేశాలు ఇచ్చారని చెప్పటం ఎంతో నిజం. అయితే ఈ రుచులు ఏమిటి, వీటి ప్రయోజనం మరియు ఇవి లభ్య మయ్యే పదార్దాలేమిటోతెలుసుకుందామా?

1. తీపి:  లభించే పదార్ధాలు: తీయటి పళ్ళు, పాలు, ధాన్యాలు మొదలైనవి. ఈ పదార్ధాలు కండరాల పెరుగుదల కు ఎక్కువగా తోడ్పడుతాయని తెలుస్తోంది.

2. పులుపు:  లభించే పదార్ధాలు: పుల్లటి పళ్ళు, పెరుగు, పులిసిన పదార్ధాలు మొదలైనవి. వీటి వలన, కండరాలు శుభ్ర పడటం, శరీరం లవణాలను గ్రహించటం జరుగుతుందని తెలుస్తోంది.


3. ఉప్పు:  లభించే పదార్ధాలు: కూరగాయలు, సహజమైన ఉప్పు మొదలైనవి. వీటివలన ఆహారానికి రుచి, కండరాలకు ఇంధనం మరియు జీర్ణ కారి గా కూడా పనిచేస్తాయని చెపుతారు.

 4. చేదు/వగరు:  లభించే పదార్ధాలు: పచ్చని ఆకుకూరలు, మూలిక ఆకులు, సుగంధ ద్రవ్యాలు. వీటివలన మలిన విసర్జన, కండరాలు తేలిక పడటం మొదలైనవి జరుగుతాయని చెప్తారు .

5. కారం:  లభించే పదార్ధాలు: వెల్లుల్లి, పచ్చి మిరప, సుగంధ ద్రవ్యాలు ఈ పదార్ధాలు జీర్ణ కారి, క్రొవ్వును కరిగించుట మొదలగు వాటికి దోహదకారి అని తెలుస్తోంది.

6. కమ్మతనం:  లభించే పదార్ధాలు: పచ్చిగా ఉన్న పళ్ళు, దుంపలు, మూలికలు. వీటిలో నీటిని గ్రహించి, క్రొవ్వును కరిగించి, కండరాలను పటిష్టంగా చేయు గుణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

కనుక ఈ ఆరు రుచులతోను మేళవించిన భోజనం తీసుకున్నట్లయితే శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుందని ఈ షడ్ర సోపెతమయిన భోజనము ను అనగా మనం ఇపుడు పిలుచుకునే  సమతౌల్య ఆహారం (Balanced Meal) ను ఎంతో దూర దృష్టితో, మన క్షేమాన్ని కోరి మనకు అనేక సందేశాలుగా తెలియచేసిన మన పూర్వీకుల ఋణం మనం ఏనాటి కైనా తీర్చుకోగలమా చెప్పండి?

మరి మనం ఏ గొప్ప విందుకో, రాజుగారి ఆస్థానానికో వెళ్లి ఈ భోజనం కోసం అర్రులు చాచనవసరం లేదు కదా!
ఇక మనందరం, ఈ షడ్రుచులతోటి భోజనము చేసుకుంటే అదే షడ్రసోపేత భోజనం! అపుడు అందరకు మా ఇంట్లో ప్రతీ రోజు షడ్ర సోపేత భోజనమే నని  ధీమాగా చెప్పగలుగుతాము.

 *****

కామాక్షి వంటింటి కబుర్లు
శ్రీమతి రత్నశ్రీనివాస్, బెంగుళూరు

చామదుంపలు  - శ్రీ వారు
         
"కాస్త  రోజైన వచ్చే సరికి కొంచెం చామ దుంపల వేపుడు వర్రగా, వేడి వేడి గా చేసి పెట్టు. మొన్న అనంగా తెచ్చి పడేసాను. ఇదిగో చేస్తాను, అదిగో చేస్తాను అనటమే గాని దానికి మోక్షమే లేదు” అన్నాడు విశ్వనాథం ఆఫీసు కి వెళ్ళటానికి సిద్దమవుతూ
"ఎందుకు చేయను? రాత్రి పూట చేస్తే అరగదని, శని,ఆదివారాలైతే ఇంట్లోనే వుంటారు కదా, పగలు చేయచ్చని ఊరుకున్నాను. అంతే కాని బద్దకించి కాదు”,  కొంచెం వుడుకుమోత్తనంగా అంది కామాక్షి
"! అప్పటి దాక ఆగితే మొక్కలు కూడా మొలుస్తాయి వాటికి. ఏదో చేసి పడేస్తే పనైపోతుందని సరిగ్గా వుడకనీకుండా  రాళ్ళల్లా చేస్తే అరగవు కాని మనసు పెట్టి చేసి మెత్తగా ఉడికిస్తే సుబ్బరంగా అరుగుతాయి పూట చేసిన!", కొంచెం నిష్టూరంగా అంటూ కారు తాళాలు  తీసుకుని భయ్యి మంటూ వెళ్ళిపోయాడు విశ్వనాధం

ఎటు వాళ్ళు అటు వెళ్ళాక కామాక్షి ఇల్లు సర్దుకుని, బట్టలు పని చూసుకుని, స్నానం చేసి, పూజ చేసుకుని అపుడు టిఫిన్ తింటుంది. తనకి వంట చెసుకొదు.  రాత్రి చేసినవే సాధారణంగా మిగులుతాయి. అవే భోజనం వేళలో వేడి చేసుకుని తింటుంది. పిల్లాడు పట్టాభికి మాత్రం బాక్స్ లోకి వాడు ఏది అడిగితె అది చేసి పెడుతుంది. విశ్వనాథం టిఫిన్ మాత్రం తిని వెళతాడు. మధ్యాహ్నానికి అక్కడే కాంటీన్లో తింటాడు. ఇక ఇంట్లో భోజనం రాత్రికే. అందుకే   ఒక్క పూట తనకి కావలసిన విధంగా వంట చేయమంటాడు విశ్వనాధం

అసలు విషయానికి వస్తే కామాక్షికి వేపుడు చేయటం ఎంత మాత్రం ఇష్టం లేదు. ముందు రోజే ఇంత  నూనె పోసి  బంగాళ   దుంప వేపుడు, అంతకు ముందు రోజు అరటికాయ వేపుడు చెసిన్ది పూట చేమ దుంపల వేపుడు చేయాలిట! ఇంట్లో వేపుళ్ళు! కాంటీన్లో పకోడీలు, పర్చిమిరపకాయ బజ్జీలు! అక్కడ ఆపేదెవరు? ఇలా రోజు వేపుళ్ళు చేసుకుపోతే ఆరోగ్యం  ఏమి గాను? కొంచెం ఒంటి మీద శ్రద్ద ఉండక్కర్లేదుఇవాళ ఏమైనా గాని నేను మాత్రం చచ్చిన వేపుడు చేయను. కొంచెం గట్టిగానే నిశ్చయించుకుంది కామాక్షి

బుట్టలోంచి చామదుంపలు తీసి పంపు కింద పెట్టి సుబ్బరంగా మట్టిపోయేలాగా ఒకటికి రెండు సార్లు కడిగింది. ప్రెషర్ పాన్ తీసి చామ  దుంపలు పెట్టి, సరిపడా నీళ్ళు పోసి, కొంచెం పసుపు వేసి మూత పెట్టింది. మూడు కూతలు వచ్చాక స్టవ్ ఆపి, చల్లారాక దుంపలు బైటకి తీసిన్ది. భర్త  ఆరోగ్యం కోసం మనసు పెట్టి చేసిందేమో దుంపలు మెత్తగా వుడికాయి. తొక్క తీసి నాన్స్టిక్ మూకుడు ని స్టవ్ వెలిగించి పెట్టింది. మామూలు బాండి ఐతే పోపు కూర కదా? కలిపినపుడు ముద్ద ఐతే విశ్వనాథం గొడవ చేస్తాడు. కొంచెం నూనె వేసి ఎండు మిరపకాయలు రెండు,మూడు తుంపి వేసిన్ది. తలా కొంచెం మినప పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు చిటపట లాడేక, కమ్మటి పాల ఇంగువ వేసిందిపచ్చగా, తాజాగా వున్నకరివేపాకు రెబ్బలు వేసి, పైన చేమదుంపలు వేసిన్ది. పిల్లాడు పట్టాభి పోపు కూర తినడు. తిండి విషయంలో కొంచెం పేచికోరు, పంతాలమారి. అందుకని కొన్ని దుంపలు వాడికి వేపుడు చేయటం కోసమని అట్టే పెట్టింది

ఉప్పు,పసుపు వేసి కొంచెం కలియబెట్టి మూత పెట్టింది. ప్రక్కనే ఒక చిన్నకప్పులో చింతపండు నానబెట్టింది. దుంపలు మగ్గేక కొద్దిగా చింతపండు పులుసు వేసి, చిన్న బెల్లం ముక్క కూడా వేసిన్ది. దుంపలు చితకకుండా జాగ్రత్తగా ఓమారు కలిపి మూత పెట్టింది . కొంతసేపటికి దుంపలు  పులుసు, బెల్లాన్ని బాగా పీల్చుకున్నాక ఒక చెంచా బియ్యప్పిండి, మరింత కారం వేసి ముక్కల్ని కలియబెట్టింది . బియ్యప్పిండి వేయటం వలన దుంపలు ఒకదానికొకటి అతుక్కోకుండా, విడివిడిగా వున్నాయి. మూత పెట్టి కొంచెం సేపయ్యాక స్టవ్ ఆపేసింది

పట్టాభి కోసం పెట్టిన దుంపల్ని నాన్స్టిక్ పాన్ లోనే కొంచెం నూనె వేసి వేయిచింది. పిల్లాడికే కాబట్టి వర్రగా చెయనక్కర్లెదు. ఎర్రగా మాత్రం వేయిచింది. ఉప్పు, పసుపు, జీలకర్ర, ఒక రవ్వ కారం వేసి కలియబెట్టి స్టవ్ ఆపేసిందిరెండు కూరలు తయారయ్యాయి

రాత్రి భోజనాల వేళ అవుతుండగా విశ్వనాధం ఆఫీసు నుండి వచ్చాడు. వస్తూనే ఇవాళ ఐనా వేపుడు చేశావా అని అడగ బోయి వేపుడు వాసన వచ్చేసరికి మిన్నకున్నాడు

కామాక్షి కంచాలు పెట్టి విశ్వనాధం, పట్టాభిని భోజనానికి పిలిచింది. పట్టాభి కంచంలో వేపుడు కూర వేసి అన్నం పెట్టి  కలిపి ఇచ్చింది . 
విశ్వనాధానికి ఒకళ్ళు వడ్డిస్తే మహా చెడ్డ చిరాకు. తనకి కావలసింది తనే వడ్డించుకుని తింటాడు. తనకి నచ్చితే పప్పైన, కూరైన రెండు, మూడు సార్లు తింటాడు. రెండో ఐటెం జోలికి వెళ్ళడు. అందుకని కామాక్షి ఎపుడు విశ్వనాధానికి  వడ్డించదు. పదార్ధాల మీద మూత తీసి అతనికి అందుబాటులో పెడుతుంది

వేపుడు అంతా  పట్టాభికి  వేయటం చూసి "ఇదేమిటి? వేపుడు వాడికి ఒక్కడికేనా?నాకు చేయలేదా?" అసహనంగా అన్నాడు

“లేదు. రోజు వేపుళ్ళు ఐపొతున్నాయని పులుసు- బెల్లం పెట్టి మీ అమ్మగారు చేసినట్లు చేసేను. బాగా వచ్చింది. తినండి" అంది  కామాక్షి నెమ్మదిగా

విశ్వనాధానికి ఒళ్ళు మండిపొయింది. "వేపుడు ఐతే దగ్గరుండి వేయించాలని, నీ టీవీ సేరియళ్ళకి అడ్డం వస్తుందని, ఏదో కొంచెం పోపు పడేసి, ధనా, ధనా కుమ్మేసి, పాసం పాసం చేసి తద్దినం కూరలాగా తగలేట్టావా?కోపం తారాస్థాయికి చేరుకుంది విశ్వనాధానికి

కామాక్షి మారుమాటాడకుండా కూర మూత  తీసి కంచం దగ్గర పెట్టింది. కూర ఎర్రగా, ముక్కకి ముక్కలాగ వుండి, పచ్చని కరివేపాకు రెబ్బలతోటి, కమ్మని పోపు వాసనతో ఘుమ ఘుమ లాడేసరికి, విశ్వనాధానికి పూనకం దిగి మామూలు మనిషి అయ్యేడు. ఆకలి నకనకలాడటంతో వడ్డించుకోవడం ప్రారంభించేడు. అలవాటు ప్రకారం మొదట కూరతోనే మొదలెట్టేడు. విశ్వనాధానికి కూర నచ్చింది. కాని పైకి ఏమి అనకుండా రెండోసారి మళ్ళీ వేసుకున్నాడు. తింటూ పట్టభితో "నువ్వు కూడా పులుసు, బెల్లం కూర కొంచెం  టేస్ట్ చెయ్యరా"  అన్నాడు

కామాక్షికి, విశ్వనాధానికి కూర నచ్చిందని అర్ధమైపోయింది. అంతవరకూ మౌనంగా వున్నది ఇంక అందుకుంది. "చేమదుంపలు అంటే ఎపుడు ఇంత నూనె పోసి బడ బడ వేయించడం ఒక్కటే కాదు. పులుసు, బెల్లం పెట్టుకోవచ్చు, నిమ్మకాయ పిండి చేసుకోవచ్చు, పులుసుల్లోనూ వేసుకోవచ్చు” అంది దెప్పి పొడుపుగ
  
 కామాక్షి తనని దెప్పి పొడుస్తోందని గ్రహించి విశ్వనాధం "అయినా రాత్రి పూట చేమ దుంపలు వేపుడు ఐతే అరుగుతుంది గాని, ఇలా పులుసులు, బెల్లాలు పెట్టి చేస్తే అరగవుతనూ దెప్పేడు
   
వెంటనే కామాక్షి "మనసు పెట్టి చేసి, మెత్తగా వుడికించేను కదా! రాత్రి పూటైనా అరుగుతుంది లెండి" అంది తడుముకోకుండ

తన మాట తనకే అప్పజెప్పిందని, మూడోసారి కూర వేసుకుంటూ కామాక్షి కేసి గుర్రుగా చూసాడు విశ్వనాధం

*****

కామాక్షి కబుర్ల విశిష్టత ఏమంటే, ఇందులో శ్రీమతి రత్న గారు తమ చక్కని కధ, కధనం, ఆహ్లాదకరమైన సంబాషణల తో బాటు, ఒక చక్కని తెలుగు వంటకపు వివరణా మరియు చేసి విధానం అంతర్లీనంగా వివరిస్తూ చదువరులకు నోరు వూరిస్తారనటం అతిశయోక్తి కాదు!

సంపాదకుడు

*****

చదువరులకు విజ్ఞప్తి:  

ప్రతి సంచిక పైన చదువరులు తమ తమ అమూల్యమైన అభిప్రాయాలను బ్లాగ్ నందలి కామెంట్స్ భాగం లో పోస్ట్ చెయ్యగలరు . లేదా వాటిని  ఈ క్రింద పొందుపరచిన ఈమెయిలు ఇడి కి  పంపించ గలరు.

తెలుగు శాకాహార రుచుల పట్ల అభిలాష ఉండి, తమ తమ ప్రాంతానికి చెందిన సాంప్రదాయక తెలుగు శాకాహారవంటలను మరియు సంబందిత విశేషాలను ఉత్సాహపరులైన చదువరులు తమదైన శైలి లో వివరిస్తూ, దానికి సంబందించిన ఫొటోస్ కూడా జోడిస్తూ సంపాదకునికి ఈ దిగువ ఇవ్వబడిన ఈమెయిలు ఇడి కి  పంపించ గలరు. తమ వ్యాసాలను తెలుగు లిపి లో టైపు చేసి పంపించ గలరు. 


సంపాదకుడు
----------------------------------------------------------------------------------------------------------

6 comments:

  1. Chakkati kathalo kammati koora nu melavinchi chaduvarulaku akali rekathinche manchi katha

    ReplyDelete
  2. Chakkati kathalo kammati koora nu melavinchi chaduvarulaku akali rekathinche manchi katha

    ReplyDelete
  3. తెలుగు భోజనం blog చాల బాగుంది . కామాక్షి కధ తెలుగు వారికీ , తెలుగుతనానికి చాలా దగ్గరగా వుంది . నోరు ఊరించే మంచి విషయాలు చెప్తున్నందుకు కృతఙ్ఞతలు .

    ReplyDelete
  4. చక్కని కామెంట్స్ పంపిన మీకందరకు ధన్యవాదాలు. మీ సహకారం మరియు ప్రోత్సాహం తో మరింత ఆకర్షనీయము గా నిర్వహించుటకు ప్రయత్నిస్తాము.

    ReplyDelete
  5. Norurinche vantakani chakati saililo adbhuthamuga vivarincharu.ratnagaru.hats off to you.saradaga malli malli chadavalani anipinchela undi vivarana. Padmagaru kuda shadruchula gurinchi chakaga vivarincharu.inka manchi vantakalani gurinchi theliyajestharani eduru chusthunnamu.

    ReplyDelete
  6. తెలుగు భోజనం బ్లాగ్ తెలుగు తనం వుట్టిపదేలాగా వుంది. తెలుగు రుచులు,చక్కని కధలను అందించే ఉద్దేశ్యంతో ఈ బ్లాగ్ ను రూపందిన్చినందుకు రమణ గారు అభినందీయులు.అలాగే షడ్రుచులు గురించి పద్మ గారు చాల చక్కగా వివరించటమే కాకుండా నూరూరించే పిక్చర్స్ ని కూడా జోడించారు .మీ బ్లాగ్ లో మున్ముందు కూడా ఇలాగే చక్కని,వైవిధ్యభరితమైన వంటకములను అందించగలరని ఆశిస్తున్నాము.

    ReplyDelete